ఆల్ఫా... ఎవరి మాటా వినడు
75 శాతం బాస్‌లకు వింత వ్యాధి. సంస్థలు, ఉద్యోగులకు తిప్పలు.
లండన్
వారు ఎంతో తెలివైన వారు. చురుకైన వారు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రపంచ గమనాన్నే నిర్దేశిస్తారు. కానీ... ఎప్పుడూ తామే కరెక్టనుకుంటారు. తమకు పూర్తిగా తెలియని విషయాల గురించీ అనర్గళంగా మాట్లాడతారు. అలవోకగా నిర్ణయాలు తీసుకుంటారు. ఫలానా విషయం మీకు తెలియదని ఎవరైనా చెబితే తమను అవమానించినట్లు భావిస్తారు. తమ కిందివారిని రాచి రంపాన పెడతారు. 'ఆల్ఫా మేల్ సిండ్రోమ్' అనే వ్యాధి తాలూకు లక్షణాలివి.
కేట్ లూడ్‌మ్యాన్, ఎడ్డీ ఎర్లాండ్‌సన్ అనే దంపతులు 'ఆల్ఫా మేల్ సిండ్రోమ్' పేరుతో ఓ పుస్తకం రాశారు. తమను తాము ఆల్ఫాలుగా ప్రకటించుకున్న ఈ దంపతులు, ఈ వ్యాధి గురించి ప్రపంచం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. కారణం... ఆల్ఫా మేల్ సిండ్రోమ్ అనేది పెద్ద వ్యాధి కాకపోయినా పెద్దవారి వ్యాధి. పారిశ్రామిక ప్రపంచంలోని అగ్రశ్రేణి మేనేజర్లలో 75 శాతం మంది ఆల్ఫాలే. నాటి అలెగ్జాండర్ నుంచి మావో వరకూ, నేటి జార్జి బుష్ నుంచి టోనీ బ్లెయిర్ వరకూ ఎందరో నేతలు ఇలాంటివారే. అంతెందుకు?... మీ ఆఫీసులో బాస్ కూడా ఓ ఆల్ఫానే కావచ్చు. ప్రపంచ ప్రగతికి ఇలాంటివారెంతో అవసరం. కానీ వారు తప్పుదారి పడితే ఎంతో ప్రమాదం. అందువల్ల ఆల్ఫాల శక్తిసామర్థ్యాల్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నా, వారిలోని లోపాల్ని అదుపులో పెట్టాలన్నా ఈ వ్యాధి లక్షణాల్ని అర్థం చేసుకోవడం అవసరం.
వారు చెప్పిందే వేదం
''ఆల్ఫాలు జీవితంలో చాలా వేగంగా ఎదుగుతారు. ఎదిగే ప్రతి దశలో ఇతరుల మెప్పును పొందుతారు. అదే వారి సమస్య. దానివల్ల తాము ఎక్కడా తప్పు చేయబోమనే ధీమా వారిలో పెరుగుతుంది. తమ ఎదుగుదలకు ఉపయోగపడ్డ లక్షణాలు... ఎదిగాక సరిపోవన్న స్పృహ కొరవడుతుంది. ఇతరులు చెప్పింది ఓపిగ్గా వినే ఓర్పు తగ్గుతుంది. ఏ వ్యక్తయినా పెద్ద పెద్ద పదవులు చేపట్టేకొద్దీ తనకు అవగాహన లేని అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పెరుగుతుంది. తన జ్ఞానానికి గల పరిమితుల్ని నిజాయితీగా, బాహాటంగా అంగీకరించగలిగితేనే ఇతరుల సలహాతో అతడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. కానీ ఆల్ఫాల్లో ఈ రకమైన పారదర్శకత ఎంతమాత్రం ఉండదు'' అని లూడ్‌మ్యాన్ తెలిపారు. ఆల్ఫా మేల్ సిండ్రోమ్ పేరులో 'మేల్' ఉంది కదా అని ఇది కేవలం మగవారికే సంబంధించిన వ్యాధి అనుకోనక్కర్లేదు. కొందరు ఆడవారిలో కూడా ఈ వ్యాధి లక్షణాలుంటాయి. కానీ వారి సంఖ్య చాలా తక్కువ.
ముక్కోపం... ముక్కోణం:
ఆల్ఫాలు దారి తప్పితే సంభవించే పరిణామాలకు విలన్, బాధితుడు, హీరో అనే మూడు కోణాలుంటాయి. దీనిని 'ఆల్ఫా త్రికోణం'గా రచయితలు అభివర్ణించారు. 1) ఆల్ఫా తన కార్యాలయంలో విలన్ మాదిరిగా ప్రవర్తిస్తాడు. ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తూ వారిపై ఒత్తిడి పెంచుతాడు. వారు చిన్నతప్పు చేసినా ఎత్తిచూపుతూ వారి జీవితాల్ని నరకప్రాయం చేస్తాడు. 2) దీనివల్ల ఆఫీసులో కొందరు బాధితులు ఏర్పడతారు. వారు ఆల్ఫాను చక్కదిద్దలేరు. అందువల్ల ఇతరుల సానుభూతి కోసం ప్రయత్నిస్తారు. అది లభిస్తే చాలు... సంతోషపడతారు. ఊరట పొందుతారు. 3) ఈ క్రమంలో కొందరు హీరోలుగా అవతరిస్తారు. ఆల్ఫా ప్రవర్తనతో ఆఫీసులో దెబ్బతిన్న సంబంధాల్ని పునరుద్ధరించే పనిని చేపడతారు. ఆల్ఫాకు, బాధితులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించి, ఎక్కడి మాట అక్కడ చెప్పి పరిస్థితిని చక్కదిద్దుతారు.
ముగ్గురూ ముగ్గురే:
ఈ ఆల్ఫా త్రికోణం సంస్థకు ఎంతమాత్రం మేలు చేయదు. ఉద్యోగులు సృజనాత్మకంగా, సమర్థంగా పని చేయడానికి బదులు... ఆల్ఫా మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. అతడు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడు? అతణ్ని ఎలా సంతోషపెట్టాలి? అని మాత్రమే ఆలోచిస్తారు. 'ఆల్ఫా తిక్రోణం' కొనసాగడానికి ఆల్ఫా ఒక్కడే కారణం కాదు. అందులోని ముగ్గురూ బాధ్యులే. త్రికోణం నుంచి ఏ ఒక్కరు వైదొలగినా సంస్థకు మేలు జరుగుతుంది. కానీ చాలామంది అందుకు ఇష్టపడరు. బాధితులు ఇతరుల సానుభూతిని, హీరోలు ఇతరుల మెప్పును ఆస్వాదిస్తూ అదే రీతిగా ప్రవర్తిస్తుంటారు.
సెక్స్‌లోనూ ఆధిపత్యం:
ఆల్ఫాల ఆధిపత్య భావన సెక్స్ వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. తమ కింద పనిచేసే వారిని లైంగికంగా లోబరచుకోవచ్చని, అది తమ హక్కని కూడా వీరిలో కొందరు భావిస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మోనికా లువిన్‌స్కీతో ప్రవర్తించిన తీరు ఇందుకు ఉదాహరణ.
ఆల్ఫా మేల్ సిండ్రోమ్‌కు చికిత్స ఏమిటి?
లూడ్‌మ్యాన్, ఎర్లాండ్‌సన్‌లు కొన్ని పరిష్కారాలను సూచించారు. సమష్టి కృషి విలువను ఆల్ఫాలు తెలుసుకునేలా, ఇతరుల అభిప్రాయాల్ని వినేలా, ఇతరులు చెప్పేది విశ్వసించేలా చేయాలి. కానీ ఇవన్నీ జరగాలంటే ముందుగా ఆల్ఫాలు తమ లోపాల్ని తాము అంగీకరించేలా చూడాలి. ఇటీవల ఎన్‌రాన్ వంటి కొన్ని కంపెనీలు దెబ్బతినడానికి కారణం ఈ ఆల్ఫా మేల్ సిండ్రోమేనని రచయితలు విశ్లేషించారు. దీనిని ఎదుర్కోవడం ఇప్పుడు కంపెనీలకు ఆదర్శప్రాయం అని కాకుండా.. అత్యవసరమైపోయిందని తెలిపారు. అయితే కార్పొరేట్ రంగంలో మహిళలు ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి మారుతుందని వారు విశ్లేషించారు. ''కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఆల్ఫాలకు ఉండే నైపుణ్యాలు, దృఢచిత్తం అత్యవసరం. అదే సమయంలో ఆల్ఫాయేతర లక్షణాలు... మెత్తగా మాట్లాడడం, ఆధిపత్య ధోరణి లేకపోవడం, ఏకాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం... వంటివి ఉన్నవారు యాజమాన్యానికి సుస్థిరతను అందించగలరు. ఆల్ఫాల ప్రాబల్యం ఉన్న సంస్థల్లో ఒక ఆల్ఫాయేతర వ్యక్తికి ఉన్నత పదవి ఇస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే కొందరు ప్రతిభావంతులు తమతో మర్యాదగా, నెమ్మదిగా ప్రవర్తించే వారితోనే పని చేయడానికి ఇష్టపడతారు. కార్పొరేట్ సంస్థలు ప్రతిభను ఆకర్షించాలన్నా, నిలుపుకోవాలన్నా, పెంపొందించాలన్నా ఇది చాలా అవసరం'' అని సూచించారు.
ఈనాడు, 18:10:2006
http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel4.htm
_______________________________________________________________________
Labels: Management
0 Comments:
Post a Comment
<< Home