మూగజీవాల వృద్ధాశ్రమం
సృష్టిలో ఏ ప్రాణినీ చులకనగా చూడకూడదు. ప్రకృతిలో సమతుల్యత నిలకడగా ఉండటానికి ప్రాణులన్నిటి అవసరమూ ఉంది. నాగరికత ఇంతగా లేని రోజుల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో మనుషులకు ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులువంటి జంతువులతోనే కాక పిచికలు, పిట్టలువంటి పక్షులతో కూడా సన్నిహితత్వం ఎక్కువగానే ఉండేది. అప్పట్లో కోడికూతతో కాని మనుషులకు మెలకువ వచ్చేది కాదు. కోయిలలు గొంతులు సవరించుకోవటం మొదలుపెట్టగానే వసంతకాలం వచ్చేసిందని సంతోషపడేవారు. కుక్క అరుపు ఊళ్ళోకి, నక్క అరుపు శ్మశానానికి దారి తీస్తుందని సామెత. ప్రతి విషయాన్నీ ఏదో ఒక ప్రాణితో లంకెపెట్టి గుర్తించటం పూర్వం రివాజుగా ఉండేది. దొడ్లో కాకి అరిస్తే చుట్టాలు వస్తారని ఆశించేవారు. కాకమ్మ కూతలూ కల్లలూ కావు అన్నలూ వచ్చేటి సూచనలు ఏమొ- అని అత్తింటి కోడళ్ళు ఆశగా చూసేవారు. ''ఈగతల్లి నీళ్ళాడి వీధివీధి నిండాలి, దోమతల్లి నీళ్ళాడి దొడ్డెల్ల నిండాలి, పాముతల్లి నీళ్ళాడి పంటచేలో తిరగాలి, కప్పతల్లి నీళ్ళాడి కడవపంచల కుయ్యాలి...'' అని రైతులు కోరుకొనేవారు. అలా జరిగితే అదనుకు వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్మేవారు. కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవటం మనుషులకు మొదటినుంచీ ఉన్న అలవాటే. పూర్వం భరతుడు అనే ముని తల్లిలేని ఓ జింకపిల్లను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకొచ్చి ముద్దుగా పెంచుకుంటాడు. క్రమంగా ఆ జింకపిల్లే అతనికి ఆరో ప్రాణం అయిపోతుంది. అటువంటి జింకపిల్ల ఓ రోజు ఆశ్రమంలోనుంచి పారిపోతుంది. అపుడా మునీశ్వరుడు పడిన బాధ అంతా ఇంతా కాదు. పెంపుడు జంతువులపై మనుషులు ఎంతగా మమకారాన్ని పెంచుకుంటారో ఇటువంటి ఉదంతాలన్నీ రుజువు చేస్తుంటాయి.
కాపలా కోసమే కాకుండా ముద్దుకీ కుక్కల్ని పెంచుకోవటం మనుషులకు కొత్తకాదు. వేటగాళ్ళు తమకు సాయపడేటందుకు జాగిలాలను పెంచుకొనేవారు. ''గుణవంతుడనే జాగిలము గొడుగు నీడను వచ్చు, హనుమంతుడనే జాగిలము అందలములో వచ్చు, ప్రతాపుడనే జాగిలము పల్లకీలో వచ్చు...'' అంటూ ఓ యాదవరాజు తన జాగిలాలకు ఎటువంటి భోగాలు కల్పించాడో రసవత్తరంగా చెప్పారో వీరగాథలో. ముద్దుచేసిన కుక్క మూతి నాకును అన్న విషయం తెలిసినా ముద్దుచెయ్యటమే కాదు, వాటిని దింపకుండా ఎత్తుకొని మరీ తిప్పే శునకప్రియులెందరో ఉన్నారు. ఆ పెద్దింటమ్మ తన ముద్దుల కుక్కకోసం ప్రత్యేకంగా తయారయ్యే మినరల్ వాటర్ కొనటానికి ఓ దుకాణానికి వెళ్ళింది. ఆ సీసామీద 'కుక్కలకు మాత్రమే' అని రాసున్న చీటీ లేదు. ''ఆ చీటీ అతికించి ఇమ్మంటారా'' అని అడిగాడు షాపాయన. ''ఎందుకూ అక్కర్లేదు. మా ఆయన మందు తప్ప మంచినీళ్ళు ముట్టడు. మా కుక్కకేమో చదువురాదు. ఇంకా చీటీ ఎందుకు, అలాగే ఇచ్చేయండి'' అంది. పెంపుడు జీవాలనే కాదు, ప్రతి ప్రాణినీ అందరూ భూతదయతో ఆదరించాలి. కొంతమంది చీమలపుట్టల దగ్గర పంచదార పోస్తుంటారు. కొందరు వాకిట్లో ధాన్యపు గుత్తులు వేలాడదీస్తారు. పావురాలకు గింజలు చల్లి ఆనందించేవారు మరెందరో!
మనుషులకు వృద్ధాశ్రమాలు ఉండటం మామూలే. యజమానులు వదిలేసిన లేదా ఏ నీడా లేక నిరాశ్రయంగా తిరిగే కుక్కలు, పిల్లులువంటి వాటిని పట్టించుకొనేవారే కనిపించరు. అటువంటి మూగజీవాలను చేరదీసి వాటి సంరక్షణా బాధ్యతలు చేపట్టాడు చెన్నైకి చెందిన నలభైరెండేళ్ల అశోక్. ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇంజంబాకమ్‌లో 'బెంజీస్ డాగ్ అకాడమీ' అనే పేరుతో ఓ శునక సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి నడుపుతున్నాడాయన. ఇప్పుడు కొత్తగా తలపెట్టిన మూగజీవాల వృద్ధాశ్రమం దానికి కొత్త చేర్పు. అశోక్ నడుపుతున్న కేంద్రాల్లో ప్రస్తుతం 80 కుక్కలు, తొమ్మిది పిల్లులు ఆశ్రయం పొందుతున్నాయి. ''నాకు చిన్నప్పటినుంచీ కుక్కలన్నా, పిల్లులన్నా మహా ఇష్టం...'' అంటున్న అశోక్- ఆ ఇష్టం వల్లే మూగజీవాల సంరక్షణ కేంద్రాలను ప్రారంభించి నడుపుతున్నానంటున్నాడు. కొంతమంది తమ పెంపుడు కుక్కల సంరక్షణ బాధ్యతలను కొంతకాలంపాటు చూడమని అశోక్‌కు అప్పగిస్తుంటారు. అందుకోసంగాను నిర్ణీత రుసుము పుచ్చుకొని వాటినీ జాగ్రత్తగా చూస్తుంటాడు. వాటికి తగిన ఆహారం సమకూర్చటమే కాక అవసరమైనప్పుడు వైద్య సదుపాయం కల్పిస్తాడు. ఈ కేంద్రానికి అనుసంధానించి ఓ శ్మశానవాటికా ఉంది. మృతిచెందిన మూగజీవాలకు ఆ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అశోక్ సంరక్షణ కేంద్రంలో ఉన్న కుక్కలు కొన్ని తమిళ, తెలుగు సినిమాల్లో నటించాయి. వ్యాపార ప్రకటనలకు చెందిన చిత్రాల్లోనూ ఇవి దర్శనమిస్తుంటాయి. కేంద్రానికి చెన్నైలో స్థలం సరిపోకపోవటంతో మహాబలిపురంలో ఓ అర ఎకరం కొని మూగజీవాలకోసం విశాలమైన మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుచేయాలని సంకల్పించాడు. అందుకోసం నిధులు సేకరించే ప్రయత్నంలోపడ్డాడు. అశోక్ నిర్వహిస్తున్న రక్షణ కేంద్రంలో కుక్కలు, పిల్లుల సంరక్షణ చూసేందుకు ముగ్గురు పనివారున్నారు. అశోక్ భార్య అత్తగారూ మిగతా కుటుంబ సభ్యులూ తోడ్పడుతుంటారు. వీరందరి సహకారంతో ఆ కేంద్రంలో శునకాలు, పిల్లులు మహా కులాసాగా కాలం గడిపేస్తున్నాయి!
(Eenadu,Editorial,14:01:2007)
------------------------------------------------------------------
Labels: Animals/ telugu
0 Comments:
Post a Comment
<< Home