అందం:
చూడదగినదైన చూడగ వలయురా. -వేమన
"అందమే ఆనందం
ఆనందమె జీవితమకరందం."
______________________________________________
అజ్ఞానం:
తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు సుఖతరముగ దెలుపగ వచ్చున్
దెలిసిన వానిందెలిసియు
దెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. - భర్తృహరి
కుక్కనందలమున కూర్చుండపెట్టిన
నొక్క మనసుతోడ నుండబోదు.
ఆత్మ నిలుపలేని యజ్ఞానియును నట్టె. -వేమన
అజ్ఞుల నోరు మూయవచ్చునే. -పాపరాజు
________________________________________
అధికారం:
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు.-వేమన
అవనిలోపల నధికార మబ్బినేని
క్రిందివారలనెప్పుడు కినియదగదు. -కందుకూరి వీరేశలింగం పంతులు
____________________________________
అప్పు:
అప్పుదీయ రోత హరిహరాదులకైన
మొప్పెతోడ మైత్రి మొదలె రోత
తప్పు బలుక రోత తాకట్టు కడు రోత. -వేమన
అప్పులేనివాడె అధిక సంపన్నుడు. -వేమన
ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం ఉండకూడదు. -ఒక సూక్తి
________________________________________
అలంకారం:
నగలు లేవటంచు వగజెందుటేగాని
నగలవల్ల లేని సొగసు రాదు;
మగువకేల నగలు మనసిచ్చుమగడున్న? -నార్లవెంకటేశ్వరరావు
తామర సాక్షికెందు
తలిదండ్రులు పెట్టని సొమ్ము పెన్నెరుల్. -చేమకూర వేంటకవి
భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుచేయు పవిత్రవాణి వా
గ్భూషణమే సుభాషణము భూషముల్ నశియుంచు నన్నియున్.-భర్తృహరి
____________________________________________
అసూయ:
కుళ్ళుబోతు నొద్దగూడి మాట్లాడిన
గొప్ప మర్మములను చెప్పరాదు .-వేమన
అన్యుల కల్మి కన్ గొని యసూయామగ్నుడౌ
వానికాపద సేకూరు నవశ్యము. -పాపరాజు
సరివారి పరువు సైపని
నరుడే ధర తెవులు లేక నవయుచు కుందున్. -కోలచలం
__________________________________________
అహింస:
కలుగునవశ్యమున్ సకల కర్మములనందును హింస
హింస సేయనివాడు లేడిజ్జగమున. -ఎఱ్ఱన
దానమును తపంబు ధర్మంబు యజ్ఞంబు
శౌచ మంత్ర తంత్ర సత్యములును
బుధులహింస రూపములు గాగ చెప్పుట
నెల్లకల్మి సుమ్మహింస కలిమి. -తిక్కన
కుళ్ళిపోయున్న కురుపుమీద వైద్యుడు జరిపే శస్త్రప్రయోగాన్ని
హింస అని ఎవ్వడూ అనలేడు. -శ్రీశ్రీ
అహింస పరమోధర్మః -ఆర్యోక్తి
_______________________________________
(భావన, యువభారతి ప్రచురణ:29,ప్రథమ ముద్రణ 1974)
________________________________________
0 Comments:
Post a Comment
<< Home