పెద్దలూ బహుపరాక్!

చదువు దగ్గరకొచ్చేసరికి కొంతమంది పిల్లలు మొరాయిస్తుంటారు. సామ దాన భేద దండోపాయాలుపయోగించి పిల్లలకు నాలుగు ముక్కలు నేర్పాలని ఉపాధ్యాయులు, నేర్పించాలని తల్లిదండ్రులూ ఆరాటపడుతూనే ఉంటారు. ''చక్కనైన బుద్ధి, చదువు రావలెనన్న నెప్పుడైన గొట్టి చెప్పవలయు'' అన్నది పాతకాలం సిద్ధాంతం. ''చక్కనైన బుద్ధి చదువు వచ్చు గాన, నెప్పుడైన గొట్టి చెప్పనేల'' అనేది ఇప్పటివారి అభిప్రాయం. ప్రహ్లాదుడు తాను కోరినవిధంగా చదువుకోవటం లేదని ఆగ్రహించిన హిరణ్యకశిపునితో- ''ఈ పాపని జదివింతుము నీ పాదములాన యింక నిపుణతతోడం గోపింతుము, దండింతుము కోపింపకుమయ్య దనుజకుంజర వింటే'' అంటారు చండామార్కులవారు. ఎంత కోపించినా దండించినా తనకు నచ్చిన చదువేకాని గురువులు చెప్పిన చదువు ఒంటపట్టించుకోకపోవటమే ప్రహ్లాదోపాఖ్యానంలోని విశేషం. పూర్వం ఒంటిమీద దెబ్బలు పడితేకాని చదువు బుర్రలోకెక్కదని గురువులు భావించేవారు. చిలకమర్తివారు సృష్టించిన గణపతి స్వయంగా బడి పెట్టదలచి ముందుగా, ''కాలవయొడ్డునకు బోయి మంచి యీత బెత్తములు రెండు, మూడు విరిచి యాకులూడదీసి నున్నగా జేసి యొకటి చేతబుచ్చుకొని బడికి వచ్చి'' కూర్చున్నాడట! బెత్తం దాస్తే పిల్లలు పాడైపోతారనేది అతని నమ్మకం. ఈ రోజుల్లో అటువంటి నమ్మకాలకు కాలం చెల్లిపోయింది.
'మొక్కయి వంగనిదే మానై వంగుతుందా' అని సామెత. పిల్లలకు క్రమశిక్షణ నేర్పేటప్పుడు తల్లిదండ్రులు తరచూ ఈ సామెత ప్రయోగిస్తుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పాలనే తాపత్రయంతో ఒక్కొక్కసారి తిడతారు, కొడతారు. చదువు దగ్గరకొచ్చేసరికి 'దండం దశగుణం భవేత్' అనే నమ్మకం చాలామంది ఉపాధ్యాయులకు ఉంటుంది. పిల్లలను కొట్టనిదే చదువురాదని, దండిస్తేతప్ప పిల్లలు దోవలోకి రారని కొంతమంది భావిస్తుంటారు. ఆ నమ్మకంతోటే బెత్తానికి పనిచెబుతుంటారు. ఇటువంటివారి ఆటలికముందు సాగేట్లు లేవు. పిల్లలను హింసించటాన్ని నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం ఓ బిల్లు తేవాలని సంకల్పించింది. ముసాయిదా బిల్లును మహిళా శిశుసంక్షేమశాఖ రూపొందించింది. ఆ బిల్లు చట్టరూపం దాలిస్తే పిల్లలను దండించే తల్లిదండ్రులకు శిక్షలు తప్పవు. మనవాళ్ళేకదా అని అబ్బాయినో అమ్మాయినో ఓ చెంపదెబ్బ కొడితే బిల్లు ప్రకారం కనీసం మూడేళ్ళ జైలుశిక్ష విధించవచ్చు. గరిష్ఠ శిక్ష ఏడేళ్ళ దాకా ఉంటుంది. పిల్లల్ని శారీరకంగాను; కోప్పడటం, తిట్టటం వంటి చర్యలతో మానసికంగాను హింసించటాన్ని నిరోధించటానికి బిల్లులో పలు శిక్షలు ప్రతిపాదించారు. లైంగికపరమైన వేధింపులతో సహా బాలలపై జరిగే హింసల గురించి స్పష్టమైన వివరాలను ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. చెంపమీద కొట్టడం, కాలితో తన్నడం, బెత్తంతో కొట్టడం వంటివన్నీ భౌతిక హింసకిందికి వస్తాయి. అనవసరంగా కోప్పడటం, తిట్టడం, మందలించడం వంటివన్నీ మానసిక హింసకిందికి వస్తాయి. పిల్లలను నగ్నంగా ఫొటోలు తీయడం, పిల్లలచేత పెద్దవారు తమ శరీర భాగాలను తడిమించుకోవటం వంటివన్నీ లైంగిక పరమైన హింస కిందికి వస్తాయి. అలాగే బాలికల పట్ల విచక్షణ కనబరచడం, వారికి సరైన ఆహారం పెట్టకపోవటం వంటివీ హింసగానే పరిగణిస్తారు. ముసాయిదా బిల్లును పరిశీలన కోసం న్యాయశాఖకు పంపారు. ఈ బిల్లు చట్టమైతే పాఠశాలలో ఉపాధ్యాయులూ పిల్లల్ని కొట్టేముందు ఆలోచించాల్సిందే. ఉల్లంఘిస్తే మూడేళ్ళ జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఇటువంటి చట్టాలు అమెరికావంటి దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఇప్పుడే ఇటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి.
(Eenadu:22:04:07)
_____________________________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home