భగవదంశ
సర్వాంతర్యామియైన భగవంతుడు సృష్టిలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడని, చరాచరాల్లోనేగాక జడపదార్థాల్లోనూ భగవదంశ ఉన్నదని మన పూర్వులు విశదం చేశారు.
భగవంతుని విశ్వవ్యాప్త లక్షణాన్ని వివరించే కథను రామకృష్ణ పరమహంస ఇలా తెలియజెప్పారు.
కార్తికేయుడు ఒకనాడు పిల్లిని గిల్లాడట. ఇంట్లోకి పోయి చూసేసరికి తన తల్లి పార్వతీదేవి చెంప గిల్లి ఉండటం గమనించాడు.
''అమ్మా! నీ బుగ్గమీద ఈ గాయం ఎట్లా అయింది'' అని ప్రశ్నించాడు.
''ఇది నీ పనే! నీ గోటిరక్కే ఇది'' అని జవాబు చెప్పింది ఆ జగజ్జనని. కార్తికేయుడు నివ్వెరపోయాడు. ''అదెట్లాగమ్మా! నేను నిన్ను గిల్లినట్టుగా గుర్తులేదే'' అన్నాడు.
''నాయనా! ఈ ఉదయాన నువ్వు పిల్లిని గిల్లినమాట మరచిపోయావా?'' అని తల్లి అడిగింది.
''ఆ! ఔనమ్మా! నేను పిల్లిని గిల్లిన మాట మరచిపోయాను. అయినా నీ బుగ్గ మీద గాయం ఎట్లయింది?'' అని అడిగాడు కార్తికేయుడు.
అప్పుడు ఆ తల్లి చెప్పింది. ''వెర్రి నాయనా! ఈ జగత్తులో నేను మినహా ఏమీలేదు. సృష్టి సర్వస్వం నేనే. నువ్వు ఎవరిని హింసించినా నన్నే హింసించిన వాడవవుతావు''.
''ఏది కళ్లకు కనబడదో, దేనివలన కళ్లు చూస్తున్నాయో అదే పరబ్రహ్మం అని తెలుసుకో'' అని చెబుతోంది.
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి... అని భగవానుడు గీతలో చెప్పాడు. ''సర్వప్రాణుల హృదయాలలోను ఈశ్వరుడు నివశించివున్నాడు...'' అయితే మాయచేత ఆయన ఉనికిని మానవుడు గ్రహించలేకపోతున్నాడు.
''ఆ పరతత్వానికి కాళ్ళు లేవు. అయినా వేగంగా పోగలదు. చేతులు లేకనే పట్టుకోగలదు. కళ్ళులేకనే చూడగలదు. చెవులు లేకనే వింటుంది'' అని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. భగవంతుడు సర్వత్రా సర్వకాలాల్లో ఉన్నాడనే స్పృహ ఉంటే విలువలతో కూడిన జీవనం గడపడానికి సాధన చెయ్యవచ్చు.
-డి.ఎస్.ఆర్. ఆంజనేయలు
(Eenadu,06:05:2006) ___________________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home