My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, May 28, 2015

2018- 3 is better than 6

(Antaryami, eenadu, 09:04:2015)

Labels: ,

Sunday, July 06, 2014

1549- సర్వ ధర్మ పరాయణం (సువర్ణ , రజత , ప్లాటినం సూత్రాలు)

- మల్లాది హనుమంతరావు 
పరాయణం అంటే సర్వోత్తమమైన ఆశ్రయం, గమ్యం అని అర్థం. అయనం అంటే ఆధారం, ఆశ్రయం, నివాసం, ద్వారం అని అర్థాలున్నాయి. పర-అయనం అంటే ఉత్కృష్టమైన గమ్యం, ఆశ్రయం! సర్వ ధర్మాలకు పరాయణమై, సర్వ ధర్మ మార్గాల్లో అత్యుత్తమమైన మార్గం అని చెప్పే ధర్మం ఒకటి ఉంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ఇది మహాభారతం శాంతిపర్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది.

మహా భారత యుద్ధం పూర్తయిన తరవాత, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన వసిష్ఠ శిష్యుడు, ధర్మశాస్త్ర విశారదుడు. సర్వ విద్యలకూ ఆయన ఆశ్రయం. రేపు ఉత్తరాయణం రాగానే ప్రాణత్యాగం చేయాలని ఎదురుచూస్తున్నాడు. ధర్మరాజు బంధుమిత్ర పరివార సమేతంగా తాతగారి దగ్గరకు వెళ్ళి సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ధర్మచర్చలు చేస్తాడు. ఈ చర్చల సారాంశంగా భీష్ముడు ధర్మరాజుకు ఒక్క ధర్మం బోధిస్తాడు. అది బాగా లోక ప్రసిద్ధమే అయినా తరచుగా మననం చేసుకోదగిన ధర్మం.'ధర్మ సర్వస్వ నైజ స్వరూపం' కరతలామలకంగా ఒక్క మాటలో చెబుతాను, విను' అని భీష్ముడు ఈ అతి ముఖ్యమైన ధర్మాన్ని బోధిస్తాడు. ఇతరులు ఏమేమి చేస్తే తన మనసుకు కష్టంగా ఉంటుందో, తాను ఇతరులకు అవి చేయకుండా ఉండటం గొప్ప ధర్మమార్గాల్లో అన్నిటికన్నా విశిష్టమైంది. ఇది సర్వధర్మాల సంగ్రహ రూపం.

ఒక విచిత్రమేమిటంటే ఈ ధర్మం ప్రపంచంలో ఉన్న ప్రధాన మత సంప్రదాయాలు అన్నింటిలోనూ కనిపిస్తుంది. బౌద్ధ, జైన, యూదు, పార్సీ, క్రైస్తవ, మహమ్మదీయ మతాల మత గ్రంథాలన్నింటిలోనూ ఈ సూత్రం కనిపిస్తుంది. అన్ని మత సంప్రదాయాల్లో దాదాపు ఒకే రూపంలో కనిపించే ఒకే ఒక్క ధర్మసూత్రమూ ఇదే.

 'ఏ వ్యవస్థలోనూ ఇతరులను నొప్పించటమనేది న్యాయమూ ధర్మమూ కాజాలదు' అన్నాడు సోక్రటీస్‌. అది సత్యమే కదా?
'నువ్వు ఇతరులకు ఏం చేశావో, వాళ్లు నీకు అదే చేస్తారు, సిద్ధపడు!' అని హెచ్చరిస్తాడు సెనెకా అనే వేదాంతి.
 'నీకు అప్రియంగా నువ్వు భావించేదాన్ని, ఇతరుల మీద రుద్దకు' అంటాడు కన్‌ఫ్యూషియస్‌ అనే చైనా దేశపు విజ్ఞాని.
 'నేను ఎలాంటివాడినో ఇతరులూ సరిగా అలాంటివారే. వాళ్లు ఎలాంటివారో నేనూ సరిగ్గా అలాంటివాడినే' అనే సూత్రం గౌతమ బుద్ధుడి బోధల్లో కనిపిస్తుంది.  'అవతలివాళ్లను నీతో పోల్చుకొని వారూ నీ వంటివారే అని గమనించు. చంపవద్దు, హింసించవద్దు' అంటుంది 'ధమ్మపద' అనే బౌద్ధ మత గ్రంథం.

'ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకొంటావో వాళ్లకు నువ్వూ అదే చెయ్యి' అనేది బైబిల్‌ బోధించే ముఖ్యమైన ధర్మ సూత్రాల్లో ఒకటి. 'నీతోటివాడిని నీలాగే ప్రేమించు!' అని బోధిస్తుంది పాత నిబంధనల పుస్తకం.

'స్వర్గానికి వెళ్లేందుకు తేలిక మార్గం ఏదైనా తనకు బోధించ'మని ఒక శిష్యుడు మహమ్మద్‌ ప్రవక్తను అడిగితే, 'ఇతరులు నీకు ఏం చేస్తే బాగుంటుందో, అది నువ్వు ఇతరులకు చెయ్యి, వాళ్లు నీకు చేసేవాటిలో నీకు నచ్చనివి నువ్వు వాళ్లకు చెయ్యకు!' అన్నాడట.

ఇలా అన్నీ మతాల బోధనల్లోనూ కనిపించే ధర్మసూత్రం కనుక దీన్ని 'సువర్ణ సూత్రం'(గోల్డెన్‌ రూల్‌) అన్నారు. 'ఇతరులు నీకేది చేస్తే నీకు బాగుంటుందో, అది వాళ్లకు నువ్వు చేయి' అనేది ఈ సూత్రం సకారాత్మక రూపం.
చెయ్యవలసిన విధిని చెబుతున్నది. ఇది సువర్ణ సూత్రం. భారతంలో చెప్పినట్టు, 'ఇతరులు ఏం చేస్తే నీకు అప్రియంగా ఉంటుందో, అది వాళ్లపట్ల నువ్వు చెయ్యకు' అనేది నకారాత్మక రూపం. చేయకూడని పనిని నిషేధరూపంలో చెబుతుంది. దీన్ని 'రజత సూత్రం'(సిల్వర్‌ రూల్‌) అనటం కద్దు.

ఈ సువర్ణ సూత్రంతో విభేదించే ప్రముఖులూ ఉన్నారు. జార్జి బెర్నార్డ్‌ షా ఇలా చమత్కరిస్తాడు- 'ఇతరులు నీకేం చేస్తే నీకు బాగుంటుందో, అది నువ్వు వాళ్లకు చెయ్యటం ఎప్పుడూ వివేకవంతమైన మార్గం కాదు సుమా! నీకు నచ్చింది వాళ్లకు నచ్చాలని ఎక్కడుంది?'

'నిరాశావాదులు, పిడివాదులు తమకున్న విలువలు, నమ్మకాలతో ఈ సూత్రాన్ని పాటించకపోతేనే ఇతరులకు మేలు. అందుకే ఈ సువర్ణ, రజత సూత్రాలకు తోడుగా 'ప్లాటినం సూత్రం' అన్న పేరుతో ఒక కొనసాగింపు ఉంది. 'నీకేది బాగుంటుదో అది ఇతరులకు చేయడం కాదు. వాళ్లకేది బాగుంటుందో చక్కగా ఆలోచించి, అది వాళ్లకు చేయి!'
(అంతర్యామి , ఈనాడు , ఆదివారం జూలై, 2014)
________________________________

Labels: , , ,

Sunday, March 30, 2014

1395- అన్నమయ్య గీత!
























______________________________________

Labels: , , ,

Sunday, April 28, 2013

1122- భార'తీయదనం'


ఒకటి, రెండు, మూడు... గణితం. మూడు, రెండు, ఒకటి... వివాహ జీవితం! మూడుముళ్లతో ఇద్దర్నీ ఒక్కటి చేసే పెళ్ళి- ఆనందం 'జల్లులై కొల్లకొల్లలై/ పెల్లుబికి వెల్లివిరియ'జేసే పవిత్ర క్రతువు. అది అంకురారోపణంతో మొదలై నక్షత్రదర్శనందాకా కొనసాగి కన్యాదానం, కల్యాణ హోమం, జీలకర్ర- బెల్లం, మంగళసూత్రధారణం, పాణిగ్రహణం, తలంబ్రాలు, సప్తపది కలుపుకొని నవవిధ ప్రధాన శోభితం. విష్ణుపురాణ సంబంధిత నాయికా నాయకులు నర్మద, పురుకుత్సుల పరిణయ రమణీయత ప్రబంధ కవి స్మితశ్రీ అవలోకించినట్టు 'అగరు ధూపంబులు గగన భాగంబెల్ల/ సౌరభమ్ములు నింపి స్వాగతించె/ పట్టువస్త్రములపై పన్నీరు జిల్కింప/ సౌగంధికాపూర్ణ సౌఖ్యమిచ్చె'. ఎదుర్కోలు ఆహ్లాదభరితమనీ, ప్రాంగణమంతటా మోగిన మంగళవాద్యాలతో పెండ్లివేదిక సందడించిందనీ ఆ గళ సారాంశం. కమనీయ రీతిన సాగిన గోదా రంగనాథుల మనువూ నిత్య మననీయమే. దేవి గళాన శ్రీవారు మంగళసూత్రం కట్టడంతోనే- అక్కడంతా నవోత్సవం, మహోత్సాహం. 'నెలతయు పతియును కరముల/ నలవరచిరి కంకణంబు లన్యోన్యంబున్' అంటూ దాంపత్యబంధ ఘనతను ఆవిష్కరించారా కావ్యకర్త. ఆది దంపతులు గౌరీశంకరులది సత్య సనాతనత్వం, అర్ధనారీశ్వర సముదాత్త తత్వం. ధన్య చరితులు జానకీరాముల మది నిత్య ఏకాత్మకం. వారిది సముల్లసిత సౌభాగ్య సహిత మహిత మనోజ్ఞ జీవనం. చందనాల చల్లదనం, మకరందాల తియ్యదనం, సకల కళల చక్కదనం సమస్తం... ఆ ఆదర్శ జంటల సొంతం.

'నేను' నుంచి 'మన'లోకి రస హృదయాల్ని అలవోకగా తరలించుకుపోయే బహుచక్కటి ముచ్చట మనువొక్కటే. ఆ సరసమయ సామ్రాజ్యంలో ఆలూమగలిద్దరిదీ సమ భాగస్వామ్యం. ఆ క్రీడానంద జగతిలో నాటికీ నేటికీ ఏనాటికీ ఉభయులదీ ఘన విజయం. 'చిత్తచోరా! శ్రీయుతాకారా!' అని శ్రీకృష్ణుణ్ని ప్రస్తుతించిన రుక్మిణి ఆయనకు 'సోగకన్నుల రాణి, సౌభాగ్యవాణి, జీవిత కల్యాణి'. ప్రణయ పరిణయాల్లో విజయవిలాస యానం సాగించిన సుభద్రార్జునులదీ మహదానంద అనుభవమే. గిరికా వసురాజులది అనురాగోదయ వృత్తాంతమైతే, ధూర్జటి సందర్శించిన ఇందుమతీ వివాహ వైభవం నవనవానంద రసోదయం. మూడు పువ్వులూ ఆరు కాయలుగా రోజులు దొర్లిపోయేలా వేదికమీద ధ్వనిస్తాయి పెళ్ళినాటి ప్రమాణాలు. అంతకుముందు- తేనె, పెరుగు, బెల్లం కలగలిపిన మధుర పదార్థ సేవనం వరుడి నోటినీ మనసునూ తీపి చేస్తుంది. ఎదుర్కోలు వేళ, వధూవరుల ఉభయపక్షాల సమక్షంలో పానకమూ మధురాతిమధురమే. వరుడి కాళ్లు కడిగి జరిపే కన్యాదానం అతడి ధర్మకామార్థ సిద్ధికి మూలం. ప్రమాణాల్ని అతిక్రమించనంటూ ఆ అల్లుడు ముమ్మార్లు మామకు చేసే వాగ్దానమే సర్వ వేదోక్తం. ఇల్లంటే అనురాగాల నిలయమని, కుటుంబమంటే అనుబంధాల సమాహారమని చాటే ఆ వైనం కవి స్వరం పలికినట్టు 'యుగయుగాల జాతికి ఉజ్జీవనం/ జగజగాల జ్యోతికి సంభావనం'. భిన్నరుచులను మమేకం చేసేందుకే బెల్లమూ జీలకర్రా. కార్యక్రమ ఆరంభంలోనే 'బరువు కాదు- ఇది బాధ్యత' అన్నట్టు గంపలో వధువును తెచ్చి పెళ్ళిపీట దరికి చేరుస్తారు మేనమామలు. వధువు తల్లికి రక్తసంబంధ సోదరులైన మేనుమామలే వారు. వధువుకు వరుడు తాళికట్టే తరుణంలోనూ 'పెళ్ళంటే నూరేళ్ల పంట' అంటూ మంగళవాద్య ధ్వనులు. నూతన దంపతులపైన బంధుమిత్రాదులు కురిపించే అక్షతలు అ-క్షతాలు. పెద్దల దీవనలు కోరుతూ ఆ భార్యాభర్తలు నడిచే ఏడడుగులూ ఏడేడు జన్మల అనుబంధాలకు సూచికలు. వారు దర్శించే నక్షత్రమంత కాంతిప్రభ జీవితమంతా నిండి, కవిశ్రీ గీత మాధురిలా 'మమతామయివై సృష్టికి/ సమరస భావమ్ము నేర్పు సౌజన్యముతో/ రమణీయ రాగరంజిత/ సుమనోరథమెక్కి రమ్ము శోభనమూర్తీ' అని ఆహ్వానిస్తుంది.

చిలిపి నవ్వులూ కొంటె చూపులూ సరసాలూ మురిపాలూ పెళ్ళిరోజుకే పరిమితాలు కావు. పద్మరాగాల్లా, కుంద ప్రసూనాల్లా, ఇంద్రనీలాల్లా, పుష్పవర్షాల్లా శాశ్వత శోభితాలవి. లోకోత్తరులూ రాజవంశీకులైన సుచంద్ర, చంద్రికల పెళ్ళిఘట్టాన్ని స్మరణకు తెచ్చుకుంటే 'ఒకరి దరహాసం మరొకరికి మధుమాసం, ఒకరి చరణం మరొకరికి శశికిరణం'. అభినవ తార ఒకరైతే, రసమయ కాంతిధార మరొకరు. జడ అల్లి, బొట్టుపెట్టి, గంధంపూసి, వజ్రమాలిక వేసి- పెళ్ళికూతుర్ని చేశారామెను. రత్నాల పతకం, ముత్యాల బాసికం, కెంపుల ఉంగరం, రవ్వల భుజకీర్తితో అలంకరించారు అతణ్ని. అక్కడి ఆ అందాలూ ఆనందాలకు పరిమితులంటూ ఉంటాయా? అటువంటి భావగాఢతే పెద్దన రచనలో 'వలపుల సమత, తలపుల తనూలత'గా రూపుదిద్దుకుంది. భారతీయ వివాహ సంస్కారంలో, జంటతో చేయించే ప్రతి పనికీ ఓ అంతరార్థమూ ఓ పరమార్థమూ ఉంటాయి మరి. అందుకు ఎంతగానో స్పందించినందునే జపాన్ యువతి, యువకుడు భాగ్యనగరికొచ్చి మరీ తెలుగు సంప్రదాయ రీతిలో ఇటీవల పెళ్ళాడారు. చీర, ఉత్తరీయం అంచుల్ని కలిపి వేసిన ఆ బ్రహ్మముడితో ఇద్దరి జీవితాలూ హాయిహాయిగా తీయతీయగా చూపరుల కనుల పంటగా ముడివడ్డాయి. ఇక్కడి సంస్కృతి అపురూపమని, పెళ్ళిముస్తాబు అపూర్వమనీ మురిసిపోయారా ఇద్దరూ. మనసున మల్లెల మాలలూగించిన వారి ఆ అనుభవాల్ని చూసిన, విన్న ఎవరికైనా భారతీయతకు నమోస్తుతి చేయాలనిపించదూ


(ఈనాడు ,సంపాదకీయం , 31:03:2013)
____________________________________

Labels: , , , ,

Friday, April 19, 2013

1101- శ్రీరామ నామాలు శతకోటి



   ' రామ' రెండే అక్షరాలు... కానీ ఎంత సాహిత్యం! 'రామ' అనే శబ్దాన్ని తిరగేసి పలికినా అక్షర జ్ఞానం లేని ఆటవికుడు ఆదికవిగా మారాడు! విశ్వానికి తొలి కావ్యాన్ని ప్రసాదించాడు. అది మొదలు ఎన్నో భాషల్లో ఎన్నో కావ్యాలు. పద్యాలుగా, పదాలుగా, పాటలుగా పల్లవించాయి. రామనామ గానామృతభాండాన్ని తరతరాలకూ తరగని సంపదగా అందిస్తున్నాయి. తెలుగు చలన చిత్రాల్లో సైతం రాముడి పాటలకు రత్నాల సింహాసనం మీద పట్టాభిషేకం జరిగింది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా 'పాలు మీగడల కన్న పంచదార చిలకల కన్న' ఎంతో రుచికరమైన కొన్ని పాటల్ని తీర్థప్రసాదాల్లా కళ్లకద్దుకొందాం...

రాముడి పాటలు అనగానే ఒక తరంవారికి వెంటనే గుర్తుకొచ్చే కవి సీనియర్ సముద్రాల. వాహిని వారి 'దేవత'లో 'రామ భజనే మోదజనకమురా' అని శ్రీరాముడిపై తొలిసారిగా రాసిన సముద్రాల... ఆ తరవాత 'భక్త పోతన'లో 'సర్వమంగళ నామా రామా...' లాంటి పాటలతో భజన గీతాల సంప్రదాయానికి సరికొత్త ఒరవడిని సృష్టించారు. 'భూకైలాస్'లో శ్రీరామచంద్రుడి అవతార భవిష్యద్దర్శనం చేస్తూ ఆయన రాసిన 'రాముని అవతారం...' పాట చిరస్థాయిగా నిలిచిపోయింది. 'లవకుశ', 'వాల్మీకి' చిత్రాల్లో సముద్రాల వారి రామకథా గీతాలు ఆపాత మధురాలు. వారి చిట్టచివరి సినిమా పాట సైతం రామాయణ గీతమే కావడం విశేషం. అది... 'శ్రీరామకథ'లోని 'రామకథా... శ్రీరామ కథా...' గీతం.

సీనియర్ సముద్రాల కలం వారసుడు జూనియర్ సముద్రాల కూడా తన రామభక్తిని అక్షరాల్లో చూపించారు. ఆయన 'శాంతినివాసం' చిత్రం కోసం 'శ్రీరఘురాం జయ రఘురాం...', 'జయసింహ'లో 'జయ జయ శ్రీరామా రఘువరా...' గీతాలు రాశారు.

పదములే చాలు:  

నీలమేఘ శ్యాముడిపై రాయడంలో దేవులపల్లి కృష్ణశాస్త్రిది మరో శైలి. భక్తీ, కరుణ, పరిపూర్ణ శరణాగతి, భావుకత రంగరించి దేవులపల్లి హృదయాల్ని తాకేలా రాశారు. 'ఏమి రామ కథ శబరీ...' (భక్త శబరి), 'వూరికే కొలను నీరు...' (సంపూర్ణ రామాయణం), 'పదములే చాలు రామా' (బంగారు పంజరం), 'ఈ గంగకెంత గుబులో' (శ్రీరామ పట్టాభిషేకం) లాంటి ఆణిముత్యాలతో ఆయన గీతార్చన చేశారు. రాముడి పాటల అల్లికలో ఆరుద్రది విశిష్ట ముద్ర అని చెప్పాలి. తిలక్, బాపు-రమణల చిత్రాల్లో ఆయన కలం నుంచి జాలువారిన రాముడి పాటలు సాహితీ విలువలతో వాసికెక్కాయి. 'అశోక వనమున సీతా...' (అత్తా ఒకింటి కోడలే), 'అందాలా రాముడు... ఇందీవర శ్యాముడు' (ఉయ్యాల జంపాల), 'పలుకే బంగారమాయెరా..' (అందాల రాముడు), 'శ్రీరామ జయరామ సీతారామ' (ముత్యాల ముగ్గు), 'రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా' (గోరంత దీపం), 'శ్రీకరమౌ శ్రీరామ నామం' (శ్రీరామాంజనేయ యుద్ధం) లాంటి పాటలు ఆయనవే. ఇక ఆరుద్ర రాసిన మరో ఆణిముత్యంలాంటి రామ గీతం 'మీనా' చిత్రంలో ఉంది. అదే... 'శ్రీరామ నామాలు శతకోటి'. ఈ గీతం నేటికీ జనాదరణ పొందుతూనే ఉంది.

మా వూరి దేవుడు:  

మన దేశంలో రాములవారి గుడి లేని వూరు ఉండదంటారు. కాబట్టే మన దర్శకులు అవకాశం వచ్చినప్పుడల్లా రామాలయాన్నీ, స్వామి విగ్రహాల్నీ తమ కథలో భాగం చేసుకొంటారు. అందుకు తగ్గ విధంగానే సాహిత్య విలువలున్న గీతాలూ రాయించుకొంటారు. ఆ పాట రాసే అవకాశం వచ్చినప్పుడల్లా మన కవులు భక్తి పారవశ్యంతో కలాన్ని పరుగులు తీయించారు. దాశరథి - 'రాముని రూపమే' (పెళ్లికూతురు), 'జగదభిరామా రఘుకులసోమా' (రామాలయం); సి.నారాయణరెడ్డి - 'మముబ్రోవమని చెప్పవే..' (అందాల రాముడు), శ్రీశ్రీ - 'శ్రీనగజాతనయం' (వాగ్ధానంలో హరికథ), కొసరాజు - 'శ్రీరామ నీ నామమెంతో రుచిరా' (ఇద్దరుమిత్రులు), 'రామయ తండ్రి...' (సంపూర్ణ రామాయణం); వేటూరి - 'మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు' (పంతులమ్మ), 'మా వూరి దేవుడు అందాల రాముడు' (అల్లుడా మజాకా); కులశేఖర్ - 'కోదండ రాముణ్ని చూడు...' (శీను వాసంతి లక్ష్మి) ఆ భక్తి గీతాల జాబితాలోనివే. ఇటీవల వచ్చిన 'శ్రీరామరాజ్యం'లో జొన్నవిత్తుల రాసిన గీతాలు, 'శ్రీరామదాసు'లో కీరవాణి స్వరపరచిన రామదాసు గీతాలను నవతరం శ్రోతలు విని తన్మయులయ్యారు.
- ఓలేటి శోభ

(ఈనాడు , సినిమా ,19:04:2013)
______________________________________

Labels: , , ,

Wednesday, April 17, 2013

1096- జలాభివందనం


సకల భువన పావని మన భరతావని. గంగా తరంగాలు పొంగి పొరలే ఈ నేల జన హృదయాంతరంగ తరంగిణి. గరికిపాటివారన్నట్టు ఇక్కడ 'నీటిబొట్టున కేదియు సాటిరాదు'. సిరులు నిండించుకుంటూ, కలలు పండించుకుంటూ సాగే గంగానదీ జలప్రవాహంలోని ఒక్కో నీటిచుక్కా భారతీయత పాలిట ఆశాదీపిక. ఈ నదీమతల్లితో పాటు యమునా సరస్వతుల సంగమ స్థలమైన త్రివేణికి చేరి 'ఒక్క చుక్కను తలమీద చల్లుకున్నా చాలు' అనుకునేవారు ఎందరెందరో. వీరంతా అనేకానేక ప్రాంతాలనుంచి వందల్లో వేలల్లో లక్షల్లో... అన్నీ కలిపి కోట్ల సంఖ్యలో ఫిబ్రవరి నెలలో  అలహాబాద్‌కి బారులు తీరడమే మహా కుంభమేళా. ఏటా ఎన్ని పర్వదినోత్సవాలున్నా, ప్రతీ పన్నెండేళ్లకీ పుష్కరాలొస్తున్నా, నూట నలభైనాలుగేళ్ల బహు సుదీర్ఘకాలం తరవాత సాగిన భక్తజన ప్రభంజన విశ్వవిఖ్యాత మేళా ఇదే. 'అడుగులో అడుగులో అకలంక మంకమై/ అడుగు వేసినదయ్య అలల రాణి/ నడకలో నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్య నల్ల తరగ/ పరుగులో పరుగులో పరమార్ద్ర భావమై పరుగెత్తి వచ్చెనా నురుగు నవ్వు' అనుకున్నప్పుడు సంగమ స్థలిలో పుణ్యస్నానం అపూర్వమూ అపురూపమే కాదు, మహా విశేషం మహా విశిష్టం కూడా. కుంభరాశిలోకి దినకరుడు అడుగిడిన  సందర్భంలో రోజుల పర్యంతం కొనసాగిన ఈ స్నాన పరంపర భిన్న విధానాల విభిన్న సంప్రదాయాల ఏకైక సమ్మేళనం. నాగరికత, ధార్మికత, సంస్కృతుల మేలు కలయికగా భాసించిన ఇది అన్ని వయసులవారికీ ఉమ్మడి వేడుక.

'అఖిలాండకోటి బ్రహ్మాండనాథు డంతరంగమున/ నెలకొనియుండగ నిక గావలసినదేమి?' అన్న త్యాగయ్యకు సమాధానమా అన్నట్టు సాగుతుంటాయి మేళా స్నానాదికాలు. పోయిన నెల పదో తేదీన మహాశివరాత్రి తరుణంలోనూ ఎటుచూసినా ఎక్కడ విన్నా ఇక శివానంద లహరులే. ఎక్కడైనా ఎప్పుడైనా నదులే జాతి సజీవతకు సూచికలు, సుగతికీ త్వరితగతి ప్రగతికీ వీచికలు. గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే పండేవి ఒక్క బంగారు పంటలేనా? ప్రజలందరి కలలూ కోరికలూ పండి... కవి అద్దేపల్లి అనుభవానికి వచ్చినట్టు 'నీళ్లు దోసిట్లోకి తీసుకుంటే అందులో సంస్కృతీ నిలబడుతుంది, గొంతులో పోసుకున్న నీళ్లతోపాటే చరిత్రా లోనికి ప్రవహిస్తుంది'. అదే రీతిన గంగమ్మను తలచుకున్నా 'తీర్థగమన ఫలంబెల్ల పుణ్యంబులకు విశేష'మన్న నన్నయకవి మాటా స్మృతిపథాన మెరవాలి. ఆ జలాల శుచి, శుభ్రత, రంగు, రుచి, వాసనలన్నీ ఇంపుగా ఉన్నప్పుడే- అక్కడి స్థితి సజావుగా ఉన్నట్టు. ఉత్తుంగ తరంగాల గంగకు ముకుళిత హస్తాలతో భక్తి నమస్కారాలు చేయాలే కానీ, వాటి స్థానే భయం కమ్ముకోకూడదు. 'అయ్యయొ! ముక్కు మూసుకొనుమయ్య!' అనేంతగా వాతావరణం ఉందంటే, అది కాలుష్య హారిణి కాదు- అక్షరాలా కాలుష్యకారిణే. వేదాలూ ఇతిహాసాల్లో చోటుచేసుకున్న నదీసంపదకు వర్తమానంలో ఎదురవుతున్న విపత్కర స్థితి అతి దుర్భరం. మన ఆశల ప్రశ్నలకు జవాబు కావాల్సిన కాలం మన ఆశయాలకే పెద్ద సవాలుగా మారుతుండటం- ఆరుద్ర చెప్పినట్టు 'కష్టాల కడగండ్ల నడుమ మొత్తంగా ఇరుక్కుపోవడం!' మామూలు రోజుల్లో పవిత్రత నిలపాల్సిన నదీస్నానాలు, ఘట్టాలు మహామేళా వంటి కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఉండితీరాలి.

దేశవిదేశాలవారు సందర్శించిన  కుంభమేళా స్థలి ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 17,ఆదివారం రథసప్తమి, 18 సోమవారం భీష్మాష్టమి కూడా ప్రధాన పుణ్యస్నానాల రోజులే. జనసందోహం పోటెత్తుండటంతో అసలు రూపురేఖలే మారిపోయే ఆ సంగమ ప్రదేశాన్ని పరిపూర్ణ అధ్యయనం చేసింది హార్వర్డ్ బృందం. 'చెదరిపోవునో శేషుని శిరములు/ బెదరిపోవునో దిక్కుంజరములు/ అదరిపోవునో అవనీతలమే' అన్నంతగా అలహాబాద్ నగర జీవనాన్ని చట్రంలో బందించిన వైనాన్ని  పరిశీలించారా సభ్యులు. జలమయం, జనమయం... రెండింటినీ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండటం 'ఏయే తీరము లూరడిల్లినవి తల్లీ! నీదు పొత్తిళ్లలో?/ ఏయే సారము లంతరించినవి మల్లీ! నీవు సాక్ష్యమ్ముగా?' అన్న ప్రశ్నల్ని వారిముందు ఉండడమూ సహజమే. పర్యావరణాన్నే కాక ప్రజారోగ్యం, సాంకేతిక సమాచార రంగాలనూ విశేషంగా ప్రభావితం చేసిన ఈ మేళా తదుపరి ఏర్పాటు 'కుంభమేళా' పేరిట ఉజ్జయిని కేంద్రంగా ఇక మళ్ళీ రెండేళ్లకే. అటు తరవాత క్రమంలో పూర్ణ కుంభమేళా నిర్వహణ ఉంటుంది. పేర్లు ఏవైనా, నిర్వహణ స్థలాలు ఎక్కడున్నా- అడివి బాపిరాజు ఆనాడే దర్శించినట్టు 'వడులలో గర్వాన/ నడలలో సుడులలో/ పరవళ్లు తొక్కుతూ ప్రవహించి' వస్తుంటుంది నదీమ తల్లి. ఆ జలదేవత ఒడిలో స్నానం ఎప్పుడైనా ఎక్కడైనా పరమ పవిత్రం, బహు ఆహ్లాదభరితం. ఇప్పుడు గంగమ్మతల్లినీ 'రసమయివై సదా హృదయ రంజనివై/ యనురాగ స్వర్ణ కుసుమిత వల్లివై, మధుర కోమల హాస విలాస రేఖవై' రమ్మని ఆహ్వానిస్తూనే ఎదురెళ్లడం చలచల్లని పాలవెల్లిలో జాబిల్లిని చూసినంత మధురం. మల్లెమొగ్గలను మెలమెల్లగా చల్లినంత మనోహరం కూడా. భక్తిశ్రద్ధలతో ఆ జననికి చేసే అభివందనం జనజీవితాల్లో విరిచందనం. 'జననీ! నీ అర్చనలు సర్వోదయశ్రీలు/ తల్లీ! నీ దీవనలు ధర్మవిజయశ్రీలు' అంటూ ముందుకు సాగడమే అందరి కర్తవ్యం. 

(ఈనాడు ,సంపాదకీయం , 17:02:2013)
____________________________________ 

Labels: , , , , ,

Saturday, December 31, 2011

1954 Photograph
















(From Swati weekly)
__________________________________

Labels:

Thursday, December 29, 2011

గీతా మకరందం


గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలిరెంటి మాట అలా ఉంచి గీతాసూత్రం మాత్రం 'శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడల్లా మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్కటి ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధులైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలోపడ్డ నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్యబోధ- గీత! 'గీ' అంటే త్యాగం, 'త' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా తీసుకొని సర్వకాలాలకూ వర్తించే నిష్కామ కర్మయోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని మాటగా 'గీత' ప్రకటించిందని బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరిసమానంగా ప్రమాణత సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల వంటి భగవత్పాదులే గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వమేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంట్ వంటి మేధావులూ వ్యాఖ్యానాలు చేశారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిన కాలంనుంచి, నేటికాలం దాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు. త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష రహితంగా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్తవ్యమని నిక్కచ్చిగా చెప్పిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారలేదు. గీత సజీవతకు, అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్య జీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాదు?

'దేహమా కంపించుచున్నది/ 'ద్రోహమా' యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడ్డ నరుణ్ని- 'మోహమడంగె తొలంగె ధర్మ సందేహములన్నియున్' అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని రావడానికి 'గీత'లో నారాయణుడు ఎత్తిన అవతారాలు ఎన్నెన్నో. 'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య!' అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి. 'దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము?/ కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్' అంటూ డీలాపడిపోయినప్పుడు 'త్యజింపుము బేలతనమ్ము/ ధైర్యమున్ జెదరనీకుము' అంటూ తల్లిలా లాలిస్తాడు ఇంకోసారి. 'కొంచెపు మాట లాడెదు, జుగుప్స, అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి, కశ్మలత చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు మరోసారి. మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయిపట్టుకొని ఎలాగైనా పైకి లేపాలనే తాపత్రయం చూపిస్తాడు చాలాసార్లు. 'నరుడే కైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజేస్తాడు భగవానుడు గీతలో. 'కర్తన్ నేను సమస్త భూతములకున్/ సర్వమ్ములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారమున్/ దీర్తున్, నీవు నిమిత్త మాత్రమగు మంతే, క్త్లెబ్యమింకేల? నీ/ కర్తవ్యము గుర్తెరింగి విజయా/ గైకొమ్ము గాండీవమున్' అంటూ నిలబెడతాడు. చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించడానికి అంతా తనమీద వేసుకొనే ఔదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు.

చెప్పడంలోని గొప్పతనమో, వ్యాసుడు రాయడంలోని గడుసుదనమో గాని... పరమ గంభీరమైన వేదాంతసారం గీతాపాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, జ్ఞానులు, అవధూతలే కాదు... బుద్ధివాదులు, చివరికి చలం వంటి స్వేచ్ఛాప్రణయ జీవులూ గీతామకరందాన్ని సీతాకోక చిలుకల్లాగా సేవించడానికి ఉవ్విళ్లూరడాన్నిబట్టి, సుఖజీవిత అంతస్సూత్రమేదో ఆ పుష్పంలో దాగుందనేగా అర్థం! 'చాలాకాలం కిందటే కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నేనా తల్లి ఒడిలోనే తలదాచుకొనేది' అనేవారు అహింసాయోగి మహాత్మాగాంధీ. 'చిత్తం పరిశుద్ధమయ్యేకొద్దీ కొత్తకొత్త అర్థాలు తోచే చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం గీత' అనేవారు ఆధునిక యోగి వివేకానంద. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు విచక్షణ భగవత్ స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనే గదా మనిషి పతనావస్థనుంచి బైటపడగలిగేది! వ్యాస ప్రోక్తమైన గీత అష్టాదశాధ్యాయాల్లోని శ్లోకాల్లో- ఏదో ఒకటి ఎల్లవేళలా ప్రపంచంలోని ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే చీకటిని చెండాడే దివిటీలా వెలుగుతూనే ఉంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంత మన్నన. గీత కేవలం వ్యాస మహాభారతంలోని భాగం మాత్రమే కాదు. మనిషి- నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగిన జీవన సూత్రాల్ని విరివిగా పొదిగిన మనోవికాస శాస్త్రం. నరుడికి నారాయణుడు గీతలో చేసిన 'తామరాకు మీది నీటిబొట్టు తత్వం'- మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం అనుసరించదగిన సూక్తం. అనేక భాషల్లో భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడమే దురదృష్టం. ఉత్తమ మానసిక వికాస సాహిత్యంగా, జ్ఞానామృత భాండాగారంగా ప్రశంసలు చూరగొంటున్న శ్రీమద్భగవద్గీత మీద తీవ్రవాద సాహిత్యమనే ముద్ర వేయడం, నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనం. మనసును ఉద్దీప్తం చేసి, జాతి కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసుల ఆర్తి తీర్చడంలో ముందున్న గీతను ఎవరేమని ఆడిపోసుకున్నా- అది, మకరందం!

(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, ౨౫:౧౨:౨౦౧౧)
_____________________________________

Labels: ,

Thursday, August 11, 2011

ఏది స్వర్గం, ఏది నరకం?

ఏ రహస్య సృష్టి సానువులనుంచో జాలువారే కాంతి జలపాతం ఈ జీవితం... జనించేదెవరి వలన, చలించేదెందు కొరకు, లయించేది ఏ దిశకు? అన్నీ ధర్మసందేహాలే. అసలు కిటుకు ఆ కమలాసనుడికైనా తెలుసో లేదో! మానవుడు బుద్ధిజీవి. రాశి చక్రగతులలో/ రాత్రిందిన పరిణామాలలో/ బ్రహ్మాండ గోళ పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువుకా ప్రేరణకేది మూలకారణమో అంతు తేలేదాకా ప్రయాణం మానడు. అదే చిత్రం. గ్రహరాశుల నధిగమించి/ గగనాంతర రోదసిలో/ గంధర్వ గోళగతులు దాటిన మనిషి ఓ వంక నెలవంకనంటివస్తాడు... మరోవంక, మరణానంతరం జీవితం ప్రశాంతంగా సాగేటందుకు చుక్కలకు ఆవలి దిక్కున ఎక్కడో చక్కని లోకాలు చక్కర్లు కొడుతున్నాయని బలంగా నమ్ముతుంటాడు... అదింకో విచిత్రం. మార్గాలు, రూపాలు వేరువేరైనా స్వర్గాలు, నరకాలు అన్న భావనలు అన్ని మతాలకూ ఒకేలా ఉండటం అన్నింటికన్నా చిత్ర విచిత్రం! 'పుణ్యం చేసుకున్నవారు మరణానంతరం దైవదూతలుగా తేలియాడే ప్రేమారామ'మని యూదుల స్వర్గధామాన్ని అభివర్ణిస్తారు. 'అమృతం కురిసిన రాత్రి'లో బాల గంగాధర్‌ తిలక్‌ వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలబడినప్పుడు- పాదాల తారామంజీరాలు ఘల్లు ఘల్లుమని మోగించుకుంటూ వయ్యారంగా ఆకాశమార్గాన పరుగులెత్తుతూ పరవశం కలిగించింది బహుశా అలాంటి దేవతా ప్రేమమూర్తులేనేమో!

ఆ అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులు, భావుకులకు విశ్వసాహిత్యంలో కొదవే లేదు. కాళిదాసునుంచి మిల్టన్‌దాకా, కృష్ణశాస్త్రినుంచి కవి తిలక్‌వరకూ దివిసీమ అందాలను గురించి పలవరించనిదెవరు? మనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డు పెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచాన్ని గురించే! 'అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ' అంటూ అమరపురి వైభోగాలను కలవరించిన తీరుకు మునిముచ్చులకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడునే గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? 'దిగిరాను దిగిరాను దివినుంచి భువికి' అని భావకవి వూరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల సాము గరిడీలట పద్మసంభవ, వైకుంఠ, భర్గసభలు! ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంతా సాధారణమైన సాధనేనా?! కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్పవృక్ష చ్ఛాయల్లో పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల వెచ్చని ఒడి... అమర గానం... అమృతపానం... అవో... ఏ మర్త్యప్రాణిని ఝల్లుమనిపించవు?! ఏడు వూర్ధ్వ లోకాలనే కాదు... ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'ఆ నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు' ఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?! కాలదండం పాలబడకుండా కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి మార్గం. 'దైవమూ-దయ్యమూ, పాపమూ-పుణ్యమూ, స్వర్గమూ-నరకమూ, మందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందు' అంటాడు కవి ఎమ్మాగోల్డ్‌. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమాలిన వారలగుచు గదుకక యెవరో/ బతిమాలిన నల్లిన' కట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.

స్వర్గం, నరకం- మానవ మనోమందిరంలోని రెండు వూహా లోకాలు అయితే కావచ్చు... మరి మహనీయుల కమనీయ కల్పనల వెనకున్న తపనో?! మానవుడనే శిలను మాధవుడనే శిల్పంగా తొలిచి భువిని భువర్లోకంగా మలచాలనుకోవడం మహదాశయం కాదా? మహాభారతంలో స్వర్గారోహణం వేళ ధర్మజునితో యమధర్మరాజు అన్నట్లు 'స్వర్గ నరకాలు వేరువేరుగా లేవు'. తన సంతోషమె స్వర్గం, తన దుఃఖమె నరకమనే గదా సుమతీ శతక కర్త సుభాషితం. 'తృప్తిచెందని నరుని సప్త ద్వీపంబులైన చక్కంజేయునే! అక్షరంబులు నాలుగు కుక్షిలో వేసి అక్షరంబేదో తెలుసుకో మనసా' అని హెచ్చరించారు వేదాంతులు. నిగమంబులు వేయి చదివినా జీవిత సారం ఒంటబట్టనివాడికి ముక్తిమార్గమూ సుగమం కాదు. జీవితాన్ని చెదలపుట్టలో చీకిన ఆకులు తిని బతికే మకిలి పురుగులాగా చీదరించుకొనే వాదం ఎంత అసంబద్ధమో... విడివిడి భాగాల కలివిడితో తయారైన భౌతిక యంత్రంతో పోల్చి చూడటమూ అంతే అహేతుకం. శాస్త్ర నిఘంటువు నిర్వచనానికి అందనిదంతా అసత్యమన్న వాదనా సత్యదూరమే. క్రాంతి దర్శకులు వెలుగు చూపరు. వారు చూపిన దారిని పట్టుకుని జీవితాన్ని వెలిగించుకోవలసింది మనం. తెలివిడే జ్ఞానం. ప్రేమను మూలధనంగా పెట్టి జీవితాన్ని వ్యాపారంగా మలుపుకోవాలనుకునే బేహారులకు- లాభం స్వర్గం, నష్టం నరకం. విజయం స్వర్గం, అపజయం నరకం. దుఃఖం నరకం, సుఖం స్వర్గం. ఠాగూర్గీతాంజలి ప్రార్థన ప్రకారమైతే- ఎక్కడ జ్ఞానం నిత్యం వెల్లివిరుస్తుంటుందో అదే శాశ్వత స్వర్గం. కాలసంక్షిప్త చరిత్ర గ్రంథకర్త, అయిదు దశాబ్దాల బట్టి చావుబతుకుల సరిహద్దుల వద్ద తచ్చాడుతూనే మానవ చరిత్ర పురోగతికి అసమానమైన సేవలందిస్తున్న శాస్త్రవేత్త స్టీఫెన్హాకింగ్‌ 'స్వర్గం మిథ్య' అని చేసిన తాజా వాదాన్ని నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. మానవజాతి అభివృద్ధికోసం తపించే వారెవరికైనా అడుగడుగునా గుడే కనిపిస్తుంటుంది. అందులో వెలిగే దీపం భావవాదులకు దైవం అయితే... భౌతికవాదులకు జ్ఞానం. చూపులు వేరైనా చూస్తున్నది ఒకటే. అదే దైవజ్ఞానం, జ్ఞానదైవం. తేడా లేదు- రెండూ ఒకటే.
(సంపాదకీయం, ఈనాడు, ౨౨:౦౫:౨౦౧౧)
_____________________________

Labels:

Wednesday, October 06, 2010

వైరాగ్యం

.........'స్వామీ! ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు?'

'ఏమీ వద్దనుకుంటే అంతా ఆనందమే. అన్నీ కావాలనుకుంటే అనుక్షణం దుఃఖమే. ఈ శరీరం కోసమేగా మన కోరికలన్నీ? శ్మశాన0లో రోజూ ఎన్నో శవాలు కాలిపోతుంటాయి. వాటితోపాటు కోరికలూ కాలిపోతుంటాయి. వాటి బూడిదలోనే వైరాగ్య సందేశం ఉంది. స్థిర వైరాగ్యానికి శ్మశానమే నిత్యపాఠశాల. ' ................
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌
(ఈనాడు, అంతర్యామి, ౨౯:౦౯:౨౦౧౦)
______________________________

Labels: ,

తాబేటి పాఠాలు

"...............[౧]తాబేలు తన మూపుమీద ఎంత బరువైనా మోస్తుంది. స్వామి కూర్మావతారంలో మందరపర్వతాన్ని మోయలేదూ? అంచేత బరువు బాధ్యతలు నెత్తికెత్తుకొని లోకవృత్తంలో ప్రవర్తించు- అన్నది మొదటి పాఠం.
[౨]శీతోష్ణాల్లో, సుఖదుఃఖాల్లో మెలకువగా ప్రవర్తిస్తూ అవసరం వచ్చినప్పుడు అంతర్ముఖంగా ఉండాలి... తనప్పుడు ప్రవృత్తిలో ఉండాలి అని చూపడానికి... కొన్ని సందర్భాల్లో తాబేలు కాళ్లను లోపలికి ముడుచుకుని చైతన్యం లేనట్లు పడి ఉంటుంది... అది రెండో పాఠం.
[౩]అది వయస్సు మీరి మరణించాక తాబేటిచిప్ప జలపాత్రగా లోకానికి దానం చేస్తుంది. అది మూడో పాఠం.

కష్టపడి పనిచేయాలి-
సందర్భానుసారం జాగ్రత్తగా వ్యవహరించాలి.
మనవల్ల లోకానికి ఏదైనా మేలు చేకూరాలి................................"


- డాక్టర్‌ ధారా రామనాథశాస్త్రి
_________________________
(ఈనాడు, అంతర్యామి, ౨౭:౦౯:౨౦౧౦)
_______________________

Labels: ,

Sunday, June 20, 2010

భక్తి ప్రపత్తులు


- కాలిపు వీరభద్రుడు
మనసులో ఉన్నదొకటి, చెప్పేదింకొకటి, చేసేది వేరొకటి కాకుండా త్రికరణశుద్ధిగా (మనసా వాచా కర్మణా) సర్వాత్ముడైన శ్రీహరిని నమ్మి ఆరాధించిన సజ్జనుడు భగవంతునికి చేరువవుతాడు. ఈ ఆరాధనలో తొమ్మిది విధాలైన భక్తిపద్ధతులున్నాయి- అని భక్తశిఖామణి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో చెప్పినట్లు భాగవత కథనం. ఆ భక్తిమార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం (చింతనం), పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి. శ్రీహరి భక్తుల్లో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు చెప్పిన ఈ నవవిధ భక్తి పద్ధతులు రామభద్రుని అనుజుడైన భరతునిలోనూ ఉన్నట్లు రామాయణం చెబుతున్నది. భరతునికి రాముడే తల్లి, తండ్రి, గురువు, దైవం.

శ్రవణం: శ్రీమన్నారాయణుని నామరూప గుణాదులకు సంబంధించిన మహిమాన్విత దివ్యగాథల్ని ప్రేమపారవశ్యంతో వినడాన్ని శ్రవణభక్తి అంటారు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదమహర్షి చెప్పగా శ్రీహరి మహిమను తెలుసుకున్నాడు. అందుకే విష్ణునాకర్ణించు వీనులే వీనులంటూ పులకించే శరీరంతో శ్రీహరి నామాన్ని పలుమార్లు అంటాడు. అంటూ వింటూ ఉంటాడు. రామచంద్రుడు అయోధ్యకు వస్తున్న శుభసందేశాన్ని నందిగ్రామంలో ఉన్న భరతునికి నివేదిస్తాడు హనుమంతుడు. ఈ మాటలు వినగానే దాహంతో ఉన్నవాడు అమృతాన్ని తాగినంతగా ఆనందిస్తాడు భరతుడు.

కీర్తనం: ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్నే జపిస్తూ ఉంటాడు. శ్రీహరిని తన మనస్సులో ప్రతిష్ఠించుకొని ఉన్మత్తుడై పాడుతూ ఉంటాడని భాగవతంలో ఉంది. రామచంద్రునిపైగల ప్రేమలో లీనమై రామనామాన్ని జపిస్తున్న భరతుని హనుమంతుడు దర్శించినట్లు రామాయణం చెబుతోంది.

స్మరణం: ఈ భక్తిపద్ధతిని చింతనమనీ అంటారు. శ్రీహరిగాథల్ని, సదా స్మరణకు తెచ్చుకొంటూ మననం చేసుకోవడాన్ని చింతన భక్తి మార్గమంటారు. అంబుజోదరుడైన శ్రీహరి పాదారవిందాలను ధ్యానిస్తూ ఆ చింతనామృతాన్ని పానంచేస్తూ మైమరచిన చిత్తం ప్రహ్లాదుడిది. భరతుడు సైతం నందిగ్రామంలో ఉంటూ శ్రీరాముని చింతనతోనే కాలం వెళ్లదీస్తాడు.

పాదసేవనం: భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు.

అర్చనం: పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. కమలాక్షునర్చించు చేతులే చేతులని భావిస్తూ ప్రహ్లాదుడు శ్రీహరి పాదపద్మాలను అర్చిస్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు.

వందనం: భగవంతుని పాదాలముందు మోకరిల్లి భక్తిశ్రద్ధలతో రెండు చేతులూ జోడించి నమస్కరించడాన్ని వందన భక్తి అంటారు. శ్రీహరిని పూజించి వందనం చేయని చేతులను, కూరల్ని కలియబెట్టే కర్రతెడ్డులతో పోలుస్తాడు ప్రహ్లాదుడు. పుష్పకవిమానం నుంచి కిందికి దిగుతున్న రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు.

దాస్యం: మనల్ని మనం భగవంతుని సేవకులుగా భావించుకొని ఆ స్వామిని భక్తితో సేవించడాన్ని దాస్యభక్తి అంటారు. ప్రహ్లాదుడు చరాచర ప్రపంచాన్నంతటినీ విష్ణుమయంగా భావిస్తాడు. ఎల్లవేళలా శ్రీహరి ధ్యానంలోనే ఉంటాడు. భరతుడు కూడా 'నేను రామచంద్రుడి దాసుడిని'అంటాడు. ఆ ప్రభువు ఆజ్ఞానుసారం అతని సేవచేస్తానని అంటాడు.

సఖ్యభక్తి: భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడాన్ని సఖ్యభావభక్తి అంటారు. ప్రహ్లాదుడు తన తోటి బాలురిలో శ్రీహరినే చూస్తాడు. భరతుడాడిన భ్రాత, బంధు అనే మాటల్లో సఖ్యభావం ఇమిడిఉందని పెద్దలంటారు.

ఆత్మనివేదనం: మనం చేసే పనులు, పూజాదికర్మలు మొదలైనవాటి ఫలితాన్ని భగవంతునికి సమర్పించుకోవడమే ఆత్మనివేదన భక్తి. కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో శ్రీహరిని భజించాలనీ, భక్తికి చిక్కినట్టుగా ఇతరాలైన క్రతు, వ్రత, దానాదులకు చక్రి (శ్రీహరి) చిక్కడని ప్రహ్లాదుడంటాడు. 'తమ రాజ్యాన్ని తమకు అప్పగించేస్తున్నాను. నా జన్మ ధన్యమైంది' అని- రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాక అతని పాదాలకు పాదుకలు తొడుగుతూ భరతుడంటాడు.

ఈ తొమ్మిది విధాలైన భక్తి పద్ధతుల్లో శ్రవణ కీర్తన స్మరణాలనే వాటిని భగవంతుడు మనకు ఎదురుగా లేనప్పుడూ ఆచరించవచ్చు. వందనం, పాదసేవనం, అర్చనలను భగవంతుని సన్నిధానంలో చేస్తాం. దాస్య, సఖ్య, ఆత్మనివేదన పద్ధతులను భావప్రధానాలుగా భావిస్తారు. ఈ నవవిధ భక్తి పద్ధతుల్లో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా మన జన్మ ధన్యమవుతుంది.
(ఈనాడు, అంతర్యామి, ౧౩:౦౬:౨౦౧౦)
________________________

Labels:

ఉత్తమ సందేశం

- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
ఎవరి హృదయంలో బాధాగ్ని రగిలినా, ఆర్పగలిగే తపన, ఉదార సానుభూతి ఉత్తమ ప్రవర్తనకు నిదర్శనాలని ఉద్గ్రంథాలెన్నో ఘోషిస్తున్నాయి. ఆర్తులను చేరదీసే ఆత్మీయత ఒంటినిండా మనం నింపుకోలేకపోవడం ఆ పరాత్పరుని దృష్టిలో తీరని లోపం. పొరుగువారి ఆకలిని అర్థం చేసుకోగల మనో పరిపక్వత మనకవసరం. పేదలు, బలహీనులు, కదలలేని వృద్ధులు, రోగులు- వీళ్ల సేవ చేయడంలోనే దేవుని మహోన్నత సేవ ఉందని గ్రహించిననాడే నిజమైన దైవభక్తులం కాగలం. అంతరంగాల్ని కలిపేది ఆరాధన. మనిషి మనిషి మధ్య మైత్రిని విరబూసేలా చేసేది భక్తి. నిరంతరం సద్గుణాలవైపు మనసును మరల్చగలిగితే- నవజీవన మాధుర్యం.

ఆ జగదీశ్వరుడు తనను ఆరాధించేవాళ్లకంటే, స్తుతించేవాళ్లకంటే విపత్తుల్లో ఉన్నవారిని చేరదీసి కన్నీరు తుడిచేవాళ్లను అధికంగా ఇష్టపడతాడన్నది అక్షర సత్యమని విజ్ఞుల అభిప్రాయం. సాటి మానవుల్ని ప్రేమించాలని, మంచిని మంచివాళ్ల ప్రేమను పొందాలని నిరతం మనం కోరుకోవాలి. మనం ఎంత పవిత్ర జీవితం గడిపినా, ఎంత నిష్ఠాగరిమను పాటించినా ఒక పేదవాడి మనసుకు బాధ కలిగిస్తే మనం చేసిందంతా నిష్ప్రయోజనమే.

అదొక ఎడారి. చీకటి దట్టంగా అలముకొంది. దాదాపు అంతా నిర్మానుష్యం. హఠాత్తుగా తుపాను చెలరేగింది. ఎముకలగూడులా ఉన్న డెబ్భై ఐదేళ్ల వృద్ధుడొకడు తుపానులో చిక్కుకొన్నాడు. బాగా అలసి ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకొంటూ సహాయం కోసం అలమటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒకే ఒక చిన్న ఇల్లు కనిపించింది. తలదాచుకోవడానికి ఆ ఇంట్లోకి ప్రవేశించాడా వృద్ధుడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమాని భోజనానికి లేవబోతున్నాడు. ఆకలిగొన్న అతిథి ఇంటికి రావడం గమనించాడు. అతిథిని ఆదరించాలని అన్ని మతాలూ చెబుతాయి. ఆ గృహస్థుడు తన మతవిధానాల్ని సునిశితంగా అధ్యయనం చేశాడు. 'బాగా ఆకలిగొని ఉన్నావు. దేవుడు ప్రసాదించిన ఈ భోజనాన్ని నాతో కలిసి భుజించి ఆకలి తీర్చుకొందువుగాని రా సోదరా!' అన్నాడాయన అతిథితో. ఆప్యాయత అనురాగం కలగలిసిన చల్లని మాటవిని వృద్ధునికి ప్రాణం లేచివచ్చింది. గృహస్థు దస్తరుఖాన్‌ (భోంచేయడానికి ముస్లిములు పరచుకొనే వస్త్రం) పరిచాడు. భోజనం వడ్డించాడు. ఇరువురూ భోజనానికి కూర్చున్నారు. వృద్ధుడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. 'ఆగు' అని కోపోద్రిక్తుడై ఇంటి యజమాని హుంకరించాడు. 'ఈ ఆహారం ఎలా లభించిందనుకొన్నావు? దేవుని దయవల్ల. ఆ దేవునికి మొదట కృతజ్ఞత తెలుపుకోవాలని నీకు తెలీదా? బిస్మిల్లా (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో) అని దేవుని స్మరించుకోవాలి'- గృహస్థుని మండిపాటుకు వృద్ధుడు భయంతో కంపించి వినయంగా 'అయ్యా! అదంతా నాకు తెలీదు. బిస్మిల్లా అనే మాటే ఇంతవరకూ నేను వినలేదు అన్నాడు. అయితే నువ్వు దేవుణ్ని విశ్వసించేవాడివి కావు. మత విధులకు దూరంగా ఉన్నవాడివి. ఇక్కడ భోంచేసే అర్హత నీకు లేదు. వెళ్లిపో. నా ఇంటి నుంచి వెళ్లిపో' అని ఉరిమాడు గృహస్థు. వృద్ధుని ఆశ కుప్పకూలింది. భోజనంవైపు ఆశగా చూస్తూ బయటికెళ్లాడు. అంతా గాఢాంధకారం. పెను తుపాను. ఎటు వెళ్లిపోయాడో! ఏమైపోయాడో... ఇంటి యజమాని శాంతించి, తనకు ఆహారం సమకూర్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకొన్నాడు. కడుపునిండా తిన్నాడు. హాయిగా నిద్రించాడు. అర్ధరాత్రి సమయం. ఎవరో నిద్ర లేపినట్లు మేల్కొన్నాడు. దివ్యకాంతి పుంజం గోచరించింది- 'ఆకలితో నీ ఇంటికి వచ్చిన పండుటాకును కాస్తంతైనా కరుణచూపక వెళ్లగొట్టావు. అతని అంతర్వేదనల భీతిని గ్రహించలేని, నీ ఆలోచనా విధానం నాకెంతమాత్రం నచ్చలేదు. ధర్మం విలపించేలా ప్రవర్తించావు'- దేవదూత ద్వారా దేవుని మాటలు వినిపించాయి.

'ప్రభూ! అతడు నిన్ను విశ్వసించేవాడు కాడు. అతనికెలా ఆహారం పెట్టగలను?'- అన్నాడు ఇంటి యజమాని.

'ఏదీ నీది కాదు. సర్వమూ నాదే. నీ ఆధిపత్యం అనవసరం. డెబ్భైఐదేళ్లుగా నేను వృద్ధుణ్ని పోషిస్తున్నాను. ఒక్కపూట అన్నం పెట్టలేకపోయావు నువ్వు. హృదయమాలిన్యం తొలగించలేని నీ మతానుష్ఠానమెందుకు? ప్రార్థనలెందుకు?- దైవ వాక్కులు మళ్లీ దేవదూత వినిపించాడు.

ఇంటి యజమాని స్తంభించిపోయాడు. తేరుకొని తప్పు గ్రహించాడు. పశ్చాత్తాపంతో వలవలా విలపించాడు.

ఈ కథ కల్పితమా, వాస్తవమా? ప్రశ్నలు ప్రధానం కాదు. దుఃఖభూయిష్ఠమైన వదనాల వెనుక ఎంత విషాదం పొంచి ఉందో గమనించగలవాడే నిజమైన భక్తుడు. కష్టాల్లో సాటి మనిషికి సహాయం అందించని నరునికి దైవత్వం దూరంగా ఉంటుంది- అనే ఉత్కృష్టమైన సందేశం లోకం గమనించగలుగుతుంది.
(ఈనాడు, అంతర్యామి, ౧౧:౦౬:౨౦౧౦)
____________________________

Labels:

త్యాగయాగం

- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ఈ లోకంలో త్యాగభావంకన్నా మహత్తరమైన గుణం మరొకటి లేదు. ఈ మానవజాతి జన్మసార్థకతకు మూలం 'త్యాగం'. త్యాగం ప్రేమవల్ల పుడుతుంది. ప్రేమ స్నేహంవల్ల పుడుతుంది. స్నేహం విశ్వాసంనుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వాసం అవగాహన నుంచి జనిస్తుంది. అవగాహనకు మూలం ఆధ్యాత్మిక పరిజ్ఞానం. కనుక ఆధ్యాత్మికతకు త్యాగానికీ అవినాభావ సంబంధం ఉంది.

మానవుడు సహజంగా సుఖం కోరుకుంటాడు. ఎంతో శ్రమిస్తాడు. సంపద పోగుచేస్తాడు. ఆ సంపదలో కొంతభాగాన్నైనా దానరూపంలో త్యాగం చేయాలి. ఈ దానం త్యాగంలోని ఒక భాగం. ఏ సంపదనైనా త్యాగభావంతో అనుభవించాలని వేదం చెబుతోంది. మన సంపద ఏ రూపంలో ఉన్నా అందులోని కొంతభాగాన్ని తప్పకుండా ఇతరుల శ్రేయంకోసం వినియోగించాలి. ధనం, ధాన్యం, భూమి, జలం యిలాంటివేవైనా మనం శ్రమించి కూడబెట్టుకుంటే అర్హులయినవారికి వీటిలోని ఎంతో కొంత భాగాన్ని వితరణ చేసి ఉదారవంతులం కావాలి.

జీవించినంతకాలం లోకహితకర్మలే ఆచరించాలి. ఈ లోక హితకర్మలన్నింటిలో త్యాగలక్షణం ప్రథమశ్రేణికి చెందినది. స్వార్థమున్నచోట త్యాగానికి తావే ఉండదు. మానవుడు తనలోని స్వార్థబుద్ధిని క్రమక్రమంగా దూరం చేసేకొద్దీ త్యాగబుద్ధికి హృదయంలో చోటు దక్కుతుంది. 'కర్మలను త్యజించడం సన్యాసం కాదు, కర్మఫలాలను త్యజించడం సన్యాసమనిపించుకుంటుంది' అని గీతావాక్యం. ఒంటరిగా తినటంకన్నా నలుగురితో కలిసి భోజనం చేస్తే కలిగే సంతృప్తి అనిర్వచనీయమైనది. మనకేది లభించినా అది భగవత్ప్రసాదం. దాన్ని వితరణ చేయాలి.

ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పరోపకారం త్యాగమే అవుతుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువూ సజీవమైనా, నిర్జీవమైనా- మననుంచి ఏమీ ఆశించకుండానే... ఎంతటి మహోత్కృష్ట ఫలితాలు, సౌఖ్యాలు ప్రసాదిస్తున్నాయో చూడండి. మేఘం, చెట్టు, గాలి, నీరు, గగనం, నేల... ఏదైనా ప్రాణికోటిని సేవిస్తోందేతప్ప బదులుగా ఏదీ తీసుకోవడంలేదు. ఇంతకన్న మించిన త్యాగం ఏముంటుంది? అదే నేర్చుకోవాలి మనం. అందుకే 'ప్రకృతి మానవుడి మొదటిబడి' అంటారు విజ్ఞులు.

మనదేశం అనాదిగా త్యాగానికి సాకారంగా పరిఢవిల్లుతోంది. మన ఆర్షవాఞ్మయమే అందుకు సాక్షి. తన శరణుకోరిన పావురాన్ని కాపాడటంకోసం శిబిచక్రవర్తి డేగకు తన తొడకోసి మాంసాన్నిచ్చి దాని ఆకలి తీర్చాడు. బ్రాహ్మణవేషంలో వచ్చిన ఇంద్రుడు కోరగానే పుట్టుకతోనే దేహంతో వచ్చిన సహజ కవచకుండలాలను త్యాగం చేశాడు కర్ణుడు. రాక్షస సంహారం కోసం ఇంద్రుడు కోరగానే తన వెన్నెముకను ఆయుధంగా ఇచ్చేశాడు దధీచి మహర్షి. రంతిదేవుడు అడవుల్లో తన ఆలుబిడ్డలతో తిరుగుతుంటే- చాలా రోజులకు దొరికిన అన్నం ఒక భిక్షుడికిచ్చివేసి ముంతలోని నీటితో దాహం తీర్చుకొనేందుకు సిద్ధమవుతాడు. అంతలో మరో యాచకుడు దాహార్తితో యాచించగానే ఆ నీరు అతనికి ఇచ్చేస్తాడు. సత్యంకోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్నే త్యాగం చేస్తాడు. శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టేందుకు అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, నలుడు, బలిచక్రవర్తి ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. అహింసామూర్తి బాపూజీ భారత స్వాతంత్య్రం కోసం తన జీవితమంతా త్యాగం చేశాడు. అల్లూరి, ఆంధ్రకేసరి, తిలక్‌, గోఖలే, భగత్‌సింగ్‌ల త్యాగనిరతిని జాతి మరువగలదా?

నూరు మందిలో ఒకడు శూరుడై ఉంటాడు. వెయ్యిమందిలో ఒకడు పండితుడై ఉంటాడు. పదివేల మందిలో ఒకడు వక్తయి ఉంటాడు. లక్షల్లోనైనా ఒకడు దాత అయి ఉండటం అరుదు. దాత అంటే త్యాగశీలి అయినవాడు. త్యాగానికి రెండు పంక్తుల్లో ఎంతటి మహత్తరమైన అర్థం చెప్పాడు గురజాడ! 'సొంతలాభం కొంత మానుక పొరుగువారికి తోడు పడవోయ్‌!' అన్నారాయన. త్యాగంవల్ల మానవుడిలో తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరమపురుషార్థం వైపు తీసుకువెళ్లేదే త్యాగం. యజ్ఞప్రక్రియను త్యాగానికి ప్రతీకగా అభివర్ణించారు సనాతనులు. అందుకే త్యాగమొక యాగం. 'కొట్టితినకు, పెట్టితిను' అనే వేదమే సామాన్యుడికి అవగతమయ్యేలా చెప్పింది. సత్పాత్ర దానంవల్లనే సంపాదన సార్థకమవుతుంది. అధములు 'నాదీ నాదే, నీదీ నాదే' అంటారు. మధ్యములు 'నీది నీదే నాది నాదే' అంటారు. ఉత్తములు 'నీది నీదే, నాదీ నీదే' అంటారు. ఈ ఉత్తమగుణం అలవరచుకుంటే లోకకల్యాణమే! ప్రతిఫలాపేక్షతో చేసే త్యాగం త్యాగమే కాదు. దేశం కోసం, లోకం కోసం చేసే త్యాగానికెవరూ విలువకట్టలేరు. త్యాగంవల్ల కలిగే ఆనందానికీ తృప్తికీ అవధులే లేవు, హద్దులే లేవు. మేరుపర్వతమంత ధనం సంపాదించాలనీ, త్యాగం చేసేటప్పుడు దాన్ని గడ్డిపరకలా భావించాలనీ శాస్త్రోక్తి. ఇదే మన జీవన పరమార్థం.
(eenaaDu, aMtaryaami, 10:06:2010)
_____________________________

Labels: ,

Monday, May 17, 2010

రాధామాధవం


ఎనిమిదిమంది దేవేరులకు నల్లనయ్య శ్రీవారు. పదహారువేలమంది గోపకాంతలకూ ప్రియవిభుడు. ఆ చల్లని దేవర నామం స్మరించగానే దాని సరసన చప్పున స్ఫురించే పేరు మాత్రం రాధమ్మదే తప్ప- ముజ్జగాలనూ తన బొజ్జలో ఇముడ్చుకున్న ఆ అయ్య బరువును భక్తితో ఒకేఒక్క తులసిదళాన్ని తక్కెడలో ఉంచి తూచిన రుక్మిణిదీ కాదు; ముద్దుమురిపాల్లో, ముచ్చట్లలో తేలించి రక్తితో ఆయనను తన కొంగున కట్టుకున్న సత్యభామామణిదీ కాదు! కృష్ణస్వామి ఇంటిపేరే రాధ అన్నట్లుగా- తనను, తన సైదోడును ఈలోకం నిత్యం రాధాకృష్ణులుగానే కీర్తించేంత ఖ్యాతీ రాధాదేవి సొంతమే. 'గోపజనములందు, గోపికలందును/ సకల జంతువులందు సంచరించు...' ఆ సర్వాంతర్యామి పేరుతో తన పేరు అలా పెనవేసుకుపోవడానికి ఆమె ఏ నోము నోచెనో, తపమేమి చేసెనో అనిపిస్తుంది. రాధామాధవీయం ఎప్పటికీ రమణీయమే, స్మరణీయమే. మధురానగరిలో యమునా తీరాన ఇసుకతిన్నెల మీద వెన్నెల రాత్రుల్లోన గోపికలతో నల్లని దేవుడు సాగించిన రసరమ్య రాసలీలలపై కతలెన్నో, కవితలెన్నో, కావ్యాలెన్నో, చిత్రాలెన్నో. 'నారీ నారీ నడుమ మురారి/ హరికీ హరికీ నడుమ వయారి' వలయాలు వలయాలుగా తిరుగుతూ సాగిన కేళీగోపాలం- మహనీయుల కృతుల్లో కృష్ణలీలాతరంగిణియైు ఓలలాడించింది. గీతగోవిందమై అలరించింది. వర్ణరంజిత చిత్రమై ఎదఎదలో రంగవల్లులద్దింది. స్వరలహరియైు గుండెగుండెపై పన్నీటి జల్లులు చిలకరించింది. గోవిందుడు అందరివాడే. కానీ, 'గోపాలునకెంతమంది గోపికలున్నా/ గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే'ననిపించేంతగా తన అనురాగాన్ని ఆయన రాధమ్మపైనే కురిపించాడట. ఇక రాధ- మాధవ నిలయమైన తన హృదయమే కృష్ణ ప్రేమాలయం అనిపించేంత ప్రణయరాగ సుధ!

నవరసాలలో శిఖరస్థానం శృంగారానిదే. అలాగే, భారతీయ సాహిత్యంలో- శృంగార రసాధిదేవతలైన నాయికా నాయకులుగా కవుల అగ్రతాంబూలం అందుకున్నదీ రాధాకృష్ణులే. వారి అనురాగ రాగాలే పదాలై పల్లవించి ప్రవహించిన ప్రణయభావనలు, ప్రభవించిన ప్రేమగీతాలు ఎన్నో! కృష్ణుడికి రాధ మేనత్త అనీ అంటారు. 'అల్లుడికి అత్తాశ' అనే సామెతను నిజం చేయడానికా అన్నట్లు- నోరూరించే వెన్నముద్దలు రాధత్త బుగ్గల్లా ఉన్నాయని మురిసిపోయేవాడట అల్లరి బాలకృష్ణుడు ఆ పిన్న వయసులోనే! చిన్ననాటినుంచే వారిరువురి నడుమ మరుగుగా మరుని ముచ్చట్లు చాలానే నడిచాయని ప్రతీతి. అది నిజమో, కల్పనో కానీ- రమ్యాక్షర రూపాన్ని సంతరించుకున్న ఆ మురిపాలన్నీ రసజ్ఞులకు మనోజ్ఞమైనవే. 'పచ్చకప్పురపు వాసనల తాంబూలపు మోవి రాధ మోవిపయి మోపి'న గోపాలుణ్ని శ్రీనాథ మహాకవి ప్రస్తుతిస్తే- కృష్ణుడి చెక్కిలి నొక్కి ముద్దిడిన మిటారి రాధను కవయిత్రి ముద్దుపళని తన ప్రబంధం 'రాధికా సాంత్వనం'లో చిత్రించింది. ఆ 'ముద్దు' ముచ్చట వెనక నడిచిన గ్రంథం ఎంతో ఉంది. ఇళాదేవికి, కృష్ణుడికి స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించినది రాధాదేవే. ఆ తరవాత ఆమే- 'సొమ్ములియ్యవచ్చు, సమ్మందమియవచ్చు/ ఇయ్యరాని ప్రాణమియ్యవచ్చు/ తనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి/ తాళవశమె యెట్టిదానికైన...' అని కృష్ణుని ఎడబాటుకు ఎంతో పరితపించింది. ఇళ మోజులో పడి ఆయన తనను పట్టించుకోలేదని కోపించింది. చాలా రోజులు అత్తవారింట్లో గడిపి తిరిగివచ్చిన కృష్ణుడు- పరిపరివిధాల అనునయించి, ఆఖరికి పాదాల మీద పడిన తరవాతనే రాధిక కినుక వీడింది. కనికరించింది. అలక మానింది. ఆయనకు ముద్దును అనుగ్రహించింది. అదీ, ఆ రసవత్కావ్య ఇతివృత్తం!
భారతీయుల దృష్టిలో- అవధుల్లేని ఆరాధనకూ, అవ్యాజమైన అనురాగానికీ, అలౌకిక ప్రణయానికీ, మధుర భక్తికీ, మాధుర్యమైన రక్తికీ రాధాకృష్ణులు ప్రతీకలు. వారి అనుబంధంపై భిన్న వాదనలూ ఉన్నాయి. భాగవతం ప్రకారం- చిన్నతనాన కృష్ణుడితో ఆడుతూ, పాడుతూ గడిపిన గోపకాంతల్లో రాధ కూడా ఒక గోపిక, అంతే. ఆ తరవాతి కాలంలో జయదేవుడు రూపకల్పన చేసిన గీతగోవిందం- రాధాకృష్ణుల్ని భక్తహృదయపీఠంపై ప్రతిష్ఠించింది. కృష్ణభగవానుని ఆత్మశక్తి రాధేనన్నది వైష్ణవ మతానుయాయుల నమ్మిక. వారివురూ సహజీవనం సాగించారన్నది సత్యదూరమని కొందరి విశ్వాసం. రాధను స్వయంవరంలో కృష్ణుడు పెళ్లాడటం- చింతలపూడి ఎల్లన్న కావ్య కథావస్తువు! పురాణాల్లో ప్రక్షిప్తాలుండటం పాతకథే. స్వకపోల కల్పనా చాతుర్యం చాటుకోవడానికి కవులు పౌరాణిక పాత్రల చుట్టూ కల్పిత కథలు, గాథలు అల్లడమూ కొత్త కాదు. సహజీవనంపైనో, జీవన సాహచర్యంపైనో వాటినే ప్రామాణికంగా తీసుకోవడం తగదు. రాధాకృష్ణులు భార్యాభర్తలై మనుగడ సాగించారా, లేక పెళ్లి చేసుకోకుండా సహజీవన యాత్రను తమ జీవితపంథాగా ఎంచుకున్నారా అనే సంగతిని పక్కనపెడితే- వారూ సీతారాముల వలె, శివపార్వతుల వలె భారతీయులకు పూజనీయులే. పెళ్లికిముందు శృంగారకేళి తప్పు కాదని తీర్పునిస్తూ, ఆ సందర్భంగా 'రాధాకృష్ణులదీ సహజీవనమే కదా' అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజానీకంలో అత్యధికులకు రుచించకపోవడానికి కారణం అదే.
(
ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౪:౨౦౧౦)
____________________________

Labels: , ,

Monday, May 10, 2010

ఉత్కృష్టమార్గం

- తటవర్తి రామచంద్రరావు


'ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు:

'నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది! అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.

పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో... ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.

పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ల లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.

అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు. ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం.
(ఈనాడు, అంతర్యామి, ౧౦:౦౫:౨౦౧౦)
_____________________________

Labels:

సన్మార్గమే సోపానం

యం.సి.శివశంకరశాస్త్రి


అది ఒక పల్లెటూరు. దేవుడు లేడని వాదించేవాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు. ఆ వూరికి ఏ సాధువు, సన్యాసి వచ్చినా అక్కడి నాస్తికవాదులందరూ ఒక్కటై చుట్టుముట్టి 'దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు' అని వేధించేవారు.

ఒకసారి ఆ వూరికి ఒక యోగి వచ్చి అక్కడి రామాలయంలో మకాం వేశాడు. అల్లరి గుంపంతా కలిసి వెళ్లి యోగిని ముట్టడించింది. ఆ మహాత్ముడు వారడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పి 'నాయనలారా! రెండు రోజులుగా భోజనం చేయలేదు. ఏమైనా తెచ్చి ఇవ్వగలరా?' అని కోరాడు. వారిలో ఒక యువకుడు వెంటనే ఇంటికెళ్ళి ఒక గ్లాసునిండా పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. పాల గ్లాసు చేతపట్టుకొని అక్కడే పడి ఉన్న ఒక పుల్లతో పాలను కలియబెడుతూ పదేపదే పరీక్షగా ఆ పాలలోకి తొంగిచూడటం మొదలుపెట్టాడు. పాలు తాగమన్నాడు తెచ్చి ఇచ్చిన యువకుడు. 'నాయనా! పాలలో వెన్న ఉంటుందని అంటారు. ఆ వెన్న చూద్దామని వెతుకుతున్నాను' అని చెప్పాడు యోగి. 'భలేవాడివే. అలా వెతికితే వెన్న ఎలా కనబడుతుందనుకున్నావు? ప్రతి పాల బొట్టులోనూ వెన్న ఉంది. కానీ అది అలా కనబడదు. దాన్ని వెలికితీసే పద్ధతి వేరే ఉంది. పాలను కాచి, తోడుపెట్టి, చిలికితే తప్ప వెన్న కనబడదు' అన్నాడు.

'మరైతే దేవుడున్నాడా? ఎక్కడున్నాడో చూపెట్టు అంటూ ఇందాక మీరందరూ కలిసి నన్ను సతాయించారే. దేవుడు అంత సులభంగా కనిపిస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన అందరికీ కనబడడు. కొందరే చూడగలరు. దేవుని చూసే ప్రక్రియ వేరే ఉంది' అని చెప్పాడాయన. 'అది ఎలా సాధ్యమో చెప్పండి' అన్నాడు అతను.

'మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. విషయం మళ్ళీ తెలియజేస్తాను. ఇప్పటికిక నన్ను వదిలిపెట్టండి' అని వారిని సమాధానపరచి పంపాడు.

పాలు తెచ్చి ఇచ్చిన యువకుడికి యోగి మాట తీరు బాగా నచ్చింది. ఆయన ద్వారా విషయాలు మరిన్ని తెలుసుకుంటే బాగుంటుందని భావించాడు.

మరునాడు ఉదయం రామాలయానికి వెళ్ళాడు. యోగిని దర్శించుకొని 'స్వామీ! మీరేమీ అనుకోనంటే ఓ మాట అడగాలనుకొంటున్నాను. అడగమంటారా?' అన్నాడు. 'అడుగు నాయనా! నాకు తెలిసిందేదో చెబుతాను' అన్నాడాయన. 'దేవుణ్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక నాకు ఎంతో కాలంగా ఉంది. నెరవేరుతుందంటారా?' అని అడిగాడు యువకుడు. 'నేను చెప్పినట్టు చేస్తే తప్పక నెరవేరుతుంది. దేవుని నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. రేపు సూర్యోదయానికి ముందే శుచిగా నువ్వు ఇక్కడికి రా' అని చెప్పాడు.

యోగి చెప్పినట్లు యువకుడు మర్నాడు రామాలయం దగ్గరికెళ్ళాడు. అప్పటికే ఆయన ఒక మూట తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆ యువకుని రమ్మని 'ఇదిగో ఈ మూటను తలపై పెట్టుకొని నాతోపాటు ఆ కనబడే కొండ శిఖరాన్ని చేరుకో. అక్కడ దేవుని ప్రత్యక్షంగా నీకు చూపెడతాను' అన్నాడు.

యువకుడు మూట నెత్తిన పెట్టుకొని కొండ ఎక్కసాగాడు. కొంత ఎత్తుకు వెళ్లేసరికి మూట బరువనిపించింది. యోగికి చెప్పాడు. 'మూట విప్పి అందులోంచి ఒక రాయి తీసి పడేసి మళ్ళీ పయనం సాగించు' అన్నాడు. ఆయన చెప్పినట్లే చేసి ముందుకు నడిచాడు. ఇంకొంత ఎత్తుకు వెళ్ళాక మళ్ళీ మూట బరువనిపించింది. వెనకాలే వస్తున్న యోగికి చెప్పాడు. ఇంకొక రాయి తీసి పడేయమన్నాడు.

ఇలా ఒక్కొక్క రాయి చొప్పున ఆ మూటలో కట్టి ఉంచిన ఆరు రాళ్లూ తీసి పడేశాడు. ఖాళీ చేతులతో కొండ శిఖరం చేరుకున్నాడు. 'మీరు చెప్పినట్టే ఇక్కడికి చేరుకున్నాను. దేవుని ప్రత్యక్షంగా చూపెట్టండి' అన్నాడు యువకుడు. 'నాయనా! మూటలో కట్టి ఉంచిన ఆరు రాళ్ళూ శిఖరందాకా మోయలేక ఒక్కొక్కటిగా అన్నీ తీసి పడేసి చివరికి వట్టి చేతులతో ఇక్కడికి చేరుకున్నావు. నేను అందులో కట్టి ఉంచిన ఆరు రాళ్ళూ మామూలు రాళ్ళని అనుకోకు. అరిషడ్వర్గాలుగా పిలిచే ఆరు చెడ్డ గుణాలకు అవి ఉదాహరణలు. వాటిని తీసివేసిన తరవాతే సులభంగా ఈ శిఖరం చేరుకున్నావు- అవునా?' అన్నాడు. 'అవును' అన్నాడు అతడు. 'అలాగే మనిషి ఎదుగుదలకు అన్ని విధాలా అడ్డుగా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు చెడ్డ గుణాలను మన నుంచి దూరం చేసుకోవాలి. అప్పుడు ఏ పని చేసినా సులభతరమవుతుంది. సఫలమవుతుంది' అని పలికాడు యోగి.

'అరిషడ్వర్గాలన్నింటినీ అరికట్టే మార్గమేదో దయచేసి తమరే తెలియజేయండి' అన్నాడీసారి యువకుడు. 'అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. అంతర్ముఖ బుద్ధి సంపాదించి సాధన సంపత్తి సాధిస్తే ఇక అసాధ్యమనేది ఏదీ ఉండదు' అని విడమరచి చెప్పాడు యోగి. ఈ మాటలతో యువకుని మనసు మారిపోయింది. 'స్వామీ! ఇక ఈ క్షణం నుంచి నా నడవడికను మార్చుకుని మంచి మార్గంలో పయనిస్తాను' అని చెప్పాడు. అతణ్ని అభినందించాడు యోగి.
(ఈనాడు, అంతర్యామి, ౦౯:౦౫:౨౦౧౦)
________________________________

Labels:

Monday, April 19, 2010

మలచుకోవాలి


- అయ్యగారి శ్రీనివాసరావు



సృష్టిలో ప్రతీది మార్పు చెందేదే. అది నిరంతర ప్రక్రియ. మార్పువలన మంచీ, చెడూ రెండూ సంభవిస్తాయి. ఒకే మార్పు ఒకరికి మంచిగా, మరొకరికి చెడుగానూ మారవచ్చు. అందుకే మార్పును చూసి భయపడకూడదు. మంచి అయినా, చెడు అయినా మార్పును అనుకూలంగా మలచుకోవడంలోనే మనుషుల విజ్ఞత ద్యోతకమవుతుంది.

హోరుమని వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దారిలో ప్రయాణించే రైలు ఒక చిన్న గ్రామంలో ఆగిపోయింది. ఎప్పుడు కదులుతుందో తెలియని పరిస్థితి. ఒక బాల బిచ్చగాడు అది చూశాడు. ప్రయాణీకుల దగ్గర అడుక్కోవాలని వెళ్ళాడు. అక్కడి ప్రయాణీకుల పరిస్థితి మరోలాగ ఉంది. ఎంత డబ్బున్నా తినడానికి ఏదీ దొరకని పరిస్థితి వారిది. పిల్లలు మరీ తల్లడిల్లిపోతున్నారు.ఆ స్థితిలో అడిగితే ఛీత్కారాలు తప్ప చిల్లర రాలదు. అయినా డబ్బు సంపాదించాలి. ఎలా?... ఆలోచించాడు. అంతవరకూ బిచ్చమెత్తగా వచ్చిన డబ్బులు లెక్కచూసుకున్నాడు. పచారీ కొట్టుకు వెళ్ళి సామానులు కొన్నాడు. ఇంటికి వెళ్లి తల్లిచేత సులువుగా తయారయ్యే తినుబండారాలు తయారుచేయించాడు. రైలు ఆగిన ప్రదేశానికి చేరుకున్నాడు. వాటికి గిరాకీ పెరిగింది. డబ్బూ వచ్చింది. అదే పెట్టుబడిగా రెండుమూడు సార్లు అలాగే చేశాడు. రైలు వెళ్ళిపోయాక లెక్కచూసుకుంటే... ఆశ్చర్యం. ఒక్కరోజులోనే ఎంతో మార్పు. ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో అతడి జీవితమే మారిపోయింది. బిచ్చగాడినుంచి వ్యాపారిగా అతడి హోదా పెరిగింది.

'మార్పే ప్రపంచానికి మూలసూత్రం. మారనిదే ప్రపంచం మనజాలదు' అంటాడు గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్‌. అతడి సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఏదీ ఏ క్షణమూ స్థిరంగా ఉండదు. మార్పుచెందని పదార్థమూ ఉండదు. కిందటి క్షణానికి, ఈ క్షణానికి మధ్య ఈ విశ్వంలో జరిగే మార్పువలన ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. నిరంతరమైన ఈ మార్పే చైతన్యం. చైతన్యం ప్రకృతిస్వరూపం. ప్రకృతి పంచ భూతాత్మకం. అందుకే పంచ భూతాలూ నిరంతరం అనేక మార్పులు చెందుతూ ఉంటాయి.

భూమి అనేకదేహాలుగా (పశు, పక్షి, వృక్షాదులు), నీరు అనేకరూపాలుగా (ఆవిరి, బిందువు, సింధువు, ఘనం), అగ్ని ఒక శక్తిగా (నడిపించే, నశింపజేసే), వాయువు ప్రాణరూపంగా, ఆకాశం అవకాశాలకు నిలయంగా మార్పు చెందుతూనే ఉంటాయి. పదార్థం, పరిస్థితులు, ఆలోచనలు, అలవాట్లు, ప్రకృతి, నాగరికతలాంటివన్నీ నిరంతరం మార్పుచెందేవే. ప్రవహించే నీటికి ఆటంకం ఏర్పడితే అక్కడితో ఆగిపోదు. దారి మార్చుకుని పక్కదారులగుండా మరలిపోతుంది. అల్పప్రాణులు సైతం వాటికనుగుణంగా తమ అలవాట్లను మలచుకుంటాయి. ముందుజాగ్రత్తలు తీసుకుంటాయి. వలసపోవడం (పక్షులు), భూమి అడుగుపొరలలోకి చేరిపోవడం (వేసవిలో చేపలు), దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోవడం (మంచు ప్రాంతాల్లో ప్రాణులు)లాంటివి చేస్తుంటాయి. ప్రకృతి తనకు ఇవ్వని శక్తిని తలచుకుని కుమిలిపోకూడదు. అలాటి పరిస్థితులను అధిగమించడానికే తెలివినిచ్చాడు భగవంతుడు. దాని సాయంతో ఇతరులకున్న అవకాశాల్ని తనకు అనుకూలంగా మలచుకోవాలి. కోయిలకు తన గుడ్లను పొదగడం తెలియదు. అందువలన కాకి గూటిలో గుడ్లు పెడుతుంది. అంగవైకల్యం కలిగినవారు సైతం తమ వైకల్యానికి కుంగిపోరు. తమకున్న ఇతర శక్తులను ఆ వైకల్యానికి విరుగుడుగా మార్చుకుంటారు.

నవనవలాడే పదార్థం కాలానుగుణంగా కుళ్ళిపోతుంది. అది ఎరువుగా మారి తనలోని సూక్ష్మపదార్థాలతో, మరో పదార్థానికి రూపునిస్తుంది. పర్వతం అ(క)రిగిపోయి ఇసకరేణువులుగా మారినా, అది మరో భవన నిర్మాణానికి ముడిపదార్థంగా మారుతుంది.

ష్టాన్ని అనుభవంగా, అపజయాన్ని గుణపాఠంగా, అవమానాన్ని ఎత్తుకు ఎదిగే ఆసరాగా, ఆపదల్ని సంపదలుగా మార్చుకోవాలి. అదే తెలివైన వారి లక్షణం. జన్మరాహిత్యమైన మోక్షం పొందాలన్నా మార్పువలననే సాధ్యం. సంసారి ధ్యానిగా, ధ్యాని యోగిగా, యోగి సన్యాసిగా మారుతూ, చివరికి ఏ మార్పూలేని పరమాత్మను చేరుకోవచ్చు!
(ఈనాడు, అంతర్యామి, ౧౦:౦౪:౨౦౧౦)
_____________________________

Labels: ,

Sunday, February 28, 2010

మహా ప్రసాదం


చిటికెన వేలిపై గోవర్ధన గిరినెత్తి, గోవుల్ని కాపాడటానికి దాన్ని గొడుగుగా పట్టిన చిన్నిశిశువే- సకల జీవులకు తన ఛత్రచ్ఛాయలో రక్ష కల్పించేందుకు కొండంత దేవుడు కోనేటిరాయడైనాడు. తిరుమలపై కొలువుతీరాడు. 'పెద్ద కిరీటమువాడు, పీతాంబరమువాడు, వొద్దిక కౌస్తుభమణి వురమువాడు/ ముద్దుల మొగమువాడు, ముత్తేల నామమువాడు, అద్దిగో శంఖచక్రాలవాడు...' అంటూ చిగురుమోవివాడైన శ్రీవేంకటేశుని తన అక్షరాల్లో మన కళ్లకు కట్టాడు అన్నమయ్య. 'వెక్కసమగు నీ నామము- వెల సులభము, ఫలమధికము' అంటూ తనను కొలిచేవారికి ఆ స్వామి ఎంతటి కొంగుబంగారమో విశదపరచాడు. 'పాపమెంత గలిగిన బరిహరించేయందుకు/ నా పాలగలదుగా నీ నామము' అన్న ఆ సంకీర్తనాచార్యుని పలుకు మనకూ తారకమంత్రమే. అందుకే, నిత్యకల్యాణమూర్తియైు జన నీరాజనాలందుకుంటున్న 'వేంకటేశ సమోదేవో/ నభూతో న భవిష్యతి'- వేంకటేశ్వరుని మించిన మరోదైవం లేదని- పెద్దలు ఘంటాకంఠంగా చాటారు. వేదాలు శిలాకృతులై, తాపసులు తరువులై, సర్వదేవతలు మృగజాతులై, పుణ్యరాసులే ఏరులై ఆ దేవాదిదేవునికి ఆవాసమైన తిరుమల- ఇలపై నెలకొన్న వైకుంఠమేనని ప్రతీతి. 'కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ/ విరివైనదిదివో శ్రీవేంకటపు కొండ...' అంటూ పదకవితా పితామహుడు కీర్తించిన వేంకటాద్రికంటే మిన్నయైున మరో పుణ్యక్షేత్రం ఏడేడు లోకాల్లో ఎక్కడా లేదన్నది రుషివాక్కు. ఆ అయ్యను దర్శించాలన్న తపనతో, ఆర్తితో, భక్తితో, కాంక్షతో ఏడాది పొడవునా ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు నానాదిక్కులనుంచి తరలివచ్చే భక్తజన సందోహంతో నిండిపోయే తిరువీధుల్లో అనునిత్యం తిరునాళ్ల ప్రభలే, ఏడుకొండల్లో అనుక్షణం గోవిందనామస్మరణల ప్రతిధ్వనులే!

'ఈ ఓంకార తరంగిణిలో ఓలలాడి, ఈ కాంతి సముద్రంలో మునిగితేలి భక్తులు తమనుతామే మరచిపోతారు. తమ కోర్కెల్నీ మరచిపోతారు. తమ బాధల్నీ మరచిపోతారు. బాధలో పుట్టిన కన్నీటి బిందువులు ఆనందబాష్పాలుగా స్వామి పాదాలను చేరతాయి. ఆనంద స్వరూపులవుతారు. ఆనందోబ్రహ్మ! అదే బ్రహ్మోత్సవం' అంటూ- వేంకటనాథునికి ఏటా జరిగే ఆ రాజరాజోత్సవ ప్రాభవ ప్రాశస్త్యాన్ని అభివర్ణించారు ముళ్లపూడి రమణీయంగా. అంగరంగ వైభవం అన్న పదానికి అచ్చమైన అర్థతాత్పార్యాలు- అందమైన తిరువేంకటాధిపుడు అందుకునే సేవల్లోనే సాక్షాత్కరిస్తాయి. తూరుపురేకలు విచ్చుకోకముందే మొదలయ్యే సుప్రభాత సేవనుంచి అర్ధరాత్రి దాటాక శయన మంటపం చేరేవరకు స్వామికి జరిగే సేవలన్నీ కమనీయమైనవే. 'కౌసల్యా సుప్రజా రామా' అన్న సుప్రభాత గీత పఠనాలు, వేంకటేశ్వర స్తోత్రాలాపనలు, ప్రపత్తిగానాలు, మంగళాశాసనాలు, కర్పూరహారతులు, అర్చనలు, అభిషేకాలు, వస్త్రసమర్పణలు, పుష్పాలంకరణలు, నైవేద్య నివేదనలు- అన్నీ విన వేడుకే, కన వేడుకే! ఉపమించగరాని ఆ ఉన్నత రూపానికి తప్ప, ఓ పాటలో వేటూరి అన్నట్లు... 'రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు/పన్నీటి జలకాలు, పాలాభిషేకాలు/ కస్తూరితిలకాలు, కనక కిరీటాలు/ తీర్థప్రసాదాలు, దివ్యనైవేద్యాలు/ ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు' అనిపిస్తుంది. పుష్పమాలాలంకృతుడైన వేంకటేశుని దర్శించిన క్షణాన- 'సంపంగి, చంపక పూగపన్నాగ/ పూలంగిసేవలో పొద్దంత చూడగ/ నీపైని మోహము నిత్యము సత్యమై/ అహము పోదోలురా, ఇహము చేదౌనురా...' అన్న ఆత్రేయ కవిత, మనకు తెలియకుండానే గుండె తలుపులు తడుతుంది.

అమృత మథనుడైన ఆ జగత్పతికి 'ఇదివో నైవేద్యము' అంటూ నివేదించే- పులిహోర, పొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలి వంటి అన్న ప్రసాదాలు; లడ్డు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు వంటి పిండివంటలు భక్తులకు దివ్య ద్రవ్యాలే. చేతులుచాచి వారు మహద్భాగ్యంగా స్వీకరించే దివ్య ప్రసాదాలవి. శ్రీవారి శంఖు చక్రాలను తలపించే లడ్డు, వడ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తిరుమల వెళ్లి వచ్చిన యాత్రికులు తమ బంధుమిత్రులకు, పరివారానికి ప్రధానంగా పందేరం చేసేది కొండ లడ్డూనే. కొండంత దేవుణ్ని కొండంత పత్రితో పూజించలేనట్లే, కొండ లడ్డునంతటినీ వారు సన్నిహితులకు పంచలేకపోవచ్చు. చిన్న ముక్కగానైనా, విడి పొడిగానైనా తమవారు పంచే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారికి తామే స్వయంగా తిరుమల సందర్శించినంత దివ్యానుభూతి! తన కడకు రాలేకపోయిన తమకు తిరుమల ప్రభువే స్వయంగా ప్రసాదం పంపించి దీవించాడన్నంత బ్రహ్మానందం! మాధుర్యంలోనే కాదు, ప్రాచుర్యంలోను శ్రీవారి లడ్డు తిరుగులేనిదే. తిరుమలలోనే, అదీ తితిదేయే తప్ప ఇతరులెవరూ తయారుచేయడానికి వీల్లేకుండా దానికి పేటెంట్‌ హక్కూ ఈమధ్యే లభించింది. యాత్రికుల అవసరాలకు తగినన్ని లడ్డూలను తిరుమల-తిరుపతి దేవస్థానంవారు సరఫరా చేయలేకపోవడంతో వాటికీ ఆ మధ్య కటకట ఏర్పడింది. రోజుకు లక్షన్నర లడ్డూలు తయారు చేస్తున్నా- సరఫరా గిరాకీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందన్నది అధికారుల కథనం. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తితిదే ఇప్పుడు రంగంలోకి దిగింది. వెంకన్న భక్తులకు వారు కోరినన్ని లడ్డూలను అతి త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్న అధికారులు- అయిదులక్షల లడ్డూల తయారీకి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామంటున్నారు. ఇకపై భక్తులకు కొండలరాయని లడ్డూలు కోరినన్ని లభిస్తే అంతకుమించిన మహాప్రసాదం ఏముంటుంది?
(ఈనాడు, సంపాదకీయం, ౧౩:౧౨:౨౦౦౯)
________________________________

Labels:

Saturday, September 19, 2009

జీవితం ఒక యోగం

- చక్కిలం విజయలక్ష్మి
జీవితం గురించి, భగవంతుని గురించి సరైన అవగాహన లేనివారే
జీవతమూ, భగవంతుడూ వేరు వేరు అనే భావనతో ఉంటారు. భగవంతుడు సృజించిన, భగవంతునిలోంచి ఉత్పన్నమైన జీవితం ఆయనతో వేరుపడి ఎలా ఉంటుంది!? చెట్టులోంచి వచ్చిన కాయ చెట్టు తాలూకు జీవ లక్షణాలనే కలిగి ఉంటుంది- రూపం వేరైనా. చాలామంది భగవంతుణ్ని పూజ గదికే పరిమితం చేసి ఉంటారు. ఎంతో నిష్ఠగా, పవిత్రంగా పూజావిధిని నిర్వహించిన వ్యక్తి, పూజ ముగించి ఆ గది తలుపులు మూయగానే పూర్తిస్థాయి 'సామాజిక స్పృహ'ను పులుముకుంటాడు ఒక వ్యక్తిలోని దైవత్వానికి, రాక్షసత్వానికి ఒక 'గడపమాత్రం' దూరమేనా!?

వేదం 'సర్వభూత దయ'ను నిర్దేశించింది. నీచస్థాయి జీవి అయిన కుక్కనైనా కాలితో తన్నకూడదని విజ్ఞుల ఉపదేశం. చీపురుకట్టకూ తగిన మర్యాద ఇవ్వాలని దివ్య జనని శారదామాత అభిప్రాయం. మనం మన సాటి మనిషిని, తోటిమనిషిని మానసిక హింసకు గురి చేస్తున్నాం. మన స్వార్థంకోసం మరెందర్నో, మరెన్నింటినో... మరెన్ని రకాలుగానో. మనం రెండు వేషాలు వేస్తూ ఉంటాం- మానసికంగా! ఒకటి భక్తుడిగా, మరొకటి సామాజికుడిగా. నాటకీయత మనకుఅవసరం లేదు. వేషాల మార్పుతో పనిలేదు. కదలని దేవుడు పూజామందిరంలో ఉంటే, కదిలే దేవుళ్లు బయట ఉన్నారు. పలకని దేవుడు లోపల ఉంటే, పలికే దేవుళ్లు బయట ఉన్నారు. అంతే. మనుషులేకాదు, సమస్త జీవజాలం, జీవంలేని వస్తుజాలమూ భగవంతుని సృజనే. ఆయన ప్రతిరూపమే. మనం సామరస్య స్పృహ, సమతాదృష్టి కలిగిఉంటే చాలు.

విజ్ఞులు భగవత్సాధనకు ఒక్క యోగాన్ని మాత్రమే నిర్దేశించలేదు.
భక్తి, జ్ఞాన యోగాలతోపాటు కర్మయోగాన్నీ సూచించారు. సర్వభూత దయ, సాటి మనుషుల పట్ల సామరస్య ధోరణి, త్యాగం, విరాగం, నిష్కామకర్మ, ప్రతి కర్మలో ఆధ్యాత్మిక దృష్టి... ఇవన్నీ కర్మయోగమే. యోగాన్ని పూజామందిరంలో మాత్రమే యోగీ నిక్షిప్తంచేయలేడు. భగవంతుణ్ని ఒక్క ఆలయంలో మాత్రమే రుషీ ఆవాహన చేయలేడు. మోక్షం దేవుడూ గరిటెతోవడ్డించేది కాదు. అందుకు జీవితాన్నిచ్చాడు భగవంతుడు. ఇది చాలా సరళమైన యోగం. అదే... జీవితాన్ని యోగంగా భావించటం.

ఎలా! ఇదెలా సంభవం!?
సామాజిక జీవనంలో ఒక రూపాయి సంపాదించాలంటే, కేవలం పదిమందిలో ఒకరిగా గుర్తింపు పొందాలంటే, కనీసం కుటుంబ సభ్యుల ప్రేమ సంపాదించాలంటే ఎంతో కష్టపడతాం. మరెంతో త్యాగం చేస్తాం. మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు, దాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ మాత్రం శ్రమ తీసుకోలేమా? ఏ మాత్రం సాహసం చేయలేమా? దాని ఫలితం సర్వోత్కృష్టమైన, సర్వ శ్రేష్ఠమైన జీవన్‌ ముక్తి, జన్మ రాహిత్యం. పరమాత్మ పదం. దానికై చేయలేనిది ఏముంది? చేయరానిది ఏముంది? ప్రారంభంలో కష్టం అనిపించినా సాత్వికాహారంలా క్రమేణా సులువవుతుంది. రుచి దొరుకుతుంది. చివరకు వదలలేనిదవుతుంది. అందుకే ఆ పనిలో నిమగ్నమవుదాం.

దిశగా...
ప్రతి పనిలో పక్కవారి ఇబ్బందిని గమనిద్దాం. ప్రతి లాభంలో పక్కవారికి భాగం అందేలా చూద్దాం. ప్రతి మాటలో పక్కవారికి మాధుర్యం అందజేద్దాం. దైన్యాన్ని పోగొడదాం. ధైర్యాన్ని, ధీశక్తిని ప్రోది చేద్దాం. అవతలివారి ఆవేదనలో సగం మనం తీసేసుకుందాం. మన ఆనందంలో సగం అవతలివారికి భాగం పెడదాం. అప్పుడు ప్రపంచమే పూజామందిరం అవుతుంది. ప్రతి దేహధారీ దేవుడై విలసిల్లుతాడు. అప్పుడు మన పూజ ఒక్క దేవుడికి కాక కోట్లాది దేవుళ్లకు అందుతుంది. మన ఆరాధన ఒక పూజా మందిరానికే చెందక ప్రపంచపరివ్యాప్త మవుతుంది. మన సాధన ఒకటికి కోటి రెట్లుగా మారి, పరమాత్మవైపు మనం వేసిన ఒక్క అడుగు కోట్లాదిఅడుగులకు చేరి అగణితమై భగవంతుడు మరింత, మరెంతో చేరువై అరచేతిలో ఆమలకంలా భాసిస్తాడు. మన 'ప్రేమవిశ్వరూపం' ముందు వామనుడై, అంగుష్ఠ మాత్రుడై, కుశాగ్ర (తృణాగ్ర)మాత్రుడై మన హృదయంలో ప్రేమమీద తానుగాబందీయైపోతాడు.
(ఈనాడు, ౧౯:౦౯:౨౦౦౯)
__________________________________

Labels: ,