వడ్డించేది తనవాడైతే...
'గోమూత్రం, మంగళ సూత్రం; సున్నిపిండీ, ఉగాది పచ్చడీ కాదేదీ పేటెంటు కనర్హం; ఔనౌను యోగమనర్ఘం' అనుకుంటూ అమెరికన్లు అడ్డగోలుగానైనా గోల్ సాధించడానికి శీర్షాసనాలు వేస్తున్నారు. పేటెంటు రావడమే ఒక యోగమనుకుంటూ యోగా సంబంధమైన 134 పేటెంట్లు, 150 కాపీరైట్లు, 2315 ట్రేడ్ మార్కులు ఎడాపెడాగా తమ అకౌంటులో వేసుకున్నారు. అమెరికాలో యోగ పరిశ్రమ 27 బిలియన్ డాలర్లకు పడగలెత్తింది. ఆ దేశంలో 28 మిలియన్ల మంది 'ఓ! దిస్ యోగా ఈజె జాలీ గుడ్ థింగ్' అనుకుంటూ యోగాభ్యాసానికి రెడీ అయిపోతున్నారు. బిక్రమ్ చౌదరి అనే యోగాచార్యుడు యోగ బోధించి 2002లో 3 మిలియన్ డాలర్లను జేబులో వేసుకున్నాడు. 26 యోగాసనాల మీద పేటెంటు 'దేవో'భవ... అని ఆయన అనేసరికి బిత్తరపోయే పరిస్థితి ఏర్పడింది. అన్నట్లు బిక్రమ్ చౌదరిది హీట్ యోగా. ఈ దెబ్బకు'యుగయుగమ్ముల నుంచి యోగమున్నా మనకు పేటెంటు యోగమ్ము పట్టుజారేనా?' అన్న కంగారుతో కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఆసనాలకు సంబంధించి అత్యవసర కార్యాచరణకు దిగవలసిన సమయం ఆసన్నమయిందని గ్రహించింది. ఏమాత్రం లేట్ చేయకుండా యోగా శ్లోకాల్ని ట్రాన్స్‌లేట్ చేయించి పేటెంటు ఆఫీసులకు పంపించడానికి శ్రీకారం చుట్టింది. 2010 నాటికి ఇండియాలో ఏడాదికి లక్ష పైగా పేటెంట్ దరఖాస్తులు దాఖలవుతాయని అంచనా. పేటెంట్ల కోసం కిందటేడాది 25వేల దరఖాస్తులు వచ్చాయి. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందన్న అంచనాలూ వినవస్తున్నాయి.
ప్రపంచంలో ఏటా మంజూరవుతున్న పేటెంట్లలో 90% అమెరికా, ఐరోపా, జపాన్‌లవి. పేటెంట్లు సాధించగలిగిన ఆ 'మెరిక'లంతా అమెరికా లాంటి దేశాల్లోనే ఉంటారన్న ప్రచారానికి అడ్డుకట్ట వేయక తప్పదు. అమెరికా వరుస చూస్తుంటే 'పేటెంట్ల మీద మాకే పేటెంటు ఇవ్వండి' అని ఓ దరఖాస్తు పడేసేటట్టుంది! మన చాదస్తం గానీ పేటెంట్ల సాధనకు విజ్ఞానులు ఎందుకు? వారు ఏం చూసినా పూర్వం ఎవరో దీనిని సాధించారు అనిపిస్తోంది. అజ్ఞానులకు అలాంటి 'బాధ'రబందీ ల్లేవు. కళ్ల ముందు ఏమి కనిపించినా 'ఇదే ఇదే! నేను కనుక్కున్నదీ...'అంటూ రాగాలు తీస్తారు.
'చరిత్ర అడక్కు- చెప్పేది విను' అని ఓ పంచ్ డైలాగు ఉంది. వడ్డించేవాడు తన వాడయితే 'చరిత్ర మీద కూడా పేటెంట్ మాకే ఇవ్వాలి' అని అర్జీ పెడతారు. గుడ్లప్పగించి చూస్తున్నంత కాలం చెవిలో రకరకాల పువ్వులు పెడుతూనే ఉంటారు! ఏమంటారు...?
- ఫన్‌కర్
(Eenadu, 12:08:2007)
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home