వలస వచ్చిన అదృష్టమూ
'కదిలేదీ కదిలించేదీ కవిత్వం' అని మహా కవి శ్రీశ్రీ అన్నా కవిత్వానికి అంత సీను ఎక్కడిది? మహా అయితే సభ మొదట్లో కిక్కిరిసి ఉన్నా క్షణాల్లో తుపాకీ గుండుకు కూడా మనిషి దొరకకుండా బయటకి కదిలించగలదు. అంతే. నిజానికి మనుషులను కదిలించగల శక్తి డబ్బుకు ఉంది. తెల్లవాడు వ్యాపారం కోసం ఇండియాకు వలస వచ్చినా, నల్లవాడు ఉద్యోగం కోసం ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్లినా గుండె 'డబ్బు డబ్బు' అని కొట్టుకోవడమే కారణం. పట్టా చేత పట్టుకొని కావలసిన చోటుకు జై పరమేశ్వరా అంటున్నది ఇందుకే.
'వలస వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము' అని 'ధన'సారా పాడుకుంటున్నారు. వలసలు ప్రకృతి విలాసాలు వికృతి అయిపోయాయి.
సర్వప్రాణులకు వలస సహజం. తెప్పలుగ చెరువు నిండిన కప్పలు వలస వచ్చును. పక్షులు రెక్కలు కట్టుకుని, పౌరులు 'లెక్క'లు కట్టుకుని వలస వెళ్లుదురు. విదేశాలకు వలసపోయి అక్కడి కంపెనీలు కొంటున్న మనవాళ్లకు 'లక్ష్మీ'కటాక్షం ఉన్న 'మిట్టల్'లదే అడుగు జాడ. అమెరికాలో ప్రత్యేకించి సిలికాన్ వేలీలో కొత్త పరిశ్రమ వచ్చిందంటే ఆ శ్రమ ప్రవాస భారతీయులదేనని ఇక్కడ ఆశ్రమ వాసులను అడిగినా చెప్పేయగలరు. చదువుల కోసం మన కుర్రాళ్లు విదేశాలకు వలస వెళ్తుంటే, నవ వధువులు 'అ అంటే అమెరికా' అని పల్లవి పాడుకుంటూ సప్త సముద్రాలు దాటి వచ్చే వరుని కోసం చూస్తున్నారు.ఏ మేలుకయినా ఇ-మెయిల్ ఉపయోగపడుతున్న ఈ రోజుల్లో వలస పెద్ద కష్టమేం కాదు. కొండ మీది కోతి అయినా చెంగు చెంగున కిందకు వలస వచ్చేస్తుంది.
కాదేదీ వలస కనర్హం ఔనౌను ఫీల్డు అనర్ఘం' అయిపోయింది.
'వెండి' తెర రంగంలో కూడా వలస 'బంగారు' పంట పండిస్తోంది. అ, ఆ, ఇ, ఈ అర్థంగాని వాడు తెలుగు పాట పాడితే గాని అందులోని రెండర్థాల కష్టాలు తెలియవు! అలాగే హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి పనికిరాదు. వైద్యానికి పెరటి చెట్టు మాదిరి. ముంబాయి ముద్దుగుమ్మలు వలస వచ్చి నటిస్తే ఆ మజాయే వేరు. ప్రాంతీయ భాషల నటీనటులు, దర్శకులు బాలీవుడ్‌కు వలస వెళ్లారంటే ధనమే ప్రధానం. డిమాండున్నా వలస రాని అమాయకులుంటారు.'రావోయి చందమామా.. మా వింతగాథ వినుమా..' అని అద్భుతమైన ఆఫర్ వచ్చినా, జాబిల్లి ఇక్కడికి తరలివచ్చిన దాఖలాలు లేవు. దాంతో మనిషే చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చాడు. అందమైన అమ్మాయిల ముఖాలను చందమామతో పోల్చడంలో ఎంత తేడా ఉందో గ్రహించగలిగాడు. రిక్షాలో వెళ్లినంత తేలిగ్గా మనిషి అంతరిక్షానికి వలస వెళ్లే రోజూ రావచ్చునేమో.
ఎరక్క దుబాయ్ వెళ్లి జీవితంలో దెబ్బతిన్న వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. వలసలో 'వల' ఉంది అని తెలిసి బాధితులు వలవల వాపోతున్నారు. ఎంత వలసకు అంత నష్టాలా...! ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు ఆగనట్టే, కలతలు వస్తాయని వలసలు ఆగడం లేదు. డబ్బాశ మనిషిని నిలకడగా ఉండనివ్వడం లేదని ఎదురునిల్చి వాదిస్తుంటే, వారించడానికి ఇక ఏముంది?
-ఫన్‌కర్
(Eenadu, 25:08:2007)
----------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home