ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ అస్తమయం
ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిషశాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు భమిడిపాటి రాధాకృష్ణ(78) మంగళవారం ఉదయం 11.05 గంటలకు రాజమండ్రిలో మృతి చెందారు. ఆస్తమా, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడురోజుల క్రితం కోమాలోకి వెళ్ళిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. 1929, నవంబరు 24న రాజమండ్రిలో జన్మించిన రాధాకృష్ణకు భార్య సుశీల, ఒక కుమార్తె, అయిదుగురు కుమారులు ఉన్నారు. ఈయన 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంతవేదాంతం తదితర నాటిక, నాటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కీర్తిశేషులు నాటకంలోని ఓ పాత్ర ద్వారా ప్రముఖ నటుడు రావుగోపాలరావు మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు పోద్బలంతో భమిడిపాటి సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కళాతపస్వి కె.విశ్వనాథ్ తొలి చిత్రమైన ఆత్మగౌరవం చిత్రం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురానికథ, విచిత్రకుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటి చిత్రాలకు ఈయనే కథకుడు. నాటి తరంలోని ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి మహానటులకు భమిడిపాటి సన్నిహితుడు. ప్రత్యేకించి అక్కినేని నాగేశ్వరరావుతో మంచి మైత్రి ఉండేది. ఆయన ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పనిసరిగా భమిడిపాటిని కలిసేవారు. రాధాకృష్ణ 1994 తరువాత క్రమంగా సినిమా రంగానికి దూరమై తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి క్యాలెండర్ పేరిట క్రీస్తు పూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా రాధాకృష్ణ అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కనబరిచారు. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా నామకరణ మహోత్సవం సందర్భంగా చిన్నారులు బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా జాతకాలు చెబుతారనే పేరుంది. 'అపరిచితుడు' సినీ హీరో అసలుపేరు కాన్ కెనడీ కాగా జాతకం ప్రకారం ఆయనకు విక్రమ్‌గా నామకరణం చేసింది రాధాకృష్ణ కావడం గమనార్హం. హాస్యబ్రహ్మ భమిడిపాడి కామేశ్వరరావు కుమారుడిగా ఆయన రచనా వారసత్వాన్ని రాధాకృష్ణమూర్తి పుణికి పుచ్చుకుని సునిశితమైన వ్యంగ్యాన్ని రంగరించి ఆయన కథల్లో హాస్యాన్ని పండించేవారు. తుది ఘడియల వరకు కూడా రచనా వ్యాసంగంలోనే మునిగి తేలారు. తాను 'సెప్టెంబరు 4న గంట కొట్టేస్తాన'ని నర్మగర్భంగా తన మరణ తేదీని ముందే డైరీలో రాసుకున్న ఉదాహరణ రాధాకృష్ణ హాస్యచతురతకు, సంఖ్యా, జ్యోతిష శాస్త్రాలపై ఆయనకున్న పట్టును రుజువు చేస్తుంది. ప్రముఖ వారపత్రిక 'స్వాతి' ఎడిటర్ వేమూరి బలరామ్ భమిడిపాటి రాధాకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించగా, సాహితీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
(Eenadu, 05:09:2007)
Labels: Personality, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home