శృంగార ఘటికులు

ప్రపంచంలోని ఎన్నో భాషల్లో శృంగారమే ప్రముఖ స్థానం వహిస్తోంది. బాల్జాక్ రాసిన శృంగారపూరితమైన కథలు డి.హెచ్. లారెన్సు, చలం వంటి వారు రాసిన నవలలు ఈనాటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. శృంగార సంబంధ సామెతలు అనేకం తెలుగులో ప్రచారంలో ఉన్నాయి. బావా అని పలకరిస్తే రావా అని కొంగు పట్టుకున్నాడట, మోహభ్రమను చిక్కి మొనగాడు నీల్గడా, యోగికీ రోగికీ భోగికీ నిద్ర ఉండదు, బ్రమసి బాపనయ్య దగ్గరకు పోతే వద్దేబాబూ వర్జ్యం ఉందన్నాడట వంటి సామెతలు అడపాదడపా వినపడుతూనే ఉంటాయి. ఆ అమ్మడు తన ప్రియుడికి టెలిగ్రాం ఇవ్వటానికి పోస్టాఫీసుకు వచ్చింది. ''సరే...'' అని ఒక్క ముక్కరాసి కౌంటర్‌లో ఉన్న బాబుకు ఇచ్చింది. ఆ కాగితం చూసిన కౌంటర్‌బాబు ''మరో మూడు నాలుగు మాటలు రాసినా అంతే చార్జి అవుతుందమ్మా!'' అన్నాడు. ''అవుననుకోండి... సరే సరే అని మూడుసార్లో నాలుగు సార్లో రాస్తే నేను మరీ తొందర పడిపోతున్నానని నా బాయ్ ఫ్రెండు అనుకోడూ...'' అందా అమ్మాయి కొంచెం సిగ్గుపడుతూ. ప్రేమ, శృంగారాల ప్రకటనల దగ్గరకొచ్చేసరికి కొన్ని అప్రకటిత హద్దులూ ఉంటాయి.
ఈ కబురు వింటే తన పాత డైలాగును మార్చి ''మన వాళ్ళు గొప్ప ఘటికులోయ్'' అని ఉండేవాడు గిరీశం పంతులు. 26 దేశాల్లో సాగించిన ఇటీవలి అధ్యయన ఫలితాల ప్రకారం వాత్సాయన కామసూత్రాలకు పుట్టినిల్లయిన భారతదేశ వాసులే భేషయిన శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నారు. రకరకాల భంగిమల్లో శృంగారంలో పాల్గొంటూ సంతృప్తికర ఆనందానుభూతి పొందుతున్నారు. సర్వేలో పాల్గొన్న పదిమంది భారతీయుల్లో ఏడుగురు తాము శృంగారంలో పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తున్నామని స్వర్గసుఖాలను రుచి చూస్తున్నామని చెప్పారు. ప్రేమికుల దేశంగా పేరుపొందిన ఫ్రాన్సు వంటి దేశాలు ఈ విషయంలో వెనకబడిపోయాయి. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 68శాతం తాము చక్కని శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నామంటే బ్రిటన్‌లో 38శాతం, ఫ్రాన్సులో 36శాతం మాత్రమే ఆ విధంగా చెప్పగలిగారు. గ్రీకులు మెక్సికన్లు మాత్రం తమ శృంగార జీవితం సంతృప్తికరంగానే ఉన్నట్లు వెల్లడించారు. పడక గదిలో తమకు ఏం కావాలో సహచరులు, ఎలా సహకరించాలో చెప్పడంలో 74శాతం భారతీయులు ఎటువంటి బిడియాన్నీ కనబరచటం లేదు. ప్రపంచంలో సగటున 58శాతం మాత్రమే అలా నిస్సంకోచంగా చెప్పి పడకగదిలో సుఖాలను పొందగలుగుతున్నారు. ప్రియులు ప్రియురాళ్ళ విషయంలో భారతీయులది సంయమన మార్గం. భారతీయ పురుషులకు సగటున ఆరుగురు ప్రియురాళ్ళు ఉండగా, మహిళలకు ఇద్దరు ప్రియులు ఉంటున్నారు. అదే బ్రిటన్‌లో పురుషులకు 16మంది ప్రియురాళ్ళు, మహిళలకు 10మంది ప్రియులు ఉంటున్నట్లు సర్వేలో తేలింది. భారతీయులు పడకగదులను అలంకరించుకోవటంలోను ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. ఇటీవలి కాలంలో కామోద్దీపనను కలగజేసే కృత్రిమ పరికరాలను ఉపయోగించటమూ ఎక్కువైనట్లు తేలింది. శృంగారాన్ని సర్వతోముఖంగా అనుభవించి ఆనందించటానికి ప్రపంచంలోని మిగతా దేశాల వారికంటె భారతీయులే ముందున్నారని సర్వేలో తేలిపోయింది. ''ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే, అనురాగపుటంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం'' అని మహాకవి అననే అన్నారు కదా!
(Eenadu, 07:10:2007)
__________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home