నేడు విశ్వ కారుణ్య దినోత్సవం
నోరు మంచిదయితే వూరు మంచిదవుతుంది. ఓ చిరునవ్వు... ఆత్మీయులను సంపాదించి పెడుతుంది. కరుణ చూపిస్తే పాషాణ హృదయమూ కరుగుతుంది. ప్రతి ఒక్కరూ కరుణను అలవర్చుకుంటే ప్రపంచమంతా సంతోషమయమవుతుంది. కరుణ చూపించడానికి కోట్లు కుమ్మరించాల్సిన పనిలేదు. పెద్దపెద్ద త్యాగాలూ అవసరం లేదు. కాస్తంత ఉదారం చూపితే చాలు. కోపం అణుచుకుంటే చాలు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు కాస్తంత సంయమనం పాటిస్తే దూదిపింజలా తేలిపోతాయి. రోడ్డుమీద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఓ వృద్ధురాలు రోడ్డు దాటడానికి ప్రయాస పడుతుంది. ఓ శునకం బెంబేలెత్తుతుంది. పోలీసులెవరూ చెప్పకుండానే... మీ వాహనాన్ని ఆపి ఆ వృద్ధురాలికో, ఆ శునకానికో వెసులుబాటు ఇవ్వండి. అదే కరుణంటే. అర్థరాత్రి మంచి నిద్రలో ఉంటారు. పక్క ఫ్లాట్లోంచి విపరీత శబ్దాలు వచ్చి మీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. వారిపై కోపగించుకుంటే ఏమవుతుంది. మీ నిద్ర ఎలాగూ పోయింది సరికదా! వారితో శత్రుత్వం ఏర్పడి ప్రశాంతత కరవవుతుంది. సంయమనంతో ఉండండి. ప్రశాంతత మీ సొంతమవుతుంది. మొక్కలు పెంచడం, పక్షులకు ధాన్యం గింజలు వేయడం, సహోద్యోగి పని ఒత్తిడిలో ఉన్నప్పుడు సాయమందించడం, పొరుగువారి కష్టాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ కారుణ్య చర్యలే. ఇల్లాలికి ఇంటిపనిలో సాయం చేయడమూ అదే కోవలోకి వస్తుంది. విశ్వ కారుణ్య ఉద్యమం తొలిసదస్సును జపాన్‌లోని టోక్యోలో 1998 నవంబరు 13న నిర్వహించారు. జపాన్ చిరు కారుణ్య ఉద్యమం 35వ వార్షికోత్సవం కూడా ఆ రోజునే పాటించారు. అప్పటినుంచి, కారుణ్య స్వభావాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నవంబరు 13ను విశ్వ కారుణ్య దినోత్సవంగా గుర్తిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ప్రాణి పట్లా కరుణ చూపడం, పర్యావరణం పట్ల మమకారం పెంచుకోవడం ఈ దినోత్సవం ఆశయం. ఈ ఆశయానికి అందరూ కంకణబద్ధులైతే ప్రపంచమంతా సంతోషం వెల్లివిరిస్తుంది. అశాంతి పరిసమాప్తమవుతుంది.
(Eenadu, 13:11:2007)
_______________________________________
Labels: Self development, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home