శేష ప్రశ్న
జననీ జన్మభూమి- అన్నారు. కన్నతల్లి మీదా ఉన్న వూరుపైనా ప్రేమాభిమానాలు ప్రతివారికీ ఉంటాయి. ఏ దేశంవారికి ఆ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదనే అభిప్రాయం ఉంటుంది. ''సూర్యుని వెలుతురుల్ సోకునందాక, ఓడల జండాలు ఆడునందాక, అందాకగల ఈ యనంత భూతలిని మనభూమివంటి చల్లని తల్లిలేదు'' అన్నారు రాయప్రోలు. రెండు దేశాలవారు ఒకచోట తారసపడ్డప్పుడు ఎవరికివారే తమదేశం గొప్పదని అవతలివారికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఓ ఇజననీ జన్మభూమి- అన్నారు. కన్నతల్లి మీదా ఉన్న వూరుపైనా ప్రేమాభిమానాలు ప్రతివారికీ ఉంటాయి. ఏ దేశంవారికి ఆ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదనే అభిప్రాయం ఉంటుంది. ''సూర్యుని వెలుతురుల్ సోకునందాక, ఓడల జండాలు ఆడునందాక, అందాకగల ఈ యనంత భూతలిని మనభూమివంటి చల్లని తల్లిలేదు'' అన్నారు రాయప్రోలు. రెండు దేశాలవారు ఒకచోట తారసపడ్డప్పుడు ఎవరికివారే తమదేశం గొప్పదని అవతలివారికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఓ ఇంగ్లిషాయన, అమెరికా పెద్దమనిషీ అనుకోకుండా ఒకచోట కలిశారు. ఇద్దరికీ ప్రపంచం మొత్తంమీద తమదేశమే గొప్పదనే అభిప్రాయం గాఢంగా ఉంది. ఆ విషయాన్ని అమెరికా పెద్దమనిషి తన మాటలద్వారా బయటపెట్టేశాడు. ఇంగ్లిషాయన బదులు చెప్పలేదు. ఒక్కమాట మాట్లాడకుండా నవ్వి వూరుకున్నాడు. ఆయనకు ఇంగ్లాండే గొప్పదేశమని ప్రపంచమంతటికీ తెలుసని గట్టినమ్మకం. ''దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి'' అన్నారు మహాకవి. తన దేశభక్తిని గురించి పదేపదే చెప్పుకొనేకంటే తన దేశప్రజలకు మంచిని చేకూర్చే ఒక పనిని చేయటమే అసలైన దేశభక్తికి చిహ్నమంటారు. ముగ్గురు చైనా యువకులు తాము అంతరిక్షంలో షికారుచేసి వచ్చామని గొప్పలు చెప్పటం ప్రారంభించారు. ఆ మాటలు విన్న ఓ రష్యన్ పెద్దమనిషి- ''అదెలా సాధ్యమయ్యా? మీ దేశంలో రాకెట్లు లేవు అంతరిక్ష నౌకలు లేవు అటువంటప్పుడు మీరెలా అంతరిక్షంలోకి వెళ్ళారు?'' అని అడిగాడు. ''అవన్నీ మాకెందుకయ్యా. మా దేశస్థులంతా ఒకచోట కదలకుండా నుంచోగా ఒకరి భుజాలపై మరొకరం ఎక్కాం. అందరికంటే పైనున్న మేం ముగ్గురం అంతరిక్షంలో అడుగుపెట్టేశాం-'' అన్నారువాళ్లు!
''ఎక్కడివాడో యక్షతనయేందు జయంత వసంతకంతులన్ జక్కదనంబునన్ గెలువ జాలెడువాడు'' అంటూ నిర్మానుష్యమైన మంచుకొండలపై ప్రవరాఖ్యుడు కనపడినప్పుడు గంధర్వకన్య వరూధిని ఆశ్చర్యపోతుంది. పరదేశులు అకస్మాత్తుగా కనపడినప్పుడు ఆ విధమైన ఆశ్చర్యం కలగటం సహజమే. ఒక దేశం వారికీ మరొక దేశం వారికీ మధ్య అంతరాలు చాలా ఉంటాయి. ఆచారాలు, ఆకారాలు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పాతాళంలో ఉండే నాగలోకానికి చెందిన ఉలూచి అనే నాగకన్యక భూలోకానికి వచ్చి గంగానది ఒడ్డున జపం చేసుకుంటున్న అర్జునుని చూసి మోహించి మాయాబలంతో తన నగరానికి తీసుకుపోతుంది. తరవాత కళ్ళు తెరిచిన అర్జునుడు చుట్టూ చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఉలూచే- ''యో మదవతీ నవమన్మథ, ఈ జగంబు పాతాళము, నేనులూచి యనుదాన, భుజంగమరాజ కన్యకన్'' అంటూ తననూ పరిసరాలనూ పరిచయం చేస్తుంది. ఆపై ఉలూచి అర్జునుల పరిణయం జరిగి ఇలావంతుడు అనే కుమారుడు జన్మిస్తాడు. మానవ మాత్రుడికి, నాగకన్యకకు పుట్టిన ఆ బాలుడు ఏ జాతికి చెందినవాడు అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అర్జునుడు ఆ కుమారుణ్ని తల్లిదగ్గరే నాగలోకంలోనే వదిలి భూలోకానికి వెళ్ళిపోవటంతో అటువంటి సందేహాల సమస్యలు ఏర్పడలేదు. శాస్త్రవిజ్ఞానం అద్భుతంగా పెరిగిన ఈ రోజుల్లో మాత్రం అటువంటి సందేహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
''మీది రాజమహేంద్రవరం షండీ చెప్పారు కారు-'' అంటూ అప్పటివరకు గిరీశాన్ని చూసి ధుమధుమలాడిన అగ్నిహోత్రావధాన్లు. ఆ తరవాత ఎక్కడలేని ఆప్యాయతా ఒలకబోస్తాడు. ఒక ప్రాంతం లేదా ఒక వూరికి చెందినవారికి అదే ప్రాంతం లేదా అదే వూరికి చెందిన వారిపై ప్రత్యేక అభిమానం ఉండటం వింతకాదు. ఈ విషయం దేశాలకూ వర్తిస్తుంది. ''ఏ పూర్వపుణ్యమో ఏయోగ బలమొ జనియించినాడనీ స్వర్గఖండమున'' అంటూ భరత భూమిలో పుట్టినవారిని ప్రస్తుతించారు కవి. శాస్త్రవిజ్ఞానం బహుముఖాలుగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనుషులు చంద్రలోక విహారాలుచేసి వస్తున్నారు. ఇతర గ్రహాల్లోకి అడుగు పెడుతున్నారు. జాతీయత అన్నది పుట్టిన స్థలంపై ఆధారపడి ఉంటుంది. చంద్రునిపై జన్మించినవారి జాతీయతను నిర్ధారించటం ఎలా అనే మహత్తర సందేహం ప్రస్తుతం శాస్త్రజ్ఞులను కలవరపెడుతోంది. 1967వ సంవత్సరంలో కుదుర్చుకున్న అంతరిక్ష ఒప్పందం ప్రకారం చంద్రుణ్ని ఎవరూ తమ దేశానికే చెందిన గ్రహంగా పరిగణించే వీలులేదు. ఇతర గ్రహాలకు చెందిన ప్రాంతాన్నీ ఏ దేశంవారూ తమకే చెందిన ప్రాంతంగా అనుకొనే వీలులేదు. ఇతర గ్రహాల్లో మనుషులు స్థావరాలు ఏర్పాటు చేసుకొని పిల్లాపాపలను కనే రోజులు ఇప్పట్లో సాధ్యం కాకపోయినప్పటికీ అందుకు సంబంధించిన అనేక సందేహాలు మాత్రం శాస్త్రజ్ఞులను వేధిస్తున్నాయి. ఇటీవల వియన్నాలో జరిగిన అంతరిక్ష శాస్త్రజ్ఞుల సదస్సులో ఈ విషయమై చర్చలు జరిగాయి. ఒక అంగీకారానికి మాత్రం శాస్త్రవేత్తలు రాలేకపోయారు. ఇతర గ్రహాలపై జన్మించిన మనుషుల జాతీయత శేషప్రశ్నగానే మిగిలిపోతుందా అన్న సందేహం కలుగుతోంది. దీన్ని ఎప్పటికైనా అంతరిక్ష శాస్త్రవేత్తలే తీర్చాలి!
(Eenadu,25:11:2007)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home