ఆయుర్దాయం పెంచుకోవచ్చు....
తెలిసినవారు ఎదురైతే 'బాగున్నారా' అని ప్రశ్నించడం మన అలవాటు. నిజానికి అది ప్రశ్నకాదు, పలకరింపు. మనిషికీ మనిషికీ మధ్య బాంధవ్యాల కొనసాగింపు. తరతరాలుగా జాతిలో స్థిరపడిన ఒక ఆపేక్షకు శబ్దమయ రూపమే- బాగున్నారా అన్న ప్రశ్న! శారీరకంగాను, మానసికంగాను పూర్తి ఆరోగ్యంతో ఉండాలన్న శుభకామనలోంచి ఆ ప్రశ్న పుడుతుంది. అది అర్థమైన వారికి ఆ మాట 'బాగుండటానికి ప్రయత్నం చేస్తున్నారుకదూ?' అన్నట్లుగా వినిపిస్తుంది! ఎందుకంటే మన అలవాట్లు శరీరాన్ని, ఆలోచనలు మనసునీ ప్రభావితం చేస్తాయని సైన్స్ చెబుతోంది. అవి బాగుంటే ఇవీ బాగుంటాయి. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే- శారీరకంగాను, మానసికంగాను పూర్తి స్వస్థతతో ఉన్నాడని అర్థం. సంపూర్ణ ఆరోగ్యంతో మనిషి నిండు నూరేళ్లు జీవించాలని మన పెద్దలు వేదకాలం నుంచి ఆకాంక్షించారు. 'పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం, భవామ శరదశ్శతం, శృణువామ శరదశ్శతం...,- నిండు నూరేళ్లూ చూద్దాం, జీవం తొణికిసలాడుతూ నూరేళ్లు ఉందాం, నూరేళ్లు ఆనందిద్దాం, నూరేళ్లు సంతృప్తిగా జీవిద్దాం, నూరేళ్లూ విందాం, మాట్లాడుతూ ఉందామని మానవాళిని ప్రోత్సహించారు. అందుకు తగ్గట్లే ఎన్నో ఆరోగ్య సూత్రాలు నిర్మించారు. అలవాట్లు రూపొందించారు. కట్టుబాట్లు విధించారు. కాలం మారింది. నాలుగుకాలాల పాటు 'చల్లగా' జీవించమని పిల్లనిచ్చిన మామ ఆశీర్వదిస్తే- పడగ్గది ఏసీ చేయించాడు కాదని సణుక్కునే అల్లుళ్లున్నారు. పచ్చగా బతకమని బంధువులంటే నాకు కామెర్లు రావాలని వారి కోరికా- అని అపార్థం చేసుకునే జనాభా తయారైంది. ఆకాశంలో చంద్రుణ్ని వేలెత్తి చూపిస్తుంటే మూర్ఖుడు వేలుకేసి చూస్తాడన్న సామెతను నిజం చేస్తున్నారు. మనిషి అలవాట్లు దిగజారుతున్నాయి. సంఘంలో కట్టుబాట్లు సడలుతున్నాయి. సుస్తీ చేస్తేనేగాని ఆరోగ్యం ఎంత ముఖ్యమో గమనించని దశకు చేరుకుంటున్నాం.
రోజూ రాత్రి రెండుదాకా మెలకువగా కూర్చుని, ఆరోగ్యం పాడుచేసుకుంటోందని భార్యగురించి వైద్యుడికి చెప్పి వాపోయాడొకాయన. ఆవిడ పెందరాళే నిద్రపోవడానికి మందిమ్మని కోరాడు. డాక్టరుకు అనుమానం వచ్చింది. 'అంతరాత్రి దాకా మేలుకొని ఏం చేస్తుందావిడ?' అని ప్రశ్నించాడు. 'నేను బార్‌నుంచి వచ్చేసరికి ఆవేళవుతుంది... అందాక ఆవిడ నాకోసం కాచుకుని ఉంటోంది' అని చల్లగా జవాబిచ్చాడు పతిదేవుడు! ఆరోగ్యం అనేమాటకు శాస్త్రం చిత్రమైన అర్థం చెప్పింది- ''నీ ఒళ్ళు నీకు తెలియకపోవడమే ఆరోగ్యం... ఏ నొప్పివల్లో ఒళ్ళు తెలిసిందంటే అనారోగ్యం ఏర్పడినట్లు'. 'పొగతాగితే క్షయ, క్యాన్సరు వస్తాయని పత్రికలు, మందు ఎక్కువైతే ఆయుక్షీణమని ఛానెళ్లు చెప్పిచెప్పి చెవులు ఊదరగొట్టేసరికి ఇక లాభం లేదని మానేశానోయ్' అని ఒక మిత్రుడు ప్రకటించాడు. 'ఏం మానేశావు' అంటే- పత్రికలు చదవడమూ, టీవీ చూడటమూ అన్నాడు! మద్యపానం కన్నా ధూమపానం మరీ ప్రమాదకరమైనదని శాస్త్రజ్ఞులు తేల్చిచెప్పారు. అదివిని 'సిగరెట్లు బాగా తగ్గించేస్తున్నానోయ్' అని జనవరి ఫస్టున మాటిచ్చాడు భర్త- ఇంట్లో బార్‌కి ప్రారంభోత్సవం చేస్తూ! మద్యమైనా తగుమాత్రంగానే సేవించాలి సుమా- అని హెచ్చరించాడు ఆచార్య చరకుడు. ''అన్నం మాదిరిగానే మద్యం కూడా స్వభావరీత్యా స్వయంగా దోషపూరితం కాదు... పరిమితి దాటితే మాత్రం తప్పక హాని చేస్తుంది' అని హెచ్చరించాడు. అదే వరుసలో వ్యాయామం మనిషికి నిత్యావసరమన్నాడు. మద్యపానం విషయంలో రాయితీలను మాత్రమే స్వీకరిస్తాం, చరకుడి ఆరోగ్యసూత్రాలు పాటించడం సాధ్యం కాదంటే కుదరదు. పచ్చికూరగాయలు, పళ్ళు వాడకం విషయంలో ఆయుర్వేదం వంటి ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రాలు ఎన్నో విశేషాలు ప్రకటించాయి. వాటిని తూచా తప్పకుండా పాటించిన మన పూర్వీకులు ఆరోగ్యంగా నిండునూరేళ్లు పోడిమితో హాయిగా జీవించారు. నేడు జీవనశైలి, స్థాయి పెరిగాయిగాని జీవకళ తరిగింది. మందులున్నాయి- ఆరోగ్యం లేదు. అన్నం ఉంది- ఆకలి లేదు. పని ఉంది- ఓపిక లేదు. మనిషి ఉన్నాడు- జీవిస్తూ కాదు... గడుపుతూ... ఆనందం'తో' కాదు... ఆనందాన్ని అన్వేషిస్తూ...
ఈ దుస్థితి నుంచి మనిషి బయటపడాలంటే నాలుగు విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తేచాలు, పద్నాలుగేళ్ల పాటు జీవితకాలం పొడిగింపు సాధ్యమవుతుంది- అంటున్నారు శాస్త్రజ్ఞులు. రోజువారీ వ్యాయామం, హెచ్చుమొత్తంలో పళ్ళు, తాజా కూరగాయల వాడకం, మద్యాన్ని స్వల్పమాత్రంగా సేవించడం, ధూమపానం పూర్తిగా మానుకోవడం అనే నియమాలు పాటిస్తే మనిషి ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలింది. ఇరవై వేలమందిపై 14 ఏళ్లకుపైగా విస్తృతంగా జరిపిన పరిశోధనలవి. బృందం నాయకుడు ప్రొఫెసర్ కె.టి.ఖా వైద్య సంబంధిత పత్రికలో ఈ వివరాలు వెల్లడించారు. ఇదే పరిశోధనలో మరో ముఖ్య విషయమూ బయటపడింది. పొగతాగడం అన్నింటికన్నా ప్రమాదకరమని తేలింది. పరిశోధనలో పాల్గొని అందరికన్నా ఎక్కువ కాలం జీవించినాయన ఒక్కసారి కూడా పొగతాగి ఎరుగడు. రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేసేవాడు. ఎంతలేదన్నా ఐదుసార్లు పళ్లు తాజాకూరగాయలు తీసుకునేవాడు. ''పాలీల పండగనాడు పొట్టనిండా తాగితాగి, పక్కనున్న నిన్నుసూసి సంక నేను గుద్దుకుంటి'' అన్న తరహాలో కాకుండా మితంగా మద్యం పుచ్చుకునేవాడు. అందరికన్నా ఎక్కువకాలం, అదీ ఆరోగ్యంగా జీవించడానికి ఇవే కారణాలని పరిశోధకులంతా ముక్తకంఠంతో చెప్పారు. 'హంసలా ఆర్నెల్లు బతికితే చాలు' అనే వైరాగ్య ప్రకటనలు మానేసి, కాకిలా కలకాలం జీవించడమే ముద్దు- అనే నిర్ణయానికి ప్రజలొస్తే, ఆరోగ్య సూత్రాలను పాటిస్తే మేలంటున్నారు అనుభవజ్ఞులంతా. వేదాంతం వల్లిస్తాంగాని, బతుకుమీద తీపి ఎవరికిలేదు చెప్పండి!
(Eenadu, Editorial, 13:01:2008)
____________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home