ధ్యానం- జ్ఞానం
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
ఒక అమాయక భక్తుడు పురాణశ్రవణానికి వెళ్ళాడు.
'భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడ వెతికినా కనిపిస్తాడు' అన్న గురువు మాటలు అతనిలో బలంగా నాటుకున్నాయి. ఉన్న పళంగా భగవంతుణ్ని వెతుకుతూ బయలుదేరాడు. ఊరూరా తిరుగుతూ కొండలూ, లోయలూ గాలిస్తూ అడవిదారి పట్టాడు. చాలాదూరం నడవడంతో అలసి ఒక చెట్టునీడన విశ్రమించాడు. ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకుంటున్న రుషి ఆ భక్తుణ్ని చూసి 'ఎవరిని వెతుక్కుంటూ బయలుదేరావ్?' అన్నాడు. 'దేవుణ్ని' అన్నాడు భక్తుడు. రుషి నవ్వుతూ, 'దేవుణ్ని వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చావ్, ఎక్కడ వెతికినా కనిపించే ఆ దేవుణ్ని ఒకచోట వెతకడం మరచిపోయావ్' అన్నాడు.
'ఎక్కడ స్వామీ?' అడిగాడు భక్తుడు.
'నీలాంటి భక్తులు వెంటపడుతున్నారని, దేవుడు ఎవరూ వెదకని ప్రదేశంలో కొలువై ఉన్నాడు. ఆ ప్రదేశం ఏమిటో ఎవరూ ఊహించలేరు' అన్నాడు ఆ రుషి. 'దయచేసి ఆ ప్రదేశం ఏమిటో చెప్పండి?' అన్నాడు భక్తుడు ఆతృతగా. 'అది, నీ మనసు, నీ మనసులోకి తొంగి చూడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు' అన్నాడు రుషి.
వెంటనే ఆ చెట్టుకింద కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానముద్రలోకి వెళ్ళాడు. నిమిషాలు గడిచాయి. అవి గంటలుగా మారి చాలాసేపటి తరవాత భక్తుడు కళ్ళు తెరిచాడు. తననే గమనిస్తున్న రుషిని చూసి 'స్వామీ... నా మనసులోకి తొంగిచూశాను, ఏమీ కనబడలేదు' అన్నాడు అమాయకంగా. అపుడు రుషి 'నువ్ నీ మనసులో ఏమీలేని శూన్యస్థితిని సాధించావ్, అంటే ఆకాశంలో అంతులేనిది, అదే నిరాకారుడైన భగవంతుని శక్తిస్వరూపం' అన్నాడు.
- ఈ కథలో పేర్కొన్న విధంగా పారమార్థిక ధ్యానం ద్వారా అంతర్యామితో మమేకమయ్యే మార్గం సులభతరం అని యోగిపుంగవులైనవారు ధ్యానమార్గాల్ని గురించిన బోధనలు సాగించారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీనిద్వారా భవిష్యత్తుపై భయంగానీ, నిన్నటి గురించిన దిగులుగానీ లేని 'ఈ క్షణంలోకి ప్రయాణించడం సులభం' అని మరికొంతమంది యోగులు ప్రవచించారు. నువ్వు ఎవరు, నేను ఎవరు, ఈ సృష్టి రహస్యం ఏమిటనే ప్రశ్నలకు ధ్యానంద్వారా సమాధానం లభిస్తుందంటారు వేదాంతులు. ధ్యానంద్వారా తమలోకి తాము అంతర్ముఖులై తమ అంతర్వాహిని వినగలుగుతారు. అలా మనస్సు అంతః పొరల్లోకి చూడటం ధ్యానం ద్వారానే సాధ్యం, అదే ఆత్మశోధన అన్నారు గాంధీ.
సముద్రం అంటే చాలా ఉన్నతమైనదనీ దానిలో జలక్రీడలు చేయడం అంతులేని ఆనందం కలిగిస్తుందనీ ఎవరో చెబుతుంటే ఒక చేప విని, తన తల్లి చేపను అడిగింది. 'అసలు సముద్రం అంటే ఏమిటి?' అని. ఆ తల్లి చేపకూ సమాధానం తెలీదు. తమ సహచర చేపల్ని ప్రశ్నించింది. అసలు ఏ చేపకూ సముద్రం గురించిన విషయం అంతు చిక్కలేదు. ఆ చేపలన్నీ కలిసి సముద్రం గురించి అన్వేషణ సాగించాయి. వాస్తవానికి, ఆ చేపలు నివసించేది సముద్రంలోనే. అదే అజ్ఞానం.
పైన చెప్పిన కథలోని అమాయక భక్తుడు తన మనసుమందిరంలో కొలువై ఉన్న దేవుణ్ని తెలుసుకోలేక వూరూవాడా తిరిగినట్టుగా, ఆ చేపలు సైతం సముద్రంలో సంచరిస్తున్నా అజ్ఞానంతో సముద్రపు ఉనికినే మరచిపోయాయి. ఈ రకమైన అజ్ఞానపు చీకట్లు తొలగి జ్ఞానజ్యోతులు వెలగాలంటే ధ్యానం సహాయకారిగా నిలుస్తుందనేది ఈ కథలు చెప్పే ఆధ్యాత్మిక ప్రబోధం.
ధ్యానం చేసేకొద్దీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగేకొద్దీ ధ్యానంలో అవగాహన అదేస్థితిలో మెరుగవుతుంది అంటారు ధ్యానం ద్వారా జ్ఞానసంపన్నులైన మహానుభావులు. అలాంటివారు చూపిన ధ్యానమార్గంలో నడిచి జ్ఞానవంతులు కావడం అందరికీ సులభసాధ్యం, ఆచరణ యోగ్యం.
(ఈనాడు, అంతర్యామి, 11:06:2008)
_____________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home