చెదరని జ్ఞాపకం

మరణించినవారి ఆత్మీయులది పరమ దుఃఖస్థితి. దశరథుడు మరణించిన తరవాత భరతుడు అయోధ్యకు చేరుకున్నాడు. తండ్రి చావు కబురును చల్లగా చేరవేసింది కైకమ్మ. అమితమైన దుఃఖానికి లోనై మూర్ఛపోయాడు భరతుడు. ఎప్పటికో తేరుకుని ప్రేతకార్యాలు నిర్వహించాడు. తండ్రి దేహాన్ని చితిపైకి చేర్చి, హృదయస్థానంపై సమిధను ప్రతిష్ఠించి, 'హేసమిత్ అస్యప్రేతస్య ఉపరి సాదయామి, స్థాపయామి... ఈ ఉపాధిని గ్రహించు...' అంటూ అగ్నిని ముట్టించాడు. అది వేదోక్తి. తదనంతరం శ్రాద్ధకర్మ, పుణ్యాహవాచకాదులతో శుచి అయ్యాకా- పదమూడోరోజున అస్తి సంచయనానికై తండ్రి చితినుంచి చితాభస్మాన్ని సేకరించాడని రామాయణం వివరించింది. ఇప్పటికీ మనం అదే పద్ధతిని పాటిస్తున్నాం. అస్తికలను వివిధ నదుల్లో, సముద్రాల్లో కలపడం ఆనవాయితీ. కాశీపోయి గంగలో కలుపుతారు. ఆ తీరంలో శ్రాద్ధకర్మలు, అన్నదానాదులు చేస్తారు. వారివారి అభిరుచుల మేరకు సమాధి నిర్మాణాలు, విగ్రహస్థాపనలు, ఛాయాచిత్రపటాలు వంటి స్మారక చిహ్నాల రూపంలో తమ ఆత్మీయతలను పదిలపరచుకోవడం జరుగుతుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ అలాంటి స్మృతిచిహ్నమే. మరికొందరు పంచభూతాల్లోనూ తమ ఆత్మీయుల తీపిగుర్తులను వెతుక్కుంటారు. 'కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేని పసల్, హంసల చేరెను నడకల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ' అనే గురజాడ పుత్తడిబొమ్మ గీతాన్ని ఆ కోణంలోంచే అర్థం చేసుకోవాలి. కొద్దిమంది విషయంలో ఎడబాటు తీవ్రత ప్రాణత్యాగానికి సైతం పురిగొల్పుతుంది. భర్త మృతితో మంగళసూత్రాలతో పాటు ఆడంబరమైన వస్త్రాభరణాలను, కుంకుమధారణను చాలామంది స్త్రీలు విసర్జిస్తున్నారు. సన్యాసం కూడా మరణంతో సమానమన్నారు. బుద్ధుడి గురించి బేతవోలు వారి యశోధర 'దైవము వీడిపోయెను కదా' అని విలపిస్తుంది. 'ఇక ఈ గుడికేల మండనశ్రీ విభవంబులు... సువర్ణ దివ్యభూషావళి నీ చరణసన్నిధిని అర్పణ చేసికొందు... ప్రశాంతి సుగంధము భిక్షవేయరా...' అంటూ హృదయ విదారకంగా భర్తను బతిమాలుతుంది.
బూది, బూడిద, భస్మం, విభూతి... ఇవన్నీ సమానార్థకాలే. విభూతి అంటే ఐశ్వర్యం, సంపద అనే అర్థాలు ఉన్నాయి. ఇంతవరకూ అవి భస్మధారణకు వాడే విబూదికే అన్వయించేవి. ఇటీవల సంపద అనే అర్థం చితాభస్మానికీ వర్తిస్తోంది. అమెరికా, స్విట్జర్లాండ్, రష్యా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో నూతనంగా విస్తరిస్తున్న 'మరణానంతర సేవల రంగం'- కాదేదీ విపణికి అనర్హం అంటోంది. చితాభస్మం నుంచి విలువైన వజ్రాలు రూపొందిస్తున్నారు. గాలిలో కలిసిపోయే, నీటిలో కరిగిపోయే చిటికెడు చితాభస్మాన్ని శాశ్వతంగా నిలిచిపోయే ఫలకాలుగా మార్చి- కోరితే, సముద్రంలో అట్టడుగున భద్రపరచేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. వజ్రం కర్బనం నుంచి తయారవుతుందని మనకు తెలుసు. అలాగే బూడిదలోనూ కర్బనం ఉంటుంది. పొటాషియం, కాల్షియాలను వేరుచేసి బూడిదలో మిగిలిన కర్బనాన్ని పదిహేడువందల సెల్సియస్ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద గ్రాఫైట్‌గా మారుస్తున్నారు. తరవాత మరింత పీడనానికి గురిచేసి, కృత్రిమ వజ్రాలుగా మలుస్తారు. ఒక్కో వజ్రం తయారీకి అరకిలో బూడిద అవసరమవుతోందంటున్నారు. యూరోపియన్ జెమ్ పరిశోధనాలయాలు వాటి నాణ్యతను, విలువను సమర్ధిస్తున్నాయి. ఆ వజ్రాలను కంఠాభరణాల్లో పొదిగి మెడలో వేసేసరికి ప్రజలు ఏదో తెలియని భావోద్వేగాలకు గురవుతున్నారు. వాటి తాకిడిని తమను విడిచి వెళ్లిన ఆత్మీయుల సహజ స్పర్శగా భావిస్తున్నారు. కాలం ఎంత మారుతున్నా మనిషి కన్నీరు కార్చడం మరిచిపోలేదు. ఈ లోకంలో బెంగలు, ఆపేక్షలు, ఆత్మీయతలు, వియోగదుఃఖాలు ఇంకా కొంత మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా మరణం వంటి సున్నితమైన విషయంలో భావోద్వేగాలు ఎంతో సజీవంగా ఉన్నాయి. కాలి బూడిదైనా కనీసం ఆ మనిషి స్మృతికి ఒక శాశ్వతత్వం కల్పించాలన్న తపనకు నిదర్శనాలివన్నీ! మరణానికీ, స్మరణానికీ ఇవి 'విలువ' కల్పిస్తున్నాయి.
(ఈనాడు, 26:07:2008)
______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home