సంఘం చెక్కిన శిల్పాలు
తామెంతగానో ఆరాధించే కథానాయకుడు వెండితెరపై కళ్లబడగానే అభిమానులంతా ఉప్పొంగిపోతారు. ఊగిపోతారు. జేజేలు పలుకుతారు. అదే సమయంలో వారంతా ఒక ముఖ్యవిషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అందాల నటుడు ఎందరిదో శ్రమకు ఫలితంగా అంత అందంగా రూపొందాడు. తలదువ్వేవారు, తళుకులు అద్దేవారు, దిద్దితీర్చేవారు, నిగ్గుతెచ్చేవారు, మాటరాసేవారు, వెనక పలికేవారు... ఇలా ఎందరో నిర్విరామంగా కృషిచేస్తే- ఆ నటుడు తెరమీద మనకు కనువిందు చేస్తున్నాడు. మనిషి విషయంలో సమాజం పాత్రా అదే! ఒక మనిషి విజేతగా రాణించడం వెనక ఎందరిదో శ్రమ ఇమిడి ఉంటుంది. కని పెంచేవారు, విద్యనేర్పేవారు, బుద్ధిమప్పేవారు, వివేకం అలవరచేవారు, ఆలోచనలను అలవాట్లను ప్రభావితం చేసేవారు... ఇలా ఎందరో సాయపడితే- ఒక విజేత తయారవుతాడు. మనిషికి సమాజంనుంచి లభించే తోడ్పాటును సమీక్షిస్తూ, అరిస్టాటిల్ 'మనిషి సంఘజీవి' అని తీర్మానించాడు. ప్రతివ్యక్తికీ 'తాను ప్రేమ పొందాలి' అనే తపన ఉంటుంది. అంతేకాదు, 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని ఎవరో చెబితే వినాలనీ ఉంటుందన్నాడు ప్రముఖ రచయిత జార్జి ఇలియట్. 'నా కొరకు చెమ్మగిలు నయనమ్ములేదు...' అంటూ కవి వాపోవడం మనకు తెలుసు. తనచుట్టూ ఉన్న ప్రపంచంనుంచి మనిషి ప్రేమ, గుర్తింపు కోరుకుంటాడు. మనస్తత్వవేత్తలు దీన్ని అస్తిత్వ సంక్షోభం(ఐడెంటిటీ క్రైసిస్)లో భాగం అంటున్నారు. గుర్తింపుకోసం తపన, సమాజంతో అవసరాలు పునాదులుగా, మనిషికీ సంఘానికీ మధ్య సంబంధబాంధవ్యాలు నిర్మాణమవుతాయి. మనిషే సమాజానికి కేంద్రబిందువు. మనిషి వ్యక్తిత్వమే సమాజంలో అతని స్థానాన్ని నిర్దేశిస్తుంది. వ్యక్తిత్వం అంటే మరేంలేదు- 'ఆ మనిషి అలవాట్లన్నింటి కూడికే' అన్నాడు స్టీఫెన్‌కోవె. 'అలవాట్లలోంచే ఆ మనిషి వ్యక్తిత్వం తొంగిచూస్తుంది' అన్నాడాయన. బాల్యంలోని సావాసాలు, వయసులో తిరుగుళ్లు- మనిషి అలవాట్లుగా మారి, వ్యక్తిత్వంగా ప్రపంచానికి పరిచయమవుతాయి.
'ఏమిస్తావో అదే వస్తుంది' అనే సిద్ధాంతం- ప్రేమ, గుర్తింపుల విషయానికి బాగా అన్వయిస్తుంది. ప్రేమ ఇవ్వడమంటే- పక్కింటమ్మాయిని ప్రేమించడం కాదు. ఒకాయన 'భార్యే నా ప్రపంచం' అనేవాడు. ప్రపంచంపై కసి అంతటినీ నిత్యం భార్యమీద చూపించేవాడు. మనపక్కవాడు తన యోగక్షేమాలపట్ల మన ఆసక్తిని ఆశిస్తాడు. కష్టాల్లో మన సహానుభూతిని కోరతాడు. తనను చాలామంది పట్టించుకుంటున్నారన్నది- మనిషికి గొప్ప ఊరట. అలాంటి సందర్భాల్లో 'నీవు ఇచ్చిన- నీకు వచ్చును' అన్న సూత్రం వర్తిస్తుంది. ఎండ అనుకోకుండా పక్కింటావిడతో కిరాణాకొట్టుకు తోడువెళ్తే- పెద్దపిల్లను స్కూల్లో దింపడానికి వెళ్లినప్పుడు, మన ఇంట్లో చంటాణ్ని ఆవిడ చూసుకుంటుంది. తోటి ఉద్యోగికి ఒంట్లో బాగోలేనప్పుడు అతని పనిని కాస్త పంచుకుంటే- మన బండి పాడైనప్పుడు అతడు ఆదుకుంటాడు. వీధికుళాయి దగ్గర నీళ్లు పట్టుకోవడం దగ్గరనుంచి- ఇల్లు మారడాలు, పెళ్లిళ్లు వంటి పనులదాకా ఇరుగుపొరుగు ఒకరికొకరు సాయం చేసుకునే అలవాటు ఆ రకంగానే మొదలవుతుంది. సాయపడేటప్పుడు కొందరికి మనసులో ఇష్టంగా లేకపోయినా, పైకి నవ్వు నటిస్తూండవచ్చు. ఈ రకం ద్వంద్వ ప్రవృత్తినే లోపలిమనిషి(హైడ్), బయటిమనిషి(జెకిల్) లక్షణాలుగా మనస్తత్వవేత్తలు చెబుతారు. కొన్నాళ్లకు వారుచేసిన సాయం కారణంగా కాకుండా- మంచితనాన్ని గుర్తించినందువల్ల, తెలియకుండానే మనలో వారిపట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అది మనలో మార్పుతెస్తుంది. సాయం లేదా మంచి చెయ్యడం మనకీ అలవాటుగా మారుతుంది. క్రమంగా అది మన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందుతుంది. మనం 'సంఘం చెక్కిన శిల్పాలం' అవుతాం. సమాజాలు బాగుపడేది ఈ రకంగానే! తమదగ్గరలేని గొప్ప గుణాలను తెరవేల్పుల్లో చూసి ఈలలువేసే అభిమానులు స్వయంగా తామే కథానాయకులయ్యేది- ఈ సమాజాల్లోంచే. అలాంటివాణ్ని 'ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు' అంటారు.
చెట్టు చాటున నిలిచి తనను బాణంతో పడగొట్టిన రాముణ్ని జుగుప్సగా చూశాడు వాలి. 'రేపు సభ్యసమాజం నిన్ను నిలదీస్తే- ఈ పాపకార్యానికి ఏం జవాబు చెబుతావు' అని అడిగాడు. అంటే మనిషి తప్పుచేస్తే సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. సత్పురుషులతో కూడిన సంఘాలు సభ్యుల చెడు నడతను నిలదీస్తాయి. వ్యక్తిత్వాలను సరిజేస్తాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులను పిలిచి భార్య నట్టింట్లో పేరంటం పెడితే, పడగ్గదిలో మందుకొట్టడాన్ని భర్త వాయిదావేయక తప్పదు. మంచిని చూసినప్పుడు చెడు జంకుతుంది. వెనకంజ వేస్తుంది. ఇరుగూపొరుగూ గౌరవనేయులైతే, మధ్యవాడు మంచివాడవడానికి చాలా అవకాశం ఉంది. అంతేకాదు, నలుగురితో కలివిడిగా ఉండేవారికి ఆరోగ్యం బాగా ఉంటుందని మిచిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అనాడియెజ్ రూక్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అలాంటివారికి రక్తపోటు చాలా తక్కువస్థాయిలో ఉందని ఆయన పరిశోధనలో తేలింది. కలిసిమెలసి జీవించే స్వభావం మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని, గుండెజబ్బుల ప్రమాదం తగ్గిస్తుందని- ఆయన నిరూపించారు. నలుగురితో కలిసిపోయేవారిలో వ్యాయామాలు చెయ్యడం, నడకకు వెళ్లడం వంటి మంచి అలవాట్లు పెరుగుతున్నాయని, వారిలో నేరస్వభావం తగ్గుతోందని డాక్టర్ రూక్స్ గుర్తించారు. ఒంటరివాళ్లకన్నా- ఇరుగుపొరుగులతో జతకలిపి బతికేవాళ్లు 'ఆరోగ్య భాగ్యవంతులు' అని తేలింది. 'మీరు మా పక్కింట్లోంచి మారిపోయాక మాకు మంచి పొరుగు లభించిందొదినా' అని ఈవిడా, 'మాకూ అంతే... పీడ విరగడ అయినట్లుంది' అని ఆవిడా దెప్పుకొనేట్లు కాకుండా- ప్రేమాభిమానాల వాయనాల్ని ఇరుగుపొరుగులతో ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంది సహజీవన సౌందర్యం!
(ఈనాడు, సంపాదకీయం,03:08:2008)
_____________________________
Labels: Self development, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home