గట్టిమేల్ తలపెట్టవోయ్!
అమ్మభాషకేల దుర్గతి?
- డాక్టర్ తూమాటి సంజీవరావు
'జనని సంస్కృతంబు సకల భాషలకు' అంటే నేడు మండిపడేవారు తెలుగువారు. ఈ విషయంలో అభిప్రాయ భేదాలుండవచ్చు. సంస్కృత సాహాయ్యంవల్ల తెలుగు భాష భ్రష్టుపట్టిందని వీరి అభిమతం. ఈ కోణంలో ఒక అర్ధ శతాబ్దికాలంగా సమాజంలో అభిప్రాయం బలపడింది. ఫలితంగా- సంస్కృత జ్ఞానంలేని తరం ఒకటి తయారై, దానిని ద్వేషించడం మొదలయింది. ఆపై పరిస్థితులు మారాయి. సంస్కృత జ్ఞానం లేకపోవటం వలన మనం నష్టపోతున్నాం అనే జ్ఞానోదయం కొంతమందికి కలిగింది, మరి కొంతమందికి కలుగుతూ ఉంది. మన విద్యా విధానంలో ఇప్పుడు భారతీయ భాషలకంటే ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఎక్కువైంది. అయినా, విద్యార్థులు తెలుగుకంటే సంస్కృత భాషను చదివితేనే పరీక్షల్లో మార్కులు ఎక్కువగా ఇస్తారనే భావంతో, దానిని అభ్యసించడమూ ఎక్కువయింది. ఫలితం- సంస్కృత భాషా బోధన పెరిగింది. ఇటువంటి సంస్కృత భాషను మన విద్యారంగంలో 'క్లాసికల్' భాషగా పరిగణిస్తున్నాం.
మనం మరచిన మాతృభాష
సంస్కృత భాషను సుసంపన్నం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం వారు- అప్పటి మానవ వనరుల శాఖామాత్యులు ప్రత్యేక నిధులను సమకూర్చటంతో ఒక ప్రణాళికాబద్ధంగా దాని అభివృద్ధిని చేపట్టారు. ఆ సమయంలో డీఎంకే వారు ఆ కూటమిలో భాగస్వాములే. వారికి గల భాషాప్రేమ చాలా ఎక్కువ. ద్రావిడ పార్టీల వారికందరికి తమిళభాష మాత్రమే ద్రావిడ సంస్కృతికి మూలమనే విశ్వాసం. సంస్కృత భాషను 'వడమొళి' (ఉత్తరాది భాష)గా పరిగణిస్తారు. వారు తమ భాషపై సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావాలను మందులాగా వాడుకొంటున్నారు. సంస్కృత భాషా ప్రాచుర్య విషయంలో వారికి ఇబ్బంది లేకున్నా, తమ భాషకు కూడా అటువంటి ప్రత్యేక నిధులను సమకూర్చుకొనటంలో కృతకృత్యులు అప్పట్లో కాలేకపోయినా, యూపీఏ కూటమి అవతరణ సమయంలోనే, తమ మద్దతును కోరే కాంగ్రెస్ పార్టీ దగ్గర సెమ్మొళి అంతస్తును ఇచ్చేలా నియమం ఏర్పరచుకుని, ఆపైనే కూటమిలో చేరారు. ఫలితంగా యూపీఏ అధికారం చేపట్టిన తరవాత తమిళ భాషకు క్లాసికల్ భాష (సెమ్మొళి) హోదాను సాధించుకున్నారు. ఏ రాజకీయ పక్షం వారు పోరాడకపోయినా, సంస్కృత భాషకు క్లాసికల్ అంతస్తు లభించింది. తమిళానికి రాజకీయ ఒత్తిడివల్ల ఆ పని జరిగింది.
'అంధాన్ రాతి ఇతి-ఆంధ్రః, ఆంధ్రః ఏవ ఆంధ్రః' అని ఆంధ్ర శబ్దవ్యుత్పత్తిని చెప్పే అలవాటు కూడా ఉంది. అంటే గుడ్డివాళ్లకు కూడా ప్రకాశాన్ని తెలియజేసేవాళ్లు తెలుగువాళ్లని అభివర్ణించుకుంటాము. కానీ, క్లాసికల్ (సెమ్మొళి) అంతస్తు విషయంలో మనం గుడ్డివాళ్లగానే మిగిలిపోయాం. తమిళానికి ఇచ్చేవరకు నిద్రపోయాం, ఆపై మేల్కొన్నాం! దాదాపు నాలుగేళ్లనుంచి రకరకాలుగా పోరాడుతున్నా, పరిస్థితి మాత్రం 'ఎక్కడ వేసిన గొంగడి' అక్కడే అన్నట్టు ఉంది. 'క్లాసికల్' పదానికి తెలుగు అనువాదంగా- శ్రేష్ఠ, విశిష్ట, ప్రాచీన పదాలను మనవాళ్లు వాడుతున్నారు. ఇవన్నీ పర్యాయార్థకాలే అయినా, సరియైన పదానువాదం ఇంతవరకు చేసుకోలేకపోయాం. తమిళులు 'సెమ్మొళి' అని ఒక పదాన్ని వాడుతున్నారు. తమిళ సాహిత్యం సంగ కాలానికే ప్రారంభమయింది. 'తొల్కాప్పియ' వ్యాకరణ గ్రంథం క్రీస్తుపూర్వం తయారయింది. వారి 'తిరుక్కురళ్' ద్రవిడవేదమట. అలాగే ఆరాధిస్తారు. వారి ప్రాచీన గ్రంథాలు 'మణిమేగలై', 'శిలప్పదికారం' వంటివి వారికి తలమానికాలు. ఇటువంటి ప్రాచీన సాహిత్యాన్ని చూపి, వారు తమ భాషను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు సాహిత్యం పుట్టుక నన్నయతోనని మనవాళ్ల సంరంభం. మొదటి తెలుగు వ్యాకరణం నన్నయ్య కృతం- ఆంధ్ర శబ్ద చింతామణి. సంస్కృత భాషలోనే అదికూడా విరచితం. దానికి వచ్చిన వ్యాఖ్యానాలు కూడా సంస్కృత భాషలో రాసినవే. తెలుగు భాషలో తెలుగుభాషకు గాను చిన్నయసూరి రాసిన వ్యాకరణమే 'బాల వ్యాకరణము'. దానికిగల పూరణమే ప్రౌఢవ్యాకరణము. చిన్నయ వ్యాకరణం అసమగ్రమని 1926లో మల్లాది సూర్యనారాయణ శాస్త్రి 'ఆంధ్ర భాషానుశాసనము' పేరిట ఒక వ్యాకరణ గ్రంథం రచించారు. 1958లో వాంగ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్య 'వ్యావహారిక భాషా వ్యాకరణం' వెలువరించారు. ఇవి తెలుగులో గల మౌలిక వ్యాకరణాలు. తెలుగు సాహిత్యమంతా అనువాదమని మన ఆధునికులు ప్రచారం చేసి, మహాపరాధం చేశారు భాషకు. అనువాదంవేరు. అనుసృజన వేరు. మన కవులు సంస్కృత వాంగ్మయాన్ని మదించి, అందలి విషయాన్ని తమదైన బాణీలో రచించారు. కాబట్టి అపోహలను వీడి, అనుసృజన ఎంతటి గొప్ప విషయమో తెలుసుకోవాలి. మచ్చుకు ఒక ఉదాహరణను గమనించండి. 'శృంగార నైషధం'లో శ్రీనాధుడు ఒకచోట 'వనజదళ నేత్ర! విహరింతు, శృంగార వనములోన' అంటాడు. ఇక్కడ 'వనజదళనేత్ర' శబ్దంలోని 'వన' పదానికి నీళ్లు అని, 'శృంగార వనములోన' అనే చోటగల 'వన' పదానికి అడవి, తోట అని అర్థం. ఒకే పద్యపాదంలో విరుద్ధార్థాలు కలిగిన 'వన' శబ్దాన్ని వాడిన విధం మన తెలుగు కవికే సాధ్యమైంది. ఇటువంటి అంశాలను వెలికితీసి మన భాషా ఔన్నత్యాన్ని లోకానికి తెలియజేయాలి. అది ప్రస్తుతం ఉద్యమంలో ఎంతవరకు స్థానాన్ని పొందిందో చెప్పలేము.
నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాధ, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, చేమకూర వేంకటకవితోపాటు నాచన సోమన, మొల్ల, భాస్కరుడు, ముద్దుపళని వంటి కవులు, కవయిత్రులు వెలయించిన సాహిత్యం సంస్కృత జన్యమైనా, అనుసృజనాత్మకం అనే విషయం మరువకూడదు. సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావంతోపాటు, తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్న భాష మన తెలుగు. నన్నయ నాటికే ఛందస్సుందరత్వం కనబడుతుంది. సంస్కృత వృత్తాలతోపాటు దేశీయ ఛందస్సులోని కంద, సీస, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కర వంటివి సుప్రయుక్తాలు. ప్రత్యేక సారస్వతాన్ని తెలుగులో అప్పకవి అందించాడు. పద్య, గద్య, చంపూ నాటకాది సంస్కృత ప్రక్రియలను పుణికి పుచ్చుకున్న మన తెలుగువారు వాటితో మాత్రమే సంతృప్తి చెందలేదు. విప్లవ కవిత్వం, భావకవిత్వం, దిగంబర కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నవల, కథలు, కథానికలు, గేయాలు, నానీలు, ప్రక్రియలతోపాటు స్త్రీవాద, దళితవాద, మైనారిటీ వాద సాహిత్యం కూడా వెలుగు చూసింది. తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన విశిష్ట ప్రక్రియ అవధాన ప్రక్రియ. అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచసహస్రావధాన పర్యంతం ఎదిగింది. నేత్ర, నాట్యావధానాలు కూడా సుప్రసిద్ధాలు. ద్వ్యర్థి, త్య్రర్థి, చాతురర్థికాలతోపాటు శతార్థక కావ్యాలు వెలిశాయి. తెలుగువారి శతక సాహిత్య ప్రక్రియ వైశిష్ట్యం కలది. చిన్నవారిని, పెద్దవారిని కూడా ఆకట్టుకోగలది శతకం మాత్రమే. 'ఉదాహరణ ప్రక్రియ'ను గుర్తుపెట్టుకున్నవారు చాలా అరుదు. మన వాగ్గేయ సాహిత్యం త్యాగరాజుతో మొదలయి ముమ్మూర్తులతో విరాజిల్లింది. త్యాగరాజు నేటి తమిళనాడు ప్రాంతంలోనివారని కొట్టి పారేస్తారేమో! రాయలసీమలోని అన్నమయ్య, తెలంగాణలోని రామదాసు, కోస్తాలోని క్షేత్రయ్యలను తీసి పారేవేయలేం కదా! త్రిలింగదేశం వారే కదా ఈ మువ్వురు! ఇంతటి విలువైన సాహిత్య సంపదను ఉట్టంకించకుండా, పెంకులు, రాళ్లు, రప్పలమీద పరిశోధనచేసి, గీతలను ఆధారంగా చేసుకుని ప్రాచీన భాషాస్థాయి కావాలంటే వస్తుందా!
'నేటి తెలుగు భాషను కాపాడండి. నేడు తెలుగు భాషను కాపాడండి' అనే వేదన, ఆవేదనను వెలిబుచ్చుతున్నవారున్నారు. వ్యవహారిక, గ్రాంధిక రూపాలలో భాషను చూస్తున్నాం. రూపాలు వేరైనా, సమస్యల జోలికి పోలేదు. పరిష్కారాల ఊసేలేదు. తెలుగు భాషకు గల ప్రత్యేకాక్షరాలైన అరసున్న, ఱ (బండి ర) చ, జ(దంత్య చకార, జకారాలను)ను వదులుకున్నాం. నేడు అక్షరాల సంఖ్య ప్రశ్నార్థకం!
తెలుగు నేతలు ఆలోచిస్తున్నారా?
తెలుగు అకాడమీ లక్ష్యాల్లో మూడోది: 'తెలుగు భాషను ఆధునీకరించి (ఆధునికీకరించి) సుసంపన్నం చేసే కృషిలో భాగంగా ప్రమాణీకరించడం, పరిశోధనలు నిర్వహించడం.' అయితే అందుకు పరిస్థితి నేడు భిన్నంగా ఉంది. ఆ సంస్థ సంచాలకుల మాటల్లో చెప్పాలంటే 'సిబ్బంది కొరత. దీనివలన భాషా సమీక్ష, పరిశోధన వంటి అకాడమీ మౌలిక ఆశయాలు కుంటుపడుతున్నాయి.' ఈ వాస్తవాన్ని గమనించండి. సముచిత రీతిలో స్పందించండి. అధికార భాషా సంఘాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆరోపణ ఉంది. తెలుగు అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఏటా వచ్చే మొత్తం ఆరులక్షల రూపాయలు మాత్రమే. ఈ మొత్తాన్ని జీతాలకోసం ఇస్తారు. ఇది విద్యుత్ ఛార్జీలకు కూడా చాలదు. హిందీ అకాడమీకి మనరాష్ట్ర ప్రభుత్వం 48లక్షల రూపాయలు ఇస్తుంది. ఇంతకంటే ఘనమైన విషయం- ఉర్దూ అకాడమీకి మూడు కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు గల ప్రాధాన్యమిదీ! తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి పరిస్థితిని కల్పిస్తే, రాష్ట్రేతరాంధ్రుల స్థితిగతులు ఇంక ఎలా ఉంటాయో గమనించగలరు! కరుణానిధి తమిళ భాషా సాహిత్యాలలో దిట్ట. 'తొల్కాప్పియ వ్యాకరణ గ్రంథానికి 15 ఏళ్ల క్రితమే వ్యాఖ్యానం వెలయించారు. అది ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయింది. ఆయన రచనలను చైనా భాషలోకి కూడా తర్జుమా చేయిస్తున్నారు. ప్రపంచ జనాభాలో మొదటి స్థానాన్ని వహించిన చైనీయులకు కూడా తమ సాహిత్యం అందుబాటులో ఉండాలనే కోరిక తమిళులది. ఇది వారి అనువాద శక్తియుక్తులకు సాక్షాత్కారం. కరుణానిధి ఇటీవల 'సెమ్మొళి' సంస్థకు తమ సొంతపైకం ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. భాషా సాహిత్యాలకోసం వారి దాతృత్వం మన తెలుగు(నే)తలలో ఉందా! పార్టీల విషయం మరవండి. తెలుగుకోసం ఆలోచించండి!!
(ఈనాడు,03:08:2008)
__________________________
Labels: Telugu language
2 Comments:
అర సున్న( ఎక్కడ వాడతారు...
ఱ, ర ల మద్య తేడా ఏమిటి...
డా||తూమాటి సంజీవరావు గారి ఫోన్ నంబర్ ఎవరికైనా తెలుసా
3:58 pm
http://wowmusings.blogspot.com/2006/10/blog-post.html
(ఈ బ్లాగులోనే 04:.10:2006 posting- "అరసున్న [ ( ], బండి ' ఱ 'లు ఎందుకు?") చూడండి.
డా||తూమాటి సంజీవరావు గారి ఫోన్ నంబర్, ఈనాడు పత్రికా కార్యాలయాన్ని సంప్రదిస్తే తెలుస్తుందేమో!
11:51 am
Post a Comment
<< Home