మరపురాని ఆత్మీయవాణి
రేడియో అక్కయ్య శతజయంతి
- కేశవ
తమ్ముడి సంసారాన్ని బాగుచేసి, అతడి కుటుంబాన్ని నిలబెట్టి తెలుగువారి పలుకుబడిగా నిలిచింది నిగమశర్మ అక్క. ఆమె ఓ ప్రబంధ పాత్ర. ఆంధ్రదేశంలోని తమ్ముళ్లూ, చెల్లెళ్లూ, పిల్లలూ అందరూ బాగుండాలని; ఉత్తమ పౌరులుగా ఎదగాలని నిర్విరామ కృషి చేసి ప్రజల హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించినవారు రేడియో అక్కయ్య. యాభైయవ దశకం మొదలు తెలుగువారి విలువల్నీ, వికాసాన్నీ ప్రభావితం చేసేలా ఎదిగిన రేడియో మాధ్యమం ద్వారా ఆంధ్రులతో ఆత్మీయ బంధాన్ని పెనవేసుకున్న అక్కయ్యకు మొత్తంగా ఒక తరానికే సంస్కారాన్ని అద్దిన ఘనత ఉంది. రేడియో ఉజ్వలంగా వెలుగొందుతున్న కాలంలో చిట్టి తమ్ముళ్లు, చిన్ని చెల్లాయిల్లో నైతిక సామాజిక అంశాలపట్ల జిజ్ఞాసను రగిల్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నత బాధ్యతను తలకెత్తుకున్న ఆంధ్రుల ప్రియమైన అక్కయ్య అసలు పేరు న్యాయపతి కామేశ్వరి. విజయనగరం మహారాజ కళాశాలనుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా విశిష్టతను సంతరించుకోవడం మొదలు- సర్వజనామోదమైన పాటలు, నాటికలు, వ్యాసాలను రాయడం; రేడియో ద్వారా లక్షలమంది జీవితాలను ప్రభావితం చేయడం వరకూ ఆమెది విలక్షణ పంథా. తెలుగునేల జ్ఞాపకాల పొరల్లో నిరంతరం తాజాగా గుబాళించే రేడియో అక్కయ్య శత జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా- ఆ ధీమణి సామాజిక స్పృహ, ఆదర్శాలను స్మరించుకోవడం ఎంతైనా స్ఫూర్తిదాయకం.
'రారండోయ్! రారండోయ్! పిల్లల్లారా రారండోయ్' అంటూ వినిపించగానే చిన్నాపెద్దా అంతా రేడియో సెట్లముందు అక్కయ్య కబుర్లకోసం ఎదురుచూడటం తెలుగువారికో వ్యసనం. పొద్దుటి కాఫీ కప్పులా, భూమ్మీద విస్తరించే సూర్యకిరణంలా శ్రోతను పలకరించే అక్కయ్య మాటకున్న మహత్తు అంతటిది. పిల్లలందరినీ ఆప్యాయంగా చుట్టూ కూర్చోపెట్టుకొని అక్కయ్య కథ చెప్పే తీరు అనితరసాధ్యం. ఆమె ప్రతి కార్యక్రమంలో ఓ జీవితకాలానికి సరిపడా అనుభవాలు, అనుభూతులు పొంగిపొర్లేవి. ప్రతి మాటతో పిల్లలకు కొత్త జగత్తు పరిచయమయ్యేది. స్కూల్లో లెక్కల మాష్టారు రానప్పుడు బోర్డుమీద లెక్కలు రాసి వివరించే బాధ్యతను ప్రధానోపాధ్యాయుడు 'అక్కయ్య'కు అప్పగించిన క్షణంనుంచే- శ్రోతలను తన మాటకు కట్టిపడేసుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. మద్రాసు లేడీ విల్లింగ్టన్ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకొని- జాతీయ బాలికల పాఠశాలలో కొంతకాలం టీచర్‌గా పనిచేసిన అక్కయ్య అక్కడ తెలుగు మాధ్యమానికి అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 'రేడియో అన్నయ్య'గా ప్రసిద్ధులైన భర్త న్యాయపతి రాఘవరావుతో కలిసి 1945లో మద్రాసులో 'బాల' అనే బొమ్మల మాసపత్రికను ప్రారంభించడం ఆమె భాషాభిమానానికి, ఉద్యమస్ఫూర్తికి నిదర్శనం. ఆ పత్రికలో 'అక్కతో అయిదు నిమిషాలు' పేరిట పిల్లలతో ముచ్చటించి వారి సందేహాలను తీర్చేందుకు ఓ శీర్షికను ప్రవేశపెట్టారు. మరోవంక ఆకాశవాణిలో 'ఆటవిడుపు' పేరుతో పిల్లల కార్యక్రమ నిర్వహణ చేపట్టగానే ఆమె తెలుగువారి అక్కయ్యగా స్థిరపడిపోయారు. పిల్లలకు, సామాన్య మహిళలకు అవకాశాలిచ్చి, వారిలో చైతన్యం నింపి వెలుగులోకి తీసుకురావడం అక్కయ్య స్ఫూర్తిదాయక వ్యక్తిత్వానికే దర్పణం పడుతోంది. మణిమంజరి, రంగవల్లి, మహిళా సమాజం కార్యక్రమాల ద్వారా ఆంధ్రదేశంలోని ప్రతిభగల మహిళా సంఘాల సభ్యులెందరికో అవకాశాలిచ్చి వారి ఉన్నతికి అక్కయ్య నిజాయతీగా కృషిచేశారు. రేడియోలో ప్రసారమయ్యే స్త్రీల కార్యక్రమాలు వారి వ్యక్తిత్వానికి, ప్రత్యేకతకు ప్రతీకగా నిలవాలని అహరహం శ్రమించిన అక్కయ్య- గ్రామీణ అతివల వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా 50 మహిళా సంఘాలనూ ప్రారంభించారు. స్త్రీలకు సొంత గొంతుకనివ్వడంకోసం, వారి అవగాహన స్థాయులను పెంచడంకోసం మొదలైన ఈ సంఘాలను స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కయ్య స్ఫూర్తినింపేవారు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ధన, కనక, వస్తు, వాహనాలను తెగనమ్మి 'రేడియో మహిళా సంస్థలు' దేశ రక్షణ నిధికి విరాళాలను ప్రకటించిన తీరు- అక్కయ్య స్ఫూర్తిదాయక నేతృత్వానికి ఓ దృష్టాంతంగా మిగిలిపోతుంది.
'అన్యాయాన్ని నిరసిస్తే సరిపోదు. దానికి వ్యతిరేకంగా పోరాడగలిగినప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది'- విక్టర్ హ్యూగో ప్రఖ్యాత నవల 'లె మిసరబుల్స్'లో ఓ పాత్ర పలికిన మాటలివి. రేడియో ద్వారా మహిళల, పిల్లల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని శ్రమించడంతో సరిపెట్టకుండా- స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగి భర్తతో కలిసి బాలానంద సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను కేవలం 'మాటల మనిషి'ని కాదని అక్కయ్య నిరూపించుకున్నారు. పిల్లలకు విద్యా, విజ్ఞాన, వినోద విషయాల్లో తర్ఫీదునిచ్చే ఉన్నతాశయంతో ఏర్పాటైన 'బాలానంద సంఘం' ఉద్యమస్థాయిలో విస్తరించింది. కార్యక్రమాలు పెరిగిన కారణంగా కొత్త భవనంలోకి మారాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు నిధుల కొరత పీడిస్తోంది. ఆ సమయంలో తమ నివాస భవనాన్ని 'బాలానందా'నికి అప్పగించి అక్కయ్య అద్దెఇంట్లోకి మారిపోయిన ఘటన ఆమె త్యాగనిరతికి తార్కాణం. నేటికీ హైదరాబాదులోని అదే భవనంలో బాలానంద సంఘ కార్యకలాపాలు హుషారుగా జరుగుతున్నాయి. చేసేపనిపట్ల అవ్యాజప్రేమ, మనుషులపట్ల సహృదయత, సమస్యలపట్ల నిజాయతీ ఉంటే- వ్యక్తులే ఉద్యమాలకు మారుపేరుగా మారతారు. జనహర్షంగా వ్యవస్థలను తీర్చిదిద్దుతారు. అక్కయ్య చేతులమీదుగా ఎదిగివచ్చిన బాలానంద సంఘాలు, మహిళా మండళ్లు రాష్ట్రవ్యాప్తంగా నేడు ఉద్యమ స్ఫూర్తితో విస్తరిస్తుండటమే అందుకు తార్కాణం. అగ్నికి వేయి నాలుకలు, వాయువుకు వేయి చేతులు ఉంటాయని అమ్మమ్మలు చెబుతుంటారు. కానీ మహిళ, శిశుసంక్షేమం కోసం అహరహం శ్రమించిన రేడియో అక్కయ్యకు మాత్రం- తెలుగునేల నలు చెరగులా ఎందరెందరో ప్రియమైన తమ్ముళ్లూ... చెల్లెళ్లూ.
(Eenadu, 24:12:2008)
__________________________
Labels: Personality
0 Comments:
Post a Comment
<< Home