రస సిద్ధుడికి రాజమకుటం

సంత్‌హరిదాస్ మధురగాయకుడని విన్నాడు అక్బర్ పాదుషా. తన దర్బారుకు పిలిపించి ఆయనను ఘనంగా సత్కరించాలనుకున్నాడు. 'రాజుల కొలువుకు మా గురువులు రారు' అన్నాడు ఆస్థాన విద్వాంసుడు తాన్‌సేన్. చేసేదేంలేక పాదుషా రహస్యంగా వెళ్ళి, గుళ్ళో గానం చేస్తున్న హరిదాస్ పాట విన్నాడు. ఆయన గొంతులోని అతిలోక మాధుర్యాన్ని గ్రహించి ఆశ్చర్యచకితుడయ్యాడు. శ్రవణేంద్రియాలను దాటివెళ్ళి, ఎక్కడో ఆత్మలో తేజస్సును నింపుతున్న దివ్య ప్రకంపనలకు ముగ్ధుడయ్యాడు. అనాహత నాదం ఒక యోగి శరీరంలో సృష్టించే స్పందనల అనుభూతిని అక్బర్ ఆస్వాదించాడు. 'నీవు వారి శిష్యుడివేగా! అంతటి లోకోత్తర మాధుర్యం మరి నీనుంచి మాకెందుకు అనుభూతం కావడంలేదు?' అని తాన్‌సేన్‌ని ప్రశ్నించాడు. పదేపదే రాజు అడిగేసరికి తాన్‌సేన్ సన్నని ఎలుగుతో 'మన్నించాలి జహాపనా! నేను పాడుతున్నది ఢిల్లీశ్వరుడి కోసం, మా గురుదేవులు పాడేది జగదీశ్వరుడి కోసం!' అన్నాడు. తాన్‌సేన్ వంటి గొప్ప గాయకుడి మాటలు అర్థమైతే త్యాగరాజకృతి '...మమత బంధనయుత నరస్తుతి సుఖమో, సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమో!' లోని యథార్థం బోధపడుతుంది. తాన్‌సేన్ మొగలాయీ రాచకొలువులోని గాయకుడు. సంత్‌హరిదాస్ జగదీశ్వరుడి దర్బార్‌లో ఆస్థాన గాయకుడు. అదీ తేడా! 'ఈ పేద దేశంలో లేని ఎన్నో సౌకర్యాలు కల్పిస్తాం, మా దేశానికి తరలి రండి' అని షెహనాయీ విద్వాంసుడు బిస్మిల్లాఖాన్‌ను పాశ్చాత్యులు ప్రలోభపెట్టారు. అంతా విని, ఆయన 'నా జీవితం ఈ పవిత్ర నదితో ముడిపడి ఉంది. మరి ఈ గంగామాయీని ఎలా తరలిస్తారు?' అని అడిగాడు. భారతీయ రససిద్ధుల సంస్కార విశేషం ఆ రకంగా ఉంటుంది.
ప్రభువులు గతించారు... ఆస్థానాలు అంతరించాయి... ఈ దేశపు పాండిత్యమూ రసజ్ఞతా మాత్రం ఇంకిపోలేదు. 'సుకవి జీవించె ప్రజల నాల్కలపై' అని మహాకవి అన్నట్లుగా విద్వాంసులు రసోపాసన కొనసాగిస్తూ ప్రజల హృదయాల్లో స్థిరపడ్డారు. ప్రజాప్రభుత్వాల నుంచి సత్కారాలు అందుకుంటున్నారు. ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర సత్కారం 'భారతరత్న' మరోసారి రససిద్ధుణ్ని వరించింది. ఏడేళ్ళక్రితం బిస్మిల్లాఖాన్‌కు దక్కిన ఈ అపురూప సత్కారం ఈసారి ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ భీమ్‌సేన్ జోషీకి ప్రకటించారు. భారతీయ శాస్త్రీయ సంగీత పునరుజ్జీవన మహా ఉద్యమానికి నాయకత్వం వహించి, హిందుస్థానీ ఘరానా సంప్రదాయపు గిరిశ్రేణిలో గౌరీశంకర శిఖరం అనిపించుకున్న పండిట్ జోషీ- దీనితో మకుటం కూడా దక్కిన మహారాజయ్యారు. 'ఈ సంప్రదాయానికి చెందిన విద్వాంసులందరి పక్షాన దీన్ని అంగీకరిస్తాను' అని ఆయన హుందాగా ప్రకటించారు. 'బిరుదులను సామాన్యులు భరిస్తారు- మాన్యులు ధరిస్తారు' అన్న ముళ్ళపూడి మాటలను గుర్తుతెచ్చారు. దండలకోసం ఒంటెమాదిరి మెడ ముందుకు చాచుకుని కూర్చునే బాపతు కాకపోవడంతో జోషీకి ఎనభైఆరేళ్లు వచ్చేదాకా ఈ అవార్డు దక్కలేదు. వృద్ధాప్యం వచ్చాక డాక్టరేట్ అందుకుంటూ దాశరథి- 'దూర్ సే ఆయీ, దేర్ సే ఆయీ... ఫిర్‌భి ఆయీ సుహాగ్ కి రాత్' అన్న మాట గుర్తొస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతను ప్రకటించినందుకు, రసజ్ఞతను నిరూపించినందుకు మనం సంతోషించాలి. ఇటీవల జాతీయ గీతంతో సమానంగా ప్రజాదరణ పొందిన 'మిలే సుర్ మేరా తుమ్హారా' గీతంలో ప్రముఖులతో గొంతు కలిపి పండిట్ జోషీ చేసిన ఆలాపన 'ఖంగుమని మా చెవులు మారుమ్రోగేదాకా...' వింటామని రసజ్ఞులు జేజేలు పలికే సందర్భమిది. భారతీయ సంప్రదాయ సంగీతానికి దక్కిన ఈ గౌరవం గంధర్వ విద్యకు గర్వకారణం!
(Eenadu, 09:11:2008)
__________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home