భారత్‌కీ మా.. నిర్మలమ్మ!

* బందరు బంధం:
బందరులో పుట్టిపెరిగిన నిర్మలమ్మకు చిన్నప్పటి నుంచి చదువులు అబ్బలేదుగానీ నాటకాలంటే పిచ్చి. బందరుకు పగటివేషగాళ్లొచ్చినా, భోగం మేళం వచ్చినా అందరికన్నా ముందుగా పరుగులు తీసేది. చిన్నతనంలో తోటివారిని కూడబెట్టుకుని తనే చిన్న నాటకాలను రచించి అందరి చేతా వేయించి ప్రధాన పాత్రధారిగా మిగిలేది. 19వ ఏట జి.వి.కృష్ణారావుతో పెళ్లి ఖాయమైనా నాటకాలు వేయనిస్తేనే పెళ్లి అని వాగ్దానం తీసుకుని మరీ మూడుముళ్లు వేయించుకుంది.
* పృథ్విరాజ్ మాట:
కాకినాడలో 'కరవురోజులు' నాటకంలో ఈమె పాత్రను చూసిన పృథ్విరాజ్‌కపూర్ 'గొప్ప నటివవుతావు' అని చెప్పారట. ఆ సంఘటనని చాలా సందర్భాల్లో గుర్తుచేసుకునేది నిర్మలమ్మ. అప్పట్లో 'ఏకవీర' నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసి విశ్వనాథ సత్యనారాయణగారు 'పిచ్చి మొద్దూ నీలో ఇంత నటన ఉందనుకోలేదు' అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
* రేడియో నిర్మలమ్మ:
నాటకాలతో మెప్పుపొందాలని ప్రయత్నించిన నిర్మలమ్మకు విజయవాడ రేడియో స్టేషన్ ప్రోగ్రామ్స్ వూరటనిచ్చాయి. ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాల గురించి ముందుగానే ప్రకటనలిచ్చేవారట. నిర్మలమ్మ కార్యక్రమాల కోసం ప్రత్యేక శ్రోతలు ఉండేవారు. ముఖ్యంగా 'చిత్రాంగి' ఏకపాత్రాభినయం కోసం!
* హిందీ రాదే:
నిర్మలమ్మ 'ఆడపెత్తనం'లో హీరోయిన్‌గా చేయాల్సింది. కానీ మిస్సయింది. తరవాత ఆమె 'గరుడ గర్వభంగం'లో చేసింది. కానీ నటిగా పేరు తెచ్చింది మాత్రం 'మనుషులు మారాలి'. ఆ సినిమా శతదినోత్సవ వేడుకకు వెళ్లిన నటుడు ప్రాణ్ నిర్మలమ్మ కాళ్లకు నమస్కారం చేసి 'నువ్వు శోభన్‌బాబుకు మాత్రం కాదు. భారత్‌కీ మా' అని అన్నారట. అప్పుడు అతనితో నాలుగు మాటలు హిందీలో మాట్లాడలేకపోయానని అంటుండేది నిర్మలమ్మ.
* బాధపడ్డ క్షణాలు:
జీవితంలో హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి. దగ్గర పనిచేయలేకపోయామేనన్న బాధ నిర్మలమ్మకు బాగా ఉండేది. రఘుపతి వెంకయ్య అవార్డులు వంటివి తమలాంటి వారికి అందట్లేదని ఆమె అవసాన దశలో చాలా బాధపడేవారు.

* షూటింగ్ గ్యాప్‌లో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందుకే అందరం నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-అక్కినేని నాగేశ్వరరావు, సినీ నటుడు
* నటనకు నూతన భాష్యం చెప్పిన నిర్మలమ్మ కన్నుమూత దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రతి పాత్రలోనూ ఆమె పరకాయ ప్రవేశం చేసేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి
-చిరంజీవి, ప్రరాప అధినేత
* అందరినీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలుకరించే నిర్మలమ్మ ఇకలేరన్న విషయం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాం.
-మూవీ ఆర్ట్సిస్ట్ ఆసోసియేషన్
* తెలుగు పరిశ్రమకు పెద్దదిక్కు. పదహారణాల తెలుగు బామ్మ ఇకలేరు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం.
- తమ్మారెడ్డి భరద్వాజ, టీవీడీ ప్రసాద్
-చలనచిత్ర నిర్మాతల మండలి.
తెలుగు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల, జమున, రాజేంద్రప్రసాద్, రామ్‌చరణ్, గీతాంజలి, రేలంగి నరసింహారావు, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు

(ఈనాడు, ౨౦:౦౨:౨౦౦౯)
_____________________________________
Labels: Cinima/ Telugu, Personality
0 Comments:
Post a Comment
<< Home