My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, July 31, 2009

అమ్మకానికి కన్నీరు

పసిపిల్లలకు కల్లాకపటం తెలియవు. కల్ల అంటే మాటలో దాగిన అబద్ధం. కపటం అంటే మనసులో దాగిన అబద్ధం. కల్లబొల్లి ఏడుపులు మాత్రం పిల్లలకు బాగా తెలుసు. అమ్మ కావాలనో, బొమ్మ కావాలనో అనిపించినప్పుడు పిల్లలు దొంగ ఏడుపులు ఏడుస్తారు. పెద్దగొంతుతో ఏడుస్తారు. అప్పుడు పిల్లల నోటినుంచి శబ్దం వస్తుందిగాని, కంటివెంట నీరుమాత్రం రాదు. అమ్మ పరుగునవచ్చి ఎత్తుకోగానే, మీటనొక్కినట్లు ఏడుపు ఠక్కున ఆగిపోతుంది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వారికి దొంగ ఏడుపు ఒక సాధనం. పిల్లలు ఏడ్చిన ప్రతిసారీ దుఃఖమో, బాధో కారణం కావు. కవిత్వానికి పోపుసామానుగా కథానాయికలచేత కన్నీరు పెట్టించడం ప్రబంధకవులకు సరదా. ముక్కుతిమ్మన సత్యభామను ముద్దుముద్దుగా ఏడిపించాడు. భట్టుమూర్తి గిరిక చేత బావురుమనిపించాడు. పెద్దన అయితే వరూధిని ఏడుపులో సంగీతస్వరాలు పలికించాడు. లోకం నుంచి సానుభూతి ఆశించే కవుల దగ్గర కన్నీరు, దుఃఖం సమృద్ధిగా నిలవ ఉంటాయి. '... నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు... నితాంతదుఃఖంపు నిధులుగలవు...' అంటూ కృష్ణశాస్త్రి తన నిల్వల కొలతలను సైతం లోకానికి వెల్లడించారు. దుఃఖపురి నా సొంతం, అదే నా ఇలాకా అనీ తెలియజెప్పారు. కృ.శా.కే కాదు, కన్నీరంటే కవులందరికీ మక్కువే. కన్నీటి విలువ కవులకు బాగా తెలుసు. పట్టెడు ప్రేమ, పుట్టెడు దుఃఖం- వెరసి, మనిషి నూరేళ్ళ జీవితం! మనిషి కన్నీళ్లలో ఆ రెండింటి ఆనవాళ్ళూ దొరుకుతాయి. 'కలవారి కోడలు కలికి కామాక్షి' కన్నీటిలో వాటి చిరునామాను స్పష్టంగా గుర్తించాడు కవి. పుట్టింటికి పిలుచుకు వెళ్లేందుకు వచ్చిన అన్నగారిని చూసి ఆమె 'కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె...' అని గమనించాడు. ఆ క్షణాన కామాక్షి గుండెల్లో ప్రేమకూ ఆనందానికీ, బెంగకూ దుఃఖానికీ... ఆ గుండెతడికి బలమైన ఆనవాలు- ఆమె కనుకొలకుల్లో నిలిచిన నీటిబిందువులు. వాటి విలువ తెలిసినవాడే నిజమైన మనిషి, అసలైన కవి!

ఆనందమే మనిషి సహజస్వభావం అంటుంది వేదాంతం. కన్నీరే మనిషి సరైన చిరునామా అంటుంది కవిత్వం. ఆనందాన్ని పంచుకోవడానికైనా, దుఃఖాన్ని దించుకోవడానికైనా- మనిషికి కన్నీరే ఆధారం, కన్నీరే ఆలంబన. కన్నీరుకార్చని మనిషి ఉండడు. 'కాళ్ళు తడవకుండా మహాసముద్రాన్ని దాటిన మేధావి కూడా- కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు' అన్నాడో కవి. 'గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు' అంటూ వాటి ప్రయోజనాన్ని వివరించారు ఆత్రేయ. అలా అడపాదడపా తాను కన్నీరు కార్చడం మనిషికి అవసరం అనుకుంటే- తనకోసం మరొకరు కంట తడిపెట్టడం మహాభాగ్యం అన్నారు శ్రీశ్రీ. 'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీకోసమె కన్నీరు నించుటకు... నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన...' మనిషికి అంతకన్నా ఏం కావాలని ప్రశ్నించారాయన. నిజానికి బతికున్నప్పుడే కాదు, మరణించాక కూడా తనకోసం నలుగురూ కంటతడి పెట్టాలని మనిషి కోరుకుంటాడు. నలుగురినీ మంచి చేసుకొమ్మని పెద్దలు చెప్పిన మాట- ఎంతో దూరదృష్టితో కూడినది. వీధిలో నడుస్తున్నా, పాడెమీద పవళించినా వెనక నలుగురుంటేనే మనిషికి బలం. అలా నలుగురినీ ఆకట్టుకున్న మనిషికి బతుకే కాదు, మరణమూ ఘనమే. బాగా ఆత్మీయుడైన వ్యక్తి హఠాత్తుగా పోయాడని తెలిస్తే, మనిషి గుండె కొయ్యబారిపోతుంది. దుఃఖం గడ్డ కడుతుంది. రెప్ప చెలియలి కట్టనుదాటి బయటపడదామని కన్నీరు కాచుకుంటుంది. తనలాంటి స్థితిలోనే ఉన్న నలుగురినీ చూడగానే మనిషి కన్నీరు కట్టలు తెంచుకుంటుంది. అందుకే శవంచుట్టూ ఉన్నవారికి ఒకరిని చూస్తే ఒకరికి ఏడుపొస్తుంది. దుఃఖం ఒకరినుంచి మరొకరికి ప్రసారమవుతుంది. ఆ స్థితినే 'మైల' అంటారు. దగ్గరైతే దుఃఖం తనకూ అంటుతుందని భయపడిన మనిషి మైల సోకినవారిని దూరంగా ఉంచుతాడు.

మరణయాత్రను బట్టి మనిషి బతికిన తీరును అంచనావేయడం పరిపాటి. 'నా చివర ప్రయాణమూ ఇంత ఘనంగా జరిగితే బాగుండును' అని అంతిమయాత్రలో పాల్గొన్న మనిషి అనుకుంటే- చనిపోయిన వ్యక్తి గొప్పగా బతికాడని లెక్క! పదిమందినీ మంచి చేసుకున్నాడని అర్థం. కాకపోతే అది సహజంగా జరగాలి. శ్మశానం దాకా సాగనంపి రావాలని పదిమందికీ స్వతహాగా అనిపించాలి. మృతుడికి అదే నిజమైన నివాళి. ఈమధ్య మరో పద్ధతి మొదలైంది. బాగా ఏడవగలిగేవారిని శవం దగ్గర కిరాయికి నియమించడం, నాయకుల సభలకు మల్లే అంతిమయాత్రకు జనాన్ని అద్దెకు తీసుకురావడం ఇటీవలి విషాదకర పరిణామాలు. అంటే, కన్నీటికి సైతం ఖరీదుకట్టే షరాబులు కొత్తగా తయారయ్యారు. డబ్బుతో ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు. శవం చుట్టూ సందడి సృష్టించడం, శవయాత్ర ఘనంగా జరిగిందని లోకాన్ని నమ్మించడం వారి ఉద్దేశం. పోయినవాడు చాలా గొప్పవాడని చూసేవారికి అనిపించడంకోసం ఆ ప్రయత్నం. 'నానాటి బ్రతుకు నాటకము...' అనే అన్నమయ్య పాటకు వారు 'మరణం సైతం నాటకమూ' అనే అనుపల్లవి జోడిస్తున్నారు. అలాగే చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే కొందరు ఆ రకం 'పిలుపు'లకోసం సిద్ధంగా ఉంటున్నారు. 'పోయారట' అని ఫోన్‌రాగానే పరుగెత్తుకెళతారు. ముక్కూమొహం తెలియని శవంమీదపడి భోరున విలపిస్తారు. మధ్యమధ్యలో మృతుడితో తమ 'అనుబంధం' వర్ణిస్తారు. అదే వీరి బాధ్యత. తమ కడుపుమంటలు ఆర్పేందుకు, వేణ్నీళ్లకు చన్నీళ్లుగా తమ కన్నీళ్లు ఉపయోగపడుతున్నాయని వారంటున్నారు. వారి దృష్టిలో ఇది అనుబంధ వృత్తి లేదా రుణానుబంధవృత్తి. మృతుడి సామాజిక వర్గానికే చెంది, కుల ఆచారవ్యవహారాలు తెలిసిఉంటే ఈ వృత్తిలో మరింతగా రాణించే అవకాశం ఉందట. హతోస్మి! ఓ మహాత్మా, ఓ మహర్షీ... ఈ సమాజం ఎటువైపు పోతోంది?
(ఈనాడు, సంపాదకీయం, ౧౦:౦౫:౨౦౦౯)
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home