My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, August 16, 2009

చిరంజీవులు


'షేక్‌స్పియర్‌ నాటకాలు- అన్నీ షేక్‌స్పియరే రాసి ఉండకపోవచ్చు' అని ఒకాయన తెగ వాదిస్తున్నాడు. విని విని శ్రోతకు విసుగొచ్చింది. 'ఇదిలా తేలదు, నేను చచ్చి స్వర్గానికి వెళ్ళాక ఆయననే అడిగి కనుక్కోవాలి' అని లేచి పోబోయాడు. మొదటాయన వదలలేదు- 'షేక్‌స్పియర్‌ స్వర్గంలోనే ఉంటాడని నమ్మకం ఏముంది? నరకంలో ఉండొచ్చుగా' అని ఎదురు తిరిగాడు. శ్రోత తాపీగా లేచి 'అయితే పేచీ ఏముంది? మీరే స్వయంగా ఆయనతో తేల్చుకుందురుగాని' అనేసి చక్కాపోయాడు.

స్వర్గం నరకం అనేవి ఉన్నాయని, అక్కడికి వెళ్ళాక తమ పూర్వీకులను కలుసుకోవచ్చునని చాలామంది నమ్ముతారు. వారిలో కొందరిది విశ్వాసం, మరికొందరిది భయం. విశ్వాసం గలవారికి పుణ్యకార్యాలు చేద్దామన్న ఆసక్తి ఉంటుంది. భయపడేవారిలో పాపకార్యాలు చేయరాదన్న జంకు ఉంటుంది. 'స్వర్గ నరకాలు ఎక్కడో కాదు మనలోనే ఉంటాయి' అని మరికొందరంటారు. జపాన్‌ జానపద కథలో ఒక గొప్ప మల్లయోధుడు(సమురాయ్‌) రాజవుతాడు. స్వర్గ నరకాలకు తేడా తెలుసుకోవాలన్న ఆలోచన ఓరోజు అతని మనసు తొలిచేస్తుంది. ఉన్నపళంగా తన ఆధ్యాత్మిక గురువు దగ్గరకు పోయి, సంగతి తేల్చుకోవాలనుకుంటాడు. విషయం విన్న గురువు రాజును తేరిపారచూసి తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి రాజుకి ఓపిక తగ్గినా ఎలాగో తమాయించుకున్నాడు. అసలే సాహసి, దానికితోడు రాజ్యాధికారం. చివరికి గురువును బలవంతాన పట్టి కుదిపాడు. ఆయన కళ్లు తెరిచి 'నువ్వు మూర్ఖుడివి... స్వర్గ నరకాల మధ్య తేడా గురించి నీకు చెప్పినా అర్థం కాదు' అన్నాడు. రాజుకు ఒళ్లు మండిపోయింది. కోపం ముంచుకొచ్చింది. 'నిన్ను చంపేస్తాను' అంటూ కత్తిదూసి రొప్పుతూ గురువుపైకి దూకాడు. గురువు చిన్నగా నవ్వి 'అదిగో అదే నరకమంటే!' అన్నాడు. ఒక్కసారిగా బిత్తరపోయాడు రాజు. గురువు చెప్పిందేమిటో అర్థం అయ్యేసరికి సిగ్గుతో చచ్చిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ గురువు కాళ్లపై పడి 'గురువర్యా! ఎందుకిలా చేశారు? ఒక్కక్షణం ఆలస్యం అయితే ఎంత ఘోరం జరిగిపోయేది!' అంటూ విలపించాడు. గురువు ఆప్యాయంగా లేవనెత్తి 'ఇప్పుడు నువ్వున్నది స్వర్గంలో' అన్నాడు.

'కారే రాజులు! రాజ్యముల్‌గలుగవే! గర్వోన్నతిం పొందరే! వారేరీ? భూమిపై పేరైనన్‌గలదే?' అని ప్రశ్నించాడు బలిచక్రవర్తి. 'శిబి వంటివారిని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కారణం ఏమిటి?' అని శుక్రాచార్యుణ్ని నిలదీశాడు. ఇహపరాల్లో మనిషికి కీర్తి యశస్సు అనేవి రెండే తోడు. ధర్మబుద్ధివల్ల దానగుణంవల్ల కలిగే పేరు ప్రతిష్ఠలను కీర్తి అంటారు. శౌర్య పరాక్రమాలతో విజయాలు సాధించినవారికి దక్కేది యశస్సు. ఆ రెండే ఇక్కడ మనిషికి ప్రాచుర్యాన్ని కలిగిస్తాయి. పరలోకానికి వెంట వస్తాయి. 'ఈ లోకమయగుకొందరకు, ఆలోకమ కొందరకున్‌.. ఇహమ్మున్‌ పరమున్‌ మేలగు కొందరకు' అన్నాడు భారతంలో ఎర్రాప్రెగ్గడ. అలా ఇక్కడా అక్కడా కూడా గొప్పగా గుర్తింపు సాధించాలనే పూనికతో జీవించేవారిని 'మహాశయులు' అంటుంది లోకం. వారికి స్వగతమే కాకుండా లోకహితమూ ప్రధానమై ఉంటుంది. కొందరికి స్వార్థమే జీవితాశయం. పాప పుణ్యాలతో గాని, స్వర్గ నరకాలతో గాని ప్రమేయం ఉండదు. అసలాదృష్టే ఉండదు. ఈ భూమిపై ఉన్నన్నాళ్లూ ఉంటారు. తినగలిగినంతా తింటారు. ఎవరికీ తెలియకుండా పోతారు. బతికున్నప్పుడే ఈ లోకం వారిని పట్టించుకోదు. మరణించిన మరుక్షణం మరిచిపోతుంది. అలాంటివారిని 'జీవన్మృతులు'గా పరిగణిస్తుంది లోకం. 'నరుడు నరుడౌట ఎంతొ దుష్కరమ్ము సుమ్ము!' అన్నాడు గాలిబ్‌. మనుషులందరిలో మనిషి లక్షణాలే ఉంటాయని చెప్పలేం. దయ, సౌజన్యం, ఇతరులకు సాయం చేద్దామన్న బుద్ధి వంటివి మనిషి లక్షణాలు. వాటివల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. 'ఇతరులను పీడించడం పాపం, మేలు చేయడం పుణ్యం' అని చెప్పింది భారతం. దాన్ని పాటించినవాడే మనిషి. మానవీయమైన గుణాలతో సంపూర్ణ మానవుడిగా జీవించిన మనిషిని ఈ లోకం దేవుడిగా ఆరాధిస్తుంది.

రాముడు, ధర్మజుడు, జీసస్‌ వంటివారు తమ ఉదాత్త జీవితాల కారణంగా మహాశయులుగా పేరొందారు. రావణ వధానంతరం వరం కోరుకొమ్మని ఇంద్రుడు అడిగితే- 'నా కొరకు చనిపోయిన వానర వీరులందరికీ జీవం ప్రసాదించాలి' అని కోరాడు రాముడు. 'నాకన్నా ముందు మరణించిన బంధువర్గం అంతా ఎక్కడ ఎలా ఉన్నారో తెలుసుకోకుండా- నేను స్వర్గంలో అడుగుపెట్టే ప్రశ్న లేనేలేదు' అన్నాడు ధర్మరాజు. తన వారికోసం ప్రాణత్యాగానికి సిద్ధపడటమే కాదు, తనకు హాని చేసినవారికి క్షమాభిక్ష సైతం కోరాడు జీసస్‌ క్రీస్తు. మహాశయులు, మహనీయుల జీవన వైఖరి ఆ రకంగా ఉంటుంది. అలాంటివారు గతించి ఎన్నో వేల ఏళ్లయినా ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోతారు. గట్టిగా కొలిస్తే గుప్పెడుండే గుండెలో కొండంత చోటిచ్చి మనిషి అలాంటివారి జ్ఞాపకాలను నిత్యం పచ్చగా కాపాడుకుంటాడు. గుండెలో కొంతమేర అలా పచ్చగా ఉండటమే మనిషితనానికి గుర్తు. జీవించి ఉన్నంతకాలం స్మరించడమే కాదు, చనిపోయాకా వారిని కలుసుకోవాలన్న ఆశ మనిషి గుండెలో ఏమూలో స్థిరపడి ఉంటుంది. అలాంటి మూడువేల మందితో బ్రిటన్‌లో ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. 'చనిపోయాక ఎవరిని కలుసుకోవాలని గాఢంగా కోరుకుంటారు?' అనేది ప్రశ్న. ఎక్కువమంది జీసస్‌ క్రీస్తును కలవడానికి మొగ్గు చూపారు. ప్రజల గుండెల్లో కొలువై ఉన్న ఆ పరమ పురుషుడు ఇప్పటికీ బ్రిటన్‌ ప్రజల 'సూపర్‌స్టారే' అని నిర్వాహకులు కొనియాడారు. యువరాణి డయానా, విలియం షేక్‌స్పియర్‌, ఐన్‌స్టీన్‌, మార్లిన్‌ మన్రో, మోనాలిసా చిరునవ్వును ముగ్ధమోహనంగా చిత్రించిన లియోనార్డో డావిన్సీ వరసగా తరవాతి స్థానాలు పొందారు. తాము చనిపోయాక వీరిని కలుసుకోవాలనుకోవడానికి కారణాలు ఏమైనా- వారంతా ఇప్పటికీ జనం గుండెల్లో కొలువున్నారన్నది వాస్తవం. ఎన్నేళ్లు గడిచినా పచ్చగా గుర్తుండేవాళ్లు మరణించారని ఎలాగంటాం?
(ఈనాడు, సంపాదకీయం, ౨౮:౦౬:౨౦౦౯)
__________________________________

Labels:

2 Comments:

Blogger vijaya said...

రావుగారు మీ బ్లాగు నాకు చాలా నచ్చింది.ఇలాంటిఎన్నొసంగతులు మీద్వారా తెలుసుకోవాలని నా కోరిక.
విజయ
kandala_vijaya@yahoo.com

7:54 pm

 
Blogger C. Narayana Rao said...

నాకు నచ్చి చేర్చిన ఈ సేకరణలు మీకూ నచ్చినందుకు సంతోషం. నెనరులు.

4:10 pm

 

Post a Comment

<< Home