శతాయుష్మాన్‌భవ!
అసలు 'వంద' అనే పదంలోనే అలౌకికమైన అందం ఉందనడం అతిశయోక్తి కానేకాదు. వంద అనగానే వందనాలు అర్పించాలనిపిస్తుంది. నూరు- నిండుదనానికి ఓ కొండగుర్తు... గమ్యసాధనకు ఓ గీటురాయి... జీవన ప్రస్థానపథంలో ఓ మేలిమలుపు! 'శతాయుష్మాన్‌భవ' అంటూ నిండుమనసుతో పెద్దలు పలికే దీవెనలు గంధర్వగానానికి ప్రతిధ్వనులై పిన్నలను అలరిస్తాయి. బతుకంతా నూరేళ్లపంటలా పండించుకొమ్మని ఆహూతులు జల్లే ఆశీరక్షతలు, పెళ్లిపీటల మీది వధూవరులకు దేవతలు కురిపించిన అమృతపు సోనలనిపిస్తాయి. దాంపత్యం వందేళ్ళ సౌభాగ్యంతో తులతూగుతూ సాగిపోవాలనే శ్రేయోభిలాషుల శుభకామనలు- ఏ జంటకైనా వెన్నెల్లో తడిసినంత చల్లదనాన్నిస్తాయి. బుజ్జి పాపాయికి పొలమారినా, ఆ చిన్నారి 'హాఛ్' అంటూ చిన్నగా తుమ్మినా- తలను చేతితో మృదువుగా తడుతూ 'శతాయుష్షు' అంటూ అమ్మ అందించే ఆశీర్వాదం మాతృవేదఘోషలా వినిపిస్తుంది. ఈ రోజుల్లో తెలుగు కట్టూబొట్టుకు నిలువుటద్దమైనవారిని అసలు సిసలు తెలుగుదనానికి ప్రతిబింబాలుగా ప్రశంసించాలంటే అందుకు తగిన ఉపమానం 'నూరు' నయాపైసలే తప్ప, గతంలో మాదిరి పదహారణాలు కాదు. ఇప్పుడంటే నూర్రూపాయల నోటు కాగితం పల్చబడి, పరిమాణంలో చిక్కిపోయిందికానీ- ఒకప్పుడు దాని దర్జాయే వేరు. దాదాపు పావుఠావు మందాన ఫెళఫెళలాడుతూ, నాలుగు మడతలు పెడితే తప్ప పర్సులో ఇమడనంత సైజులో ఉండేదా నోటు. వెయ్యి, అయిదువందల రూపాయలు నోట్లు వచ్చినా, 'పచ్చనోటు' అని ఘనకీర్తి దక్కించుకున్నది వందరూపాయల నోటొక్కటే!
వంద అంకెమీద అందరికీ మక్కువే. సరిహద్దులెరుగని యువజనులు 'బౌండరీలు దాటే మనస్సు మాది' అని సగర్వంగా చాటుకుంటూ 'సెంచరీలు కొట్టే వయస్సు మాది' అంటూ నూరుకు మారాకు తొడుగుతుంటారు. కవులూ అందుకు మినహాయింపు కాదనడానికి- తెలుగు అక్షర భాండాగారాన్ని సుసంపన్నం చేసిన ఎందరో సారస్వతమూర్తులు సృజించిన శతక సాహిత్యమే సాక్ష్యం. చాలా ఏళ్ల తరవాత పద్యాలు రాస్తూ 'అందంగా, మధురస నిష్యందంగా/ పఠితృ హృదయ సంస్పందంగా/ కందాలొక వంద రచించిందికి మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా' అన్నాడు శ్రీశ్రీ. వ్యంగ్యం, నీతి, ఉపదేశంతో కూడిన తన 'సిరిసిరిమువ్వ' శతకంలో వందకు పైగానే కంద పద్యాలు విరచించి ఆ ముచ్చట తీర్చుకున్నాడు మహాకవి. నిజానికి అన్నింటా సింహాసనం నూటికే! ఓ నాటకం రంగస్థలం మీద వంద ప్రదర్శనలు పూర్తిచేసుకుంటే ఒక పండుగ. చలన చిత్రం వెండితెరమీద శతదినోత్సవానికి పరుగులు తీస్తే వేడుక. వంద సినిమాల్లో నటించడం అభినేతల కీర్తిమకుటంలో కలికితురాయి. గణితం, శాస్త్రీయ విజ్ఞానం వంటి సజ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోవటం విద్యార్థికి గర్వకారణం. మనిషి వందేళ్ల పరిపూర్ణ జీవనం గడపగలగడం ఓ అద్భుతం! 'అమ్మ కడుపు చల్లగా, అత్తకడుపు చల్లగా' ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ, నూరేళ్ల నిండుజీవితాన్ని జీవించి తుదిమజిలీలో పండుటాకులా రాలిపోయినవారు ఉన్నారు. వందేళ్లకు పైబడినా పూర్తి ఆయురారోగ్యాలతో ఉల్లాసంగా జీవించడంలోని జీవన మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నవారూ ఉన్నారు. 'పుట్టుట గిట్టుట కొరకే'నని తెలిసినా మనుషుల్లో జీవితేచ్ఛ, సుఖభోగలాలస నశించవనడానికి యయాతి చరిత ఓ ఉదాహరణ. ముదిమి ముదిరినా శృంగారేచ్ఛను వదులుకోలేని ఆ రాజుకు తన యౌవనాన్ని ప్రదానంచేసి, ఆయన ముసలితనాన్ని తాను స్వీకరించాడు కుమారుడు పూరుడు. కొడుకు నుంచి సంప్రాప్తించిన యౌవనశక్తితో యయాతి వెయ్యేళ్ల సంసార సుఖాలు అనుభవించి సంతుష్టుడై, పూరుడి జవ్వనాన్ని తిరిగి అతనికి ఇచ్చి, తన వార్ధక్యాన్ని తాను తీసుకున్నాడన్నది 'మహాభారతం'లోని కథ.
మిసిమి ప్రాయాన్ని, ముదిమి వయసును పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఇదేమీ పురాణయుగం కాదు. అలాగే, వెయ్యేళ్లు 'సుఖంబులు బడయుట' కూడా- నూరేళ్లు బతకడమే అబ్బురమనిపించే ఈ రోజుల్లో అసాధ్యమే. బహుశా అందుకే కాబోలు- 'ఎవడు బతికేడు మూడు యాభైలు' అన్న సామెతను కొందరు తరచూ ఉటంకిస్తుంటారు. ఆ నానుడిని ధిక్కరిస్తున్నట్లుగా- శత వసంతాలే కాదు, ఆ తరవాతా మనుషులు సంపూర్ణ ఆరోగ్యంతో, హాయిగా జీవితం గడపడానికి దోహదం చేసే పరమాద్భుత మాత్ర రూపుదిద్దుకుంటోంది. మరో మూడేళ్లలో ప్రాథమిక పరీక్షలకు సిద్ధం కానున్న ఆ అమృతగుళిక తయారీలో ప్రపంచంలోని పలు ప్రయోగశాలలు నిమగ్నమై ఉన్నాయి. మనిషి శతాధిక వత్సరాలు జీవించడానికి ఉపకరించే మూడురకాల జన్యువుల కలబోత అయిన ఈ మాత్రకు 'లాంగ్ లైఫ్ పిల్ (సుదీర్ఘ జీవన ప్రదాన గుళిక)'గా శాస్త్రజ్ఞులు నామకరణం చేశారు. ఆరోగ్యంతో కూడిన జీవనం, వయసు మీరేకొద్దీ ఉత్పన్నమయ్యే సమస్యలు, దీర్ఘాయువు- ఈ మూడింటినీ నియంత్రించే మూడు జన్యువుల ప్రభావాన్ని ఒకే మాత్రలో మేళవించడానికి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నట్లు లండన్‌లోని 'ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వైద్య కళాశాల'కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ గుళిక అందుబాటులోకి వస్తే అది మానవాళి పాలిట- రామాయణకాలం నాటి సంజీవని వంటిది కాగలదనడంలో సందేహం లేదు. ఆదికావ్యంలోని ఆ మందులకొండలో సంజీవ, విశల్య, సంధాన, సౌవర్ణ కరణులనే నాలుగు ఔషధాలున్నాయన్నది రుషివాక్కు. వాటి ప్రభావంతో- అంతకుముందు రామరావణ యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడు, వానర వీరులు తిరిగి తేరుకున్నారట. కొత్తగా రాగలదని ఆశిస్తున్న సుదీర్ఘ జీవన ప్రదాన గుళికలోని జన్యువులూ అలా పనిచేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?
(ఈనాడు, సంపాదకీయం, ౧౪:౦౨:౨౦౧౦)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home