చంద్రనగరి
ఆబాలగోపాలానికీ మామ వరసయ్యే అదృష్టశాలి ఆ చల్లనయ్య సెంద్రయ్యే! దేవతలు దోసిళ్లతో విరజిమ్మిన పారిజాతాలేమోననిపిస్తూ, చమక్ చమక్‌మంటున్న నక్షత్రాల నడుమ- వెండిరేకలతో విప్పారిన తెల్ల కలువలా మిసమిసలాడే రేరాజును చూడ ఎవరికైనా ముచ్చటే. అతని మీది కతలూ కైతలూ ఎప్పటికీ వినవేడుకే! పదహారు కళల కాణాచి అనిపించుకున్న అతడు- బువ్వ తినకుండా మారాంచేసే బుజ్జాయిలను బుజ్జగించే వేళ అమ్మ తోబుట్టువవుతాడు. 'సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా... అందాల చందమామ అతనే దిగివస్తాడు' అని పాడుకుంటూ గోరింటాకును అద్దుకుని సిగ్గుమొగ్గలవుతూనే మురిసిపోయే కన్నెపిల్లలకు కలల రాకుమారుడవుతాడు. దూరాన ఉన్న జతగాణ్ని తలచుకుంటూ 'కోడి కూసే జాముదాకా తోడు రారా చెందురూడా' అని సాయాన్ని అర్థించే పల్లెపడుచుకు నేస్తమవుతాడు. పెళ్ళయిన జంటలు వలపు తేనెలపంట పండించుకునే వేళ వెండిదారాలల్లిన వెన్నెల పానుపవుతాడు. ప్రేమికులకు ప్రియబాంధవుడయ్యే చందమామ ఒక్కోసారి వారికి బద్ధశత్రువూ అవుతుంటాడు పాపం! శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానమవుతూ, కృష్ణపక్షంలో రోజురోజుకీ తరిగిపోయే చంద్రకాంతుల మాదిరే- జాబిలిపై ప్రేమికుల్లో పెల్లుబికే రాగానురాగాలూ సందర్భావసరాలను బట్టి నిష్ఠురాలు, నిందోక్తులుగా తర్జుమా కావడం అదో ముచ్చట! 'ఆమె చందమామై అందగించిన/ నేను నీలిమొయిలునైన చాలు'నన్న అల్పసంతోషంతో ప్రియురాలి కోసం ఎదురుచూసే చిన్నవాడు... 'ఆమె కానుపింప అదె నాకు పున్నమ/ మగువలేక పున్నమయె అమాస' అని- విరగకాసిన వెన్నెలపై విసుక్కోవడమూ కద్దు.
మనసుకు చేరువైనవారి ఎడబాటు ఎదలో ముల్లుములుకులా తొలుస్తుంటే వేగిపోతున్నవారికి చంద్రుణ్నీ, అతగాడు వెదజల్లే వెన్నెలనూ జమిలిగా నిందించడం అలవాటే. అందులో మగవారు, మహిళలు సహాధ్యాయులే. అయినా, చంద్రుణ్ని దుమ్మెత్తిపోసే విషయంలో తమ కావ్య కథానాయికల్నే కవులు ఓ మెట్టుపైన ఉంచారు. చెంతలేని ప్రియకాంతుల్ని తలచుకుంటూ, అసలే తాము చింతాక్రాంతులై తల్లడిల్లుతుంటే, ఆ విరహాగ్ని రెట్టింపు చేసేలా వెన్నెల కుంపట్లు రాజేస్తున్నాడంటూ- మన ప్రబంధనాయికలు చల్లనయ్యకు వేసిన అక్షింతలు అన్నీఇన్నీ కావు. కిరణాల్నే పాశాలుగా ప్రయోగించి 'విరహిజనుల డాసి, ప్రాణముల్ తీసెదు దోసకారి/ రాజవా నీవు? యమధర్మరాజుగాని' అంటూ- కృష్ణుడి రాకకోసం నిరీక్షిస్తున్న రాధ నింగిలోని చంద్రుడిపై రుసరుసలాడుతుంది 'రాధికా సాంత్వనము'లో! సాగరమథనం సందర్భంగా హాలాహలంతో పాటు పుట్టిన జాబిల్లీ లోకకంటకమవుతుందన్న భయంతోనే సముద్రుడు ఆ రెంటినీ- 'త్రాగు తలబోసికొమ్మని వేగ హరునికిచ్చె'నంటూ ఇక 'నీ రుచి నెంచనేల చంద్ర' అన్నది 'విజయవిలాసం'లో సుభద్ర ఈసడింపు! విరహజ్వరాన్ని ఇంతలంతలు చేసే 'నీలో చల్లదనం వట్టి నేతిబీరచందం' అని 'ప్రభావతీ ప్రద్యుమ్నము' కథానాయిక తీర్పు ఇచ్చేసింది. నెలరాజు ఇన్ని దూషణలకు నెలవైనాడనే కాబోలు... 'చంద్రగోళం చవిటి పర్రమీద వెతగ్గా వెతగ్గా/ ప్రబంధనాయికల ఉపాలంభనలు దొరికినవట' అనికవి తిలక్ చమత్కరించాడు.
ఆ తిట్ల మాటేమోకానీ, చంద్రగోళం మాత్రం వట్టి చవిటిపర్రే. శాస్త్రీయ విజ్ఞానాన్ని మధించి, ప్రకృతి శక్తులను జయించి, విశ్వరహస్యాలను ఛేదించిన మానవ త్రివిక్రముని పాదముద్రలు- అవనీతలం నుంచి అంతరిక్షందాకా ప్రత్యక్షమవుతున్న రోజులివి. చంద్రమండలానికి మనుషుల ప్రయాణం సాధించరాని స్వప్నం కాదన్నాడు శ్రీశ్రీ తాను వెలిగించిన 'శరచ్చంద్రిక' గీతంలో. 'పరమాణువు గర్భంలోని పరమ రహస్యాలూ/ మహాకాశ వాతావరణంలోని మర్మాలూ తెలుసుకున్నాక/ సరాసరి నీ దగ్గరకే ఖరారుగా వస్తాంలే' అంటూ చందమామకు ధీమాగా చెప్పాడు. మహాకవి వాక్కులను సాకారం చేస్తూ, మనిషి చంద్రనగరిలోనూ పాగావేశాడు. అక్కడ లోయలు, గుట్టలు తప్ప- కవులు చెబుతున్న సుధలు, సౌందర్యాలు గట్రా లేవని తేల్చేశాడు. అంతమాత్రాన చంద్రప్రభలకు వచ్చిన లోటేమీ లేదు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరాన ఉన్నా- ఆ మేనమామ ఆవాసం- మనిషికి మానసోల్లాసమే. అక్కడి లోయలైనా శిఖర సమానమే. అవి తన పేరిట చలామణీ కావడం మనిషి ఘనతకు మరింత వన్నె తెచ్చేదే. నోబెల్ పురస్కార గ్రహీత సి.వి.రామన్, భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్, భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ భాభా, మేఘనాథ్ సాహావంటి మహామహుల పేర్లతో అక్కడి బిలాలు కొన్ని అలరారుతున్నాయంటున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ 44వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, చంద్రమండలంలోని ఓ బిలానికి ఆయన పేరిట నామకరణం చేసినట్లు న్యూయార్క్‌లోని 'లూనార్ జియోగ్రఫికల్ సొసైటీ' ఈ మధ్య ప్రకటించడం సంచలనం రేపింది. చంద్రగోళంలోనూ స్థలాల క్రయవిక్రయాలు సాగుతున్నట్లు అడపాదడపా వినవస్తోంది. చంద్రబిలాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం, అక్కడి స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలవంటివి ఉత్తిమాటేనన్నది అంతర్జాతీయ అంతరిక్ష సంఘం తాజా వక్కాణింపు. 'ఇంక నేనుందు ఇందుమండలమందు' అంటూ రెక్కలు కట్టుకువెళ్లి, చుక్కలలోకంలో వెన్నెలవిహారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారిని ఉసూరుమనిపించే వార్తే ఇది. భాగ్యనగరంలోని జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ మాదిరే- భవిష్యత్తులో చంద్రమండలంలోనూ జాబిలీ హిల్స్, బింబా హిల్స్ పేరిట విలాసనగరులు వెలుస్తాయని ఆశించినవారిది అడియాసేనా?
(ఈనాడు, సంపాదకీయం, ౩౧:౦౧:౨౦౧౦)
_______________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home