శత వసంతాల జ్వాలాశిశువు
-డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
'పతితులార భ్రష్టులార! బాధాసర్పదష్టులార! ఏడవకండేడవకండి-'
ఈ ఓదార్పు 19వ శతాబ్ది తెలుగుజాతినే కాదు, యావత్ దేశాన్నీ ఉలిక్కిపడేటట్టు చేసింది. కవిత్వంలో అక్షరాల్నికాదు అశ్రువుల్ని నింపుకొని; భావోద్వేగాల్నికాదు వాస్తవదృశ్యాల్ని అల్లుకొని అత్యంత వేగవంతంగా చెప్పిన కవి శ్రీశ్రీ.శ్రీశ్రీ కవిత్వంలోని వేగాన్ని పట్టుకున్న కవి ఇంతవరకూ పుట్టలేదు. శ్రీశ్రీతో పోల్చదగిన కవీ తెలుగునాట లేడు. సాంప్రదాయిక శక్తిని అంతర్నిహిత విద్యుత్తుగా మార్చి, అభ్యుదయపథాల పరుగుపెట్టించిన భాషాభగీరథుడు ఆయన. శబ్దశక్తినీ, అర్థవ్యాప్తినీ అంచనావేసి వాడిన ప్రయోగశీలి. అందుకే యుగకవిగా శ్రీశ్రీ గుర్తింపు పొందాడు.
'వ్యక్తికి వింజామరలు విసరలేను/ సమూహం నా సరదా' అని ప్రకటించి, ప్రజలవైపు ముఖ్యంగా పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం నిలిచిన మానవతావాది శ్రీశ్రీ. విదేశాల్లోని పరిస్థితులపై దృష్టి కేంద్రీకరించి, దేశీయ అభ్యున్నతికోసం విదేశీ విజ్ఞానాన్ని వాడటంలో సిద్ధహస్తుడాయన. శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఎందుకు యుగకర్తగా నిలిచాడని ప్రశ్నించుకొని ఆలోచిస్తే- వ్యక్తిత్వంలో, కవిత్వంలో, జీవితంలో చిత్తశుద్ధిగా శ్రమసౌందర్యాన్ని ఆకాంక్షించిన వ్యక్తిగా, ఉద్యమమూర్తిగా కన్పిస్తాడు. అప్పటివరకు వూహాలోకాల్లో విహరిస్తున్న తెలుగు కవిత్వానికి వాస్తవిక స్పృహను, హేతువాద దృక్పథాన్ని, సామ్యవాదాన్ని కలగలిపి ప్రభంజనం సృష్టించాడు.
సమానత్వం కావాలంటే ముందుగా రాజకీయ స్వాతంత్య్రం, తరవాత ఆర్థిక స్వాతంత్య్రం కావాలనీ, వీటిలో రెండోది మనకింకా రాలేదని ఏనాడో చెప్పాడు. అలాగే ప్రపంచీకరణవల్ల జరిగే విధ్వంస చిత్రాన్ని నాడే తన కవిత్వంలో చూపాడు. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అనడంలో వైయుక్తిక చైతన్యాన్ని సామాజిక చైతన్యంగా రూపుకట్టించడం కన్పిస్తుంది. శ్రీశ్రీ వ్యక్తిత్వం నుంచి, కవిత్వం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక దృక్పథాలకెన్నో కొత్త దారులు దొరుకుతాయి. కార్మిక విజయావిష్కరణ, సామాజిక హృదయ స్పందన, వాస్తవ జీవనచిత్రణ సాహిత్యంలో శ్రీశ్రీతోనే పుట్టాయి. కళకి ఆధారం భ్రమ కాదనీ, సామాజిక సత్యాల్ని వాస్తవిక దృష్టితో కవిత్వంలో పొదగడమే కళ అనీ శ్రీశ్రీ నిర్వచనం. సామాజిక స్పృహ లేని కవిత్వంలో నాగరక లక్షణాలుండవు. అందుకే సామాజిక కవిత్వంలోని అనుభూతిని సామాజిక చైతన్యం, శ్రమజీవన సౌందర్య వర్ణనలవైపు నడిపిన కవి శ్రీశ్రీ. పెట్టుబడిదారీ విధానాన్ని అన్నివిధాలుగా ఖండించి కార్మికవర్గాల్లో తీవ్ర చైతన్యాన్ని మేల్కొల్పిన శాస్త్రీయ సామ్యవాదాన్ని పుణికిపుచ్చుకుంది శ్రీశ్రీ కవిత.
'ధనిక స్వామికి దాస్యంచేసే
యంత్రభూతముల కోరలు తోమే
కార్మిక వీరుల కన్నుల నిండా
కణకణమండే గలగల తొణికే
విలాపాగ్నులకు విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబులేడోయ్'
- ఈ మాటలు పారిశ్రామిక విప్లవం తెచ్చిన ఆర్థిక సంక్షోభానికి సాక్షీభూతాలు. ఏళ్ళతరబడి అభివృద్ధికి నోచుకోక గనుల్లో, కార్ఖానాల్లో మగ్గుతున్న కార్మిక సోదరుల వ్యథార్త దృశ్యాలు. ప్రపంచమంతటా అభివృద్ధి కాంక్షించే స్వభావం రావడానికి కారణం రష్యన్ విప్లవం. ఈ విప్లవం నుంచే శ్రామికలోకం పక్షాన నిలిచి కణకణమండే త్రేతాగ్నుల్లాంటి కవితల్ని శ్రీశ్రీ వెెలయించాడు. సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢసంకల్పాన్ని పొందాడు. దీనికి శ్రీశ్రీలోని ప్రయోగవాదశీలం దోహదం చేసింది. కవిత్వం, సమాజం రెండూ పరిణామశీలాలు. కాబట్టి ఈ రెంటిపై ప్రయోగాలు తప్పవు. ఈ ప్రయోగాలు సకలజన ప్రయోజనాలకు అనుకూలమైనప్పుడు మాత్రమే అది ఒక సంప్రదాయంగా ఘనీభవిస్తుంది. అందుకే నాడు శ్రీశ్రీ పూరించిన శంఖారావ ప్రతిధ్వనులే నేడూ సమాజంలోనూ, శ్రామికవర్గ చైతన్యంలోనూ, సాహిత్యంలోనూ విన్పిస్తున్నాయి.
కష్టించే కండల్ని పూజించని సమాజంలో జవసత్వాలు లేనట్లే. అది వృద్ధ ప్రపంచం. అందుకే ఆ వృద్ధ ప్రపంచానికి నెత్తురూ, కన్నీరు కలిపి శ్రీశ్రీ కొత్త టానిక్ తయారుచేశాడు. అక్షరాల్ని ఆ టానిక్‌లో ముంచి, ప్రతి పదాన్నీ కదం తొక్కించాడు. శ్రీశ్రీ కవిత్వంలో పదాలు, భావాలు, ప్రతీకలూ అన్నీ శ్రమసౌందర్యాన్ని ఆస్వాదించేవిగా, స్వేదానికి పట్టాభిషేకం చేసేవిగా కన్పిస్తాయి. మాట్లాడే మంటలు, శ్రామికలోకపు సౌభాగ్యాలు, వర్షుకాభ్రముల ప్రళయ ఘోషలు, అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలూ... అన్నీ కార్మిక లోకకల్యాణం కోసమే.
శ్రీశ్రీ 1934-47 వరకూ రాసిన కవితల సంపుటి 'మహాప్రస్థానం'. మహాభారతంలో పాండవులు మహాప్రస్థానం చేసింది స్వర్గారోహణ కోసమే. సామ్యవాద సమాజాన్ని స్వర్గంగా కలలు కన్న శ్రీశ్రీ కూడా మహాప్రస్థానం రాశాడు. సాహిత్యంలో ప్రతిదీ ప్రతిఫలించాలనీ, అంతా కవితామయం చేశాడు. అందులోనూ శ్రమకు పట్టమే కట్టాడు.
కుక్కపిల్ల-ఆకలి, అగ్గిపుల్ల-పరిశ్రమ, సబ్బుబిళ్ల-ఫ్యాక్టరీ, రొట్టెముక్క- బేకరీ, అరటితొక్క-కర్షకుడు, బల్లచెక్క-శ్రామికుడు, తలుపుగొళ్లెం-బ్రిటిషువారి పాలన, హారతి పళ్ళెం-విజయం, గుర్రపుకళ్ళెం- వేగం.
వీటిలో మొదటి పదాల ద్వారా ప్రతీకలుగా రెండవ పదాల్ని స్ఫురింపజేశాడు. 'అల్పాక్షరంబుల అనల్పార్థ రచన' ఇదే. వీటిలో శ్రామిక వర్గాల బాధలు, ఆకలికేకలూ స్వాతంత్య్రం వచ్చినా తీరలేదని, తీర్చడానికి వేగవంతమైన తన కవిత్వం ద్వారా పాటుపడతాననే సందేశాన్నిచ్చాడు. దీనికి మద్దతుగా-
'చీనాలో రిక్షావాలా,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ ఖండాంతర నానా జాతులు...'
'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం'.
'ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా?! ఇకపై సాగదు'...
'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?',
'తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు'
వంటి లోతైన, గాఢమైన భావవాక్యాలు నిలుస్తాయి. విదేశీయులైన చెహోవ్, ఫ్రాంజ్‌కాంఫ్కా, కారల్ చాపెక్, విక్టర్ సాడన్, విలియం సోలోయార్, వాల్ట్ విట్‌మన్, ఇ.ఇ.- కమింగ్, మయకోవస్కీ, సాబ్లోనెరుడా, పుష్కిన్, వాసిల్వేవా, కోవ్‌సాంతిన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రసా, షాన్ షెంకిస్ వంటి ప్రగతిశీలవాదులను తెలుగువారికి పరిచయం చేయడం కూడా సామ్యవాద ఆకాంక్షల్లో భాగమే. ఈ సామ్యవాదాన్ని ఆకాంక్షించిన కార్ల్‌మార్క్స్, ఏంగెల్స్, లెనిన్‌లను శ్రీశ్రీ కణకణమండే త్రేతాగ్నులుగా ఉత్ప్రేక్షించాడు. 'ధనంజయునిలా సాగండి...' అన్న మహాప్రస్థానంలోని పిలుపు, విజయునిలా విక్రమాన్ని చూపాలని ఉద్బోధిస్తుంది.
ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించేటట్టు, సామ్యవాదాన్ని ఆకాంక్షించేటట్టూ చేయాలి. దీనికోసం దిగుమతి చేసుకున్న విదేశీ భావజాలాన్ని తెలుగునాట సంప్రదాయంలో విత్తాడు. అది అంకురించి, తదుపరి సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఉద్యమాలుగా వికసించింది. శ్రీశ్రీ ఎంచుకొన్న ఈ ప్రణాళికలో భాగమే సంప్రదాయ పదజాలాన్ని కొత్త అర్థాలలో వాడటం.
సమిధ, భూతం (ప్రాణి), యజ్ఞోపవీతం, ముహూర్తం (12 క్షణాల కాలం) వంటివెన్నో ఉన్నాయి.
ఇంకా 'యముని మహిషపు లోహఘంటలు...'
'నరకలోకపు జాగిలమ్ములు,'
'ఉదయసూర్యుని సప్తహయములు...'
'కనకదుర్గా చండసింహం,'
'ఇంద్రదేవుని మదపుటేనుగు...' మొదలైన ప్రయోగాల్లోనూ శ్రామిక జీవన దృక్పథ వర్ణనమే కన్పిస్తుంది. సనాతనంగా సంప్రదాయంలో ఉన్నవాటినే ప్రతీకలుగా తీసుకొని, అందులో సామ్యవాదాన్నీ అభ్యుదయ కాంక్షను పలికించాడు శ్రీశ్రీ. శాంతికాముకత, సమసమాజ నిర్మాణం, వర్గసంఘర్షణ వంటి లక్షణాల పట్ల ఆకర్షితుడైన శ్రీశ్రీ-
'కదిలేదీ కదిలించేదీ,
మారేదీ మార్పించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ' అభ్యుదయ పథమేనని నమ్మారు. '1930 వరకూ కవిత్వం నన్ను నడిపించింది. 30ల తరవాత నేను కవిత్వాన్ని నడిపిస్తున్నాను' అన్న ఆత్మవిశ్వాసపూరిత వాక్యాలు అభ్యుదయ దృక్పథం హృదయం నుంచి వచ్చినవే. ఇదే శ్రీశ్రీని సమాజానికి, కవిత్వానికి నిబద్ధుణ్ణి చేసింది.
'కవికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. దాన్ని విస్మరించడం అంటే సమాజానికే ద్రోహం. వెనుకటి కవులు నిరంకుశులేమో కానీ నేటి కవులు సమాజ శ్రేయస్సుకి నిబద్ధులు' అన్న ఆయన మాటలు, కవికీ సమాజానికీ ఉండవలసిన బంధాన్ని వివరిస్తాయి. కవిత్వం పట్ల కూడా లోతైన అవగాహన శ్రీశ్రీకి ఉంది. ప్రక్రియ, వస్తువు- రెండూ కలిస్తేనే కవిత్వమనీ, ప్రక్రియ శరీరమైతే వస్తువు ప్రాణమనీ, ఈ రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, ఈ లక్షణం కేవలం ఆధునిక కవిత్వానికే కాక, అన్ని కాలాల, అన్ని ప్రాంతాల కవిత్వాలకూ వర్తిస్తుందని నమ్మినవాడు శ్రీశ్రీ. అందుకే ప్రాచీన ఛందస్సులోని సంస్కృత పదాలను, విదేశీయుల భావాలను అన్నింటికీ అతీతంగా కొత్తకొత్త అర్థాలలో ప్రయోగించగలిగాడు. 'సమాజంలోని సంఘర్షణలనూ, సమస్యలనూ మార్క్సిస్ట్ దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహనే తల్లివేరు లాగా కవిత్వానికి పరిపుష్టినిస్తుంది. నేను కవిత్వం రాసేటప్పుడు ఇదే నా నిబద్ధత- సిద్ధాంతం' అని చెప్పుకొన్న శ్రీశ్రీ ప్రతి కవిత్వ చలనంలోనూ ఒక కొత్త చోదకశక్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు.
శ్రీశ్రీ ఆలోచనలు, ఆశయాలు, అభ్యుదయం, శబ్దప్రయోగంలోని వేగం, తళుక్కున మెరిసే చమత్కారం ఎవరూ అందుకోలేనివి. కాలం కన్నా ముందు పరిగెత్తేదే కవిత్వమనీ, ఇది కేవలం జీవితానికి వ్యాఖ్యానం మాత్రమే కాదని, సమస్యలకు పరిష్కారం చూపించేదనీ శ్రీశ్రీ అభిప్రాయం. కవిత్వం ఒక భోగవస్తువుగా కాక ఉపయోగ వస్తువుగా మారినప్పుడే అది ప్రజా కవిత్వమవుతుంది. ఈ లక్షణం ఉండడం వల్లనే శ్రీశ్రీ రాసిన 'కవితా ఓ కవితా' గీతం- సంప్రదాయవాది విశ్వనాథ సత్యనారాయణ కూడా కంటతడి పెట్టించిందట! అంతటి వేగం, ఆవేగం శ్రీశ్రీ కవితకే సొంతం.
శ్రీశ్రీ జీవితానికి, కవిత్వానికి ప్రయోగం హృదయనాడి. భిన్నంగా చెప్పడం, ఉండటం శ్రీశ్రీకి నచ్చే గుణాలు. శ్రీశ్రీ- ఆలోచనల్లో లోతుల్నీ, ఆశయాల్లో ఉన్నతాల్నీ శ్వాసించే నిరంతర క్రియాశీలక జీవి. తెలుగు సాహిత్యాన్ని ఒక్కసారిగా జాగృతం చేసి నవీన పంథాలో దౌడు తీయించిన రౌతు. శ్రీశ్రీ కవిత ఒక మహాశక్తి. దాని ప్రభావం సమాజంపై నేటికీ ప్రసరిస్తోంది. శ్రీశ్రీ మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని. ఎన్నో దీపాలను వెలిగించిన సాహిత్య జ్యోతి. శ్రీశ్రీ మనస్సే ఒక కార్మికశాల. నిరంతరం కవితాక్షరాలు అచ్చుపోసినట్టు వస్తూ శ్రమజీవికి పట్టాభిషేకం చేస్తాయి. ఆధునిక కవిత్వానికి తొలి వేకువ శ్రీశ్రీ. ఫిరంగిలో సైతం జ్వరం ధ్వనింపజేసే మృదంగరావాలు శ్రీశ్రీ పిలుపులు. కవిత్వంతో కదం తొక్కిన ఏకైక కమాండో! కవిత్వంలో మెషిన్‌గన్‌లాంటివాడు. జీవితంలో నైట్రోజన్‌లాంటివాడు. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే 'శ్రీశ్రీ కన్నా మిన్న ఏదైనా ఉందంటే- అది శ్రీశ్రీ కవిత!'
(రచయిత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)
(ఈనాడు, ౩౦:౦౪:౨౦౧౦)
_________________________________
Labels: Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home