మలచుకోవాలి
- అయ్యగారి శ్రీనివాసరావు
సృష్టిలో ప్రతీది మార్పు చెందేదే. అది నిరంతర ప్రక్రియ. మార్పువలన మంచీ, చెడూ రెండూ సంభవిస్తాయి. ఒకే మార్పు ఒకరికి మంచిగా, మరొకరికి చెడుగానూ మారవచ్చు. అందుకే మార్పును చూసి భయపడకూడదు. మంచి అయినా, చెడు అయినా మార్పును అనుకూలంగా మలచుకోవడంలోనే మనుషుల విజ్ఞత ద్యోతకమవుతుంది.
హోరుమని వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దారిలో ప్రయాణించే రైలు ఒక చిన్న గ్రామంలో ఆగిపోయింది. ఎప్పుడు కదులుతుందో తెలియని పరిస్థితి. ఒక బాల బిచ్చగాడు అది చూశాడు. ప్రయాణీకుల దగ్గర అడుక్కోవాలని వెళ్ళాడు. అక్కడి ప్రయాణీకుల పరిస్థితి మరోలాగ ఉంది. ఎంత డబ్బున్నా తినడానికి ఏదీ దొరకని పరిస్థితి వారిది. పిల్లలు మరీ తల్లడిల్లిపోతున్నారు.ఆ స్థితిలో అడిగితే ఛీత్కారాలు తప్ప చిల్లర రాలదు. అయినా డబ్బు సంపాదించాలి. ఎలా?... ఆలోచించాడు. అంతవరకూ బిచ్చమెత్తగా వచ్చిన డబ్బులు లెక్కచూసుకున్నాడు. పచారీ కొట్టుకు వెళ్ళి సామానులు కొన్నాడు. ఇంటికి వెళ్లి తల్లిచేత సులువుగా తయారయ్యే తినుబండారాలు తయారుచేయించాడు. రైలు ఆగిన ప్రదేశానికి చేరుకున్నాడు. వాటికి గిరాకీ పెరిగింది. డబ్బూ వచ్చింది. అదే పెట్టుబడిగా రెండుమూడు సార్లు అలాగే చేశాడు. రైలు వెళ్ళిపోయాక లెక్కచూసుకుంటే... ఆశ్చర్యం. ఒక్కరోజులోనే ఎంతో మార్పు. ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో అతడి జీవితమే మారిపోయింది. బిచ్చగాడినుంచి వ్యాపారిగా అతడి హోదా పెరిగింది.
'మార్పే ప్రపంచానికి మూలసూత్రం. మారనిదే ప్రపంచం మనజాలదు' అంటాడు గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్. అతడి సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఏదీ ఏ క్షణమూ స్థిరంగా ఉండదు. మార్పుచెందని పదార్థమూ ఉండదు. కిందటి క్షణానికి, ఈ క్షణానికి మధ్య ఈ విశ్వంలో జరిగే మార్పువలన ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. నిరంతరమైన ఈ మార్పే చైతన్యం. చైతన్యం ప్రకృతిస్వరూపం. ప్రకృతి పంచ భూతాత్మకం. అందుకే పంచ భూతాలూ నిరంతరం అనేక మార్పులు చెందుతూ ఉంటాయి.
భూమి అనేకదేహాలుగా (పశు, పక్షి, వృక్షాదులు), నీరు అనేకరూపాలుగా (ఆవిరి, బిందువు, సింధువు, ఘనం), అగ్ని ఒక శక్తిగా (నడిపించే, నశింపజేసే), వాయువు ప్రాణరూపంగా, ఆకాశం అవకాశాలకు నిలయంగా మార్పు చెందుతూనే ఉంటాయి. పదార్థం, పరిస్థితులు, ఆలోచనలు, అలవాట్లు, ప్రకృతి, నాగరికతలాంటివన్నీ నిరంతరం మార్పుచెందేవే. ప్రవహించే నీటికి ఆటంకం ఏర్పడితే అక్కడితో ఆగిపోదు. దారి మార్చుకుని పక్కదారులగుండా మరలిపోతుంది. అల్పప్రాణులు సైతం వాటికనుగుణంగా తమ అలవాట్లను మలచుకుంటాయి. ముందుజాగ్రత్తలు తీసుకుంటాయి. వలసపోవడం (పక్షులు), భూమి అడుగుపొరలలోకి చేరిపోవడం (వేసవిలో చేపలు), దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోవడం (మంచు ప్రాంతాల్లో ప్రాణులు)లాంటివి చేస్తుంటాయి. ప్రకృతి తనకు ఇవ్వని శక్తిని తలచుకుని కుమిలిపోకూడదు. అలాటి పరిస్థితులను అధిగమించడానికే తెలివినిచ్చాడు భగవంతుడు. దాని సాయంతో ఇతరులకున్న అవకాశాల్ని తనకు అనుకూలంగా మలచుకోవాలి. కోయిలకు తన గుడ్లను పొదగడం తెలియదు. అందువలన కాకి గూటిలో గుడ్లు పెడుతుంది. అంగవైకల్యం కలిగినవారు సైతం తమ వైకల్యానికి కుంగిపోరు. తమకున్న ఇతర శక్తులను ఆ వైకల్యానికి విరుగుడుగా మార్చుకుంటారు.
నవనవలాడే పదార్థం కాలానుగుణంగా కుళ్ళిపోతుంది. అది ఎరువుగా మారి తనలోని సూక్ష్మపదార్థాలతో, మరో పదార్థానికి రూపునిస్తుంది. పర్వతం అ(క)రిగిపోయి ఇసకరేణువులుగా మారినా, అది మరో భవన నిర్మాణానికి ముడిపదార్థంగా మారుతుంది.
కష్టాన్ని అనుభవంగా, అపజయాన్ని గుణపాఠంగా, అవమానాన్ని ఎత్తుకు ఎదిగే ఆసరాగా, ఆపదల్ని సంపదలుగా మార్చుకోవాలి. అదే తెలివైన వారి లక్షణం. జన్మరాహిత్యమైన మోక్షం పొందాలన్నా మార్పువలననే సాధ్యం. సంసారి ధ్యానిగా, ధ్యాని యోగిగా, యోగి సన్యాసిగా మారుతూ, చివరికి ఏ మార్పూలేని పరమాత్మను చేరుకోవచ్చు!
(ఈనాడు, అంతర్యామి, ౧౦:౦౪:౨౦౧౦)
_____________________________
Labels: Religion/telugu, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home