My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, November 27, 2011

ఏది స్వప్నం, ఏది సత్యం?

స్వప్నం- మానవాళికి ఓ అందమైన వరం. స్వప్నావస్థ సంఘటనల ఆధారంగా భవిష్యత్తును సూచించే స్వప్నశాస్త్రం వైదిక జ్యోతిష-సంహితలో ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే, స్వప్నం చాలాసార్లు దివ్యసందేశాన్నందించే భవ్యవాణి. అశోకవనంలో సీతమ్మవారి కాపరి వృద్ధ త్రిజట శ్రీరామ విజయాన్ని ముందుగానే కలలో తిలకించింది. 'స్వప్నాలు వాస్తవాలైతే... వాస్తవాలూ స్వప్నాలంత ఉన్నతంగా ఉంటాయి' అంటారు మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్. నండూరివారి నాయుడుబావ భావించినట్లు 'యెలుతురంతా మేసి యేరు వేసే నెమరే కల'. మనసైన మనిషి కలలోకి వచ్చి కతలు సెబుతుంటే వులికులికి పడుకుంట 'వూఁ' కొట్టుకోవడం ఒక ఉత్తేజకరమైన అనుభవం. 'కలలంచున్ శకునంబు లంచు... నిమిషార్థ జీవనములందు బ్రీతిపుట్టించి నా/సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా!' అంటూ ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వరుడంతటివాణ్ని దూసిపెట్టింది, ఇంతవరకు ఎవరికీ ఎంతకూ అంతుపట్టని ఈ వింత కలల ప్రపంచాన్ని గురించే! సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కలలో ప్రత్యక్షమై ఆస్థాన కవయిత్రి మధురవాణిని సూచించేదాకా తన తెలుగు రామాయణాన్ని సంస్కృతీకరించగల సమర్థులు రఘునాథ నాయకుడికి తట్టనే లేదంటే మరేమిటర్థం?! పరమాత్ముడు ఇరు దేవేరులతో కలలో కనిపించి ఎన్నడూ పేరైనా వినుండని 'నన్నయ్య ఫక్కీ' కావ్యాన్ని తెనిగించే పని కాకునూరి అప్పకవికి అప్పగించడమేమిటి?! అరవ ఆండాళ్ ప్రేమగాథను తుళువు ప్రభువు రాయల చేత తెలుగులో రాయించడానికి శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు ఎంచుకున్న మార్గమూ స్వప్నమే. విశ్వ సంస్కృతులన్నింటిలో అనాదిగా 'స్వప్న సంసోషణ' ఓ పుణ్యాచారంగా ఊరికే కొనసాగుతూ రాదుగదా!


అందరూ నిద్రపోయేవేళ ఇల్లు విడిచి వెన్నెల మైదానంలో కురిసే అమృతాన్ని దోసిళ్లతో తాగి రావాలంటే కవి తిలక్ లాగా కలల పట్టుకుచ్చులూగే కిరీటం ధరించాలి. మనిషి అంటే మనసు చర్మపు తొడుగే కదా! ఆ మనసులో అసంకల్పితంగా సాగే భావోద్వేగాలు, అనుభవాల ఐంద్రియ సంవేదనల స్పష్టాస్పష్ట ప్రతిబింబాలే స్వప్నాలని మనోవైజ్ఞానికుల సిద్ధాంతం. విడని వాసన పదాలు విరులుగా పరిమళించడమే కలలుచేసే కనికట్టు. నిద్రావస్థ అర్ధస్పృహలో మనసు దర్శించే స్వప్నాలకు అర్థాలు విశ్లేషించడం నిజంగా సంక్లిష్ట కళే. మనసు కొలనులో అన్నివేళలా మంచి కుసుమాలే వికసించాలనీ లేదు. వరాహం మీద దిగంబరంగా రోదిస్తూ దక్షిణం దిక్కుగా భర్త నిష్క్రమించడాన్ని దుస్స్వప్నంగా భావించి రామాయణంలో మండోదరి తల్లడిల్లి పోతుంది. దుస్స్వప్న నివారణకు పంచకన్యాది దేవతాస్తోత్రాలను అగ్నిపురాణం సూచిస్తుంది. సర్పం, ఎనుము, ఆముదం, అగ్ని, అస్తికలు, మురుగునీరు, కారాగారం, వాహనప్రమాదం వంటి స్వప్న దర్శనాలు అశుభ సూచికలని స్వప్నశాస్త్ర సిద్ధాంతం. పీడకలల వల్ల నిద్రాభంగమైనా పడక దిగకుండా జలసేవనం చేసి నిద్రను కొనసాగించాలని పుష్కరుడు పరశురాముడికి అగ్నిపురాణంలో బోధిస్తాడు. గ్రీకులకు ఏకంగా 'మర్ఫీ' అనే ఒక స్వప్నదేవతే ఉంది. తండ్రి ప్రసాదించిన కలల తొడుగు (డ్రీమ్‌కోట్) ధరించిన జోసెఫ్, ఈజిప్టు రాజుకు రోజూ వచ్చే కలలకు అర్థాలు చెప్పగలుగుతాడు. బైబిల్‌లో బాగా ప్రాచుర్యమైన ఈ కథ ఆధారంగా తయారైన చిత్రం, నాటకం నేటికీ అత్యంత ఆదరణీయ కళాఖండాలు. స్వప్న విచారణలను గురించి ప్రచారంలో ఉన్నదంతా అధికభాగం వట్టి ఊహాగానం. కలల చరిత్ర నిండా పరచుకుని ఉన్నది అనిర్ధారిత చింతనే అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.



విజ్ఞానశాస్త్రం ఎంత కట్టుకథలుగా కొట్టిపారేసినా కొన్ని సత్యావిష్కరణలకు స్వప్నాలే ప్రేరణలు కావడం ఓ విచిత్రం. ఐన్‌స్టీన్‌కి సాపేక్ష సిద్ధాంతం ఓ కొండవాలు ప్రయాణంలో పట్టిన కునుకులో తట్టిన రహస్యం. రాబర్ట్ లూయీ 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్', ఎడ్గార్ పోల్ ఎన్నో కథానికలకు స్వప్నాలే ప్రేరణలని వాటి కర్తలే స్వయంగా చెప్పుకొన్నారు. దుర్మరణానికి ముందే అబ్రహాం లింకన్ ఆ దారుణాన్ని దుస్స్వప్నంలో దర్శించినట్లు కథనం! ఏది స్వప్నం, ఏది సత్యం? ఎన్నడూ చూడని సన్నివేశాలు రంగుల కలలుగా అంధులకూ అనుభవం కావడం వెనక మర్మమేమిటి? గుండెకొండల మూలల్లో ఎన్నడో పారేసుకున్న స్మృతుల మూటను అర్ధనిద్రలో మనసు భుజాన వేసుకొని చూపించడానికి రావడమేనా 'కల' అంటే? పగటి కలలు నిజంగా పరమ అసత్యాలా? సావిత్రి సత్యవంతుణ్ని పరిణయానికి ముందే స్వప్నంలో సందర్శించి ప్రేమించింది- అంటే సందేహపడాలా... వద్దా? శిరస్సు పెద్ద ఆకారంలో కలలో కనిపిస్తే నిజంగా శుభకరమేనా? స్వప్నాల సత్యసంధతమీద మొదటినుంచీ మనిషికున్న సందేహాలు ఎన్నో! తాళ్ళపాక అన్నమాచార్యులవారికి పదహారో ఏట తిరువేంగడ నాథుడు కలలో కనిపించి రోజుకో సంకీర్తన రాయమని పురమాయించాడని... ఆ కల వచ్చిన వైనాన్ని తేదీతోసహా తాళపత్రాల్లో సైతం నమోదు చేశారే! కలలన్నీ కల్లలేనని మరి నమ్మడం ఎలా?! స్వప్నశాస్త్రం (ఓనెరాలజీ) కలల చిక్కుముడులను విప్పే పనిలో పడిందిప్పుడు. జర్మనీ మాక్స్ ప్లాంక్ మనస్తత్వవేత్తలు ఒక ప్రత్యేక అయస్కాంత యంత్ర సాయంతో కలకనే మనిషి మెదడు వివిధ భాగాల్లో జరిగే రసాయనిక మార్పులను అధ్యయనం చేస్తున్నారు. కలల గుట్టు విప్పే రోజులు సమీపంలోనే ఉన్నాయని, మనిషి మానసిక రోగచికిత్సకు ఈ పరిశోధనలు ఓ మైలురాయి కానున్నాయని శాస్త్రవేత్తల బృందనాయకుడు చెబుతున్నారు. కంటిరెప్పల వెనక నుంచీ ఉబికి వచ్చే ఈ మంత్రనగరి మాయామర్మం మనిషి ప్రగతికి మరో అంచెగా మారనుండటం మంచి పరిణామమేగా!
(eenaaDu sampaadakeeyam, 06:11:2011)
________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home