My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, January 18, 2012

తెలుగు వెలుగులు

తెలుగువారికోసం తెనిగించిన ప్రథమ సంపూర్ణ వైష్ణవ ప్రధాన తత్వకావ్యం నన్నయ మహాభారతం. ఆదికవిగా నన్నయను ఆదరించింది తెలుగుతల్లి. నన్నెచోడునివంటి శైవ ప్రజాకవినీ చేరదీసింది. హరిహరులకు అభేదం చాటుతూ గొప్ప నాటకీయతతో పదిహేను పర్వాలు భారతాన్ని అపూర్వంగా పూరించిన తిక్కనను అక్కున చేర్చుకుని ధర్మనిష్పక్షపాతాన్ని నిరూపించుకుంది. ఎర్రనవంటి ప్రతిభా ప్రబంధ పరమేశ్వరులు తెలుగుతల్లి కడుపున ఎందరో జన్మించారు. ప్రౌఢశైలి, శబ్ద గుంభన, పద మాధుర్యం, చమత్కృతులతో చమక్ మనిపించే మనుచరిత్ర, వసుచరిత్ర, కళాపూర్ణోదయం, విజయవిలాసం, పారిజాతాపహరణంవంటి ఆభరణాలు తెలుగుతల్లి ఒంటినిండా ఎన్నెన్నో! శ్రీనాథుని కాశీఖండం, పోతనామాత్యుని మహా భాగవతం, మొల్లతల్లి రామాయణం, కదిరీపతి శుకసప్తతి, అన్నమయ్య పదకవితలు, త్యాగయ పంచరత్నాలు, క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు, రంగాజమ్మ యక్షగానం... వేమన ధూర్జుటి కుమార కుమారి సుమతీ నీతిశతకాలూ... మన్నికైనవి ఇవీ అని- ఎన్నెన్ని చూపాలి? రాయలవారినుంచి బికారి యోగులవరకు- ఒకరినిమించి ఒకరు అమ్మకు సమకూర్చిపెట్టిన సొమ్ముల వివరాలను, వాటి తళుకు బెళుకులను వర్ణిస్తూపోవడానికి ఒక జన్మ చాలదు. తూర్పు చాళుక్యుల పాలన అంతటి పురాతనమైన తరువోజ అలంకారాలు, శతాబ్దాలకిందటి కందుకూరి శాసనమంత సుందరమైన 'సీస'లు, ద్విపదలూ తుమ్మెదపాటలు, గొబ్బిపదాలు, వెన్నెలపాటలు, వూయలగీతాలు, గౌడుగేయాలు, అభినయంతో కూడిన అలతులు... పెట్టెనిండా పట్టకుండా పొంగిపొర్లుతున్న అలంకారాలు- తెలుగుతల్లికి ఇంకెన్నెన్నో!

'చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో/ మెక్కిన భంగి... మక్కువ పళ్ళెరంబునస/ మాహిత దాస్యమనేటి దోయిటన్/ దక్కెనటంచు' రామదాసు జుర్రుకొన్నది రామరూప సుధారసమా, తెలుగుభాష సుందరరూప విశేషమా? రామదాసువంటి భక్తులను అనేముంది... సాక్షాత్ ఆ భగవంతుణ్నే అలరించిన సుమధుర భాషాక్షరాలు అఆలు. ఆంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయలవారికి కలలో కనిపించి గోదాదేవి కల్యాణ గాథను తెలుగులోనే రాయమన్న పురమాయింపునకు కారణం స్వయంగా శ్రీవారే సెలవిచ్చారు. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ' అని 'యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి' అని చురకా అంటించారు. రాయలవారు ప్రారంభంనుంచీ పెను ఆంధ్ర భాషాభిమాని. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనస్ఫూర్తిగా నమ్మిన భాషాపోషకులు. స్వయంగా 'తుళువు' అయినా తమిళ గోదాదేవి గాథను తెలుగులోనే రాయ సంకల్పించడానికి కారణం ఈ భాషమీది గాఢాభిమానమే. 'అక్షరం చివరను అచ్చుతో ముగించగల అజంత సౌలభ్యం ప్రపంచ భాషలన్నింటిలో ఇటాలియన్‌కి లాగా ఉన్నందువలనే తెలుగుకీ సౌందర్యం' అని ముందు గుర్తించినవాడు హాల్డెన్ దొర. 'వ్రాసిన- పద్య మాంధ్రమున వ్రాయవలెన్' అని దాశరథి అంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అప్పయ్య దీక్షితులవంటి ఉద్దండ తమిళ పిండమే 'తెలుగునేలపై పుట్టుక పూర్వజన్మ సుకృతఫలం' అన్నాక- తెలుగు ఘనతకు మరో ధ్రువపత్రం అవసరమే లేదు. మధ్యేమధ్యే స్వరం మారుతూ వచ్చినా శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంనాటి తెలుగు అక్షర సౌందర్యం, మాధుర్యం ఈనాటికీ అమరావతి స్తూపం రాతిఫలకమంత స్థిరంగా ఉంది. సరే! తెలుగువారి గుండెలమీదా అంతే స్థిరంగా ఉన్నదా? గిడుగు, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువావంటి మహామహులు తెలుగుతల్లి గుమ్మంలో వెలిగించిన గుమ్మటాల వెలుగులు వెలాతెలా తేలిపోతున్నాయి. అదే ఇప్పటి దిగులు.

తిరుపతి వేంకటశాస్త్రిగారొక శతావధాన సందర్భంలో 'మీసము రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు చెప్పగా' అని రోషంతో మెలివేశారని వినికిడి. దేవభాషలో దిట్టలై ఉండీ మాతృభాషాభిమానాన్ని సమానంగా చాటుకున్న శ్రీనాథుడి వారసత్వమది. 'అత్యంత సుకుమారి ఆంధ్రభాషా యోష/ ఆత్మీయ మొద్దుచెల్లి నాకు' అన్న ప్రేమ ఉందిగనుకనే శృంగారనైషధానికి చూపించిన శ్రద్ధ చాటువుల్లోనూ చూపించాడు. వామనభట్టువంటి దిట్టలున్న వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడికి విద్యాశాఖాధికారి పట్టం కట్టబెట్టింది ఈ తెలుగు దిట్టతనమే. అచ్చుకు తగినట్లు వర్ణక్రమాన్ని సంస్కరించి, ఎన్నో విస్తృత ఉద్గ్రంథాలను పండితుల సాయంతో పరిష్కరించడానికి బ్రౌన్ దొరను పురిగొల్పిందీ తెలుగు పలుకుబడిలోని తళుకు బెళుకులే! తరిగొండ వేంగమాంబ చేత- జనం నాలికలమీద నేటికీ కదలాడుతున్న సరళ తత్వాలను రాయించింది తెలుగుభాషలోని అజరామరమైన ఆ సౌందర్య లక్షణమే. కాలంతోపాటు వేగం పెరిగింది. వినిమయ విస్తృతికున్న ఎల్లలు చెదిరిపోయి ఇల్లే వైకుంఠమనుకునే కాలం చెల్లిపోయింది. అంతర్జాతీయ సాంకేతికావసరాలకు సరితూగటంలేదన్న వంకతో తల్లిభాషను చిన్నచూపు చూసే పెడధోరణి ప్రమాదకర స్థాయికి పెరిగింది! మాతృభాష కన్ను వంటిది. పరాయిభాష ఎంత ఘనమైనదైనా కళ్లజోడుకన్నా ఎక్కువ ఉపయోగానికి రానిది. తల్లిపేగు ప్రాణధార, తల్లిభాష జ్ఞానధార. తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే తల్లిభాషకూ ఉండదు. ఇన్ని కోట్లమంది బిడ్డలుండీ తల్లికి ఇల్లూవాకిలి లేకుండా చేయడం జాతికి శుభంకాదు. కంప్యూటరీకరణకు అచ్చుగుద్దినట్లు అమరే ఏకైక భారతీయ భాష తెలుగు లిపే. భావ వేగాన్ని సమర్థంగా అందిపుచ్చుకోవడంలో రోమన్‌వంటి యూరోపియన్ భాషలతోనే కాక మన దేవనాగరి లిపితోనూ పోటీలో ముందంజ వేసేది తేనెలొలుకు తీయని తెలుగుభాషే- ఇదీ, ఆమధ్య సైన్స్‌టుడే వ్యాస సారాంశం. కావాల్సిందల్లా ప్రస్తుతం తెలుగు వారందరికీ కాస్తంత ఆత్మగౌరవం. మన తెలుగును మళ్ళీ నిలబెట్టుకోవాలన్న గట్టి సంకల్పం! 

(ఈనాడు, సంపాదకీయం, ౦౮:౦౧:౨౦౧౨)
___________________________

0 Comments:

Post a Comment

<< Home