1092-సమర ధీర
వివిధ భావాల కలబోత వనిత. ఆగ్రహించినా, అనుగ్రహించినా ఆమే. ప్రణయినీ, ప్రళయ రూపిణీ నారీమణే. వెన్నెల కురిపించడమే కాదు, మంట రగిలించడమూ తెలిసినందునే అడివి బాపిరాజు ఉదాహరించినట్టు 'కిన్నెర్లు మీటించి శంఖాలు పూరించి' విలక్షణత చాటుకుంది తరుణి. ఆమె నవ్వితే సన్నజాజుల వాన జల్లు. కోపగిస్తే సాగర ఘోషణ, గగనాంగణ గర్జన. ఆరాధకులమీద కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసిన జగదంబ భవానీదేవే 'గండరగండడౌ మహిషు సర్వము కాలరాచిబ్ర/హ్మాండము దద్దరిల్ల మహా త్రిశూలమున' గుచ్చింది. ఆ జగత్కంటకుడి పీడ వదిలించాలన్న ఆర్తుల ప్రార్థన ఆ జగదేక మాత మదిని కదిలించిన పర్యవసానమే అది. సబలగా ప్రబలగా ఆ అంబిక మోగించిన సమర దుందుభి నభోమండలాన మోగిపోయిందానాడే! నరక సంహారానికి తరలివచ్చిన సాత్రాజితిదీ రౌద్ర రూపమే, భీకర నాదమే. సత్యసంగ్రామం తప్పదంటూ విజృంభించిన ఆ తల్లి ఆ లోక సంక్షేమ నిరోధినీ నిఖిల జీవ విరోధినీ సంహరించింది. గ్రామాల్ని దహించిన, పరకాంతల్ని చెరపట్టిన దురహంకారానికి తగిన శిక్ష అది. ఘటోత్కచుడితో మొదట పోరుకు సిద్ధమైంది సుభద్ర. తనయుడు అభిమన్యుడితో రథప్రయాణం సాగిస్తున్న ఆ నారీమతల్లి వరస తెలియక అడ్డుపడిన ఆ మంత్ర తంత్ర సేనా నేతతో ఒంటరిగానే తలపడింది. మాయావి ధాటికి కన్నకుమారుడు సొక్కి సోలిపోతే తానే ధనుర్బాణాలు ధరించిందామె. కరవాలధారిగా సంగ్రామ రంగాన దూకిన నాగమ్మది సైతం జయ స్ఫూర్తి.
విశాల భారత విమోచన పోరుసీమలోకి సుడిగాలిలా చొరబడిన ఝాన్సీ లక్ష్మీబాయిది పరాయి రాజుల పారదోలి స్వరాజ్యం నిలపాలన్న ఏకైక లక్ష్యం. ఒరలో తుపాకులూ నడుముకు కత్తులూ కట్టుకుని శిరస్త్రాణంతో, ఒళ్లంతా కవచంతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన ఆమె చాటిందొక్కటే- విజయం సాధించడం కంటే అందుకు పోరాడటంలోనే బలిమీ తెగువా ఉందని! వీరాంగన రుద్రమదేవిదీ శౌర్య ధైర్యాల గాథ. వీరవిహారం సాగించిన ఆమె అక్కడివారికి ప్రళయకాల మహోగ్ర భానుకిరణం, కల్పాంత కుపిత సాగర తరంగం. 'భండనమున చండప్రచండ మా/ ర్తాండమూర్తులై వెలగండోయ్/ కండకొవ్వుతో దండెత్తిన/ మొండి శిఖండుల చెండాడండోయ్' అంటూ సేనావాహినిని ఉరకలెత్తించిన ధీశాలి, సాహసశీలి ఆమె. శత్రుసేనల్ని తరిమితరిమికొట్టిన ఏకవీరాదేవిదీ సింహనాదమే. ఆ కాకతమ్మ భ్రుకుటిలో భీకర తరంగం, కంఠంలో కరాళ హుంకారం. పోరాటమంటే మాటలా? వీర విజృంభణకు మారుపేరుగా నిలుస్తుంది ధాత్రీతలంలోని పదాతిబలం. రంగత్తరంగ జలధిన సంఘటిత శక్తిగా సాగుతుంది నౌకాదళం. విహాయస వీధిలో మహోజ్జ్వలంగా కొనసాగి సంభ్రమాశ్చర్యాలు రేకెత్తిస్తుంది విమాన సేన. నేరుగా పోరు సాగించకున్నా, ఆ కుతూహల రాగాన్ని ఆలాపించిన స్త్రీలకూ కొదవ లేదు. కురుక్షేత్రానికి ముందు పాండవుల మంత్రాలోచన సందర్భం ఎంతో హృదయోద్వేగం. 'దుష్ట విధ్వంసన మాచరింప విలు దాల్పుడు, నిల్పుడు క్షాత్ర దీపికల్' అంటూ ఉద్బోధ చేస్తుంది పాంచాలి. విజృంభించి విరోధుల్ని నిరోధించాలని కుమారుడు అర్జునుడికి ప్రబోధిస్తుంది కుంతి. మంటలు రేపిన తుంటరుల్ని, చెలువల వలువలూడ్చిన తులువల్ని ఎంతమాత్రమూ మన్నించవద్దంటుంది. విజయశ్రీ కర్త వీక్షించినట్టు 'నరుడవై గాండీవ ధరుడవై నిరంకుశత్వాన్ని నిర్మూలించు' అంటుందా మాతృమూర్తి. మానవత్వాన్ని దోచుకున్న దానవత్వాన్ని ద్వేషించాలనీ, విజ్ఞానాన్ని ప్రదర్శించి అభిజ్ఞానాన్ని అందించాలనీ హనుమకు అమ్మ అంజన మార్గనిర్దేశం. గరుత్మాన్‌కి వినతా మాత సందేశం- చీకటింట స్వేచ్ఛాదీపం వెలిగించాలనే. అశక్తులైన అమరులకు స్వశక్తి అనుగ్రహించాలని, నక్తంచరుల చెర నుంచి అమరావతికి ముక్తి ప్రసాదించాలన్నది కన్నబిడ్డ శక్తిధరుడికి గౌరీ భవాని అనురాగపూర్వక విన్నపం.
ఒకరా ఇద్దరా... ఎందరో రణచరితలు. పతిభిక్ష కోరి యముణ్ని వెంబడించిన సతీ సావిత్రి ఆ దండధర గదాదండం బెండువోయేలా చేసింది. యమ దుర్గ ద్వారాలు బద్దలయ్యేలా, తన సతీ సామర్థ్యం మోత మోగేలా గర్జించిందా పడతి. 'మీర లవక్ర విక్రములు, మీ రణయాత్రలు చిత్రితమ్ములై/ భారత భారతీ కృతులపై నవకాంతి దనర్చు' అంటూ పతి అభిమన్యుణ్ని పద్మవ్యూహానికి సిద్ధపరుస్తుంది ఉత్తర. 'ఎదురొడ్డి నిలవడానికి మీరు జంకితే, నేనే పలనాడు రణాంగణానికి వెళ్తా'నంటూ బాలచంద్రుడికి ధైర్యసాహసాలు నూరిపోస్తుంది వీరపత్ని మాంచాల. శివాజీకి కర్తవ్యబోధ చేసిన తల్లి జిజియా, వీర మాతృపథమే తన ఇష్టార్థ సంసిద్ధి అంటుంది. ఆమె ఆరాధించిందీ జగజ్జనని దుర్గమ్మనే. ధర్మాచరణ దృష్టితో ప్రత్యర్థుల్ని ఎదిరించే యోధాగ్రేసరుల్ని ఏ శక్తీ ఆపలేదు. ముందుకు దూకే ఆ సమర శక్తి సంపన్నత కవి బాలగంగాధర తిలక్‌కి అగుపించినట్టు 'ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు/ సూర్యుడిని చూడు నా తలమీద పువ్వు' అనిపిస్తుంది ఎవరితోనైనా. వాయులీనం పైన కమాను లాంటిది కాలం. పలు రకాల భావాలు కలిగిస్తుంది, విభిన్న అనుభవాల్ని దరికి తెస్తుంది. ప్రతిభ, శక్తి, సామర్థ్యం కలగలిసిన స్థితిలో పురుషులతో ఎందులోనైనా పోటీపడి రాణిస్తున్నారు మహిళామణులు. సమర రంగంలో వనితల ప్రవేశం మీద ఇప్పటిదాకా ఉన్న విధి నిషేధాల్ని పక్కన పెట్టింది అమెరికా. ఇంతవరకూ సేవల రంగానికే పరిమితమైన లలనలు ముందుముందు ఆయుధాలు చేతపట్టి కదనానికి ఇదే అదనంటూ ఇక కదం తొక్కవచ్చు. నారీమణుల రణరంగ ప్రవేశం జయభేరి మోగించడంతో మొదలై, జైత్రయాత్ర సాగించడంతో పూర్తవుతుందన్న మాట.
(ఈనాడు , సంపాదకీయం ,24:02:2913)
______________________________________
Labels: Life/telugu, Personality, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home