1090- శుభ 'కరం'
జీవ గంధం, భావ బంధం... జీవితమంటే అదే. మనిషి అణువణువునా కణకణానా తొణికిసలాడేది ఆ సుధా మధురిమే. నేల నుంచి నింగి దాకా విస్తరించిన భావనాశక్తితో కరుణశ్రీకి కనిపించినట్టు 'గాలి పటంబు జీవితము, కట్టిన దారము బుద్ధి, పుణ్య పాపాలవి గాలిపాటులు'. వాలుగాలిలో అలవోకగా సాగినా సుడిగాలికి తల్లడిల్లి తూలిపడినా, పతంగు గమనానికి మూలం మానవుల చేతులూ చేతలూ. జీవన రంగంలో మంచికి, చెడుకు అనుక్షణమూ సమరమే. వైరి నామస్మరణనైనా భరించలేని దానవాగ్రణి ఎదుట కన్నకుమారుడు ఆ స్తోత్రమే సాగించాడు! రెండుచేతులూ జోడించి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' అనడం తండ్రి మండిపాటుకు మూలకారణం. ప్రహ్లాదకుమారుడి భక్తితత్పరత సహించని తత్వం అతడి మాత్సర్యాన్ని పెంచి చివరికి వినాశనానికే దారితీసింది. లోకకంటకుడి సంహారానికి తరలిన సాత్రాజితి 'సత్య సంగ్రామము తప్పదింక, నరకా! నరకాంతకు దోయిలింపరా' అని చేసిన హుంకారంతో అతడి చేతులకీ వణుకొచ్చింది. తపోదీక్షలోని హరుడు తనను చేరవచ్చిన పర్వతపుత్రి చేతినుంచి శాంతచిత్తంతో పూలూ ఫలాలూ అందుకున్నాడు. అదే సమయంలో తపోభంగానికి పొంచి ఉన్న మరుడు అతి పంతంతో సతి రతీదేవి చేతినుంచి విల్లందుకోవడం, రెండు శక్తుల పోరుకీ ఆరంభం. స్వయంవర సభాస్థలిలో ధనువును ఫెళఫెళ విరిచిన రఘుపతితో సీతాదేవి 'కన్నులు కరములు కలసిన వేళ' ఇతర రాచ వస్తాదుల్లో వెలవెల. పరీక్షించవచ్చిన దివ్యమూర్తి త్రయాన్ని తన వంటింట దోగాడే పసిబిడ్డల్ని చేసి గోరుముద్దలు, గుజ్జనగూళ్లు తినిపించిన సతీ అనసూయది చేతి తాలింపు కమ్మదనం.
పొత్తిళ్ల బిడ్డను పూలగుత్తులమీద పడుకోబెట్టి ఒత్తుకోకుండా చేతితో ఒత్తిచూసింది కుంతీకుమారి. లోకనిందను వూహించనైనా లేని ఆ లలామ తన చిట్టితండ్రిని బజ్జుండబెట్టిన పెట్టెను కంపించే చేతులతో నీటిలోకి వదిలింది. ఏటి కెరటాలలో అది సాగిపోతుంటే, చేతులు చాచి ఆమె చేసిన రోదన హృదయవిదారకమే. నాథుడి ప్రాణాన్ని వెంట తీసుకుపోతున్న యమధర్మరాజును వెంబడించి, పలువిధాలుగా అర్థించి సఫల మనోరథగా నిలిచిన సతీ సావిత్రిదీ విజయహస్తమే. ఇక కవి కృషీవలుడు పోతన చేతిలోది గంటమా, ములుగర్రా? ఆయన అరచేతులు వాచింది గంటపు రాత వల్లనా లేక నాగలి మేడి పట్టి సేద్యం చేసినందునా? అది మెత్తని చేయి, ఆయనది సుతిమెత్తని చిత్తం. అందులోనుంచి అంత సుందర భాగవతం వెలువడిందంటే 'ఎంత బంగారు హస్తమది!' అని కైమోడ్పులందించింది కవి గళం. 'కొసరి చల్దులు మెక్కు పిల్లల వేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు'ను తెలుగువారందరికీ రుచి చూపించిన ఆ కవితామృతకర్తకు జోహారు చేసేందుకే లేస్తాయి అందరి చేతులూ. ముకుళిత హస్తాలతో వందనాలందిస్తూ సాదరంగా ఎదురొచ్చిన అక్రూరుడిని చూసి పులకిస్తాడు కృష్ణుడు. ఆ భక్తజన వశంకరుడి కరాన కంకణం, కరతలాన వేణువు. వరాలనిచ్చే గణపతికి కరాలు జోడించి మొక్కుతారు ఆరాధకులు. 'భజించే హస్తాలే హస్తాలు, ఆ కరాలే స్వామి వశీకరాలు' అన్నది రామదాసు అనుభవం. 'శ్రీపతినే పూజించిన కరములు' అన్నమయ్యవి. సీతాసాధ్వి వినిర్మల అంతరంగానికి కళ్లు తడవని వాళ్లుండరు, మొక్కని చేతులూ ఉండవు. మరి కరకమలం సదా ఆనందప్రదమే, కరచాలనం బహుధా శుభదాయకమే. చేతివేళ్లతో సమంత్రంగా చేసేది కరన్యాసమైతే, చిత్తశుద్ధితో సాగించేది కరసేవ. భక్తిశ్రద్ధలతో ముందుకు సాగితే ఎన్ని విద్యలైనా ఎన్నెన్ని శాస్త్రాలైనా కరతలామలకం. చతుష్షష్టి కళల్లోనూ చేతులతో సాగించే చిత్ర, వాద్య ప్రక్రియలకు సమధిక ప్రాధాన్యముంది. వివేక వికాసాలు ప్రసాదించే పుస్తకాలు హస్తభూషణాలు. శుభాలూ సుఖాలూ కలిగించడమన్నది కొందరి హస్తవాసి. రణభూమికి వెళ్లక తనతో సరస సల్లాపాలు సాగిస్తున్న భర్త బాలచంద్రుడితో మాంచాల 'తమరింక చేతులన్ బంగరుగాజులన్ దొడిగి భద్రము గండిట చాటుమాటుగన్' అనడం అతడి కర్తవ్య శూరతను స్ఫురణకు తేవడమే!
రాధామాధవులు ప్రణయమయ నిత్య నూత్నమైన జంట. విహార తీరానికి కాస్తంత ఆలస్యంగా వచ్చిన ఆయన విరిదండ సంకెళ్లు, పూబంతుల తాకిళ్లు కోరితే 'సొక్కిసోలిన నీ మోము చూడగలనె? చేతులెట్లాడు నిన్ను శిక్షింప నాథ' అంటూ బాహువులతో ప్రేమ బంధితుణ్ని చేస్తుందామె. 'చక్కని గోపాలా! చేతికి చిక్కని గోపాలా!' అని మువ్వగోపాలుడితో మురిపాలాడటమూ అనురాగ సూచకమే. చేతులు కలిసిన తరుణంలో ఆనందాల హరివిల్లు వెల్లివిరియదూ? చెంత చేరి చేతులు చాచిన ప్రేయసీ ప్రియుల్లో అపార రసానుభూతి పొంగిపొర్లుతుంది. 'ప్రణమిల్లి యడుగుల బడుటయే కాని/ చేతులారంగ సేవ జేయనేలేదు' అన్న వేంకట పార్వతీశ కవుల భావ గాఢతా ఇక్కడ ఆపాదించదగ్గ సందర్భమే. కరములు కల్యాణ కరములే అయినా చేతులు ముడుచుకోవడం, కట్టేసుకోవడం, దులుపుకోవడం, చేతచిక్కడం, చేజారడం, చేయి విడవడం వంటివీ అనేకమున్నాయి. సుమకోమల హస్తాలే కాదు- భస్మాసుర హస్తాలూ ఉన్నాయి ఇలలో! మానవ పరిణామ చరిత్ర ప్రకారం 'చేతులున్నది పోరాటానికే' అంటోంది అమెరికాలోని యూటో విశ్వవిద్యాలయ అధ్యయన బృందం. పిడికిళ్లు బిగించి యుద్ధం చేసి ఆత్మరక్షణ, శత్రునిర్మూలన సాధించడమే కీలకాంశమంటున్నారీ శాస్త్రవేత్తలు. చేతులంటూ ఉన్నది అందుకు మాత్రమే కాదు, అవి చేసిందీ చేస్తోందీ చేయాల్సిందీ ఎంతెంతో అనుకోవడమే- సకల మానవాళికీ శ్రీకరమూ శుభకరమూ.
(ఈనాడు , సంపాదకీయం , 20:01:2013)
__________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home