My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, May 15, 2013

1163- పెద్దలకూ పరీక్షే!!

విద్య ఓ ధనం. అది అక్షయం. విద్య ఓ దీపం. మనిషికి అదే ప్రకాశం, వికాసం. వాటికి తోడు విద్యార్థిని వినయం, యోగ్యం, ధర్మం, సుఖం వరిస్తాయి కాబట్టే అతి ప్రధానమూ విశ్వవర్ధనమూ విద్యే. 'శ్రుతుల తత్వార్థ సంహితలెల్ల బఠియించి/ స్మృతుల నానార్థ సంగతులు చదివి' ప్రజ్ఞతో సర్వజ్ఞత సంతరించుకున్నాడు బాల గౌతముడు. నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని, అఖిలాస్త్ర శస్త్ర రహస్యాల్ని సొంతం చేసుకున్న ఆ రాజ నందనుడు 'సిద్ధార్థ' కావ్యకర్త అవలోకించినట్టు 'తంత్రవాదనముల యంతస్సారమూహించి/ మంత్రవాదమ్ముల మర్మమరసి' సమస్త విద్యాఫలాల మధురిమనీ ఆస్వాదించినవాడయ్యాడు. సూచక, వాచక, బోధక మార్గాలతో పాటు అలలూ గాలులూ శిలలూ వూయలలూ లేళ్లూ సెలయేళ్లూ ఎన్నో పాఠాలు నేర్పాయా బాలకుడికి! అంతకుముందు ప్రహ్లాద కుమారుడూ 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ' అంటూ కుశాగ్రబుద్ధిని చాటుకోలేదూ? అకార ఉకార మకారాలతో రూపుదిద్దుకున్న బీజాక్షరం 'ఓం'తో మొదలైన అక్షరాభ్యాసం కూసువిద్యగా మారడమే కాలక్రమ పరిణామం. శ్రవణం, మననం, జ్ఞానం, ధ్యానం తదితరాలన్నీ అందులోని భాగాలే. 'చదివిన సదసద్వివేక చతురత గలుగున్' అని ప్రస్ఫుటపరచిన పోతనకవి చదువుల తల్లిని స్తుతించిన వైనమూ హృదయానంద దాయకమే. 'శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార' అంటూ రసవాహినిలా కొనసాగిన ఆ అక్షరధార సరస్వతీదేవికి సమర్చన. పుస్తక ధారిణిగా విజ్ఞాన ధనాన్ని, వీణాపాణిగా లలితకళా వికాసాన్ని ప్రత్యక్షంచేసిందా చైతన్య స్వరూపిణి. ధారాప్రవాహానికి, కాంతి కిరణ ప్రసరణానికి ఆది దేవతగా నిలిచిన ఆమే విద్యాధరీ వాగీశ్వరీ సకల సంపత్తులకీ అధినేత్రీ!

'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అనడంతోనే, మనోమందిరమంతటా ఆ విద్యామయే నిండుతుంది. అక్షరలక్షల భావ సంపదను ప్రసాదించే అంతటి శక్తిసంపన్న సుస్థిరస్థానం కవిగాయక వైతాళిక హృదయపీఠి మీదే. సారస్వతపుర సామ్రాజ్యమైనా సంగీతామృత సాగరమైనా ఆ దేవేరి కనుసన్నలలోనే. అగణిత పదయుతగా అద్భుత పదనుతగా వెలుగొందే ఆమే వాణీ గీర్వాణీ వివేక మూలకారిణీ. 'చతురాశ్రమములు నీ జీవనసూత్రం/చతుర్వేదములు నీ పావనగాత్రం/చతుర్థామముల హృది వీధిని వినిపించినది నీ సమతానాదం' అని కవిగళం చతురమతి ప్రస్తుతి చేసిందీ అందుకే. సత్యమే సాహిత్యం, సౌభ్రాత్రమే మిత్రం, సౌశీల్యమే జీవం, స్వాతంత్య్రమే దైవం అయినప్పుడు జీవితమంతా జయమూ శుభమే. ఎప్పుడైనా ఎక్కడైనా సారవంత మనోభూముల్లోనే చదువు సేద్యం సుభిక్షమవుతుంది. శ్రమరక్షణ, క్రమశిక్షణ, సమవీక్షణలే గురుదక్షిణలైన వేళలో దాశరథిలా 'తల్లీ భారతి వందనం/ నీ ఇల్లే మా నందనం/ మేమంతా నీ పిల్లలం/ నీ చల్లని ఒడిలో మల్లెలం' అని ప్రతి ఒక్కరి మదీ పరవశించి పాడదా మరి! భవంతి ఎంత మహోన్నతంగా ఉన్నా, దాని ఉనికికి పునాదే ఆధారం. ఆ రీతిలోనే, జీవితంలో సమున్నత స్థాయికి చేరేందుకు ప్రధానం- చదువూ, అది అందించే ఉపాధీ. చదువుసంధ్యలు మనిషికి మూడో నేత్రం, జీవనానికి గౌరవపాత్రం. మనిషి పుట్టేది మంచిని పెంచేందుకే. చదువు నేర్చేది ఉత్తమత్వాన్ని పొందేందుకే. ఆ ఉన్నతత్వమే ఉత్తమత్వమే ఉదాత్తతకు రహదారి. కానీ 'రసజ్ఞతా స్థితిన్ పొందగలేని విద్య పరిపూర్ణత నిచ్చునె, శాంతి నించునే' అన్న గరికిపాటి ప్రశ్నకు సమాధానమేదీ? 'అందరకందలేదు సరే, అందినవారలకైనగాని ఏ/మందినదందులోని పరమార్థ విశేషము?' అని ఆ కవే సంధించిన మరో ప్రశ్నాస్త్రానికీ బదులు రావాలి. చదువుల సుమపరిమళాలు అన్నిటా అంతటా గుబాళిస్తేనే, ఆ ఆస్వాదనలో మానవాళి పులకిస్తేనే కృతార్థత, సార్థకత. చదివినంతసేపూ ఆసక్తి ఉన్నప్పుడు, చదివింది పరీక్షల్లో రాసేంత శక్తి నిండినప్పుడు భావిపౌరులైన నేటి బాలలతో నవభారతికి శుభోదయమే కదా! విద్య అన్నది ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే ఉండిపోయే జడపదార్థమేమీ కాదు. అదో సత్తా, సత్తువ, శోధన, సాధన. వాటిని ఫలప్రదం చేసేందుకే శిక్షణలూ పరీక్షలూ.

ప్రకృతి ఒడే అందరికీ బడి. అక్కడ లిఖితమైనా, మౌఖికమైనా, మరోటైనా ప్రతీ పరీక్షా మరో పరీక్షకు పునాదే. ఆశాభావమంటూ ఉండాలే కానీ, ప్రతి ఒక్కటీ ఒక్కొక్క సదవకాశం. ఆధునిక కవిగళం పలికినట్టు 'గడిచిన గతాల గోతులు తవ్వి/ నీతులు వెతికి కోతలు అతికి/ చరిత్రకు పూతలు గతికి/ అచ్చేసిన కాగితాలు బతుకుల్ని ఉద్ధరించవు!' పిల్లల మనసులన్నీ అప్పుడే సాగుకు సిద్ధంచేసిన నేలల్లాంటివి. ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి మొక్కలే అక్కడ మొలకెత్తుతాయి. అక్కడంతా విజ్ఞాన బీజాలతో వికాస ఉద్దీపన. ఎవరికి వారు నిలవాల్సిందే, ఎప్పటికప్పుడు గెలవాల్సిందే. 'పూటపూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పిచే మేను తల్లడిల్ల/ బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ క్రుంగిపోవ/ తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధ నరయలేరె' అన్న నరసింహ కవి ఆక్రోశాన్నీ తలచుకున్న మరుక్షణాన పెద్దల మదిలో మెదిలేదేమిటి? ఒత్తిడిని చిత్తుచేసే, 'తులాభారాల'ను దూరంచేసే చదువే చదువు. అతి సవాలు కాని, అసలు సమస్యే ఉండని, కత్తిమీద సాము కానేకాని పరీక్షే పరీక్ష. నేటి పరీక్షలూ వాటిలో ఉత్తీర్ణతలూ పిల్లలకా, పెద్దలకా అన్న పోటీ ప్రశ్న ఉదయించని శుభక్షణం కోసమే ఆలోచనాపరుల నిరీక్షణ! 
(ఈనాడు , సంపాదకీయం ,17:03:2013)
_____________________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home