1234 -బోఫోర్స్ ఖత్రోచి మృతి
గుండెపోటుతో ఇటలీలో కన్నుమూత
శతఘ్నుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా నమోదు
అరెస్టు తప్పదనుకున్న తరుణంలో భారత్ నుంచి జారుకున్న వైనం
19 ఏళ్లపాటు దర్యాప్తు చేసిన సీబీఐ
2011లో ఖత్రోచికి కేసు నుంచి విముక్తి
భారత రాజకీయాల్ని కొన్ని దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన.. ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసిన భోఫోర్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 74 ఏళ్లు. ఇటలీలోని మిలన్ నగరంలో ఖత్రోచి శుక్రవారం మరణించారని, అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలియజేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతోపాటు ఆయన కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన ఖత్రోచి.. బోఫోర్స్ తుపాకుల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాడు. భారత్‌లో అరెస్టు కాకుండా తప్పించుకొని బయటపడ్డాడు. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయటంతో.. దేశదేశాల్లో తలదాచుకున్నాడు. చివరికి 2011లో ఆయనను ఈ కేసు నుంచి ఢిల్లీ కోర్టు విముక్తుని చేసింది.
పాతికేళ్ల నేపథ్యం: భారత సైన్యానికి హోవిట్జర్ అనే పేరున్న శతఘ్నులను విక్రయించటానికి స్వీడన్ కంపెనీ ఎ.బి.బోఫోర్స్ కాంట్రాక్టు కుదుర్చుకుంది. రూ.1,437 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఇరుపక్షాల మధ్య 24 మార్చి 1986న కుదిరింది. అయితే, మరుసటి ఏడాదే ఈ ఒప్పందం వెనకాల భారీ అవినీతి వ్యవహారం నడిచిందని స్వీడిష్ రేడియో వెల్లడించింది. కాంట్రాక్టును దక్కించుకోవటానికి భారత్‌లో ఉన్నతస్థాయి రాజకీయ నేతలకు, సైన్యంలోని ఉన్నతాధికారులకు బోఫోర్స్ కంపెనీ లంచాలు ఇచ్చిందని తెలిపింది. ఇది భారత్‌లో పెను సంచలనం సృష్టించింది. భోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి ఏమీ జరగలేదని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ లోక్‌సభలో ప్రకటించారు. కానీ, ప్రతిపక్షాలు వూరుకోలేదు. దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం లేచింది. ఫలితంగా 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ పరాజయం పాలైంది. తర్వాత సీబీఐ ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. శతఘ్నుల కాంట్రాక్టు కోసం భోఫోర్స్ కంపెనీ రూ.64 కోట్ల లంచాలు చెల్లించిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. భోఫోర్స్ కంపెనీకి.. భారత రాజకీయ నేతలకు, సైన్యాధికారులకు మధ్యవర్తిగా ఖత్రోచి వ్యవహరించాడు. ఆ సంగతి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. తన అరెస్టు తప్పదని తెలిసి ఖత్రోచి 1993లో భారత్ నుంచి జారుకున్నాడు. అనంతరం జరిగిన దరాప్తులో ఖత్రోచి పాత్ర వెల్లడి కావటంతో ఆయన అరెస్టుకు సీబీఐ వారెంట్ జారీ చేసింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ కూడా రెడ్‌కార్నర్ నోటీసు విడుదల చేసింది. దీంతో ఖత్రోచి పలుదేశాలు మారుతూ వచ్చాడు. మలేసియా, అర్జెంటినా తదితర దేశాల్లో తలదాచుకున్నాడు. అయితే, ఆయా దేశాల నుంచి ఖత్రోచిని పట్టుకోవటం కోసం సీబీఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి, దీనికోసం సీబీఐ అంత తీవ్రంగా ప్రయత్నించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఖత్రోచి అప్పగింత కోసం సీబీఐ న్యాయపరంగా సరైన పత్రాలను కూడా తమకు సమర్పించలేదని అర్జెంటినా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు అద్దం పడతాయి. ఏళ్లు గడిచినప్పటికీ ఈ కేసు విచారణ మాత్రం ఢిల్లీలో కొనసాగుతూ వచ్చింది. ఇతర నిందితులందరూ చనిపోయారు. ఖత్రోచి ఒక్కడే మిగిలాడు. ఈ నేపథ్యంలో సీబీఐ 2009లో భోఫోర్స్ కేసు అన్వేషితుల జాబితా నుంచి ఖత్రోచి పేరును తొలగిస్తూ, అతనిపై తాము నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకుంటామని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. 2011లో ఖత్రోచికి ఈ కేసు నుంచి శాశ్వతంగా విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
________________________________________
ఖత్రోచి చరిత్ర
వృత్తి రీత్యా చార్టడ్ అకౌంటెంట్. ఆయన 1984 నుంచి 1993 వరకు శ్నామ్ ప్రొగెట్టి సంస్థకు ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నారు.
భార్య మరియాతో కలిసి 1993లో కౌలాలంపూర్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి 2004లో మిలాన్ చేరుకున్నారు.
బోఫోర్స్ ఒప్పందంలో కుట్రకు, మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై భారత శిక్షాస్మృతి 120బి, 420 సెక్షన్ల కింద అభియోగాలు దాఖలయ్యాయి.
__________________________________________
భాజపా సృష్టించిన భూతం ఖత్రోచి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఖత్రోచి భాజపా సృష్టించిన భూతమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు విపక్షం ఆయన పేరును పదేపదే లాగేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శనివారం.. ఖత్రోచీ మీద ఆరోపణలను ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే ఢిల్లీ హైకోర్టు కొట్టేసిందన్నారు. భాజపా సృష్టించిన భూతం మరణం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. సింఘ్వీ ఆరోపణలను భాజపా నేత ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. కాంగ్రెస్ ఆతిథ్యం ఇచ్చింది కాబట్టే భూతం వచ్చి కూర్చోగలిగిందని వ్యాఖ్యానించారు.
________________________________________
0 Comments:
Post a Comment
<< Home