My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, June 28, 2013

1229 - నవ్వు అరవై విధాల మేలు


 హాసాన్ని ఈశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' ఆదిదేవుని ఈ సంస్తుతే ఇందుకొక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి కిలకిలల నవ్వు! ఎవరికి వారు ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం, సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఈ కథ ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసుర వధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటారు పోతన. భామ మందహాసం అదే. హరిని అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం చవితి చంద్రుడు ఏ భావంతో తేరిపార చూశాడో... నిందల పాలయ్యాడు. హాసానికి, పరిహాసానికి మధ్య పలుచని మేలి తెర మూలకంగానే భారతంలోనూ సాధ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాల పాలైంది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అని హాసపరిమితుల మీద మనకొక శతక పద్యమూ ఉంది. 'కారణము లేక నవ్వును... ప్రేరణమును లేని ప్రేమ... వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.
 

'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలం మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి ఉత్తమ గౌరవమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచినా, పదాలు అడ్డదిడ్డంగా కూర్చినా, చేష్టలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా... ఇంకా సవాలక్ష ఏవో వంకర టింకర విన్యాసాలు ప్రదర్శించైనా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను రాబట్టవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు, కన్నుల నిప్పురాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని మిగతా మరో ఎనిమిది... మొత్తం ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రల రసపోషణ రసప్లావితంగా చేసి 'ఓహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాల గురించి కాళిదాసు మొదలు దేవరాయల వరకు, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి దాకా అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకన్నా మిన్నగా శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేశాం.  'ప్రపంచ నవ్వుల దినం' (మే మాసపు మొదటి ఆదివారం) ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!

ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధులకు ఎన్నో అధ్యయనాలు, మరెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా అవి? వీలున్నంత దాకా మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు సరికదా- ఆరోగ్యానికి అరవై రకాల మేలు. చాలా అధ్యయనాల్లో ఉల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగ గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాస చికిత్సా విధానం నవ్వుల దినోత్సవ నేపథ్యం. ఎలాంటి కారణం లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు... ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయి. నవ్వు రక్తవాహికలను విశాలం చేస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకొంటుంది. వందలాది లాభాల్లో ఇవి కొన్నే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తి నవ్వు పది నిమిషాల వ్యాయామ లాభానికి సమానం. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటు రాయిలాగా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపక నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం
(మే మాసపు మొదటి ఆదివారం)హాస దినోత్సవ సంబరాల వెనకున్న స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీద ఉంది. అదే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా! 

(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)
________________________________________

Labels: , , , ,

0 Comments:

Post a Comment

<< Home