1276-ఎలుగెత్తి పిలిచే వెలుగు
ఆశించటం, అది సాధించేందుకు తపించిపోవటం, పోటీపడీ పోరు సాగించీ విజయానందం అందుకోవటం... జీవితం! ఆ ఆరాటంలో, పోరాటంలో ఉన్న సాధనాలన్నీ వినియోగించి, అన్ని సాయుధబలగాల్నీ మోహరించి వడివడిగా ముందుకు సాగే మనిషికి నాళం కృష్ణారావు కవి దర్శించిన 'పట్టుదల బూని చేయుమా పనులనెల్ల/ కాలమే సమకూర్పగలదు ఫలము' అన్నదే అనుభవానికొస్తుంది. పరిశీలన, అనుశీలన కలగలిసిన వ్యూహరచనతో ఇతర గుణగణాలూ జతకడితే, విజయాలు పరంపరగా సిద్ధించి మానవుణ్ని మాననీయుణ్ని చేస్తాయి. ఏనుగు లక్ష్మణకవి విపులీకరించిన 'ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందు దాల్మియున్/ భూ సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ, మాజి బా/హా పటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధి' ప్రకృతిసిద్ధ లక్షణాలే కాక మానవాళి పాలిట ఆయుధాలూ సాధనాలూ. రాజనందనుడైన సిద్ధార్థుడు నాడు శ్రుతులు, స్మృతులు, సంహితలతో పాటు నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని గడించాడు. అఖిల అస్త్రశస్త్ర రహస్యాలు, తంత్రవాదనల సారాంశాలు, యంత్రవాదాల లోలోని మర్మాలూ గ్రహించి సర్వజ్ఞుడయ్యాడు. 'ఉపాయపూర్వకమగు విపులయత్నము సర్వార్థ సాధకము' అన్నట్లు బాణ ప్రయోగ కళాదక్షుడిగా, ఖడ్గచాలనాది విద్యాపారీణుడిగా వీరాధివీరత్వాన్నీ సొంతంచేసుకున్నాడు. అటుతరవాత భోగభాగ్యాల్ని వదిలి, భార్యాబిడ్డల్నీ వీడి శాశ్వత జ్ఞానసాధన దిశగా తరలివెళ్లిన అతడి మేధోసంబంధ ఆయుధం- తత్వచింతనే!
పూర్వాపరాల ఆలోచన, ప్రత్యేకమైన అభిరుచి, అవిశ్రాంత కృషి కారణంగానే ఫలితం ప్రాప్తిస్తుంది. 'ధనమునకు దానమును, తప/మున కాచారమును, రాజ్యమున కాజ్ఞయు, జీ/వనమునకు యశము, విద్యకు/వినయంబును, నీతులకు వివేకము ఫలముల్' అని పలికిన సుభాషితకర్త అంతరార్థమూ సాధనాల ప్రాధాన్యమే. దానవులతో కలిసి క్షీరసాగర మథనం చేసిన దేవతలు భయాలకు లొంగలేదు, ప్రలోభాలకు దాసులు కాలేదు. అమృతభాండం లభించేవరకూ ప్రయత్నం మానలేదు. కనుకనే కృతనిశ్చయం వదలని నిపుణమతులయ్యారు. నగములు కంపించేలా గగనానికెగసి ప్రత్యర్థుల్ని భయకంపితుల్ని చేసిన గరుత్మంతుడిది రెక్కల బలం. యమధర్మరాజును వెంటాడి, పతి ప్రాణాల్ని తిరిగి దక్కించుకొన్న సావిత్రిది అపార ధైర్యం. 'ధర్మదేవతా, సూర్యచంద్రాదులార/ పంచభూతమ్ములార, దిక్పాలులార/ నన్ను రక్షింపరే నాథునకు వచించి' అంటూ నిండుసభలో సత్యపోరాటం సాగించి గెలిచిన శకుంతలది నిరుపమాన సాహసం. తనయుడు అర్జునుణ్ని ద్వాపరంలో ఆయుధంగా, సాధనంగా మలచింది తల్లి కుంతీదేవి. 'పరమశివుణ్ని ఆరాధించి పాశుపతం సంపాదించు, కదనభూమిలో విజృంభించి విరోధుల్ని నిరోధించు' అని ఆశీర్వదించి పంపింది. 'వెలుగు నిన్ను ఎలుగెత్తి పిలుస్తుంది, చీకటి నీకు దూరంగా నిలుస్తుంది' అంటూ త్రేతాయుగంలో కుమారుడు హనుమను దీవించి జాగృతపరచింది అంజన. 'నీ మాతను వీరమాతను చేయి, నీ జాతికి నవజీవం పోయి' అని కృతయుగంలో ప్రబోధించి బిడ్డను కార్యనిర్వహణ దీక్షాదక్షుణ్ని చేసింది వినత. కర్తవ్యాన్ని విస్మరించి కురుక్షేత్రంలో చేష్టలుడిగి కూర్చున్న ప్రియతముణ్ని 'లెమ్ము ధనుంజయా! విధి బలీయము, న్యాయము గెల్చు, నిల్చు స/త్యమ్ము, నశించు స్వార్థము, సదా యుగధర్మమిదే గదోయి' అని తట్టిలేపిన కృష్ణపరమాత్ముడిదీ కార్యసాధన తత్వమే. 'అంగత్రాణ కృపాణ బాణధరులై యంగమ్ము లుప్పొంగ, దు/స్సంగ స్వార్థ మదేభ కుంభములపై సంగ్రామ రంగమ్మునన్/ సింగమ్ముల్ వలె దూకి' పాండవవీరులు విజృంభించటానికి ఆ చైతన్య సమరభేరే కారణం. సకల శుభాలు, విజయ పరంపరలు ప్రసాదించే దుర్గమ్మ హస్తాలనిండా ఆయుధాలే కనిపిస్తాయి. సదాశయానికి వినియోగించే ప్రతి సాధనమూ ఆయుధమే. అక్షరం, ఆత్మవిశ్వాసం, గుండెబలం, విద్య, వినమ్రత, సమయస్ఫూర్తి... అన్నీ ఆయుధాలే, సాధనాలే. అందుకే 'బలిమి జేయరాని పని యెట్టిదైన/ ఉపాయబలము చేత జేయవచ్చు' అన్నారు 'చిత్రభారతం' కర్త.
సాహసం పథమైనప్పుడు, పట్టుదల ప్రధానమై పౌరుషమే ఆయుధంగా మారుతుంది. 'పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు/ పట్టెనేని బిగియ పట్టవలయు' అని హితవుచెప్పిన వేమన 'పట్టరాని పట్టు పట్టియుండినవాడు/ పుడమిలోన కీర్తి పొందలేడు' అంటూ హెచ్చరికా చేశాడు. ఆయుధ ప్రయోగానికైనా, సాధనాల వినియోగానికైనా పట్టువిడుపులు ఉండాలన్నది మానవ జీవన మంతటా నిండాల్సిన అంతస్సూత్రం. జ్ఞానసాధనమైన మెదడుతో పురోగమిస్తున్న విశ్వం 'శ్రమయేవ జయతే' సిద్ధాంతాన్నీ విశ్వసిస్తోంది. విశ్లేషించి చూస్తే, సంజీవదేవ్ అన్నట్లు 'తెలివిలేని శ్రమ కానీ శ్రమలేని తెలివికానీ అంతగా ఉపయోగపడవు. తెలివి, శ్రమ... రెండూ కలిసినప్పుడే ఏ పనిలోనైనా సఫలత'. కార్యసాఫల్యానికి కావాల్సింది సమాచరణ. వెనుక కాచుకుంటూ, ముందు చూసుకుంటూ సజావుగా పని సాగించటంలోనే జీవిత పరమార్థముంది. జగజ్జనని దుర్గను విజయదశమి అరుణోదయ వేళలో ఆరాధించిన జిజియా- బాలశివాజీకి చేసిన ఉద్బోధా అదే. మహాకాళి మృగేంద్ర వాహనమెక్కి కదిలి దనుజ మర్దన జరిపిన మహత్తర దినమే దశమి. 'పంచతంత్రం' కర్త తేల్చిచెప్పినట్లు 'లోకంలో సమర్థులకు అసాధ్యమన్నదే ఉండదు'. పనినే ఆయుధం, సాధనం చేసుకొని ప్రతివ్యక్తీ కదిలినప్పుడు ఆశాజ్యోతి జ్వలిస్తుంది, సాధన నిలుస్తుంది, తపస్సు ఫలిస్తుంది !
(ఈనాడు ,13:10:2013)
____________________
Labels: Life/telugu, Religion/personality/telugu, Self development/Telugu, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home