1406- ఆర్థిక విజయానికి సూత్రాలివి!
(eenaaDu, Friday, April 11, 2014)
______________________
సంపాదించే ప్రతి రూపాయికీ ఓ పరమార్థం ఉండాలి.
ఖర్చు చేసేప్పుడూ ఒక లెక్క ఉండాలి.
పెట్టుబడి పెట్టినా ఓ పద్ధతి ఉండాలి.
వచ్చిన డబ్బంతా వెనకయ్యలేం.. అలాగని మొత్తం ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది తప్పదు.
అందుకే, డబ్బు విషయంలో కొన్ని సూత్రాలు, జాగ్రత్తలు పాటించాలి.
ఒక్కో వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. అవసరాలూ వేర్వేరుగా ఉంటాయి.. ఆర్థిక విషయాల్లో ఎవరికి వారే అయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం సాధారణంగా అందరికీ ఒకేలా వర్తిస్తాయి. వాటి గురించే తెలుసుకుందాం!
(1)ఎప్పుడయ్యేను రెట్టింపు:-
మన సొమ్మును ఒక చోట పెట్టుబడి పెడుతున్నామంటే ఎంతోకొంత రాబడి ఆశించే కదా! అయితే, ఎంత రాబడి వస్తే మన డబ్బు ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందన్న విషయం మనకు తెలుసుండాలి. బీమా పాలసీలు తీసుకున్నా, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో జమ చేసినా, ఫండ్లలో పెట్టుబడి పెట్టినా రాబడి ఎంత వస్తుందో తెలిస్తే చాలు.. రెట్టింపు కోసం ఎన్నాళ్లు ఆగాలో తెలుసుకోవచ్చు.
దీనికోసం ఒక సూత్రం ఉంది. అదే 'రూల్ 72':-
దీని ద్వారా మన సొమ్ము నిర్ణీత సమయంలో రెట్టింపు కావాలంటే ఎంత రాబడి రావాలి తెలుసుకోవచ్చు. లేదా రాబడి ఆధారంగా ఎన్నేళ్ల సమయంలో మనం అనుకున్న ఫలితం వస్తుందో గణించవచ్చు.
ఎలా?:
[i] రాబడి శాతం ఎంత రావాలో తెలుసుకోవడానికి.
72/సంవత్సరాలు. అంటే పదేళ్లలో మీ సొమ్ము రెట్టింపు కావాలంటే.. కనీసం 7.2 శాతం రాబడి రావాలన్న మాట. (72/10=7.2)
[ii]మీరు పెట్టుబడి పెట్టిన పథకం 8 శాతం రాబడి ఇస్తుందనుకుందాం.అప్పుడు వీటిల్లో పెట్టిన మన సొమ్ము రెట్టింపు కావడానికి కూడా ఇదే సూత్రం వరిస్తుంది. 72/8 = 8.4 (8ఏళ్ల 4 నెలలు)
(2)నష్టభయం ఎంత మేరకు?:- దీర్ఘకాలంలో మంచి రాబడి అందించే పథకాలు అనగానే ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పథకాలే గుర్తుకు వస్తాయి. అయితే, రాబడిని అంటిపెట్టుకొని, ఇందులో నష్టభయం ఉంటుంది. అందుకే, అందరికీ ఇవి సరిపడవు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ పొదుపు పథకాలు ఇచ్చే రాబడి అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే, పెట్టుబడులకు ప్రత్యేకించేదంతా ఈక్విటీల్లోనే పెడితే నష్టాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి?
అందుకే, ఎంత సొమ్మును స్టాక్ మార్కెట్‌కు ప్రత్యేకించాలన్నది తెలుసుకోవాలి.
** వయసును బట్టి మదుపు ప్రణాళిక మారుతూ ఉండాలి. ఒక్కో దశకూ ఒక్కో అంశం ప్రాధాన్యం పెరుగుతూ ఉంటుంది. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ, 65 ఏళ్ల వారికి నష్టం వస్తే ఆర్థికంగా కష్టమే కదా!
కాబట్టి, ఈక్విటీల్లో మదుపు చేసేవారు ఒక సూత్రాన్ని పాటించాలి. 100 లోనుంచి మన వయసును తీసేయగా వచ్చే సంఖ్యకు సమానమైన శాతంలోనే పెట్టుబడులు పెట్టవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 ఏళ్లనుకుందాం. అప్పుడు 100-35= 65. అంటే, మీరు పెట్టుబడులకు కేటాయించాలనుకుంటున్న మొత్తంలో దాదాపు 65 శాతం వరకూ ఈక్విటీలకు ప్రత్యేకించవచ్చన్నమాట.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీనికి మినహాయింపులు ఉన్నాయి. మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి. ఇల్లు కట్టుకోవడం, లేదా గృహరుణం తీర్చేయాలనే లక్ష్యాలు మూడేళ్లలోపు పూర్తి తీర్చుకోవాలని అనుకుంటున్నారనుకోండి. అధిక శాతం సొమ్ము ఈక్విటీల్లో పెట్టడం మంచిది కాదు. అలాంటప్పుడు డెట్ లేదా స్థిరాదాయం అందించే పథకాలకు మళ్లించాలి.
(3)పొదుపు కూడా ఖర్చే:-
చిన్న వయసులోనే వేలకు వేల జీతం ఆర్జిస్తున్నవారూ నెలాఖరు వచ్చే సరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉంటున్నారు. క్రెడిట్ కార్డులతో నెట్టుకొస్తున్నారు. ఖర్చులు పోగా మిగిలిందంతా పొదుపే అన్నట్లు ఉండటం సరికాదు. సంపాదిస్తున్న దాంట్లో స్థిరంగా కొంత మొత్తాన్ని తీసేసి, మిగిలిందే మన చేతికి అందే సొమ్ము అనే భావన ఏర్పర్చుకోవాలి. ఇక్కడ పొదుపును కూడా ఒక ఖర్చుగానే భావించి మొదటి ప్రాధాన్యం దానికే ఇవ్వాలి.
ఎంత జీతం వచ్చినా అందులో నుంచి తక్కువలో తక్కువ 10 శాతమైనా ఈ పొదుపనే ఖర్చుకు కేటాయించాలి. అంటే మీకు నెలకు రూ.30 వేలు వస్తున్నాయనుకుందాం. అప్పుడు ముందుగా కనీసం రూ.3,000 ఆ మొత్తంలోనుంచి తగ్గించాలి. అంటే, మీకు వస్తున్నది రూ. 27వేలే అన్నమాట. ఇందులోనుంచే మీరేం చేసినా. అనివార్య పరిస్థితుల్లో మీరు ఒక నెల 10శాతం సొమ్మును దాచలేకపోయారు. అప్పుడు రెండు నెలలు 15శాతం చొప్పున మిగల్చాలి. నిబంధన మాత్రం తప్పకూడదు.
** ఈ సొమ్మును దీర్ఘకాలిక పథకాల్లోనూ మదుపు చేయవచ్చు. లేదా బ్యాంకుల్లో 'స్వీప్ ఇన్' సౌకర్యం ఉంటే అందులోకి ఈ నగదును జమ చేయవచ్చు. ఇవి తాత్కాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా పనిచేస్తాయి. లిక్విడ్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. పొదుపు ఖాతాకన్నా కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు.
(4)అప్పు చేస్తున్నారా?:-
అన్నింటికీ అప్పు సులభంగా దొరికే ఈ రోజుల్లో సరదాగా రుణాలు చేయడం అలవాటయ్యింది. కొత్తగా ఏది వచ్చినా దాన్ని కొనడం కొంతమందికి అలవాటు. ఇలా తెలియకుండానే అప్పుల వూబిలోకి దిగిపోయేవారు ఎంతోమంది. కానీ, రుణం చేయకుండా ఉండాలంటే.. చాలా వాటిని కోల్పోవాల్సి వస్తుంది. సొంతిల్లు సొంతం చేసుకోవాలన్నా.. నచ్చిన కారును కొనాలన్నా అప్పు చేయడం తప్ప మార్గం లేదు. కాకపోతే ఈ అప్పులు మరీ ఎక్కువయినప్పుడే ఇబ్బంది.
అన్ని రుణాల వాయిదాలూ కలిపి మీ మొత్తం జీతంలో 40 శాతానికి మించకూడదనేది వ్యక్తిగత ఆర్థిక నిపుణుల మాట.
ఉదాహరణకు మీరు నెలకు రూ.30,000 సంపాదిస్తున్నారునుకుందాం. అందులో నెలకు రూ. 12,000కు మించి రుణ వాయిదాలు చెల్లించకూడదు. అప్పుడే మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఎక్కువ వడ్డీలకు తెచ్చిన వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవడం మేలు. గుర్తుంచుకోండి. విలువ పెరిగే ఆస్తుల కొనుగోలుకు తీసుకున్న అప్పులు ఎప్పుడూ మంచివే.
ముందే అనుకున్నట్లు వ్యక్తులను బట్టి ప్రణాళికలు మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా పెట్టుబడి మొత్తాలు కూడా. ఒకరికి సరిపోయిన సూత్రం మరొకరికి సరిపోకపోవచ్చు.
ఒక అవగాహనకు రావడానికి మాత్రం వీటి మీద ఆధారపడవచ్చు.
_______________________________
Labels: Economics, Finance, Knowledge, Life, Management, Self development
0 Comments:
Post a Comment
<< Home