My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, October 08, 2006

వలసకూలీలమయ్యాం తెలుగుతల్లీ, క్షమించు!

శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయభాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలి తీసుకొని బతకవలసిందే గానీ, మరో మార్గం లేదు. అమృతభాషలు మృత భాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి.

పే ద జనానికి తెలుగు, ధనవంతులకు ఇంగ్లీష్‌ నేర్పుతూ అంతరాలను కొన సాగిస్తున్నారనే వాదం ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లీషును దేశభాషగా మారిస్తే, ఇంగ్లీషునే అన్ని ప్రభుత్వపాఠశాలల్లో బోధిస్తే, అన్ని కులాల వారు విమానాలెక్కే స్థాయికి వస్తారని కొందరు అంటున్నారు. ఈ రకమైన ఆశ తప్పేమీ కాదు. కానీ ఇంగ్లీష్‌ భాషవల్లనే దళితులు, వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు... బాగుపడతారా? అభివృద్ధికీ, అంతర్జాతీయ సౌకర్యాలు పొందడానికీ ఆంగ్లమే శరణ్యమని ప్రజలు ఎగబడడానికీ కారణాలు ఏమిటి? ఆ కారణాలను అన్వేషించి మన భాషకుకూడా ఆంగ్లమంతటి శక్తిని తెచ్చే ప్రయత్నాలు చేయకూడదా? ఆంగ్లానికున్నంత శక్తి తెలుగుకు రాదా? మన ప్రజలు తలుచుకొంటే ఇది సాధ్యంకాదా?

భాషకూ కులానికీ ముడిపెట్టడం అనవసరం. పెద్ద పెద్ద చదువులు ఇంగ్లీషులో చదివినవాళ్ళే అమెరికా వెళ్ళినా కులసంఘాలు వదడంలేదు. కులతత్వాన్ని, మత ఛాందసాన్ని ఇంగ్లీష్‌ పోగొట్టదు. పైగా తెలుగువాడిని ఇంగ్లీషులో హడలగొట్టే వాళ్ళు తయారయ్యారు. తెలుగు ముస్లింలను ఉర్దూ, అరబీలతో, తెలుగు హిందువుల్ని సంస్కృతంతో బెదిరించి బానిసలుగా చేసినట్టే, తెలుగు ప్రజల్ని నేడు ఇంగ్లీషుతో పాలిస్తున్నారు. అయినా ఇంకా తెలుగు చచ్చిపోలేదు.

దేశానికి లింకు భాష కావలసిరావడమే మన భాషకు పట్టిన దౌర్భాగ్యం. మనదేశ భాషలన్నీ స్వయంపోషకత్వాన్ని కోల్పోయి, వాడిపోయి రాలిపోయేదశకు చేరుకుంటున్నాయి. ఇంగ్లీష్‌ లింకు తెగితే ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయినట్లు దేశాలు విలవిలలాడుతున్నాయి. దేశభాషలన్నిటికీ ఇంగ్లీష్‌ సెలైన్‌ బాటిల్‌వలె పనిచేస్తోంది. వరల్డ్‌వైడ్‌ వెబ్‌లో ఈగల్లా చిక్కుకున్న అన్ని భాషల్నీ ఇంగ్లీష్‌ అనే సాలెపురుగు పీల్చి పిప్పిచేసింది. ఇంగ్లీష్‌ లేకుండా ఎవరి భాష వాళ్ళకు తెలిసే అవకాశంకూడా లేదనే పరిస్థితి దాపురించింది. ఇవన్నీ నిజాలు. మన భాషను ఇలాంటి స్థితిలో ఉద్ధరించడం సాధ్యమవుతుందా? మన భాషద్వారా ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధి కారులు రాగలరా? ఉపాధినిచ్చే భాషను ప్రజలు ఎగబడి నేర్చుకుంటారు. లక్షలాదిమందికి ఉపాధిని, విజ్ఞానాన్ని అందించగలస్థాయికి మనభాషను తీసుకుపోగలమా? అలాంటి ఆశ, అంకితభావం గలవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన పొలాన్ని మరొకడికి కౌలికిచ్చి, వాడి దగ్గరే కూలీగా పనిచేస్తున్నట్టుంది మన పరిస్థితి.1984లో వావిలాల గోపాలకృష్ణయ్య ఇలా అన్నారు: 'ఆనాడు మనదేశంలోనే మనం బాని సలం. 1947లో బ్రిటిష్‌ వాళ్ళనుంచి స్వేచ్ఛను పొందాక మనభాష అభివృద్ధి చెందుతుందను కున్నాం. కానీ మన భాషాభివృద్ధికి అవసరమైన ప్రభుత్వం మనకు రాలేదు. అమెరికా పోయే నలు గురికోసం అంతా ఇంగ్లీష్‌ చదవాలా? అమెరికా వాళ్ళే వాడితోపాటు మా ఊళ్ళోఉన్న గుమాస్తాకు, తలారికికూడా ఇంగ్లీష్‌ నేర్పాలట. ఎందుకో మరి? మనప్రభుత్వం ప్రజలకు అర్థంకాకుండా పోయింది. ఇంగ్లీష్‌ మోజుదారులు మాకు ఇంగ్లీష్‌ అలవాటైపోయిందండీ అంటారు. మొదట పొరపాటు, తరువాత గ్రహపాటు, ఆ తరువాత అలవాటు. ఈ అలవాటు అనే ప్రమాదకరమైన శత్రువును నిషేధించకపోతే మనం ఇక ఈ స్థితిలోకూడా నిలవం. ప్రజాపాలన ప్రజల మాతృభాషలో ఉండాలి. తెలుగు ఇవాళ చదవకపోతే భాష మరచిపోతాం. భాష ఎంతమాట్లాడుతుంటే అంత వస్తుంది. ఎన్ని విషయాలు మాట్లాడితే అంత పదజాలం పెరుగుతుంది. మన భాషను నిరంతరంగా వాడితేనే తాజాగా ఉంటుంది, ప్రవహిస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాతకూడా ఇంగ్లీష్‌ వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నట్లుగా ఉంది. కాన్వెంట్‌ స్కూళ్ళు అంటువ్యాధికంటే ప్రమాదకరమైనవి. తెలుగురాని పిల్లవాడికి ఇంగ్లీష్‌ నేర్పుతున్నారు. మనభాష ఏమైపోతుంది?'

పూజారి నోట్లోని సంస్కృత మంత్రంలా, ముల్లా నోట్లోని అరబీ సూరాలా ఇంగ్లీష్‌ గొప్పశక్తి సంపాదించుకుంది. మంత్రాలొస్తేనే గదా పూజారి అయ్యేది? అలాగే ఇంగ్లీష్‌ వస్తేనే అధికారం, ఉద్యోగం దక్కుతున్నాయి. ఇంగ్లీష్‌వాడికంటె ఎక్కువజ్ఞానం తెలుగులో సంపాదించినా వ్యర్థం. ఎందుకంటె బోలెడంత విషయ పరిజ్ఞానంతో కూడిన తెలుగుకంటె, అసలు ఏ పరిజ్ఞానం లేకపో యినాసరే, వట్టి ఇంగ్లీష్‌ భాష వస్తేచాలు బతుకు తెరువు దొరుకుతుందని హామీ ఇస్తున్నారు. ఆంగ్ల భాషావాదుల అవసరం అలాందిమరి! హిందీ, ఇంగ్లీష్‌ రాని తెలుగువాళ్ళు ఒంటరివారిలా బతు కెలా గడుస్తుందోననే భయంతో ఉన్నారు. పరాజితులు విజేతల భాష నేర్చుకోక తప్పదు. గత్యంతరంలేకే తెలుగు వాళ్ళు హిందీ, ఇంగ్లీషులకు పట్టం గట్టారు. బతుకు తెరువుకోసమే ఆ భాషల పంచన చేరారు. ఇంగ్లీష్‌ గుంపులో చేరితేనే, 'ఇక ఫరవాలేదు బతుకుతాను' అనే నమ్మకం కలుగుతోంది. ఇంగ్లీష్‌ రాని శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడుంటే ఏం చేస్తాడు?పక్షులు తమ కూతను మార్చుకోకపోయినా వల సవెళ్ళిన ప్రాంతాలనుబట్టి తమ అరుపుల్లో యాసను మారుస్తాయట. అవసరం అన్వేషణకు తల్లి అంటారు. పశువులు పక్షులేలే తమతమ భాషలతో ఆటలాడుకుంటుంటే, మనిషి ఊరుకుంటాడా? గుంపులుకట్టి కొన్ని భాషల్ని అధికారపీఠం మీద కూర్చోపెడతాడు, కొన్ని భాషల్ని అణిగిమణిగి పడిఉండమని ఆదేశిస్తాడు. ఒకదానిని దేవ భాష అంటాడు, ఒకదానిని అధికారభాష అంటాడు, మరొకదానిని బానిసభాష, పనికిమాలిన బాష అంటాడు. ఏమైనా శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయభాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలి తీసుకొని బతకవలసిందే గానీ, మరో మార్గం లేదు. అమృతభాషలు మృత భాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి.

అమ్మా తెలుగుతల్లీ, ఇక చచ్చిపో. ఎంతకాలం మంచంమీద రోగిష్టిలా ఉంటావ్‌! నిన్ను బాగుచేయించే ఆర్థికస్థోమత మాకు లేదు. అంత గొప్ప వైద్యమూ లేదని స్పెషలిస్టులూ తేల్చిచెప్పారు. నీవు ఇంట్లో వాళ్ళందరికీ అడ్డమైపోయావు అని నీ పిల్లలే విసుక్కుంటున్నారు. మొండి ప్రాణమే తల్లీ నీది. నీమీద మాకు ఎంతప్రేమఉన్నా ఏమీ చేయలేని అశక్తులం, బానిసలం, రెక్కాడితేగాని డొక్కాడని వలస కూలీలమయ్యాం. నిన్ను పోషించనందుకు మమ్మల్ని క్షమించమ్మా.
రచయిత రాష్ట్రప్రభుత్వఅధికారి
నూర్‌బాష రహంతుల్లా
Courtesy: వార్త
http://www.vaarttha.com/vaarttha/vsph1.asp

Labels:

0 Comments:

Post a Comment

<< Home