తెలివి ఎవరి సొమ్ము?
వివేకం ఒకరి సొత్తు కాదు. కాస్తో కూస్తో తెలివి తేటలు అందరికీ ఉంటాయి. మోతాదుల్లోనే తేడాలు. కొందరికి తెలివి తేటలు అధికంగా ఉంటాయి. మరికొందరు అంత తెలివిగా ఉండరు. అతితెలివి కలవారితోను ఇబ్బందే, తెలివితక్కువ వారితోనూ కష్టమే. అమాయకత్వాన్ని మంచితనంగా భావిస్తే అసలు ఇబ్బందే ఉండదు. పరమానందయ్య శిష్యులను ఈ కోవలోకి చేర్చవచ్చు. తెలివి ఒకరి సొమ్మా తోట సుబ్బమ్మా- అంటూ నిలవేశాడట ఓ సుబ్బారాయుడు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాకపోయినా తామే చాలా తెలివికలవాళ్లమనే అహం కొందరిలో ఉంటుంది. ''చెయిముట్టు సరసం అంటే నాకు కరచరణాలు ఆడవు కాని వ్యవహారాలంటే చెప్పు యెత్తుకి ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను...'' అంటాడు రామప్ప పంతులు. అంతటి తెలివితేటలు కలవాణ్నీ- ''యీ రామప్పపంతులు చిక్కులకు జాకాల్ తెలివికి బిగ్ యాస్...'' అంటూ వర్ణిస్తాడు గిరీశం. ఆ వర్ణనకు మధురవాణి విరగబడి నవ్వుతుంది. తెలివితేటలు అధికమైనప్పుడూ అభాసుపాలయ్యే అవకాశం ఉంది. అతడు పైలాపచ్చీసు పురుషుడు. సినిమాలనీ షికార్లనీ తెగ తిరుగుతుంటాడు. భార్యను మాత్రం గడప దాటనివ్వడు. ఆవిడ సూక్ష్మగ్రాహి. భర్త అనుమానం పిశాచి అని తెలుసు. అతని అనుమానానికి అడ్డకట్టవేసి ఇంటిపట్టునే కట్టి పడెయ్యటానికి మంచి ఉపాయం కనిపెట్టింది. ''ఇంట్లో ఏం తోచటంలేదండీ. ఏ సినిమాకైనా వెళ్దాం. మీకు వీలుకాకపోతే పక్కింటి పిన్నిగారితో వెళతాలెండి...'' అంటుంది. అంతే- ఆ తరవాత రెండు రోజులు మానవుడు గడప దాటడు!
స్త్రీ పురుషుల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న వివాదం ఆదినుంచీ రగులుతూనే ఉంది. తెలివితేటల విషయంలో మగవారూ ఆడవారూ ఒకరితో మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. ''అతడు ఆమెల ఫైటు, అతివ ఛాన్సులు బ్రైటు, ఆడదెపుడూ రైటు...'' అన్నారు ఆరుద్ర. సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అయినప్పటికీ ప్రతి విషయంలోనూ మగవారు ఆడవారు పోటీపడుతుండటం మొదటినుంచీ జరుగుతూనే ఉంది. ''మావారు నే గీచిన గీటు దాటరు'' అని గర్వపడుతుందా ఇల్లాలు. అంతకంటె రెండాకులు ఎక్కువ చదివిన శ్రీమన్నారాయణుడు ఫ్రెండ్సుతో పేకాడి బార్‌కు కూడా వెళ్ళి అర్ధరాత్రి తూలుకుంటూ ఇంటికొచ్చి ''ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. ఊపిరాడటం లేదు. తల బద్దలు కొట్టేస్తుంది...'' అంటూ నటసమ్రాట్‌లా నటించేస్తుంటే- నమ్మేస్తుంది అమాయకురాలు. అయ్యగారి బూట్లు విప్పటంతో పదసేవ ప్రారంభించి వేడివేడిగా కాఫీ కలిపి ఇచ్చి, బతిమాలి అన్నం తినిపించి జోలపాట మినహాగా పవళింపు సేవ పూర్తిచేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆలుమగలులో ఎవరు ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించారన్నది విజ్ఞులు తేల్చాల్సిన విషయం. అసలు రసజ్ఞులెవరూ ఇటువంటి ముచ్చట్ల జోలికి పోయి తీర్పులివ్వటానికి సిద్ధపడరు. తెలివితేటల సంగతి పక్కన పెడితే మాటల్లో మాత్రం అతివే మేటి. ''ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా...'' అని గురజాడ అననే అన్నారు. మధురవాణి వంటి పేర్లు ఆడవారికే ఉన్నాయి కాని అటువంటి భావం స్ఫురించే పేర్లు మగవారికున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు.
''ఆడది మెచ్చిందే అందం మొగాడి కన్ను మసక'' అంటుంది మధురవాణి 'కన్యాశుల్కం' నాటకంలో. కళ్ళ విషయంలో ఏమో కాని మెదడు విషయంలో మాత్రం మగవారిదే పైచేయి. అలాగని శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు మేధ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే అన్న అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం సరికాదని బుద్ధిబలంలో మగవారే ఆడవారికంటె ముందుంటారని బయటపడింది. వెస్టర్న్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుల బృందం మనస్తత్వ శాస్త్రజ్ఞుడు జె.ఫిలిప్ రష్టన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం 17 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న లక్షమంది యువతీ యువకులను పరీక్షించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ యువతీ యువకులందరికీ రకరకాల ఐ.క్యు. పరీక్షలు నిర్వహించారు. యువతుల కంటె యువకులే నాలుగైదు పాయింట్లు ముందున్నట్లు రుజువైంది. సామాజిక, ఆర్థిక సంబంధాల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పెట్టిన పరీక్షలన్నింటా మగవారే ఎక్కువ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్లు బయటపడింది. లోగడ ఓ పరిశోధనలోనూ ఇటువంటి ఫలితాలే వచ్చాయి. శైశవ బాల్యదశల్లో తెలివితేటలరీత్యా ఆడపిల్లలకు మగపిల్లలకు ఆట్టే తేడా కనిపించకపోయినా యౌవన ప్రాదుర్భావ సమయం నుంచీ మార్పులు కనిపిస్తున్నాయని తేటపడుతోంది. ఇందుకు కారణం ఆడవారికి మగవారికి మెదడు పరిమాణంలో ఉండే తేడా కూడా కావచ్చంటున్నారు. దేహబలం, బుద్ధిబలాల్లో మగవారే ఆధిక్యాన్ని కలిగి ఉన్నా, వాక్చాతుర్యంలో అమ్మాయిలదే మొదటి స్థానమని శాస్త్రజ్ఞులూ అంగీకరిస్తున్నారు. మాటల్లో మగవారు మగువలతో పోటీపడలేరని అంతా ఒప్పుకొంటున్నారు. ఆ విషయం తెలుసుకోవటానికి పెద్దగా పరిశోధనలు అక్కర్లేదనే విషయం అందరికీ తెలిసిందే!
__________________________
Labels: Telugu literature
0 Comments:
Post a Comment
<< Home