నిధి చాల సుఖమా!?
ఆదాయానికి, ఆనందానికి
మధ్య దూరం ఎంతో
శాస్త్రవేత్తల పరిశోధనలు
ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోకం దాసోహం, సొమ్ముతో కాని పని లేదు... ఇవన్నీ ఎప్పుడూ వినిపించేవే. నిజంగానే డబ్బుకు అంత శక్తి ఉందా? కొంత సొమ్ముంటే అవసరాలు తీరుతాయి. మరికొంత ఉంటే సౌకర్యాలు సమకూరుతాయి. ఇంకెంతో ఉంటే విలాసాలు కాళ్ల ముందు వాలుతాయి. ఇవన్నీ పరిపూర్ణ ఆనందాన్నిచ్చేవేనా? ఆత్మసంతృప్తి కలిగించేవేనా? విలువను కొలవడానికి మనిషి తయారుచేసుకున్న డబ్బు... మనసుకు సంబంధించిన ఆనందాన్ని కొనితెస్తుందా?
డబ్బును ఎక్కువగా సంపాదించేవారు ఎక్కువ ఆనందంగా ఉంటారని అంతా అనుకుంటారు. ఇందులో నిజమెంత అనే అంశంపైనే ప్రముఖ ఆర్థిక, మానసిక పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆదాయానికి, ఆనందానికి ఉన్న సంబంధంపై అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన నోబెల్ గ్రహీత డేనియల్ కానెమెన్, ఆర్థికవేత్త అలన్ బి.క్రూగర్ మరికొందరు మానసిక శాస్త్రవేత్తలతో కలిసి రెండేళ్లుగా కృషిచేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు ఉన్న నమ్మకాలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఎక్కువ ఆదాయం కలిగినవారు మరింత ఆనందంగా ఉంటారన్న నమ్మకం అతియోశక్తి, భ్రమ మాత్రమేనని వెల్లడైంది. డబ్బు వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చన్నది వాస్తవమే అయినా... ఆనందంగా జీవించడంలో మాత్రం దాని పాత్ర తక్కువేనని తేలింది. ఎంత సంపాదించినా అదిచ్చే ఆత్మతృప్తి తక్కువేనని ఇటీవలి ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అపర కుబేరులు కూడా సేవా కార్యక్రమాలవైపు దృష్టిని మళ్లిస్తున్నారు. సెకన్లను డబ్బుతో కొలవగలిగే స్థితిలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకొని సేవారంగానికి పూర్తిసమయం కేటాయించడానికి సిద్ధమవుతున్నారు. జీవితమంతా సంపాదనకే వెచ్చించిన బర్క్‌షైర్ హాతవే యజమాని వారెన్ బఫెట్ తన ఆస్తిలో అధికభాగం విరాళంగా ఇచ్చేశారు. తన సొమ్మును ఇంతకంటే సద్వినియోగం చేసే మార్గమేదీ కనిపించలేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. వీరి మార్గంలో మరెందరో అపర కుబేరులు పేదరిక నిర్మూలన, వ్యాధుల నిరోధక మందుల పరిశోధనలకు విరాళాలను ప్రకటిస్తున్నారు.
వ్యక్తిత్వవికాస బోధనల్లోనూ ఆదాయానికి, ఆనందానికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. కొంతకాలం క్రితం వ్యక్తిత్వవికాస నిపుణుడు, భారత సంతతికి చెందిన కెనడా రచయిత రాబిన్‌శర్మ రచించిన 'ఏ మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ' (ఫెరారీని అమ్ముకున్న సన్యాసి) అనే నవల 35 దేశాల్లో 40 భాషల్లో విపరీతంగా అమ్ముడుపోయింది. ఇది నవలే అయినా వ్యక్తిత్వవికాస పుస్తకంగా పేరుపొందింది. ఇందులో కథానాయకుడు జూలియన్ మాంటిల్ (53) న్యాయవాద వృత్తిలో విపరీతంగా సంపాదిస్తాడు. అత్యంత విలాసంగా జీవిస్తుంటాడు. అతడి జీవన విధానం వల్ల బాగా వృద్ధుడిలా కనిపిస్తుంటాడు. మాంటిల్ ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోతాడు. కోలుకున్న తర్వాత ఒక్కసారిగా మారిపోయి తన ఆస్తిని, తనకెంతో ఇష్టమైన ఫెరారీ కారును కూడా అమ్మేస్తాడు. మూడేళ్లపాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతాడు. భారత్‌లోని హిమాలయాల్లో కొందరు సాధువుల నుంచి పరిపూర్ణ జీవితం గురించి తెలుసుకొని కొత్త ఉత్సాహంతో నవయువకుడిలా తిరిగొస్తాడు. ఆ విశేషాలను తన శిష్యుడైన మరో న్యాయవాది జాన్‌కు వివరించడమే కథాంశం. ఇందులో భాగంగానే జ్ఞానం, ఆనందం, ఆధ్యాత్మికత, నాయకత్వ లక్షణాలు, లక్ష్యసాధన, నిరాడంబర జీవితం వంటి అంశాలను రచయిత లోతుగా వివరిస్తారు.
తప్పని పనులే ఎక్కువ
అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ...
అధిక ఆదాయం ఉన్నవారు... తప్పనిసరైన కార్యకలాపాలైన రోజువారీ పని, షాపింగ్, పిల్లల సంరక్షణ వంటి వాటికి సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నారు. ప్రశాంతత, ఆహ్లాదాన్ని కలిగించే సామాజిక కార్యక్రమాలు, టీవీ చూడడం వంటి పనులకు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.
అధికాదాయం పొందేవారు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలకు తక్కువ సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. వారికి ఆనందాన్నివ్వడంలో ఆదాయం పాత్ర అతి స్వల్పం.
సాధారణంగా ఆనందం కలిగించే అంశాలేమిటని ఎవరినైనా ప్రశ్నించినప్పుడు డబ్బేనని చెబుతారు. అది కేవలం నమ్మకమని, వాస్తవం అందుకు భిన్నమని అధ్యయనంలో తేలింది.
ఏటా లక్ష డాలర్ల (రూ.45 లక్షలు) ఆదాయం వచ్చేవారు తమ కంటే ఆనందంగా ఉంటారని 20వేల డాలర్ల (రూ.9 లక్షలు) వార్షికాదాయం పొందేవారు అభిప్రాయపడ్డారు. సర్వే విశ్లేషణ తర్వాత రెండు వర్గాల వారి ఆనందం స్థాయుల్లో తేడా భిన్నంగా ఉంది.
పురుషుల్లో లక్ష డాలర్ల ఆదాయం ఉన్నవారు తమ సమయంలో 19.9 శాతాన్ని వినోద కార్యక్రమాలపై వెచ్చిస్తుండగా, 20వేల డాలర్లలోపు ఆదాయం కలిగినవారు 34.7 శాతం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ ఆదాయ వర్గాలకే చెందిన మహిళల్లో ఇది 19.6, 33.5 శాతంగా ఉంది.
'ఆదాయానికి, జీవితపు సంతృప్తికి పెద్దగా సంబంధం లేకున్నా చాలా మంది మరింత సంపాదనను పెంచుకోవడానికే తీవ్రంగా కృషిచేస్తుంటారు. కొన్నిసార్లు మరింత ఒత్తిడితో కూడిన పనులకు మరింత సమయాన్ని కేటాయించడం, ఆనందం కలిగించే సామాజిక కార్యాక్రమాల సమయాన్ని త్యాగం చేయడం జరుగుతోంది' అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ అధ్యయనం కోసం కొత్త విధానాన్ని అనుసరించారు. మొత్తంగా జీవితం ఎలా ఉందన్న కోణంలో కాకుండా... వ్యక్తులు ఎదుర్కొనే రోజువారీ అనుభవాలపై వారి మనోభావాలెలా ఉన్నాయన్న కోణంలో సర్వేను నిర్వహించారు. దీనికి రోజువారీ పునర్నిర్మాణ పద్ధతి (డైలీ రీకన్‌స్ట్రక్షన్ మెథడ్-డీఆర్ఎం) అని పేరు పెట్టారు. దీని ప్రకారం ఎంపిక చేసుకున్న వ్యక్తులను... క్రితం రోజు కార్యకలాపాల్లో వారు పొందిన ఆనందం, విచారం వంటి భావనలను ఒక డైరీలో నమోదు చేయాలని కోరారు. ఇలా రెండు దఫాలుగా నిర్వహించిన సర్వే వివరాలను సరిపోల్చి విశ్లేషించారు.
(Eenadu, 26:11:2006)
__________________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home