'ఏ బడ్జెటు మాటున ఏ భారము దాగెనో'
'ఏ బడ్జెటు మాటున ఏ భారము దాగెనో'అని దేశ ప్రజ దిగాలుతో గుండె దిటవుతో చేసుకునే రోజులు మళ్లీ రానే వచ్చాయ్! జీవితంలో జెట్ స్పీడుతో దూసుకువెళ్తున్న వాళ్లు కూడా బడ్జెట్ స్పీడుతో ఆలోచించాల్సిన ఘడియలివి.
ఎప్పుడూ సుందరీమణులనే కలల్లోకి ఆహ్వానించే వాళ్లకు సైతం బడ్జెట్ వేళ ఫైనాన్స్ మినిస్టర్ కలలో కనపడి హలో అంటాడు! మామూలు రోజుల్లో కొందరికే రక్తపోటు ఉంటే అదిగో బడ్జెట్ అన్న మాట వినపడగానే చాలా మందికి బీపీ అమాంతం పెరిగిపోతుంది. బడ్జెట్ ప్రజంటేషన్ అంటే బీపీనే అని ఇంగ్లిషులో 'పొడి'చేసి ఇకిలించేవాళ్లు లేకపోలేదులెండి. పన్నులు పెరుగుతాయేమోనన్న తలపుల్లో 'నిను వీడని 'పీడ'ను నేనే' అన్న పాట మార్మోగిపోతుంటుంది. అయినా, అదే పనిగా ఎడాపెడా పన్నులు వేయడానికి ఆర్థిక మంత్రులు అమాయకులు కాదు! వారు 'నోట్'లో 'వేలు' వేసుకొని ఏమీ ఉండరు. ఎన్నికలు జరగనున్నాయనుకుంటేనే వారి 'హవా'భావాల్లో మార్పు ఉంటుంది. అయినా విత్తమంత్రుల లెక్కలు విత్తమంత్రులవి. 'పన్నులు పెంచి పాపాల భైరవులం మేమెందుకు కావాలి' అనే ఉద్దేశంతో బడ్జెట్‌కు ముందో వెనకో 'పన్నుకు పన్ను' సిద్ధాంతాన్ని ఓ కళగా అమలుపరిచేసి, చట్ట సభల్లో విమర్శల తాకిడి నుంచి తప్పించుకోజూస్తున్న అమాత్య వర్యులు ఉంటున్నారు. ఎన్నికలయ్యాక 'జండూ బామ్' అవసరమైనట్టు బడ్జెట్ రూపొందించే వారే... కనుచూపు మేరలో ఎన్నికలు కనబడుతుంటే మహాప్రభువులు అంటూ జనానికి 'ఫ్రెండూ'బామ్ రాసే కృషి చేస్తారు.
చెట్టులో ప్రాణం ఉందని కనుగొన్న జగదీశ్ చంద్రబోస్ 'బడ్జెట్'కు కూడా ప్రాణం ఉందని ఒక్క ముక్క చెప్పి ఉంటే ఆర్థిక వేత్తలంతా 'మా జేసీబోసుకు మంగళారతులు' ఇచ్చేవాళ్లు. న్యూటన్ ఇప్పుడు బతికి ఉంటే బడ్జెట్ ఆకర్షణ శక్తి ముందు భూమ్యాకర్షణ శక్తి బలాదూర్ అనేవాడు. సెల్ (ఫోన్) మొదలుకొని డీసెల్ వరకు విత్త మంత్రి కరుణాకటాక్షాల కోసం చేతులు కట్టుకు నిలబడి మేము 'ప్రెజెంట్ సార్' అంటుంటాయి. అందరికీ పొగ పంచిపెట్టే ధూమపాన ప్రియులకే పొగబెట్టే శక్తి ఆర్థిక మంత్రిది. ఇది గ్రహించబట్టే సిగ'రేట్లు' పెరిగే లోపు ఇంట్లో స్టాకు పెంచుకోవాలని దమ్ముప్రియులు ఆరాటపడతారు. ఆదాయపు పన్ను ఎగవేయదల్చుకున్న వాళ్లూ, తప్పనిసరిగా కట్టదల్చుకున్న వాళ్లూ ఒక్కుమ్మడిగా ట్యాక్స్ పెరిగిపోతుందేమోనని కలవరపడుతుంటారు. 'బండి' కొనదల్చుకున్నవాళ్లు ఎఫ్‌ఎం రివర్స్ గేర్‌లో వెళ్తే ఎలాగని కంగారు పడతారు. తాము ఎక్కదల్చుకున్న బండి ఏడాది కాలం లేటు అవుతుందేమోనని కంప్యూటర్ జాతకచక్రం వేయించుకొంటారు. కొన్నేళ్లుగా ఆర్థిక మంత్రుల వరస చూస్తుంటే 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని చూస్తే పెట్ట బుద్ధవుతుంది... వ్యవసాయాన్ని చూస్తే మొట్టబుద్ధవుతుంది' అనే కొత్త సామెతను కనిపెట్టినట్టున్నారు. బడ్జెటుకు ముందు కంప్యూటర్ కూడా 'ఇక్కడ కంప్యూటర్ జాతక చక్రం వేయబడును' అన్న బోర్డు కనబడితే చాలు అక్కడ వాలిపోయి 'నా ధర ఎలా ఉంటుందో జాతకం చెప్పు స్వామీ' అని ల్యాప్'టాప్' లెవెల్లో అంటుంది. ఆర్థిక మంత్రి చూపు పడే అన్ని సరకుల పరిస్థితీ దాదాపుగా ఇదే. ఇదివరకటి 'స్థానిక పన్నులు అదనం' మాదిరిగా ఈమధ్య జాతీయ స్థాయి సెస్సులు షరా మామూలయ్యాయి.
బడ్జెట్ లీలలపై ఎవరి గోల వారిది. ఆర్చేదీ తీర్చేదీ మంత్రి ఒక్కరే. అయినా
లోటు లేనిది ఒక్క 'లోటు'కే
(ఇంటి) బడ్జెట్ పెరుగుట పెరుగుట కొరకే...!
- ఫన్‌కర
(Eenadu,11:02:2007)
---------------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home