లోకమే కాదా స్వర్ణ సీమ
'మా పైడి తల్లికి మల్లె పూదండా
మా 'కొన్న' తల్లికీ మంగళారతులూ
మా చెవులు రింగులయి, తీగ సాగేదాక
మా గొంతు గొలుసులతో, నిండిపోయేదాక
నీ మాటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై పసిడి తల్లీ' అంటూ ఎరువు తెచ్చుకున్న 'అక్షయ తృతీయ' పండక్కి బంగారం కొనుక్కోవడానికి బ్యాంకులు, షాపుల వెంట పడ్డ జనాన్ని చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఇలాంటి పండగోటి ఉందని మూడు, నాలుగేళ్ల కిందటి వరకు మనకే తెలియదు. ఉత్తరాది నుంచి దిగుమతైన ఈ పండగ దక్షిణాదిలోనూ స్వర్ణాభరణాలకు మంచి గిరాకీని పెంచేసింది. దీన్నిబట్టి చూస్తే భువికి దివికి అనుసంధానమైంది కనకమాలక్ష్మేనన్న నమ్మకం కలక్కమానదు. స్వర్గం ప్రకృతి అయితే స్వర్ణం వికృతి అని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. రోజూ గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చునే వాళ్లు కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ గిల్లుకోవడానికి 'చలో బ్యాంకు' నినాదం అందుకున్నారు(ట). 'అక్షయ' పాత్ర మీద ఆశతోనే ఇదంతా. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ ఏవో పథకాలు వల్లించారు గానీ అదే అక్షయ తృతీయ నాడు తలా ఒక గోల్డ్ కాయిన్ ఇస్తే సరిపోయేది కదా. ఇంటింటా బంగారు బొమ్మే కనపడేది. బంగారు సర్వ సమస్యానివారణి కూడాను.
కేవలం పారిజాత పుష్పం కోసం మొగుణ్ని రచ్చ కెక్కించి బంగారం ఊసే ఎత్తని సత్యభామ అంతటి అమాయకురాళ్లు కాదిప్పటి భామామణులు. బంగారం కోసం నిరసన దీక్ష పట్టని ఇల్లు ఉంటుందని ఎవరైనా అంటే వాళ్ల ఖలేజాను మెచ్చుకుని మెళ్లో 'హారం' వెయ్యాల్సిందే. అన్నట్టు హారం కోసం ఇల్లాలు ఆహారం మానేస్తే బంగారంలా కరగని ఇంటాయనుంటాడా! చెప్పండి. బంగారం కొంటే ప్రపంచ యుద్ధాలు ఉండనే ఉండవు కదా!
72 ఏళ్ల తర్వాత ఈసారి అక్షయ తృతీయ ఏకంగా రెండు రోజులు (19, 20 తేదీల్లో) వచ్చింది. ఈ రెండు రోజుల్లోనూ దాదాపు రూ.300 కోట్ల బంగారం అమ్ముడుపోయిందంటే 'బంగారు పంటలే' పండుతాయీ అని పాడాలనీ ఉంది. బంగారం షాపింగ్ క్రీడలో మహిళల 'డ్రీమ్ ఇండియా' టీముది రికార్డు గెలుపన్నమాట. మహిళలు ఆడువారు అయితే బంగారం విక్రేతలు 'ఆడించువారు'. బంగారం ముందు పుట్టి ఆడవాళ్లు తరువాత పుట్టారనొచ్చు. అయినా మొగుడి మీద దయతో మా ఆయన బంగారం అని సర్టిఫికెటిస్తారు. కనకధారాస్తోత్రమూ వారికి కరతలామలకం.'ఎవ్వనిచే జనించు బంగారమెవ్వని లోపల నుండు లీనమై...' అని పతి మీద పేరడీ పద్యమూ పాడగలరు. ఈ విషయంలో ఆడవాళ్లలో వర్గ విభేదాల్లేవు. 'వగలాడి ఆకాంక్ష ఏదంటే నగలాడి కావాలన్నదే' అని ఒక కవి వ్యాఖ్యానించాడు. అయినా బంగారక్కలు లెక్కపెట్టరు. నీతులు చెప్పిన నిగమశర్మ సోదరి సైతం తన సోదరుడు ముక్కుపుడకలు దొంగిలించుకుపోయాడని ఏడ్చింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే బంగారాన్ని నిర్లక్ష్యం చేయడమంటే భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమే. స్వర్ణో రక్షతి రక్షితః... బంగారాన్ని నీవు కాపాడితే, అది నిన్ను కాపాడుతుంది. ఆడవాళ్లకు వారి మాంగల్యం సాక్షిగా ఇది చాలా ముందే తెలుసు. మగవాళ్లకు ఆ తెలివిడి మరి ఎప్పుడొస్తుందో?
- ఫన్‌కర్
(Eenadu-22:04:2007)
--------------------------------------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home