దేశమంటే మనుషులోయ్...
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్-' అన్నారు మహాకవి గురజాడ. ఏ దేశప్రగతి అయినా ఆ దేశపు జనాభాపైనే ఆధారపడి ఉంటుంది. కర్షకులు నాగళ్లుపట్టి ఏరువాక సాగిస్తేనే పంటలు పుష్కలంగా పండుతాయి. దేశంలో కరవు ఏర్పడకుండా ఉంటుంది. కార్మికులు తమ స్వేదం చిందిస్తూ యంత్రభూతాల కోరలు తోమి వాటిని నడిపిస్తేనే పారిశ్రామికాభివృద్ధి జరిగి సిరులు మూటలు కడతాయి. ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తేనే చదువు, లోకజ్ఞానం అబ్బి బాలలు బాధ్యతగల పౌరులుగా పెరిగి దేశాభ్యుదయానికి తమవంతు కృషిచేస్తారు. ఈ విధంగా ఏ దేశ భవిష్యత్తయినా ఆ దేశ ప్రజల శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ''సంఘమందు పుట్టి సంఘమందు పెరుగు సంఘజీవి కాడె సభ్య నరుడు, సంఘవృద్ధి లేక స్వాభివృద్ధియు లేదు-'' అన్నారు నార్లవారు. అయితే మితం తప్పితే హితం తప్పుతుంది అన్న సూక్తి జనాభా విషయంలోను వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అధిక జనాభాతో సమస్యలనెదుర్కొంటోందంటున్నారు. ఈ విషయంలో అన్ని దేశాల పరిస్థితీ ఒక్కలాగ లేదు. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతుంటే, మరికొన్ని దేశాలు జనాభా తక్కువై బాధపడుతున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలవారు కుటుంబ నియంత్రణ పద్ధతులు పెంపు చేయాలని చూస్తుంటే జనాభా తక్కువగా ఉన్న జపాన్, జర్మనీవంటి కొన్ని పాశ్చాత్య దేశాలు జననాల రేటు ఎలా వృద్ధి చేయటమా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
జనాభా ఎక్కువయినా తక్కువయినా ఏ దేశపు ప్రత్యేకత దానికే ఉంటుంది. మన దేశంలో పెళ్లికాని అమ్మాయిలను ''శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు'' అనీ, పెళ్ళయిన పడతులను ''పుత్రపౌత్రాభివృద్ధిరస్తు'' అని దీవించటం పరిపాటి. సంతానం కలగనివారు గుళ్ళూ గోపురాలనేకాక మంత్రాలను, మంత్రాల స్వాములనూ ఆశ్రయించటమూ తరచుగా జరుగుతున్నదే. పిల్లలున్న ఇంటి కళే వేరు. పిల్లలు తమ అల్లరితో, హఠంలతో ప్రాణాలను విసిగిస్తున్నా సంతానాపేక్ష మాత్రం తగ్గదు ఎవరికైనా. ''అమ్మా నువ్వు ఎగ్జిబిషన్‌లో ఆరు కప్పుల పింగీణీ టీ సెట్టు కొనుక్కున్నావు కదా-'' అని అడిగింది ఆరేళ్ళ సుపుత్రిక. ''అవును. ఆ సంగతెందుకిప్పుడు?-'' అంది తల్లి. ''మరేం లేదు, ఆ ఆరు కప్పుల టీ సెట్టును పది కప్పుల టీ సెట్టు చేశాడు తమ్ముడు!-'' అంటూ చల్లగా చెప్పింది సుపుత్రి. తిని కూర్చునేవారు ఎక్కువై పనిచేసేవారు తక్కువైపోతున్న వింత సమస్యతో కొట్టుమిట్టాడుతోంది జపాన్ దేశం. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ జననాల రేటు తగ్గిపోతూ ఉండటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పెన్షన్‌తో కాలం వెళ్ళబుచ్చే వయోవృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోతుండగా పిల్లల కేరింతలు మాత్రం వినపడడంలేదు. ప్రపంచంలోని మిగతా దేశాలు అధిక జనాభాతో సతమతమై పోతుండగా జపాన్, జర్మనీవంటి దేశాలు మాత్రం జనాభాలేమి సమస్యతో బాధపడుతున్నాయి. జపాన్‌లో జననాల రేటు బాగా పడిపోవటానికి ఆలస్యంగా చేసుకుంటున్న పెళ్ళిళ్ళు ఒక కారణం కాగా అక్కడి యువతులు పిల్లలను కనటానికి అంతగా సుముఖంగా లేకపోవటం మరో కారణం. అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖవారు విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 1988 సంవత్సరంలో జపాన్ యువతులు 25 లేక 26 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వివాహానికి సిద్ధపడుతుండగా 2004 సంవత్సరం వచ్చేసరికి 27 లేక 28 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిమాటే తలపెట్టటంలేదని తేలింది. వివాహితులైన యువతులూ సంతానవతులు కావటానికి ఇష్టపడటంలేదు. దానికి కారణం పిల్లలను పెంచటం భారీ ఖర్చుతో కూడిన కార్యక్రమం అనే ఉద్దేశం అక్కడి ప్రజలలో పెరిగిపోవటం. శిశు సంరక్షణను చేపట్టే సంస్థల కొరతవల్ల ఉద్యోగినులకు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకోవటం కష్టసాధ్యంగా పరిణమిస్తోంది.
జపాన్ యువతులు మాతృత్వంపట్ల మోజు చూపటంలేదు. దాంతో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితులలో జనాభా మరీ పల్చబడితే రాబోయే ముప్పును గ్రహించిన జపాన్ ప్రభుత్వం- ప్రజలలో వివాహం పట్ల ఆసక్తిని సంతానాపేక్షను వృద్ధి చేయాలనే సదుద్దేశంతో కొన్ని చర్యలను తీసుకోవటం మొదలుపెట్టింది. అందులో భాగంగానే వివాహాలు కుదిర్చే సంస్థలవారు తమ సంస్థల కార్యకలాపాలను గురించి టెలివిజన్‌లో ప్రకటనలు ఇచ్చుకోవచ్చన్నారు. లోగడ మ్యారేజి బ్యూరోలు పత్రికలలో ప్రకటనలిచ్చుకోవచ్చు కాని టెలివిజన్‌లో ప్రచారం చేసుకోకూడదనే నిబంధన ఉండేది. టి.వి. ప్రభావమే ప్రజలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడా నిబంధనను సడలించి టి.విలోను మ్యారేజిబ్యూరోల వారు ప్రకటనలు ఇచ్చుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ వెసులుబాటువల్ల వివాహం చేసుకొనేవారి సంఖ్య పెరిగి, జననాల రేటూ వృద్ధి పొంది కొత్త మొహాల కేరింతలతో జపాన్ దేశం కళకళలాడిపోగలదని ప్రభుత్వం వారు భావిస్తున్నారు. జర్మనీవారూ తమ దేశ జనాభాను అభివృద్ధిపరుచుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యోగినులకు ఏకంగా ఒక సంవత్సరంపాటు ప్రసూతి సెలవును మంజూరు చేస్తున్నారు. లోగడ ఆరువారాలు మాత్రమే ప్రసూతి సెలవు ఉండేది. ఇప్పుడా సెలవును ఒక్కసారే సంవత్సరానికి పెంచేశారు. అంతేకాక తల్లులయిన ఉద్యోగినుల భర్తలకూ రెండు నెలలపాటు పితృత్వ సెలవునూ మంజూరు చేస్తున్నారు. పన్ను రాయితీ వగైరాలు ఉండనే ఉన్నాయి. ఈ ప్రోత్సాహకాలన్నిటివల్లా జర్మనీ, జపాన్ దేశాలు జనాభా కరవు అన్నమాట లేకుండా పుష్కలంగా మానవవదనాలతో వెలిగిపోగలవని ఆ దేశాలవారు భావిస్తున్నారు. వారి ఆశయాలు ఫలిస్తాయనే ఆశిద్దాం!
(Eenadu,11:02:2007)
------------------------------------------------------
Labels: Indians/ Telugu
0 Comments:
Post a Comment
<< Home