మూడు పదుల్లో మూడు ముళ్లు
పుట్టంగ పురుడు పెరగంగ పెళ్ళి- అని సామెత. ఒకప్పుడు ఉయ్యాల తొట్లోని పసివారికి సైతం పెళ్ళిళ్ళు నిశ్చయ పరచుకునేవారు. ముక్కుపచ్చలారని పిల్లలకు పెళ్ళి చేయటం మనదేశంలోనేకాక ఈజిప్టు వంటి ఇతర దేశాల్లోనూ ఉండేది. అష్టవర్షా భవేత్కన్యా అన్న నమ్మకంతో ఆడపిల్లలకు ఎనిమిది సంవత్సరాలు నిండకుండానే పెళ్ళి చేయాలని గతంలో మనవాళ్లు తొందరపడిపోయేవారు. అలా చేస్తేనే కన్యాదాన ఫలం దక్కుతుందని అప్పటివారి నమ్మకం. బాల్య వివాహాలను నిరోధించాలని కొన్ని చట్టాలను చేసినా వాటిని ఉల్లంఘించటమే ఎక్కువగా జరిగేది. రజస్వలానంతర వివాహాలు మహా దోషంగా పరిగణించేవారు. ఈ బాధలు భరించలేక ముక్కుపచ్చలారని పిల్లలను ముసలివారికి కట్టబెట్టేసేవారు. ముసలివరుడు చనిపోతే అన్నెంపున్నెం ఎరగని ఆ అమ్మాయికి వైధవ్యం అంటగట్టి వేధించేవారు. కన్యాశుల్కం నాటకంలోని బుచ్చమ్మ వంటివారు అటువంటి బాల వితంతువులే. ''పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసేరోజుల్లో ఒక కునుష్టి ముసలాడికి కట్టనిశ్చయించారు. పుస్తె కట్టబోతుంటేనో, కట్టిన వుత్తర క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లిపీటలమీదే గుటుక్కుమన్నాడు-'' అని పూటకూళ్ళమ్మ వృత్తాంతం చెబుతాడు గిరీశం.
''అస్సె చూస్సివషే, విస్సావఝలవారి బుర్రినష యీ విస్సాయికిస్సారుషే విస్సడెంతటివాడే, యేళ్ళు పదిషే-'' అని పూర్వం ఆంధ్రదేశంలోని శ్రోత్రియ స్త్రీలు ముచ్చట్లాడుకొనేవారని దాసు శ్రీరాములు రాశారు. ఎనిమిది సంవత్సరాలు నిండకుండానే ఆడపిల్లలకు, పది సంవత్సరాలు నిండకుండా మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేసే ఆచారాన్ని మాన్పించటానికి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలు ఎంతగానో కృషి చేశారు. ఆ ప్రయత్నాల్లో ఎన్నో కష్టనష్టాలనూ ఎదుర్కొన్నారు. పసితనంలో జరిగిన వివాహం కారణంగా పెద్దయ్యాక భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించలేకపోవటమూ అప్పట్లో కొన్ని సందర్భాల్లో జరిగేది. పానుగంటివారి 'కంఠాభరణం' నాటకంలోని సుబ్బలక్ష్మి ఉదంతం అటువంటిదే. ''సుబ్బలక్ష్మికి పదవ ఏట వివాహమైనది. వెంటనే దీని భర్త చదువుకొనుటకై నవద్వీపమునకు బోయినాడు. కొన్ని సంవత్సరములుత్తరములు వ్రాసినాడు. తరవాత క్షేమసమాచారములేదు-'' అని సుబ్బలక్ష్మి బావగారు పరమ ఛాందస చక్రవర్తి సోమావధానులు చెబుతాడు. ఆ తరవాత తిరిగొచ్చినా సుబ్బలక్ష్మి తన భర్తనే గుర్తించలేదు. అలా గుర్తించలేకపోవటంవల్లే కంఠాభరణం నాటకం ఎన్నో వింత మలుపులు తిరుగుతుంది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. బాల్య వివాహాలు గతించిన ముచ్చటలైపోయాయి.
తొందరెందుకు పెళ్ళికి ముప్ఫైఏళ్ళు రానీ ముందర- అంటున్నారు ఇప్పటి భారతీయ యువత. స్థిరపడకుండా పెళ్ళిచేసుకొని సంసారభారం నెత్తిమీద వేసుకొని బాధలు పడేకంటే ముందుగా ఏ వృత్తిలోనో ఉద్యోగంలోనో కుదురుకున్నాకే పెళ్ళి ప్రసక్తి తలపెట్టటం మంచిదన్నది అధునాతన యువతీ యువకుల అభిప్రాయం. ఏసీనీల్సన్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తొందరపడి సంసార లంపటంలో చిక్కుకునేకంటే నిదానంగా మూడుముళ్ళు వేయటం మంచిదని 79 శాతం భారతీయ యువత విశ్వసిస్తోంది. ఆధునిక భారతీయ మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్య్రానికి, ఆర్థిక భద్రతకు ఎక్కువ విలువను ఇస్తూ మనువుకన్నా వృత్తి ఉద్యోగాలకే ప్రథమ ప్రాధాన్యం అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 61 శాతం యువత వివాహమే తమకు ముఖ్యమని పేర్కొనగా భారతీయ యువతీ యువకుల్లో 47 శాతం పెళ్ళే తమ జీవిత లక్ష్యం కాదని పేర్కొనటం గమనించదగ్గ విషయం. మిగతా దేశాలవారికంటె భారతీయులే వివాహానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ అదొక పవిత్ర బంధంగా భావిస్తారు. ఈనాటికీ ఆ అభిప్రాయం చెక్కుచెదరనప్పటికీ జీవితంలో స్థిరత్వం ఏర్పడ్డాకే మూడుముళ్ళ మాట తలపెట్టటం మంచిదని భావిస్తున్నారు. ఇదొక నూతన పరిణామం. వివాహమనేది జీవితంలో ఒకేసారి జరిగే శుభకార్యం. తమ జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసుండాలనే అధిక సంఖ్యాకులైన భారతీయులు కోరుకుంటున్నారు. వివాహబంధం పవిత్రబంధం అన్న తరతరాల భారతీయుల అభిప్రాయం నేటికీ చెక్కుచెదరలేదు. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం యువత వివాహం అవసరమని పేర్కొనగా భారతీయుల్లో 87 శాతం అటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీన్నిబట్టి వివాహంపట్ల భారతీయులకున్న నమ్మకం సడలలేదనే భావించవచ్చు. మహిళలు ఉద్యోగాలు చేసే విషయంలో ఒకప్పటికి, ఇప్పటికి భారతీయుల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. పిల్లల తల్లులు సైతం ఉద్యోగాలు చేయవచ్చని సర్వేలో పాల్గొన్న 73 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. చిన్నవయస్సులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టడానికి ఎక్కువమంది భారతీయ యువతీ యువకులు ఇష్టపడటంలేదని ఏసీ నీల్సన్ సర్వేలో వెల్లడైంది. 30 ఏళ్ళ వయసులో మానసిక పరిపక్వతతోపాటు వృత్తి జీవితంలో నిలకడ ఏర్పడుతుందనీ అదే పెళ్ళికి సరైన తరుణమన్నది ఎక్కువమంది అభిమతం. ఆ మాటా నిజమే కదా!
(Eenadu:15-04-2007)
_________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home