తెలుగెంతో ప్రాచీనం.. ముమ్మాటికీ ఇది నిజం
న్యూస్‌టుడే, చెన్నై (Eenaadu,04:06:2007)
తేనెలొలికే తెలుగు ప్రాచీనతకు ఎన్నో ఆధారాలున్నాయి. కానీ వాటన్నిటినీ విస్మరించి తమిళాన్ని అత్యంత ప్రాచీన భాషగా పేర్కొనడం ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు భాషావేత్తలు. అఖిల భారత తెలుగు మహాసభల్లో మూడో రోజు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా తెలుగు చరిత్ర గురించి ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు. వీటిపై మరింత పరిశోధన జరిగితే తెలుగెంత ప్రాచీనమో ప్రపంచానికి తెలుస్తుందన్నారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ద్రవిడమంటే తమిళం కాదు
దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేయడానికి ఇలాంటి సభలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఇక్కడకు వచ్చిన వారందరిలో భావసారూప్యత ఉన్నవారు భాషాభివృద్ధి కోసం కృషిచేసేలా కార్యాచరణ రూపొందించాలి. ప్రస్తుతం భాషా విషయాలన్నీ రాజకీయం చేస్తున్నారు. తెలుగు ప్రాచీనత కూడా రాజకీయాంశమై పోయింది. అసలు తెలుగుకు కావాల్సింది ప్రాచీన భాష హోదా కాదు, శ్రేష్ఠ భాషగా తెలుగును గుర్తించాలి. అందుకు నాయకుల్లో చిత్తశుద్ధి కావాలి. తమిళ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా భాష కోసం తపిస్తారు. మన దగ్గర అలా లేదు. తెలుగు ప్రాచీన భాష కాదని ఇక్కడి వారు చూపిస్తున్న ఆధారాలు నిరాధారం. చరిత్ర పరిశీలిస్తే తమిళానికి, తెలుగుకు సోదర సంబంధమే ఉంది. అందులోనూ తెలుగే ముందు పుట్టినట్లు ఆధారాలున్నాయి. తమిళుల సంగం వాజ్ఞయంలో కూడా తెలుగు గురించిన ప్రస్తావన ఉంది అంటే తెలుగు అంత కన్నా ముందుండాలి కదా? మనం మౌఖిక సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. తమిళుల తొలి వ్యాకరణ గ్రంథంగా చెప్పుకొనే తొల్యాప్పియంలో కూడా తెలుగు గురించిన ప్రస్తావన ఉంది. ప్రాచీన నాగరికతలన్నీ నదీతీరాల్లోనే వెలిశాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. తెలుగునాట ఎన్నో జీవనదులున్నాయి. కానీ తమిళనాడులో జీవనదులే లేవు. దీని బట్టి తెలుగు ప్రాచీనతను అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. కాశీపాండ్యన్ రాసిన 'హిడెన్ హెరిటేజ్' అన్న గ్రంథంలో కూడా తమిళ బ్రాహ్మీకి తెలుగు బ్రాహ్మీయే మూలం అని, తెలుగు బ్రాహ్మీ లిపినుంచే బ్రాహ్మీలిపి పుట్టుకొచ్చింది. వస్తుఆధారాలు కూడా తెలుగు సంస్కృతే ప్రాచీనమని నిరూపిస్తున్నాయి. అశోకుని శాసనాల్లో కూడా తెలుగు పదాలు వాడాడు. జైనులు ముందుగా ఆంధ్రలో రాజ్యస్థాపన చేశారు. వర్ధమాన మహావీరుని పేర ఉన్న వడ్డమాననే గ్రామమే దీనికి ఉదాహరణ. ఇక్కడ ఉన్న గుహాలయాలు కూడా దీనినే సమర్థిస్తున్నాయి. పంప భారతంలో కూడా 'కొలత' అన్న పదాన్ని వాడాడు. ఆ పేరుమీదే కొలత్తూరు అన్న ఊరు కూడా ఉంది.
- ఆర్వీఎస్ సుందరం, మైసూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు
తెలుగు ప్రాచీనం కాదు ప్రధమం
తెలుగు ప్రాచీన భాష కాదు ప్రధమ భాష. అన్ని సంస్కృతులకూ మూలం తెలుగే. అందుకు ఆధారాలున్నా ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పిస్తే ప్రాచీనత సాధించడం పెద్ద విషయం కాదు. ఆంధ్రులు వర్తకం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత అక్కడ వదలిన ఆధారాలు చాలా ఉన్నాయి. క్రీ.పూ. 1794లోనే ఆంధ్రులు వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్లినట్లు ఆధారాలున్నాయి. సుమేరియన్ నాగరికత మూలాలు మన తెలుగులో ఉన్నట్లు అక్కడ దొరికిన మట్టిపలకపై ఉన్న అక్షరాలు చెపుతున్నాయి. అందులో కునైఫారం లిపిలో తెల్‌మన్, తెలికా అన్న పదాలున్నాయి ఇవి తెలుగు రూపాంతరాలే. తెలుగు పేరు మీదే హిబ్రూ భాషలో తేలివాహాన నది ఉండేది. పెనునాగు అన్న పదానికి మహాసర్పం అన్న అర్థం ఉంది. ఇదే మన దగ్గరున్న పినాకిని. బహ్రైన్‌లో 10 ప్రాచీన తెగల్లో 21 మంది ఇంటి పేర్లు తెలుగు వాళ్లవే. హిబ్రూ, సుమేరియన్ల లిపి ఆంధ్రుల లిపిని పోలి ఉంటుంది. అక్కడ వినియోగిస్తున్న చాలా పదాలను బట్టి సుమేరియన్లు, ఈజిప్షియన్లు ఇక్కడివారే అని తెలుస్తోంది. అంతెందుకు బైబిల్‌లో అబ్బ, ఇప్పత్త, తల్లితాకుము, నారద, శరభయ్య, అమ్మ, తూకం వంటి తెలుగు పదాలెన్నో కనిపిస్తాయి. దీని బట్టి అప్పట్లోనే తెలుగు విరాజిల్లినట్లు తెలుస్తోంది. ఇన్ని ఆధారాల బట్టి తెలుగు ప్రాచీన భాష కాదు ప్రధమ భాష అని చెప్పవచ్చు.
సంయుక్త కూనయ్య: తెలుగుభాషా పరిశోధకురాలు
____________________________________________
Pl. also see:
http://www.hindu.com/2007/06/04/stories/2007060409670100.htm
_____________________________________________________
Labels: Telugu literature
2 Comments:
త్వరలోనే శుభ వార్త వింటామని చెన్నై ప్రపంచ తెలుగు మహాసభల్లో పురంధరెశ్వరి గారు చెప్పారు
8:11 am
This comment has been removed by a blog administrator.
8:11 am
Post a Comment
<< Home