తథాగతుడు - పంచ బోధనలు & అష్టాంగయోగం
పంచ బోధనలు
ఆధ్యాత్మిక సాధనల్లో కీలకమైన ఉపకరణం మనసు. పారమార్థికంగా మనం దేన్నయినా సాధించుకోవలసినది దానితోనే. వదిలించుకోవలసినదీ దానినే. అంటే మనం సాధన మొదలు పెట్టవలసినదీ, సాగించవలసినదీ, ముగించవలసినదీ కూడా మనసుతోనే.
అలలులేని సరసులోనే అడుగు కనిపిస్తుంది. అలజడి లేని మనసే సాధనలకు అనుకూలిస్తుంది. అలజడి తొలగాలంటే మనసుకు సానుకూల వాతావరణాన్ని ఏర్పరచాలి. అనుకూల దృక్పథాన్ని అలవరచాలి. వ్యతిరిక్తభావాలను అనుమతించకూడదు. కానీ మనసున్నంతవరకూ వ్యతిరిక్త భావనలు తప్పవు. వాటిని అనుకూలంగా మార్చుకోవటమే విరుగుడు. మరి ఎలా వాటిని అనుకూలంగా మార్చుకోవటం? దానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి వ్యతిరిక్త, అలజడి పూర్వక విషయాలను కూడా మనసు అంగీకరించక తప్పదన్న వాస్తవాన్ని మనసుకు బోధపరచటం. రెండు ఎప్పటికప్పుడు సద్విషయాలతో, సమరస భావాలతో మనసును నింపటం. ప్రథమంగా మొదటిదాన్నే మనం స్వీకరించి ఆచరించవలసి ఉంది. ఇందుకు గౌతమబుద్ధుడు బోధించిన 'అంగుత్తర నికాయ'లోని బోధలు మన ఈ ప్రయత్నానికెంతో ప్రయోజనకారిగా ఉంటాయి. అవి-
- ఏదో ఒకనాడు నాకు వృద్ధాప్యం కలుగుతుంది; అది నాకు అనివార్యం.
- ఏదో ఒకనాడు నాకు అనారోగ్యం కలుగుతుంది; అది నాకు అనివార్యం.
- ఏదో ఒకనాడు మృత్యువు నన్ను కబళిస్తుంది; అది నాకు అనివార్యం.
- నేను ఎంతగానో ప్రేమించి మమకారాన్ని పెంచుకున్నవన్నీ ఏదో ఒకనాడు మార్పునకు, పతనానికి గురై ఎడబాటు కలిగిస్తాయి; ఇదీ నాకు అనివార్యమే.
- నేను చేసిన కర్మలవల్లనే నేడు నా పరిస్థితి ఇలా ఉంది. నా పనులు మంచివైనా, చెడువైనా వాటి ఫలితాలకు నేను జవాబుదారీ కావలసిందే.
ఈ పంచ బోధనలను ధ్యానం చెయ్యమంటాడు బుద్ధుడు. వృద్ధాప్యాన్ని ధ్యానించటం ద్వారా యవ్వనం తాలూకు అహంకారాన్ని, అనారోగ్యాన్ని ధ్యానించటం ద్వారా ఆరోగ్యం తాలూకు అహంకారాన్ని, మృత్యువును ధ్యానించటం ద్వారా జీవించటంలోని అహంకారాన్ని, ప్రతి వస్తువు తాలూకు అనిత్యత్వాన్ని ధ్యానించటం ద్వారా వాటిని సొంతం చేసుకోవాలనే అత్యాశను వదులుకోవాలన్నది దంతస్సూత్రం. మన స్థితికి మనమే కర్తలమనే గ్రాహ్యతతో త్రికరణాలతో సత్కర్మలు చేయాలనే సద్భుద్ధిని మనసు ఆవాహన చేసుకుంటుందని బుద్ధుడి భావం.
ఈ పంచ బోధనలను ధ్యానిస్తే అహంకారం నశించటమేగాక వ్యతిరిక్త, అననుకూల భావాలను కూడా అంగీకరించక తప్పదన్న అవగాహనతో ప్రాతఃసంధ్యలోంచి సాయం సంధ్యలోకి నడచివెళ్లినంత సహజాతిసహజంగా వాటిని స్వీకరిస్తుంది మనసు. సానుకూల దృక్కోణంతో వాటిలోని హానికారకాలను ఉపయుక్త హేతువులుగా మలచుకుంటుంది. అందుకే మనసే మన శత్రువు. మిత్రుడు కూడా... మనం దాన్ని మలచుకునే విధానాన్ని బట్టి.
- చక్కిలం విజయలక్ష్మి
___________________________________________
తథాగతుడి అష్టాంగయోగం
దాదాపు రెండువేల ఐదొందల సంవత్సరాల కిందటి సంగతి. ఒక రాజుగారికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడి బారసాలకు వృద్ధుడైన ఒక యోగపుంగవుడు వచ్చాడు. ''అయ్యా నా కుమారుడికి మహారాజయోగం ఉందా?'' అనడిగాడు రాజు. ఆ యోగి, కుర్రాడిని పరీక్షగా చూసి ''ఈ బాలకుడు రాజ్యాధినేత అవుతాడు. భౌతికపరమైన రాజ్యానికి కాదు. మనుషుల హృదయాల్లో కొలువుతీరే హృదయాధినేత, మహాజ్ఞాన సంపన్నుడైన సర్వసంగ పరిత్యాగి అవుతాడు'' అన్నాడు ఆ మహర్షి. రాజు కంగారుపడ్డాడు. రాజాధిరాజు కావలసిన తన కొడుకు సన్యాసిగా మారతాడా అనుకుంటూ ఆ రోజు లగాయతు, ఆ కుర్రవాడికి ఏ కష్టమూ దుఃఖమూ కలగకుండా పెంచాడు. యుక్తవయస్కుడయ్యాక వివాహం జరిపాడు. రాజకుమారుడికి ఒక పుత్రుడు కూడా కలిగాడు. ఒక రోజు గుర్రపుబండిలో వాహ్యాళికి వెళ్లిన ఆ రాజకుమారుణ్ని నాలుగు దృశ్యాలు కదిలించాయి. వంగిపోయిన శరీరంతో ఉన్న పండు ముదుసలి, ఒక రోగగ్రస్తుడు, శ్మశానానికి తీసుకువెళుతున్న ఒక శవం; వీటితోపాటు భిక్షం యాచిస్తున్న ఒక సన్యాసి.
మానవ జీవితంలో ఇంత దుఃఖమూ, విషాదమూ, వేదన గూడుకట్టుకొని ఉన్నాయా, వీటిని ఎదుర్కొనే మార్గం ఏమిటి- అని అతడిలో అన్వేషణ మొదలయ్యింది. భార్యా బిడ్డలను, తల్లిదండ్రులను పరిత్యజించి ఆ యువకుడు ఇల్లు వదిలిపెట్టాడు. తనలో మెదులుతున్న అశాంతికి, అలజడికి మూలాలు వెదుకుతూ శాస్త్రాలు, వేదాలు చదివాడు. అన్న, పానీయాలు ముట్టకుండా కొండ గుహల్లో భయంకరమైన అడవుల్లో రాత్రింబవళ్లు, యోగముద్రలో, ధ్యానంలో గడిపాడు. కొన్ని సంవత్సరాల తరవాత ఒక రావిచెట్టు కింద తాను వెదుకుతున్న జ్ఞానపథం అవగతమయ్యింది. అలా సిద్ధార్థుడనే ఆ రాజకుమారుడు బుద్ధుడయ్యాడు. తన బోధనలతో ప్రపంచ చరిత్రను మలుపుతిప్పి, మానవాళి జీవితాలను ప్రభావితం చేసి, తథాగతుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. తథాగతుడు అంటే పునరావృతి లేని సద్గతి పొందినవాడు అని అర్థం. సత్యం నుంచి పుట్టిన వాడు తథాగతుడు. ఆది, అంతం, నేను, నాది అనే విచికిత్సపు భావనలకు అతీతమైన బుద్ధుడు అలా తథాగతుడైనాడు.
ఉదయించే సూర్యుడు అస్తమించినట్టే పుట్టుక తదనంతరం చావు ఉండటం ప్రకృతి ధర్మం. ఏదీ శాశ్వతంగా ఉండకపోవడం సృష్టిధర్మం. ఈ ధర్మాల సంకటంలో నలిగే మనిషికి మిగిలేది దుఃఖం. ఇది విశ్వవ్యాప్తం. ఈ దుఃఖానికి మూలాలు వెదికి వాటిని ఎదుర్కొనేందుకు బుద్ధుడు ఉపదేశించిన మార్గాల్లో అష్టాంగయోగం అతిముఖ్యమైనది. వీటిలోని ముఖ్య అంశాలు.
సమ్యక్ దృష్టి: సక్రమమైన ఆలోచన విధానం. సహేతుక దృష్టి.
సమ్యక్ సంకల్పం: ఉన్నతమైన ఆశయం. ఉన్నతమైన ఆలోచనల్లో విలువలు మరచిపోకుండా ఉండటం.
సమ్యక్ వాక్కు: సహచరులతో అరమరికలు లేకుండా సత్యమైన మాటలు మాట్లాడటం.
సమ్యక్ కర్మ: శాంతియుతమైన, స్వచ్ఛమైన ప్రవర్తనతో మెలగడం.
సమ్యక్ జీవనం: హింసా ప్రవృత్తి లేకుండా మానవత్వంతో ఉత్తమ జీవన విధానం అవలంబించడం.
సమ్యక్ కృషి: ఎల్లవేళలా అప్రమత్తంగా, సచేతనంగా జీవించడం.
సమ్యక్ స్మృతి: జీవిత సత్యాలు, మర్మాల పట్ల పరిశీలన, అవగాహనతో ఆలోచించడం.
సమ్యక్ సమాధి: పైన పేర్కొన్న ఏడు అంశాలను నియమానుసారంగా పట్టుదలతో ఆచరించడం.
ప్రతిఫలాపేక్ష, స్వార్థచింతన, దురాశాపూరితమైన ఆలోచనల్నీ విడనాడితే దుఃఖనివారణ సాధ్యమని ఆయన ప్రవచించాడు. బుద్ధుడు స్వయంగా తాను నిర్దేశించిన సూత్రాలను అమలు పరిచాడు.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
(Eenadu:14& 17 June,2007)
_______________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home