పాపం... బ్రహ్మచారులు
భారతంలో భీష్ముడు, రామాయణంలో ఆంజనేయుడు పెళ్లి జోలికి పోకుండా ఆజన్మ బ్రహ్మచారులుగా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది చెప్మా? అంటూ ఎప్పటినుంచో నన్నో సందేహం పీడిస్తూ ఉండేది.
ఈమధ్య పేపర్లు తిరగేస్తోంటే ఓ వార్త కనిపించడంతో నా సందేహం కాస్తా పటాపంచలై పోయింది. వాళ్లు ఐటీ ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్లే కదా అలా ఉండిపోవలసి వచ్చిందన్న విషయం క్షుణ్ణంగా అర్థమైంది. అంతేనా... పరమ శివుడు కూడా ఐటీ కోర్సు చేయకపోవడం వల్ల తన శరీరంలో అర్థ భాగం పార్వతికిచ్చి పెళ్లికి ఒప్పించాల్సి వచ్చింది కదా అనిపించింది. పంచ పాండవులకు ఐటీ డిగ్రీలు లోపించబట్టి అంతా కలసి ఆమెను 'పంచు'భర్తృకను చేశారన్న విషయాన్నీ రూఢీ చేసుకున్నా.
ఐటీ పుణ్యమాని పెళ్లిళ్ల మార్కెట్‌లో స్వయంవరం రోజులు వచ్చేశాయి కదా మరి. శివ ధనస్సును భంగం చేయడానికి మించిన ఐటీ పరీక్షలూ వచ్చేశాయి. 'వరాయ విష్ణు రూపాయ' అనే మాటలకు బదులు 'వరాయ ఐటీ రూపాయ' అంటున్నారు. రూపాయికి బదులు డాలర్ మోత మోగిస్తోంది. దీంతో ఐటీయేతర బ్రహ్మచారులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఏదో విధంగా ఇంటర్ నెట్టుకు వచ్చాం గదా పెళ్లి పీటల మీద కూర్చుందామని ఇంటర్‌నెట్టు బ్రౌజ్ చేసినా, తగిన సంబంధాలు దొరక్క నీరు గారిపోవలసి వస్తోంది. వెడ్డింగ్ కాగానే అమెరికాకు బెడ్డింగ్ సర్దుకోగలిగిన పరిస్థితి లేకపోతే పెళ్లి యోగం ఉండదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది.
'దేశమంటే అమెరికాయేనా?
ఉద్యోగమంటే ఐటీయేనా?'
అని బ్రహ్మచారులంతా నిట్టూర్చాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అబ్బాయిల అందానికి ప్రాధాన్యం కూడా తగ్గిపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? లేక హార్డ్‌వేర్ ఇంజినీరా? అన్నదొక్కటే క్వాలిఫికేషనై కూర్చుంది.
'లుక్‌లో ఏముంది? కంప్యూటర్ జాబులో 'లక్' ఉంది' అన్న కోరస్ వినపడి, పెళ్లి కొడుకులంతా జేబులు తడుముకోవలసి వస్తోంది. మా వాడిది గవర్నమెంటు ఉద్యోగం. 'జీతం కన్నా గీతం ఎక్కువే' వస్తుంది సుమా అన్నాసరే అమ్మాయి తరఫు వాళ్లు పెడచెవిన పెట్టేస్తున్నారట. ఔరా ఇదేం విచిత్రం. వెబ్‌సైట్లలో ఎక్కువ భాగం 'వెడ్'సైట్లే! ఆన్‌లైన్‌లోకి రాకపోతే, ఎంతగా లైనేసినా... పెళ్లిళ్లు కుదరట్లేదు. ప్రేమ సామ్రాజ్యాలు నిర్మించుకున్న కొందరికి సైతం ఐటీ దెబ్బకు గూబ గుయ్యిమంటోంది. 'లవ్వొక్కింతయు లేదు... ప్రాణముల్ ఠావుల్ తప్పెను' అని భగ్నప్రేమ కథలు ఠావుల కొద్దీ రాసుకోక తప్పదిక. పెళ్లిళ్లన్నీ ముందే నిర్ణయమైపోతాయని తెలిసిం తర్వాత జీవితంలో తమకు కల్యాణ గీత ఉందా లేదా అని అబ్‌బొయ్స్ చిలక జోస్యాలు అడగడానికీ సిగ్గుపడడం లేదు. పెళ్లి కుదరక జుట్టు లాక్కుని పిచ్చోళ్లు అయ్యేవాళ్లూ ఎక్కువే ఉండొచ్చు. పిచ్చి కుదిరాక గానీ పెళ్లి కాదు, పెళ్లి కుదిరాక గానీ పిచ్చి కుదరదు అని పెద్దవాళ్లు ఎందుకన్నారో హైపిచ్‌లో అర్థమైపోతోంది.
ఐటీ అనే రెండక్షరాలు పెళ్లిళ్లను శాసిస్తూ ఉంటే ఐటీయేతర బ్రహ్మచారులంతా సంఘంగా ఏర్పడి 'పెళ్లి చేసుకునే హక్కు'ను రాజ్యాంగంలో చేర్చాలని డిమాండ్ చేసే రోజు వస్తుంది. గాంధీ మహాత్ముడు మళ్లీ పుడితే 'పెళ్లి కావలసిన అబ్బాయిలందరికీ పెళ్లయిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం' అని మాట మారుస్తారేమో బహుశా. మూడు ముళ్ల బాట కూడా ముళ్ల బాట అయింది. అయినా ఆ దారిని పోక తప్పించుకునేందుకేముంది చెప్పండి?
- ఫన్‌కర్
(Eenadu, 24:06:2007)
_________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home