'పుంజు'కుంటే చిక్కే
యావత్ ప్రపంచమూ (అయో)మయ సభగా, మాయ సభగా మారిపోతున్న రోజులివి. ఇవాళ కనిపించినది రేపటికి ఏ రూపు దాలుస్తుందో ఎవరికెరుక చెప్పండి? నేనీ మాటలు ఊరకనే అనట్లేదు. 'ఏ నిమిషమ్మునకేమి జరుగునో ఎవరూహించెదరు గనుక?' లేకపోతే అప్పటిదాకా నిక్షేపంలా గుడ్లు పెడుతున్న కోడిపెట్ట కాస్తా పుంజులా మారిపోవడమేమిటి? చేపలు పట్టడానికి సెల్‌ఫోన్ ఉంటే చాలు అంటూ టెక్నాలజీ రొమ్ములు విరవడమేమిటి? మీరే చెప్పండి.. అందుకే ఈ ప్రపంచాన ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అంటున్నా.
ఈ వింతలు ఇలాగే సాగుతూ పోతే ఏడాదికి కోట్ల రూపాయల వ్యాపారం చేసే గుడ్ల పరిశ్రమ గతేంకావాలి చెప్పండి? పొద్దునే 'గుడ్డు లేనిదే బెడ్డు దిగనని' మారాం చేసే మారాజుల సంగతేం కావాలి? అందుకేనేమో గుడ్డు ప్రకృతి అయితే గోడు వికృతి అవుతుందని చెప్పుకోవాలేమో ఇక. పెట్టలు పుంజులుగా మారిపోతేనో, కోళ్లు ఇంగ్లిషు నేర్చుకుని లెక్కలు చేస్తేనో, సెల్‌ఫోన్లు చేపలు పడితేనో... ఇక కోళ్ల వ్యాపారులు, మత్స్యకారులు 'గుడ్డు'దుడుకులు, 'ఒడ్డు'దుడుకులు
'ఎపుడూ చెప్పలేదు వేమనగారు
అపుడే చెప్పలేదు బ్రహ్మంగారు'
ఎన్ని పాటలు పాడుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోతే ఆనక తీరిగ్గా 'గుడ్లు' మిటకరించాల్సిందే.
దేశంలో ప్రస్తుతం ఏడాదికి 1.61 మిలియన్ టన్నుల గుడ్లు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఉత్పత్తిపరంగా చూస్తే ప్రపంచంలోనే మనది అయిదో స్థానం. ఉత్పత్తిలో మన రాష్ట్రమూ తీసిపోలేదు. ఇది సరే, ఆమధ్య ఎక్కడో చదివినట్లు గుర్తు.. 'కొక్కొరొకో' అంటూ సకల జగత్తును మేలుకొలిపే కోడి తాను కూడా తెల్లారుగట్లే లేచి ఇంగ్లిషు, లెక్కలు నేర్చుకుని మనుషులకు పోటీగా తయ్యారయిందిట. అది ఇంజినీరింగ్ కూడా చదివేస్తే ఇంజినీర్లకు పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. పైగా ఆ కోడి ముద్దులు పెట్టడం కూడా నేర్చేసుకుందట! ఏమో రేపో మాపో కోళ్లు కూడా ప్రేమలో పడి మొబైల్స్ పట్టుకుని చక్కర్లు కొడితే సెల్‌ఫోన్ కంపెనీలకు గిరాకీ అమాంతం పెరిగిపోదూ!
అవును, ఇంతకీ సెల్‌ఫోనంటే గుర్తుకొచ్చింది. చేపలు పట్టడానికి సెల్‌ఫోన్లు కూడా పనికొస్తాయట. కోడి విషయం ప్రకృతి ప్రేరేపితమైతే, చేపల సంగతి హై'టెక్కు'నాలజీ సృష్టించిన ఘనతే మరి. సెల్‌ఫోన్లతోనే చేపలు పట్టేసే అవకాశం వస్తే ఇక మత్స్యకారుల బతుకులేం కావాలీ, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే చిన్నాచితకా వ్యాపారుల గతేం కావాలి చెప్పండి. ఏవండీ ఇంట్లో కూరలు అయిపోయాయి. కాస్త ఆ సెల్‌ఫోను నొక్కి చేపలు పట్టి వంటింట్లో పెట్టకూడదూ అని ఇల్లాలు ఆర్డరేసే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు సుమా!
మూగ యంత్రాలు కూడా మరమనుషుల అవతారమెత్తి చెట్టంత మనిషిని పట్టుకుని బస్తీ మే సవాల్ అంటున్న ఈ రోజుల్లో వాటికి మూగ జీవాలు కూడా జత కలిస్తే ఇక వాడి బతుకేం కావాలి! మహాప్రస్థానం బదులు మరప్రస్థానం'మర'మరికలతో సరికొత్త గీతాలాపన చేసుకోక తప్పదేమో! తలచుకుంటేనే నీరసమొచ్చేస్తోంది. కాస్త బలం పుంజుకోవడానికి అలా వెళ్లి రెండు ఆమ్లెట్లు లాగించి వచ్చేయనా! పడక తప్పదు. కోడిపెట్టలు చెప్పా'పెట్ట'కుండా గుడ్లు పెట్టడం మానేస్తే వ్యాపారస్తులు 'గుడ్లు' తేలేయాల్సిందే. రాసుకోవలసిందే. 'పొలాలనన్నీ హలాల దున్నీ...' అన్న పాటకు బదులు
-ఫన్‌కర్
(Eenadu,03:06:2007)
__________________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home