పదాలు
'మామిడి పండు' అనే మాటకు సమానార్థకమైన మాట భారతదేశంలోని ప్రతి భాషలోను వుంది. కాని, యూరప్ లోని యే భాషలోను లేదు. యెందుకు లేదంటే, యూరప్ లో మామిడి పండే లేదు గనుక.ఇంగ్లీషువాళ్ళు మనదేశానికి వచ్చినప్పుడు మామిడి పండును/ కాయను చూసి, తమిళంలోని 'మాంగాయ్'నుండి mango అనేమాట సృష్ట్తించుకున్నారు.....అలాగే, యూరప్ లో వున్న పండ్ల పేర్లు మన భాషల్లో లేవు.యెందుకు లేవంటే ఆ పండ్లే మనకు లేవు గనుక.... వస్తువే లేకపోతే దానికి పేరు వుండడం సాధ్యం కాదు గదా.వస్తువు ప్రత్యక్షంగా లేకపోయినా, ఊహలో వున్నా సరే, మనుషులు దానికి పేరు పెట్టుకోగలరు.స్వర్గం, నరకం, దేవుడు, దయ్యం, అప్సరస, బడబాగ్ని లాంటి పదాలు ఇలా పుట్టినవే.
'మంచు' అనేమాట తెలుగు వుంది. సంస్కృతంలో హిమము, ప్రాలేయము, నీహారము, హిమిక అనే మాటలు వున్నాయి.అన్నీ మంచుకు పర్యాయపదాలే. మంచులో రెండు రకాలను తెలపడానికి 'మంచుగడ్డ' 'పొగమంచు' అనే రెండు మాటలు విడిగా వున్నాయనుకోండి.కానీ యింగ్లీషులో mist, dew, fog, frost, snow, ice, slush, sleet అని 8 మాటలున్నాయి. ఇవన్నీ చాలక smog అనే కొత్త మాట, యీ శతాబ్దంలో పుట్టింది.యీ 9 మాటలకూ తొమ్మిది వేరువేరు అర్థాలున్నాయి. యేదీ మరొకదానికి పర్యాయ పదం కాదు.తొమ్మిది పదాలు వేరువేరుగా యెందు కున్నాయంటే, తొమ్మిది వస్తువులు వేరువేరుగా వున్నాయి గనుకనే, యూరప్ లో వున్న వాళ్ళు యీ తొమ్మిదింటిని ప్రత్యక్షంగా చూస్తున్నారు.తెలుగు భాషలో యిన్ని పదాలు లేక పోవడానికి భౌగోళిక, శీతోష్ణ పరిస్థితులే కారణ మనవచ్చు..........
బంధుత్వాలకు సంబంధించిన మాటలన్నీ వివాహ వ్యవస్థతో ముడివడివుంటాయని సులభంగా గ్రహించవచ్చు......మనదేశంలో సోదరీ సోదరుల పిల్లలు ఒకరినొకరు పెండ్లి చేసుకోవచ్చు.దీన్నే మేనరికమంటారు. కానీ, అన్నదమ్ముల పిల్లలు ఒకరినొకరు గానీ, అక్కచెల్లెండ్ల పిల్లలు ఒకరినొకరు గానీ పెండ్లి చేసుకోకూడదు.కానీ, యూరప్ లో చేసుకోవచ్చు.అనగా, వివాహ విషయాల్లో యూరప్ లో మేనమామకు,చిన్నాయన(పెదనాయన) కూ భేదం లేదు; అలాగే, మేనత్తకూ చిన్నమ్మ (పెద్దమ్మ) కూ భేదం లేదు.ఆ కారణం వల్లనే అక్కడ వున్న uncle అనే పదానికి రెండు పదాలు, aunt అనే పదానికి రెండు పదాలు యిక్కడ మనకు అవసరమైనాయి.యింగ్లీషులోని cousin అనే మాటకు మనభాషలో సమానార్థకం లేకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు.అయితే మరి, అన్న, తమ్ముడు అనీ, అక్క, చెల్లెలు అనీ విడివిడిగా ద్రావిడ భాషల్లో వున్నట్లు వుత్తరభారతదేశపు భాషల్లోను, యూరోపియన్ భాషల్లోను లేకపోవడనికి కారణమేమిటో చెప్పలేము...........................................
తెలుగులో మేము, మనము అనే మాటలు వున్నాయి. యీ రెండింటికి యింగ్లీషులో we అనే అంటారు.హిందీలో 'హం' అంటారు.తెలుగులో వున్న ఈ విభజన ప్రపంచంలో అనేక భాషల్లో లేదు..............................
యిలా కారణంగా లేదా ఊహకందని కారణాలవల్ల, యింగ్లీషులో వున్న పదాలు కొన్ని తెలుగులో లేవు.
ladder అంటె నిచ్చెన అని తెలుగులో వుంది గాని stair-case కు తెలుగు మాట యెందుకు లేదు. సంస్కృతం లో కూడా 'శోపానశ్రేణి' లాంటి పండిత సమాసాలు వున్నాయి గానీ, ప్రత్యేకంగా ఆ వస్తువుకొక పేరంటూ లేదు.'శోపానశ్రేణి'లాగే తెలుగులోకూడా 'మెట్లవరుస' అని కల్పించుకోవచ్చు. కానీ తెలుగువాళ్ళెవరూ ఆ మాట వాడడం లేదు. stair-case అనడానికి మెట్లు, మెటికలు, తాపలు, చీడీలు అనే అంటున్నారు. step అనే మాటకు బహువచన రూపాలే ఇవన్నీ.
window కు తెలుగు,సంస్కృత పదాలన్నీ మరుగున పడిపోగా, 'కిటికీ' అనే (ఉరుదు నుండి వచ్చిన) పరాయి మాట వాడుకలో వుంది,
మరి, window-sill కు తెలుగులో యేమనాలి?
sentiment కు తెలుగు మాట యెందుకు లేదు?
instinct కు తెలుగు మాట యెందుకు లేదు?['సహజాతం' అనేది యిటీవల పండితులు సృష్టించిన మాట.దానికంటె 'అంత:ప్రవృత్తి' అనడమే బాగుంటుంది.]
house కూ home కూ విడివిడిగా రెండు పదాలు తెలుగులో లేవు.బహుశ ప్రపంచంలో చాలా భాషల్లో లేవు.........
అది పోనీ roof కూ ceiling కూ రెండు పదాలు మనకెందుకు లేవు?
marriage కూ wedding కూ రెండు పదాలు యెందుకు లేవు?
hot కు వేడి అనీ, warm కు వెచ్చని అనీ మనకు రెండు పదాలు వున్నాయి; కానీ cool కూ, cold కూ, యెందుకు లేవు?
misuse కూ, abuse కూమధ్య గల భేదం సున్నితమైనదిగనుక వాటికి తెలుగులో రెండు మాటలు విడివిడిగా లేవని సమాధానపడవచ్చు.
discover కూ, invent కూ రెండు తెలుగు మాటలు యెందుకు లేవు?...
అది పోనీ airకూ, windకూ వేరువేరుగా రెండు మాటలు మనకెందుకుండకూడదు?.............
గాలి, పయ్యెర, వాయువు, మారుతం,పవనం, అనిలం అని యెన్నో మాటలు వున్నాయి గానీ, అన్నీ పర్యాయపదాలే. ప్రభంజనం కూడా అంతే. అన్నీ airకూ సమానార్థకాలే; windకూ సమానార్థకాలే; మళ్ళీ మాట్లాడితే breezeకు కూడా సమానార్థకాలే; యింగ్లీషులో draughtఅనే మరో మాట కూడా వుంది.దానికి తెలుగు మాట ఊహించడానికేసాధ్యం కాదు...........
(పుటలు :45,46,47 & 48, "అనువాద సమస్యలు" , రాచమల్లు రామచంద్రా రెడ్డి, 1991)
-----------------------------------------------------------
Labels: Telugu literature
3 Comments:
ఈ విషయాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఎక్కడో చదివాను అరబిక్ లో ఒంటెకు 700 దాకా పర్యాయ పదాలున్నాయి అలాగే ఉత్తర ధృవంలో మాట్లాడే ఇనుక్టూట్ లో మంచుకు 200 దాకా పదాలున్నాయని. నన్ను బాగా ఇబ్బంది పెట్టేది weather కి climate కి atmosphere కి నిర్ధిష్టమైన తెలుగు పదాలు లేకపోవటం. ఇకపోతే ఆ చివర్లో గాలి, వాయువు పర్యాయపదాలన్నారు. అది కాస్తా అలోచించాల్సిందే. గాలి వీస్తుంది అని అంటారు కానీ వాయువు వీస్తుంది అని అనరు కదా (ఖచ్చితంగా వీటి అర్ధంలో తేడాలుండాలే)
12:31 pm
పదాలే ఏం ఖర్మ! అసలు కాలాలే tenses భాషల మద్య వేరు కదా!
--ప్రసాద్
http://blog.charasala.com
5:57 pm
అ)చాలా ఇంగ్లీషు మాటలకు తెలుగులో సరైన మాటలు లేవు.ఇంగ్లీషులోనే కాదు, యే భాషలోనైనా యితర భాషల్లోలేని పదాలు కొన్నైనా వుంటాయి.(మన తెలుగులో అటువంటి పదాలు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు,మేనత్త, పెద్దమ్మ, పిన్నమ్మ, మేనమామ, పెద్దనాన్న,చిన్నాన్న.రవి గారన్నట్లు అరబిక్ లో ఒంటెకు 700పర్యాయ పదాలు,ఉత్తర ధ్రువం లో మంచుకు 200 పదాలు ఇవే బాపతు).
1) ఓ జాతి నివసించే భూభాగపు శీతోష్ణస్థితులను బట్టి,భౌగోళిక పరిస్థితులను బట్టి వీటి పై అదారపడ్డ దాని జీవిత విధానం బట్టి దాని భాష వుంటుంది.యూరోప్ లోని భౌతిక పరిస్థితులకూ, మనుషుల జీవిత విధానానికి,మనదేశంలోని భౌతిక పరిస్థితులకూ, మనుషుల జీవిత విధానానికి మధ్య చాలా భేదం వుంది.భాషల మధ్య బేధానికి ఇదో కారణం.
2)భాషల భేదానికి మరో కారణం, ఆ భాషలు మాట్లాడే జాతుల వికాసంలో భేదమే. గత 4శతాబ్ధాలుగా యూరోపియన్ జాతులు అభివృద్ధి చెందినంతగా ప్రపంచలోని యితర జాతులు అభివృద్ధి చెందలేదు.అందువల్లనే యూరోపియన్ భాషలు వికసించినంతగా ఇతర భాషలు వికసించలేదు.
ఇంగ్లీషులో పదాల సంఖ్య పది లక్షలకు చేరిందంటే, ఆ భాషలో లేని పదాలను ఇతర భాషలనుంచి ధారాళంగా తీసుకోబట్టే కదా. మనమూ, మడికట్టుకోకుండా, మన భాషలో లేని పదాలను, ఇతర భాషలనుండి తీసుకోవడంలో తప్పేమి లెదు. కానీ అటువంటి పదాలను ఎవరు ప్రమాణీకరిస్తారు?
ఆ)weather కి climate కి atmosphere కి నిర్ధిష్టమైన తెలుగు పదాలు లేకపోవటం నిజమే!
atmosphere- నభోవరణం, వియత్తు, వియత్వరణం;climate-వాతావరణం,శీతోష్నస్థితి; weather-దైనందిన వాతావరణం అనొచ్చు.
ఇ)గాలి, వాయువుల విషయానికొస్తే: గాలి తెలుగు పదం, వాయువు సంస్కృత పదం. అదే తేడా.
ఈ)నిజమే.తెలుగులో కాలములు మూడే -వర్తమాన కాలం, భూత కాలం, భవిష్యత్కాలం. కొందరు నాలుగవదిగా తద్ధర్మ కాలం చేరుస్తారు.
ఇంగ్లీషులో కూడా మూడు కాలలే- present tense, past tense, future tense న్నూ. అదనంగా వాటికి మళ్ళీ 4 రూపాలు(aspects) ఉన్నాయి -simple, continuous, perfect,perfect continuous, అలా మొత్తం (3x4)12 ఔతాయి.
1)ఇంగ్లీషులోని simple past,past perfect,present perfect, తెలుగులో భూతకాలము (ఉదా:తిన్నాను);
2)ఇంగ్లీషులోని past continuous, past perfect continuous, present continuous,present perfect continuous, తెలుగులో వర్తమానకాలము (ఉదా:తింటున్నాను)
3)ఇంగ్లీషులోని simple present, simple future, future perfect తెలుగులో భవిషత్కాలము.(ఉదా:తింటాను)
4)ఇంగ్లీషులోని future continuous, future perfect continuous తెలుగులో ఉదా:తింటుంటాను
1:16 am
Post a Comment
<< Home