జీవుడే దేవుడు!
ఆ గురుకులంలో గురువు, తన శిష్యులకు విలువిద్యలతోపాటు ధర్మపాలన, నైతిక ప్రవర్తనల గురించి బోధించేవాడు. ఒకరోజు ఇద్దరు శిష్యుల్ని పిలిచి ''మీకొక పరీక్ష పెడుతున్నాను. మీరు వెళ్ళి మంచి లక్షణాలున్న ఒక ఉత్తముణ్ని, దుర్గుణాలున్న ఒక చెడ్డ వ్యక్తిని వెతికి తీసుకురండి'' అన్నాడు. ఆ శిష్యుల్లో ఒకరు గురువు గారి ఆజ్ఞ ప్రకారం తన అన్వేషణ కొనసాగించి చివరికి తిరిగి వచ్చి, ''ఆర్యా, నా పరిశీలనలో ఏ చెడ్డవ్యక్తీ దొరకలేదు, అందరిలోనూ ఏదో ఒక సుగుణం కనిపిస్తోంది'' అన్నాడు. కొద్దిసేపటికి రెండో శిష్యుడు వచ్చి, ''అయ్యా నాకు ఏ మంచి వ్యక్తీ కనబడలేదు. ప్రతీవారిలోనూ ఏదో చెడు గుణమే తొంగి చూస్తోంది'' అన్నాడు. అందుకు గురువు నవ్వుతూ, ''ఇప్పటి మీ పరిశీలన, అవగాహన, కొన్ని యుగాల తరవాతా ఐతిహాసిక నేపథ్యంలో మీరేమిటో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతాయి'' అన్నాడు. ఆ గురువే ద్రోణాచార్యులు. ఆ శిష్యులిద్దరిలో అందరిలోనూ మంచినే దర్శించిన వ్యక్తి ధర్మమార్గంలో తుదిశ్వాసవరకు జీవించిన ధర్మరాజు. అందరిలోనూ చెడునే చూసిన శిష్యుడు, దుష్టలక్షణాలకు ప్రతీకగా నిలిచిన దుర్యోధనుడు.
ప్రపంచం చెడుగా ఉందంటే, ఆ తప్పు ప్రపంచానిది కాదు. చూసే దృష్టిదే అంటారు వేదాంతులు.
ఒక చిత్రకళాసంస్థ, చిత్రకారులకు ఒక పోటీ నిర్వహించింది. ఒక మహాపురుషుడి బొమ్మ చిత్రించాలి. అందరికీ తెలిసి, తన ఆదర్శ వ్యక్తిత్వంతో ప్రచారంలో ఉన్నవారు కాక, అజ్ఞాతంగా ఎవరికీ కనబడకుండా ఉన్న ఒక ఆదర్శమూర్తి చిత్రం వెయ్యాలి. ''ప్రేమ, కరుణ, సేవాతత్పరత అనే త్రిగుణాల కలయికతో సాక్షాత్తూ భగవంతుడే అతడిలో కనిపించాలి అనే నిబంధన ప్రకారం ఆ బొమ్మను వేసి పంపాలి'' అన్నారు ఆ సంస్థ నిర్వాహకులు. ఆ పోటీకి కొన్నివేల బొమ్మలు వచ్చాయి. యోగులు, అవధూతలు, సంఘ సేవకులు, సంస్కర్తలు... ఇలా ఎందరో మహానుభావుల చిత్రాలు పోటీకి వచ్చాయి. న్యాయనిర్ణేతలు ఎన్నో వడపోతల తరవాత ఒక చిత్రాన్ని ఎంపిక చేశారు. కొన్ని వేలమంది పౌరుల సమక్షంలో ఆ చిత్రకారుడికి బహుమతి ప్రదానం, ఆ వేదికమీదే ఆ చిత్రానికి నమూనాగా నిలిచిన ఆదర్శవ్యక్తినీ సన్మానించారు. వేదికపై ఆ మహావ్యక్తిని చూసిన వారంతా ముక్కుమీద వేలేసుకున్నారు. అతడి గత జీవితం తెలిసి ఆశ్చర్యపోయారు. పూర్వాశ్రమంలో అతడు ఒక హంతకుడు, ఎన్నో దోపిడులు చేశాడు. జైలు పాలయ్యాడు. అతడికి జైలులో జ్ఞానోదయం కలిగింది. జైలు అధికారులు అతడిలోని మంచితనాన్ని గుర్తించారు. అంతర్గతంగా అతడిలో ఉన్న కరుణ, ప్రేమల్ని వెలికితీశారు. అలా అతడొక మానవతావాదిగా, ప్రేమ స్వరూపుడిగా రూపొందాడు.
- ఒక వ్యక్తిలోని మంచిని మాత్రమే గుర్తించగలిగితే అతడు ఒక ఆదర్శ పురుషుడిగా మారతాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం ఉంటుంది?
మనసు నిర్మలంగా, పవిత్రంగా ఉంటే అంతా మంచివారిగానే కనిపిస్తారు. మనలోని అవలక్షణాలను తెలుసుకోవడంతోపాటు, ఎదుటివారిలోని సుగుణాలనూ గుర్తించి వారిని గౌరవించాలి.
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనం
అంటోంది గీత.
సమస్త జీవుల్లో తనను, తనలో సమస్త జీవుల్నీ వీక్షిస్తూ సర్వకాల, సర్వావస్థల్లో సమదృష్టి కలిగి ఉండేవాడే ఆత్మయోగి.
- అంటే అందరిలో తనను, తనలో అందరినీ చూసుకునే వ్యక్తిలో దేవుడుంటాడు. అలా దేవుడున్నాడని నమ్మి అందరిలోనూ దేవుడిని చూడగలిగే జీవుడే దేవుడు!
- డాక్టర్ ఎమ్.సుగుణరావు
(Eenadu, 01:05:2006) ________________________________________
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home