మనస్సు
మనస్సు ఇల్లువంటిది. ఇంట్లోని కసవును వూడ్చివేయటానికి చీపురు ఉపయోగపడినట్లే మనస్సులోని మాలిన్యాలను కడిగివేయటానికి సత్యం ఉపయోగపడుతుంది. (మనఃసత్యేన శుద్ధ్యతి). ఈ మనస్సు మనం తినే ఆహారాన్ని బట్టి ఏర్పడుతుంది. (యదన్నం తన్మనః).
భగవంతుడు మనిషిని మనస్సుతో వాక్కును కలిపి తయారుచేసినట్లు బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. జ్ఞానేంద్రియాలను ఐదింటిని, కర్మేంద్రియాలను ఐదింటిని నియంత్రించే శక్తి ఒక్క మనస్సుకే ఉంది. ఈ మనస్సును స్థూలంగా అంతఃకరణమని పిలుస్తాం. సంకల్పిస్తే మనస్సు. ఆలోచిస్తే చిత్తం. నిశ్చయిస్తే బుద్ధి. నేను, నాది అంటే అహంకారం.
ఇలాంటి మనస్సులోనే శుభసంకల్పాలకు తగిన చోటివ్వాలని భగవంతుణ్ని ప్రార్థించాలి.
యత్ప్రజ్ఞాన ముతచేతోధృతిశ్చ
యజ్జ్యోతిరంతరమృతం ప్రజాసు
యస్మాన్న ఋతే కించన కర్మక్రియతే
తన్మేమనః శివసంకల్పమస్సు (యజుర్వేదం 34-3)
(ఏ మనస్సు జ్ఞానసాధనమో, ఏది ఆలోచనాశక్తిని కలిగి ఉంటుందో, ఏది ధైర్యానికి స్థానమో, ఏది జనుల్లో వినాశం లేని ప్రకాశమో, దేని సహాయంతో సమస్త కార్యక్రమాలు జరుగుతాయో- అలాంటి మనస్సు నాకు శుభ సంకల్పాలు కలిగించుగాక!)
ఇంద్రియాలకంటె మనస్సు, మనస్సుకంటె ఆత్మ సూక్ష్మమైనవి. మనస్సు స్వాధీనంలో ఉండటానికే యోగప్రక్రియ. ఒక మనస్సును జయిస్తే సర్వం సాధ్యమవుతుంది. కాని ఈ మనస్సు మీద ఆరుగురు శత్రువులెప్పుడూ దాడి చేస్తుంటారు. వారికే అరిషడ్వర్గమని పేరు. మానవుడు బుద్ధిశాలియైు ఈ శత్రువుల ఆట కట్టించాలని వేదం ప్రబోధిస్తుంది.
ఉలూక యాతుం, శుశులోకయాతుం
జహిశ్వయా తుముత కోకయాతుం
సుపర్ణయాతుం, ఉతగృధ్రయాతుం
దృషదేవ ప్రమృణరక్ష ఇంద్ర (రుగ్వేదం 7-104-22)
మోహం గుడ్లగూబ స్వభావం. క్రోధం తోడేలు స్వభావం. మాత్సర్యం కుక్క స్వభావం. కామం ఊరపిచ్చుక స్వభావం. మదం గరుత్మంతుని స్వభావం. లోభం గద్ద స్వభావం. రాతితో కుండను ఏవిధంగా పగలగొడతామో, ఆత్మశక్తితో ఈ మోహాదిషడ్గుణాలను ధ్వంసం చేయాలి. ఈ ఆరింటిలో కామక్రోధలోభాలు మరీ బలమైనవి. ఇవి మూడూ నరకానికి మూడు ద్వారాలుగా భగవద్గీత చెప్పింది.
మనస్సు త్రిగుణాత్మకమైంది. మనస్సు చేసే కర్మలు కూడా మూడు రకాలు. సాత్వికం, రాజసం, తామసం. ఉదాహరణకు దానమనే కర్మను తీసుకొందాం. ప్రత్యుపకారం కోరక చేసే దానం సాత్వికం. ప్రత్యుపకారం కోరి చేసే దానం రాజసం. అనర్హులకిచ్చే దానం తామసం. వీటిలో సాత్వికం ఉత్తమమైంది.
నిష్కామకర్మలే మోక్షానికి దారి చూపుతాయి. కనుకనే యజ్ఞదానతపః కర్మలను నిరంతరం ఆచరణలోపెట్టాలి. తద్వారా మనస్సు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనస్సు ఆత్మజ్ఞానానికి, ఆత్మజ్ఞానం మోక్షానికి కారణభూతమవుతాయి. లోకంలో మూడురకాల కర్మలున్నట్లే మూడురకాల సుఖాలున్నాయి. సాత్విక, రాజస, తామస సుఖాల్లో సాత్విక సుఖమే శ్రేష్ఠమైంది. మనస్సు నిర్మలత్వం చేత లభించే సుఖమే సాత్వికసుఖం.
శ్రీరామచంద్రుడొకసారి వసిష్ఠమహర్షిని సందర్శించి మోక్షానందం ఎక్కడుందని ప్రశ్నించాడు. దానికి ఆ మహర్షి మోక్షానందం ఆకాశంలోను, పాతాళంలోను, నేలమీదనూ లేదు, నిర్మలమైన మనస్సులో మాత్రమే దానికి స్థానమని సమాధానమిచ్చాడు.
న మోక్షో నభసఃపృష్ఠే,
పాతాలే నచభూతలే
మోక్షోహి చేతో విమలం
సమ్యగ్‌జ్ఞాన విబోధితమ్ (శ్రీవసిష్ఠగీత)
(Eenadu, 03:03;2006)
-----------------------------------------------
Labels: Religion, Religion/telugu
0 Comments:
Post a Comment
<< Home