సంతృప్తే సంపద
భూమి సూర్యుని చుట్టూ తిరిగేమాట ఏమోకాని ప్రపంచం డబ్బుచుట్టూ తిరుగుతోంది. కలిమి కలిగినవాడే కాముడుగా, సోముడుగా సకల సద్గుణాభిరాముడుగా జనానికి కనిపిస్తున్నాడు. డబ్బుంటే చాలు, ''చుట్టములు గానివారలు చుట్టాలము మీకుననుచు పొంపుదలిర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు'' అంటూ లోకం పోకడను వ్యంగ్యంగా వివరించారో కవి. విద్య, వివేకంలాంటి సద్గుణాలు ఎన్ని ఉన్నా డబ్బులేనప్పుడు అవేవీ గుర్తింపునకు నోచుకోవు. ''బేలనిల భీముడనుపేర పిలువజేయు, రసికతలు యింతలేని నిరక్షరీకు పావనంబైన సకల విద్యావిశాలుడనగజేయు'' అంటూ ధనమహిమను కీర్తించాడో పూర్వకవి. అటువంటి డబ్బే ఒక్కొక్కసారి మనుషుల మధ్య అగాధాలు సృష్టించి పగలూ సెగలూ రేపుతుందని చెబుతూ ఆయనే డబ్బువల్ల కలిగే అనర్థాలనూ వివరించాడు. ''ప్రాణమిత్రునైన పగవానిగాజేయు, నరమి ప్రాణముమీద నలుగజేయు, కొరగాని కతిలోభ గుణము బుట్టగజేయు తోడబుట్టినవాని దొలగజేయు'' అంటూ ''ధనము పాప స్వరూపంబు తథ్యమరయ'' అని ధనాన్ని నిరసిస్తాడు. ఎవరేమి అన్నా, డబ్బుకున్న ప్రాముఖ్యం తగ్గేది కాదు. డబ్బు సంపాదించాలనీ ధనవంతులు కావాలనీ ప్రతివారూ ఆరాటపడుతుంటారు. డబ్బు సంపాదించటమే కాదు దాన్ని పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు చేయటమూ ముఖ్యమే అని నమ్మే ఆ అమ్మడు, ''ఈ రోజుల్లో షాపుల్లోకెళ్ళి వెనకటి కాలంనాటి ధరలకిమ్మని పేచీపడటమే నిజంగా బేరం చేయటమంటే'' అంటుంది! ధరలు రోజురోజుకీ ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. అవి తేలిగ్గా దిగివచ్చే సూచనలు కనిపించడంలేదు. మైదానంలో గాలిపటాలు ఎగరేసే పోటీలు జరుగుతున్నాయి. గాలిపటాలు ఒకదాన్ని మించి మరొకటి పైపైకి ఎగిరిపోతుంటే జనం ఉత్సాహంగా చూస్తున్నారు. ''అలా పైపైకి ఎగిరిపోతున్న గాలిపటాలను చూస్తుంటే మీకేమనిపిస్తోంది''? అని ఎవరో కుటుంబరావును అడిగారు. ''పెరిగిపోతున్న ధరలు జ్ఞాపకం వచ్చి భయమేస్తోంది'' అని ఆయన జవాబు!
అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడని సామెత. అనుకోకుండా ఐశ్వర్యం కలిసి వచ్చినప్పుడు కొందరు ఆర్భాటంగా ప్రవర్తిస్తుంటారు. నడమంత్రపు సిరి నరాలమీద కురుపు అన్నారు. లక్ష్మి చంచలమైంది. ఒకచోట నిలవదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేని ఆడంబరాలకు పోయినా లక్ష్మీదేవి గడపదాటి మాయమైపోతుంది. అందుకే ''ధనమున్నయపుడె దలపోసికొనుము, సిరులు రాజ్యంబు చేతులు మారు'' అని సలహా ఇచ్చాడో పారశీక కవి. ఈ విషయాలు ఎలా ఉన్నా అన్ని సౌకర్యాలను సమకూర్చిపెట్టే డబ్బుపట్ల మనుషులకు సహజంగానే మక్కువ ఎక్కువగా ఉంటుంది. ధనార్జన కోసం అహర్నిశలూ శ్రమిస్తుంటారు. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో మంచిచెడులను గురించి పట్టించుకోకుండా అడ్డదారులు తొక్కే ప్రబుద్ధులూ ఉంటారు. అలా చేసి వారు అపకీర్తి మూటకట్టుకుంటారు. ''మాడలమీద నాసగల మానిసికెక్కడి కీర్తి, కీర్తిపై వేడుక గల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాశ'' అంటూ మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నవారు డబ్బును గురించి ఆట్టే ఆశపడరనీ, డబ్బుకోసమే ఆరాటపడేవారు పేరును గురించి పట్టించుకోరనీ ఓ కవి చెప్పారు. లౌకిక ప్రపంచంలో ప్రతి విషయమూ డబ్బుతోనే ముడివడి ఉందనే విషయం కాదనలేని సత్యం. ఇద్దరు స్నేహితురాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ''భార్య ఖర్చుపెట్టేదానికంటె ఎక్కువ సంపాదించగలిగినవాడే ఆదర్శ భర్త'' అంది ఓ అమ్మాయి. ''అటువంటివాణ్ని పెళ్ళి చేసుకోగలిగిందే ఆదర్శ భార్య'' అంది మరో అమ్మాయి తడుముకోకుండా.
డబ్బున్న మారాజులకూ సమస్యలు తప్పవు. డబ్బుంటే చాలు ఇహ అన్నీ ఉన్నట్లే, అన్ని సౌఖ్యాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి అని చాలామంది భావిస్తారు. డబ్బున్నంత మాత్రాన సుఖసంతోషాలు దక్కి సంతృప్తికరంగా జీవితం గడుస్తుందనుకోవటం భ్రమే. ప్యుగ్లోబల్ ఆటిట్యూడ్స్ ప్రాజెక్టు అనే సంస్థ 2002-2007 మధ్య పెద్దయెత్తున ప్రజాభిప్రాయాల్ని సేకరించి సంతృప్తే సంపదనే నిర్ణయానికి వచ్చింది. 47 దేశాల్లో విస్తృతంగా పర్యటించి అనేక వేల మందిని ప్రశ్నించి వారి అభిప్రాయాలను క్రోడీకరించారు. పేద దేశాల ప్రజలు తమ ఆదాయవనరులు అంతంతమాత్రమే అయినప్పటికీ సంతృప్తికరంగానే జీవితాలు గడుపుతున్నట్లు తెలియజేశారు. ఉన్నంతలో సంతోషంగానే ఉన్నట్లు తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో తమ జీవితాలు మరింత మెరుగుపడగలవన్న ఆశావహ దృక్పథాన్నీ ప్రదర్శించారు. భారతీయుల్లో 64 శాతం తమ తరవాతి తరం భవిష్యత్తు భేషుగ్గా ఉండగలదనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర సంపన్న దేశాల్లోని ప్రజల మనోభావాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఆదాయం ఎంత ఎక్కువగా ఉన్నా వారిలో అసంతృప్తే అధికంగా ఉంది. తాము ఆశించే సుఖసంతోషాలు దక్కటంలేదనే నిరాశాభావమే వారి మాటల్లో వ్యక్తమైంది. ఫ్రాన్స్‌లో 80 శాతం తమ తరవాతి తరం జీవితాలు తమకంటే అధ్వానంగా గడుస్తాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జపాన్, జర్మనీ, బ్రిటన్, అమెరికా, కెనడా వంటి సంపన్నదేశాల ప్రజలూ దాదాపు ఇటువంటి నిర్లిప్తతనే ప్రదర్శించారు. అభివృద్ధిచెందుతున్న భారత్, చైనా దేశ పౌరులు మాత్రం వర్తమానం పట్ల సంతృప్తిని, భవిష్యత్ పట్ల నమ్మకాన్నీ వ్యక్తీకరించారు. ఆర్థికంగా వెనకబడిన ఆఫ్రికా వాసులు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం తమ జీవితాలు సుఖంగానే గడుస్తున్నాయని భవిష్యత్తు మరింత బాగుంటుందనే అనుకుంటున్నామని చెప్పారు. ఈ సర్వే వివరాల వల్ల సంతృప్తిని మించిన సంపద లేదనీ, సంతృప్తే సుఖసంతోషాలకు మూలమనీ నిర్ధారణ కావడం లేదూ!?
(Eenadu, 19:08:2007)
-----------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home